మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Oct 11, 2020 , 06:27:13

నా పేరు బాండ్‌ జేమ్స్‌ బాండ్‌ 007

నా పేరు బాండ్‌ జేమ్స్‌ బాండ్‌ 007

హాల్లో లైట్లు ఆర్పేశారు. చిమ్మచీకటి. తెర మీద ఓ చుక్క అటూఇటూ కదలాడింది. చూస్తుండగానే అది తుపాకిలా మారిపోయింది. మంద్రంగా మొదలైన నేపథ్య సంగీతం మనసుని కనికట్టు చేసేసింది. ఇకనుంచి సీట్లో ఉన్నవాడు ప్రేక్షకుడు కాదు. జేమ్స్‌బాండ్‌! ప్రపంచాన్ని తలకిందులు చేసే కుట్రనైనా... ైస్టెల్‌గా ఛేదిస్తాడు. ఓరకంటితోనే తిలోత్తమలను వశం చేసుకుంటాడు. అణ్వాయుధాలను సైతం అలవోకగా అదుపు చేస్తాడు. అలాంటి పాత్రలో లీనమవ్వాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకే జేమ్స్‌బాండ్‌ ఓ సినిమా మాత్రమే కాదు. ఒక ఆల్టర్‌ ఇగో! ఇలా ఉండాలని కోరుకునే ఓ లోకాన్ని మన ముందు నిలిపే త్రిశంకు స్వర్గం. సినిమా చూసి ఇంటికి వచ్చినా... ఇంటి యజమాని శత్రుదేశ గూఢచారి అనో, సందు చివర టీకొట్టు అణ్వాయుధాలకి అడ్డా అనేంతగా భ్రమింపజేస్తుంది. నవంబరులో విడుదల కానున్న ‘నో టైమ్‌ టు డై’తో మరోసారి బాండ్‌ మానియా ప్రపంచాన్ని కుదిపేయనుంది.

1952 ఫిబ్రవరి 17. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ అనే బ్రిటిష్‌ సైనికుడు జమైకాలోని ఓ విలాసవంతమైన ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకో ఆ రోజు తనకి కథ రాయాలనిపించింది. ‘గూఢచారి కథలన్నింటినీ మించిన కథ ఒకటి రాసి తీరతాను’ అని తన సహచరులతో చెబుతూ వచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఏదో ఆవేశం ఆవహించింది. ఎక్కడో ఓ ఆలోచన స్ఫురించింది. గదంతా కమ్ముకున్న సిగిరెట్‌ పొగ మధ్య నుంచి ఓ రూపం నడుచుకుంటూ వచ్చి తుపాకీ పేల్చింది. నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. అతనికో పేరు పెట్టాలి, తన చుట్టూ కథని అల్లాలి. ఇయాన్‌ దృష్టిలో తన కథానాయకుడు చాలా నిర్లిప్తంగా ఉండే మనిషి. ప్రభుత్వం చేతిలో పనిముట్టు. కాకపోతే తన చుట్టూ అసాధారణమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఆ పాత్రకి అంతే స్తబ్ధుగా ఉండే పేరు పెట్టాలనుకున్నాడు. ఆలోచించగా... ‘జేమ్స్‌ బాండ్‌' అనే పక్షుల శాస్త్రవేత్త గుర్తుకువచ్చాడు. చాలా సాదాసీదాగా అనిపించిన ఆ పేరును తన నాయకుడికి ఇచ్చేశాడు. నాయకుడొచ్చాడు, నామకరణం జరిగింది. మరి కథ నడిచేది ఎలా!

ఇయాన్‌ రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ తరఫున పాల్గొన్నాడు. నౌకా దళంలో గూఢచర్య విభాగంలో మంచి ప్రతిభనే చూపించాడు. అలా తను చూసిన విషయాలు, తను కలిసిన గూఢచారుల అనుభవాలు అన్నింటినీ రంగరిస్తూ... జేమ్స్‌బాండ్‌కు పోతపోశాడు. అందుకే ఇయాన్‌ లక్షణాలన్నీ జేమ్స్‌బాండ్‌లో కనిపిస్తాయి. సిగరెట్లు కాల్చడం, మందు కొట్టడం, జూదం ఆడటం, మగువలు, ఒకే బ్రాండ్‌ దుస్తులు వేసుకోవడం... అంతా ఇయాన్‌ వ్యక్తిత్వమే! అందుకనే తొలి పుస్తకం ‘కేసినో రాయల్‌' ఓ జూదగృహం చుట్టూనే తిరుగుతుంది. సరే! మొదటి పుస్తకం పూర్తయింది. కానీ దాన్ని పబ్లిషర్‌ దగ్గరికి పంపిస్తే, తిరస్కరించేశారు. ఇయాన్‌ అన్నగారు పీటర్‌ ఫ్లెమింగ్‌ ప్రముఖ ట్రావెల్‌ రచయిత. చివరికి ఆయన సిఫార్సు మేరకు ‘కేసినో రాయల్‌'ను ప్రచురించేందుకు పబ్లిషర్‌ అంగీకరించాడు. ఆ తర్వాత ఒకొక్కటిగా వెలువడ్డ, బాండ్‌ నవలలు... ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఒక్కో నవలా దాటేకొద్దీ, బాండ్‌ మరింత రాటుదేలసాగాడు.

ప్రాణం పోశాడు... ఇక చావు లేదు!

ఫ్లెమింగ్‌ చనిపోయేనాటికి... బాండ్‌ పాత్ర ఆధారంగా పన్నెండు నవలలు, రెండు కథా సంపుటాలు రాశాడు. బాండ్‌ పాత్రకు ఆదరణ అయితే లభించింది కానీ, అసాధారణమైన ఫాలోయింగ్‌ దక్కలేదు. టీవీలో ఎపిసోడ్లు, రేడియో నాటికలు, కామిక్‌ స్ట్రిప్స్‌... ఇలా నలుగురి కంటా పడటానికి బాండ్‌ నానా తంటాలు పడ్డాడు. కానీ ఎప్పుడైతే 1962లో 

‘డాక్టర్‌ నో’ చిత్రం విడుదల అయ్యిందో... తన ప్రభంజనం మొదలైంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందించినా.. మంచి లాభాలనే రాబట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ‘ఉర్సులా యాండ్రూస్‌' చరిత్రలోనే అందగత్తెల జాబితాలోకి చేరిపోయింది. ఇక బాండ్‌గా నటించిన షాన్‌ కానరీ కెరీర్‌కు తిరుగులేకుండా పోయింది. గూఢచర్యం మీద ఆధారపడి లెక్కలేనన్ని సినిమాలు రాసాగాయి. దురదృష్టవశాత్తు జేమ్స్‌బాండ్‌ ప్రభంజనాన్ని చూసే అదృష్టం ఇయాన్‌కి దక్కలేదు. 1964లోనే తను చనిపోయాడు. అప్పటికి రెండు బాండ్‌ సినిమాలే విడుదల అయ్యాయి. ఆ తర్వాత ఇక మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి చేరుకున్నాయి. సరికొత్త కథల కోసం... జేమ్స్‌బాండ్‌ మీద హక్కులు ఉన్న పబ్లిషర్లు... మరిన్ని నవలలు రాయించారు. జాన్‌ గార్డెనర్‌ అనే రచయిత అయితే ఏకంగా పదహారు పుస్తకాలు రాశాడు. అందులో ‘లైసెన్స్‌ టు కిల్‌', ‘గోల్డెన్‌ ఐ’ చిత్రాలు అదే పేరుతో సినిమాలుగా రూపొందాయి.

ప్రపంచవ్యాప్తి

తొలి చిత్రం నుంచే బాండ్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. పైగా అది మార్పును కోరుకుంటున్న సమయం. అందుకే బ్రిటన్‌కు మాత్రమే పరిమితం అవుతుందనుకున్న బాండ్‌ మానియా అమెరికాను కూడా కుదిపేసింది. నాటి అమెరికన్‌ అధ్యక్షుడు జాన్‌ కెనడీ... బాండ్‌ సాహిత్యానికి వీరాభిమాని. ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌' అనే బాండ్‌ నవల తన ఫేవరెట్‌ అని చెప్పేవాడు. దాంతో ఆ పుస్తకపు అమ్మకాలు అమాంతంగా పెరిగిపోయాయి. దాన్ని చిత్రంగా కూడా రూపొందించారు. దురదృష్టవశాత్తు, కెనడీ చనిపోయేముందు చూసిన ఆఖరి   చిత్రం ఇదే. క్యూబాతో జరుగుతున్న యుద్ధంలో గెలిచేందుకు కూడా కెనడీ, జేమ్స్‌బాండ్‌ వ్యూహాలను ప్రేరణగా తీసుకున్నాడనే ప్రచారం ఉంది. మరో అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ కూడా బాండ్‌ అభిమానే. ‘ఆక్టోపసీ’ అనే చిత్రం విడుదల సందర్భంగా నేరుగా వైట్‌హౌస్‌ నుంచి శుభాకాంక్షలు అందించాడు. భారతీయులకు కూడా బాండ్‌ తెగ నచ్చేశాడు. కుటుంబకథా చిత్రాలు చూసీ చూసీ.... అందులో త్యాగాలను తట్టుకోలేక కన్నీళ్లలో కొట్టుకుపోతున్న ప్రేక్షకులకు తాజా గాలిని అందించాడు. కొత్తదనానికి సిద్ధపడే సూపర్‌స్టార్‌ కృష్ట 1966లో గూఢచారి 116తో ఈ తరహా చిత్రాలకు శ్రీకారం చుట్టాడు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ కూడా ‘జదర బలె’ (1968)తో  బాండ్‌ సీక్వెల్స్‌ మొదలుపెట్టాడు. ఎమ్‌జిఆర్‌ నుంచి ఎన్టీఆర్‌ వరకు  బాండ్‌ పాత్రలో కనిపించినవారే.

ఆషామాషీ కాదు...

ఓ నాలుగు ఫైట్లు, ఫీట్లతో తేలిపోయే చిత్రాలు కావివి. కనిపించే ప్రతి పాత్రకీ తనదైన వ్యక్తిత్వం ఉంటుంది. వచ్చే ప్రతి మలుపులోనూ ఏదో పరమార్థం దాగుంటుంది. జేమ్స్‌ బాండ్‌ ఎవరు... తన తల్లిదండ్రులు ఏం చేసేవారు, తను ఎక్కడ చదువుకున్నాడు, ఏ దుస్తులు వేసుకుంటాడు... లాంటి ఎలాంటి ప్రశ్నకైనా ఏదో ఒక పుస్తకంలో జవాబు ఉండాల్సిందే. ఐయాన్‌ ఫ్లెమింగ్‌ ఒకచోట జేమ్స్‌ బాండ్‌ తండ్రి పేరు ఆండ్రూ బాండ్‌ అనే స్కాటిష్‌ జాతీయుడు అనీ, తల్లి మొనీక్‌ అనే స్విస్‌ జాతీయురాలనీ చెబుతాడు. బాండ్‌ చిన్నప్పుడే తన తల్లిదండ్రులిద్దరూ చనిపోయారట. ‘The World Is Not Enough’  (ప్రపంచానికి హద్దులు లేవు) అనే సూత్రంతో ఆ కుటుంబం జీవించిందని చెబుతాడు. అదే ఓ బాండ్‌ సినిమాకి టైటిల్‌గా మారింది. ఇలాంటి వివరాల ప్రకారం బాండ్‌ పుట్టింది నవంబరు 11, 1920. సరిగ్గా నూరేళ్లు దాటిన తర్వాత నవంబరు 11, 2020న బాండ్‌ 27వ సినిమా విడుదల కావడం యాదృచ్ఛికం. బాండ్‌ కథల మధ్య ఓ కనిపించని సూత్రం ఉంటుంది కాబట్టి ఎన్నో చిత్రాలు చూస్తే కానీ, ఓ పాత్ర ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో కనిపించే ‘ఎమ్‌'లాంటి అధికారులూ ‘స్టావ్రో బయోఫీల్డ్‌' లాంటి విలన్లు చాలా కథల్లో ఉంటారు. అయితే కథ కంటే విన్యాసాలకే ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి, ఓ ఛేజింగ్‌ సీన్‌ రాగానే మనం కథను పట్టించుకోం.

జేమ్స్‌ బాండ్స్‌ 007

‘డాక్టర్‌ నో’తో మొదలైన బాండ్‌ సినీ ప్రయాణం అప్పుడొకటి, అప్పుడొకటిగా 25 చిత్రాల మైలురాయిని దాటేసింది. ప్రస్తుతం విడుదల కాబోతున్న చిత్రం 27వది. వీటిలో ఏ చిత్రమూ ఫ్లాప్‌ కాలేదు! ఈ సినిమాలన్నీ కలిపి 50 వేల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం మరో విశేషం. వీటిలో ఒకే సినిమాను రెండుసార్లు రూపొందించి విజయం సాధించిన సందర్భమూ ఉంది. 1965లో నిర్మించిన ‘థండర్‌బాల్‌' అనే చిత్రాన్ని మళ్లీ 1983లో ‘నెవర్‌ సే నెవర్‌ ఎగైన్‌' పేరుతో తెరకెక్కించారు. 18 ఏళ్ల వ్యత్యాసంతో రూపొందించిన ఈ రెండు చిత్రాలలోనూ ‘షాన్‌ కానరీ’నే హీరో కావడం విశేషం. బాండ్‌ చిత్రాల ఇమేజ్‌ పెరుగుతున్న కొద్దీ, అందులో విన్యాసాలు... తను వాడే ఆయుధాలు కూడా మరింత క్రేజీగా మారాయి. బాండ్‌ ఓ బ్రాండ్‌ అయ్యాడు. ఆ పాత్రని ఎవరు పోషిస్తారనే ఉత్కంఠత రేగింది. ఆ అదృష్టాన్ని దక్కించుకుంది వీళ్లే...

చరిత్రలోనే అత్యుత్తమం: మొట్టమొదటి జేమ్స్‌బాండ్‌గా నటించిన షాన్‌ కానరీ, ఆ పాత్రకి కొత్త ఇమేజ్‌ అందించారు. స్క్రిప్ట్‌లో చిన్నచిన్న మార్పులు చేసి, బాండ్‌ని బోర్‌ కొట్టించే గూఢచారిగానే కాకుండా, హాస్యప్రియుడిగా చూపించాడు. ఏకంగా ఏడు బాండ్‌ సినిమాల్లో నటించి... ఆ తరానికి జేమ్స్‌బాండ్‌ అంటే షాన్‌ కానరీనే అని నమ్మించాడు. ‘డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌' కోసం తను అందుకున్న పారితోషికం అప్పట్లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులోకి కూడా చేరింది. అందుకే సినీచరిత్రలోనే మూడో అతి గొప్ప హీరోగా షాన్‌ నటించిన బాండ్‌ పాత్రను ‘అమెరికన ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌' గుర్తించింది.

మోసపోయిన బాండ్‌: ఓ సినిమాలో నటిస్తున్న తన భార్యను చూసేందుకు వెళ్లిన పియర్స్‌ బ్రాస్నన్‌, అక్కడి దర్శకుడి కంట్లో పడ్డాడు. నాలుగు బాండ్‌ సినిమాల కాంట్రాక్టు దక్కించుకున్నాడు. బ్రాస్నన్‌ ధూమపానానికి వ్యతిరేకం. మరీ అత్యవసరం అయితే తప్ప, అలాంటి సన్నివేశంలో కనిపించేవాడు కాదు. అయితే, తర్వాతికాలంలో, ఓ భారతీయ కంపెనీ... మౌత్‌ ఫ్రెష్‌నర్‌ అని చెప్పి పొగాకు ఉత్పత్తికి తనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా మార్చేసిందని వాపోవాల్సి వచ్చింది. కాదన్న చోటే: ఇప్పటివరకూ వచ్చిన బాండ్‌ పాత్రధారులు ఆరడుగుల ఆజానుబాహులు. అరవిందదళాయతాక్షులు. కానీ చిన్నకళ్లతో, చింపిరి జుట్టుతో ఉన్న డేనియల్‌ క్రెగ్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారని తెలియగానే అభిమానులు విస్తుపోయారు. ‘ఇతను బాండ్‌గా సరిపోడు’ అంటూ ఆన్‌లైన్‌ ఉద్యమాన్ని లేవదీశారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కాస్త మృదువుగా కనిపించే బాండ్‌ కావాలని నిర్మాతలు భావించారు. వాళ్ల నిర్ణయం సరైందే అని తేలింది. స్పీల్‌బర్గ్‌ మాటల్లో చెప్పాలంటే... ‘21వ శతాబ్దానికి సరిగ్గా నప్పే బాండ్‌ ఇతను’.

వృద్ధ బాండ్‌: షాన్‌ తర్వాత బాండ్‌ పాత్రలోకి ఒదిగిపోయాడు రోజర్‌ మూర్‌. ఏడు బాండ్‌ సినిమాల్లో నటించాడు. తన తేనె కళ్లతో జేమ్స్‌బాండ్‌కి ప్లేబాయ్‌ ఇమేజ్‌ తీసుకువచ్చాడు. 1985లో ‘ఎ వ్యూ టు కిల్‌'లో నటించేటప్పటికి రోజర్‌కు 57 ఏళ్లు ఉండటంతో, విమర్శకులు చీల్చి చండాడేశారు. దాంతో ఆ పాత్ర నుంచి తప్పుకోక తప్పలేదు. ఓ సమయంలో తన పరుగు కూడా కృతకంగా ఉందని భావించిన మూర్‌, పరుగుతీయడానికి కూడా డూప్‌ని ఉపయోగించేవాడు.

వీళ్లే కాకుండా మరో ముగ్గురు ఆ పాత్రను పోషించారు. కానీ వాళ్లు ఒకటి, రెండు చిత్రాలలో మురిపించి వెళ్లిపోయారు. వాళ్లే డేవిడ్‌ నివెన్‌, జార్జ్‌ లేజన్‌బై, టిమోతీ డాల్టన్‌. ఇక ‘మా బాండ్‌ సినిమాలో నటించు బాబూ’ అని చెప్పినా కూడా, ఆ అవకాశాన్ని వదులుకున్నవాళ్లూ లేకపోలేదు. హ్యూగ్‌ జాక్‌మన్‌ (ఎక్స్‌మెన్‌ సిరీస్‌ హీరో), ైక్లెంట్‌ ఈస్ట్‌వుడ్‌ (కౌబాయ్‌ పాత్రలకు ప్రసిద్ధం), లియామ్‌ నీసన్‌ (షిండ్లర్స్‌ లిస్ట్‌ కథనాయకుడు)... లాంటి నటులెందరో రకరకాల కారణాలతో జేమ్స్‌ బాండ్‌ అవకాశాన్ని వదులుకున్నారు.

రాబోయే చిత్రం!

2015లో విడుదలైన ‘స్పెక్టర్‌' అరుదైన విజయాన్ని అందుకోవడంతో... వెంటనే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అదే ‘నో టైమ్‌ టు డై’. ఇందులోనూ డేనియలే బాండ్‌ పాత్ర నిభాయిస్తున్నాడు. అదృశ్యం అయిపోయిన ఓ శాస్త్రవేత్తను వెతుక్కుంటూ వెళ్లిన బాండ్‌, అసాధారణమైన ప్రమాదంలో చిక్కుకోవడమే నేపథ్యంగా ఈ చిత్రం సాగుతుంది. 1,800 కోట్ల భారీ బడ్జెట్‌తో విడుదల అవుతున్న ఈ చిత్రంలో బాండ్‌ భామలుగా లియా సెడోక్స్‌, లాష్‌నా లించ్‌ నటిస్తున్నారు. జపనీస్‌ మూలాలు కలిగిన ‘ఫుకునాగా’ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది కేవలం అతని అయిదవ సినిమా కావడంతో... ఫుకునాగా ఏమేరకు బాండ్‌ కథను సంభాళించగలిగాడో అన్న అనుమానం లేకపోలేదు. నిజానికి ఏప్రిల్‌లోనే విడుదల కావల్సిన ఈ చిత్రం కొవిడ్‌ కారణంగా నవంబరుకు వాయిదా పడింది. ప్రపంచాన్ని కాపాడే బాండ్‌ను కూడా కరోనా భయపెట్టిందన్నమాట. త్రీడీ, ఐమాక్స్‌లాంటి అన్ని హంగులతో విడుదల అవుతున్న ఈ చిత్రం, కొవిడ్‌ కారణంగా మందగించిన వెండితెర వ్యాపారాన్ని మరోసారి తారాపథంలోకి తీసుకువెళ్తుందని గంపెడు ఆశలున్నాయి.

గన్‌ బ్యారల్‌ ఎఫెక్ట్‌! 

జేమ్స్‌బాండ్‌ సినిమా ఏదైనా కానీ... తెర మీద ముందుగా కనిపించే సన్నివేశం ‘గన్‌ బ్యారెల్‌ ఎఫెక్ట్‌'. ప్రేక్షకులని ఒక్కసారిగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూడ్‌లోకి తీసుకువెళ్లిపోతుందీ సన్నివేశం. తుపాకీ గొట్టంలోకి చిత్రించినట్టుగా కనిపిస్తుంది. ఆ గన్‌ బ్యారల్‌ జేమ్స్‌బాండ్‌ను గమనించి, అతని మీదకి తూటా సంధించేలోపే... అతను ఎదురుకాలుస్తాడు. సినిమాకి ప్రాణంగా నిలిచే ఈ సన్నివేశం వెనుక ఓ చిత్రమైన కథ ఉంది. తొలి బాండ్‌ సినిమా కోసం టైటిల్స్‌ రూపొందించిన ‘మారిస్‌ బైండర్‌'కి తుపాకీ గొట్టంలోంచి బాండ్‌ను పరిచయం చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ అంత సూక్ష్మమైన కెమెరాలు అప్పట్లో లేకపోయాయి. దాంతో కొన్ని గుండ్రటి స్టిక్కర్లని (ప్రైస్‌ ట్యాగ్స్‌) కలిపి, తను అనుకున్న దృశ్యాన్ని సాధించాడు.

ఆ మ్యూజిక్‌ మన భారతీయుల కోసం... 

జేమ్స్‌ బాండ్‌ పేరు వినగానే... ఓ నేపథ్య సంగీతం మన కాలుని లయబద్ధంగా ఆడిస్తుంది. ఆ స్వరానికి రూపకర్త ‘మాంటీ నార్మన్‌'. ఈ స్వరాన్ని ఇంచుమించు ప్రతి బాండ్‌ సినిమాలో ఉపయోగించుకోవడం వల్ల, రాయల్టీ కింద నార్మన్‌కి కొన్ని కోట్ల రూపాయలు దక్కాయి. కానీ దాని వెనుక ఓ చిన్న కథ లేకపోలేదు. ప్రముఖ భారతీయ రచయిత వి.ఎస్‌.నైపాల్‌ 1961లో ‘ఏ హౌజ్‌ ఫర్‌ మిస్టర్‌ బిస్వాస్‌' అనే నవల రాశారు. ట్రినిడాడ్‌లో స్థిరపడిన భారతీయ కుటుంబం కథ అది. ఆ నవలని సంగీత రూపకంగా మలిచేందుకు నార్మన్‌ స్వరాలు అందించాడు. వాటిలో ఒక స్వరాన్ని కాస్త మార్చి, జేమ్స్‌బాండ్‌ థీమ్‌ రూపొందించాడు.

బాండ్‌ భామలు 

జేమ్స్‌బాండ్‌ సినిమాలంటే తుపాకులతో పాటు తూటాల్లాంటి అమ్మాయిలు కూడా గుర్తుకువస్తారు. కాకపోతే వాళ్లని విలాసవస్తువులుగా చూపించడం తరచూ విమర్శలకు దారితీస్తూ ఉంటుంది. కొన్ని బాండ్‌ గాళ్స్‌ పేర్లు కూడా ద్వందార్థాన్ని సూచిస్తుంటాయి. అయితే వాళ్లలో చాలామంది శత్రుపక్షానికే చెందినవారనీ, బాండ్‌ను వలలో వేసుకోవడానికే అతనితో గడపుతారనీ అల్లే కథలు... ఓ నైతిక భూమికని కల్పించే ప్రయత్నం చేస్తాయి. బాండ్‌ సినిమాల్లో కనిపించే నాయికలలో 75 శాతం తనని చంపడానికి ప్రయత్నించినవారే అని ఎవరో లెక్కలు కూడా తేల్చారు. ఒకటి మాత్రం నిజం! ఎల్లలు లేని ప్రణయాల కోసమే బాండ్‌ గాళ్స్‌ని వినియోగిస్తూ ఉంటారు. ‘యూ ఓన్లీ లివ్‌ ట్వైస్‌' స్క్రీన్‌ప్లే రచయిత ‘రొలాడ్‌ దహల్‌' ప్రకారం సినిమాకి మూడు బాండ్‌ గాళ్స్‌ ఉండటం ప్రామాణికం. ఒకరు బాండ్‌ చేతిలో చనిపోయి అతనిలో పగని రగిలించాలి, రెండోవారు అతన్ని చంపడానికి వచ్చి విఫలమవ్వాలి, మూడో అమ్మాయి శుభం కార్డు సమయంలో బాండ్‌ చెంత ఉండాలి. మరి జేమ్స్‌ బాండ్‌ మనస్ఫూర్తిగా ప్రేమించిన సందర్భాలు లేవా అంటే ఉన్నాయి. ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో రెండేరెండు సందర్భాలలో బాండ్‌ ప్రేమలో పడినట్టు కనిపిస్తుంది. కానీ ఆ రెండుసార్లు కూడా వాళ్లు చనిపోతారు. బాండ్‌గాళ్‌ గ్లామర్‌ పాత్రే అయినా ఆ అవకాశం కోసం గట్టి పోటీనే కనిపిస్తుంది. ఓసారి చివరి నిమిషంలో తనను బాండ్‌గాళ్‌ పాత్రకు ఎంపిక చేయలేదనే నిరాశతో ‘మీ హమా’ అనే జపాన్‌ నాయిక బిల్డింగ్‌ మీద నుంచి దూకేస్తానని బెదిరించి మరీ... అవకాశాన్ని దక్కించుకుంది.

బాండ్‌ ముచ్చట్లు 

బాండ్‌ సినిమాల్లో తరచూ కనిపించే కారు ‘ఆస్టన్‌ మార్టిన్‌' అనే లగ్జరీ కార్ల కంపెనీది. ఆ సినిమాల్లో కనిపించడం వల్ల తమకు అనూహ్యమైన గిరాకీ వచ్చింది కాబట్టి, డేనియల్‌ క్రెగ్‌ ఎప్పుడు ఏ కారు కావాలన్నా తమ సంస్థ నుంచి తీసుకువెళ్లవచ్చని ఆస్టన్‌ మార్టిన్‌ ప్రకటించింది.

బాండ్‌ పేరు పక్కన ఉండే 007లో ‘00’ అనేది విచారణ లేకుండా చంపే అధికారాన్ని ఇచ్చే సూచన. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీతో తలపడుతున్నప్పుడు, ‘007’ అనే రహస్య సంకేతాన్ని ఛేదించడం కూడా... ఈ పేరు వెనుక ఉన్న కారణంగా చెబుతారు.

బాండ్‌ సినిమాలకు ఇంతవరకు అయిదు ఆస్కార్లు మాత్రమే దక్కాయి. అవి కూడా సంగీతానికో, సాంకేతిక విభాగాలకో కావడం గమనార్హం.
జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో ‘గోల్డెన్‌ ఐ’ ఒకటి. నిజానికి అది జమైకాలో ఇయాన్‌ ఫ్లెమింగ్‌ తన ఇంటికి పెట్టుకున్న పేరు. చాలా బాండ్‌ నవలలను ఆయన అక్కడ కూర్చుని రాసేందుకే ఇష్టపడేవారు.

ఆక్టోపసీ అనే బాండ్‌ సినిమాలో కొంతభాగాన్ని ఇండియాలో చిత్రించారు. రాజస్థాన్‌లో నడిచే ఈ కథలో కబీర్‌ బేడి కూడా పాత్రగా కనిపిస్తారు. 2012లో వచ్చిన ‘స్కైఫాల్‌' చిత్రాన్ని ముంబైలో చిత్రించాలనుకున్నారు కానీ... అక్కడి ఇరుకు వీధుల్లో షూటింగ్‌ సాధ్యం కాదనుకుని వెనక్కి తగ్గారు.

ఇప్పటివరకు 26 బాండ్‌ సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో 24 ‘ఇయాన్‌ ఫిల్మ్స్‌' అనే అధికారిక ప్రొడక్షన్‌ నుంచి వచ్చాయి. బాండ్‌ సినిమాల్లో ‘థండర్‌బాల్‌', ‘గోల్డ్‌ఫింగర్‌' చిత్రాలు ఆర్థికంగా మంచి విజయం సాధించాయి. ‘లైసెన్స్‌ టు కిల్‌', ‘ద మాన్‌ విత్‌ గోల్డెన్‌ గన్‌'లకు చావు తప్పి గన్ను లొట్టపోయింది.
యూఎస్‌ఏ టుడే అనే పత్రిక... బాండ్‌ సినిమాలకు ప్రజాదరణ ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చింది. ఆ జాబితాలో ‘ఏ వ్యూ టు కిల్‌', ‘కేసినో రాయల్‌ (1967)’ దిగువన ఉంటే ‘స్కై ఫాల్‌', ‘కేసినో రాయల్‌ (2006)’ మొదటి రెండు స్థానాలను అందుకున్నాయి.

logo