ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Oct 11, 2020 , 05:53:55

గెలిచాడు.. గెలిపిస్తున్నాడు

గెలిచాడు.. గెలిపిస్తున్నాడు

ముప్పై ఏళ్ల నాటి సంగతి. ఓ యువకుడు... అమెరికాలో అడుగుపెట్టాడు. నా అన్నవాళ్లు లేరు. గెలుపైనా తనదే... ఓటమిలోనూ ఒంటరే! ఆ జీవితం తనకోసం తాను చేస్తున్న యుద్ధం. ఇప్పుడు- తను రెండు కంపెనీలకు అధిపతి. వందలాది ఉద్యోగులు ఆయన ఆదేశం కోసం ఎదురుచూస్తుంటారు.  అయినా, ఆయన ఆరాటమూ పోరాటమూ ఆగిపోలేదు. ఈసారి తన కోసం కాదు, తనకు  ఎదిగే అవకాశం ఇచ్చిన సమాజం కోసం. ఆ సమాజంలో పేదరికాన్ని రూపుమాపడం కోసం. ఆయనే శ్రీని మదాల.

చాలా ఏండ్ల క్రితం.. నిజామాబాద్‌ జిల్లాకు ఓ కుటుంబం ఎక్కడి నుంచో వలస వచ్చింది. వర్నిలో స్థిరపడింది. స్థానికులు వాళ్లను పరాయివారిగా చూడలేదు సరికదా... కుటుంబంలో ఒకరిగా అక్కున చేర్చుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన సాంబశివరావుకు చదువంటే చాలా ఇష్టం. అప్పట్లోనే బీఏ పూర్తిచేశాడు. ఎన్ని అవకాశాలు వచ్చినా, తనకు ఇష్టమైన చదువును పదిమందికీ పంచడం కోసం ఉపాధ్యాయవృత్తిలో స్థిరపడ్డారు. తను మనసుకు తోచిన దిశలో వెళ్లడమే కాదు... తన పిల్లలకీ అదే తరహా స్వేచ్ఛను అందించారు సాంబశివరావు. ఆ దృక్పథమే ఆయన తనయుడు శ్రీని  వ్యక్తిత్వానికి భూమికగా మారింది. ఊహ తెలియకముందే తల్లి చనిపోయినా... ప్రపంచాన్నే ఒడిగా చేసుకుని ఎదిగే తత్వం అలవడింది. వరంగల్‌ ఎన్‌ఐటిలో ఇంజనీరింగ్‌ చదివి, ఆ తర్వాత ముంబయిలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌'లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1985లో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చేసింది. టాటా గ్రూప్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో పనిచేసే అవకాశం చిక్కింది.  చేరిన కొన్ని నెలలకే, శ్రీని ప్రతిభని గుర్తించి తనని అమెరికా పంపారు. ఓ మారుమూల పట్నం నుంచి వచ్చిన యువకుడికి అంతకంటే ఇంకేం కావాలి? కానీ తను చేరుకుంది గమ్యం కాదు, మజిలీ అని శ్రీనికి అర్థమైంది.

అమెరికా ఆవాసం

ఆ కుటుంబం నుంచి అమెరికాకి చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి శ్రీని. ఎటు చూసినా ఒంటరితనం. దాంతో పాటే, ఎంచుకునేందుకు లెక్కలేనన్ని అవకాశాలు కనిపించాయి. కష్టపడితే,  చుక్కల్ని అయినా చేరుకునే అవకాశం ఉందని మాత్రం గ్రహించాడు. వెంటనే టాటాలో భద్రమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు. అట్లాంటాలోని ఓ చిన్న కంపెనీలో చేరాడు. దాని యజమానినే స్ఫూర్తిగా తీసుకుని తనే సొంతంగా సంస్థను స్థాపించాడు. బ్యాడ్‌ లక్‌. ఆ సమయంలో అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ ఎదురీతలో శ్రీని సంస్థ కుప్పకూలింది. నష్టం వచ్చింది... కానీ మిలియన్‌ డాలర్ల లాభాన్ని మించిన అనుభవం దక్కింది. అందుకని 1993లో ‘సాఫ్ట్‌సోల్‌' అనే కంపెనీని ప్రారంభించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కంపెనీలను తీర్చదిద్దేందుకు ‘సాఫ్ట్‌ సోల్‌' సాయపడుతుంది. ప్రభుత్వం, మీడియా, హాస్పిటల్స్‌... ఇలా ఏ రంగంలో ఉన్న సంస్థలైనా కాలానికి అనుగుణంగా ఎదిగేందుకు అవసరమయ్యే మార్పులను సూచిస్తుంది. ‘సాఫ్ట్‌సోల్‌' అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న 500 అమెరికన్‌ కంపెనీల’ జాబితాలో చోటు సంపాదించుకుంది. కాలిఫోర్నియాతో పాటు.. వైజాగ్‌, హైదరాబాద్‌, బెంగళూరులో కూడా శాఖలని ప్రారంభించింది. సిస్కో, ఆర్సెలార్‌ మిట్టల్‌, హెచ్‌బిఓ సహా అమెరికన్‌ రక్షణ శాఖకు కూడా సేవలు అందించింది.

కుటుంబం- ఫౌండేషన్‌!

శ్రీని మదాల భార్య దుర్గ కాలిఫోర్నియాలో ప్రముఖ హృద్రోగ నిపుణురాలు. 20 ఏండ్లు వైద్యవృత్తిలో ఉంటూ... గుండెకు సంబంధించిన క్లిష్ట సమస్యలను పరిష్కరించగల నైపుణ్యం సాధించారు. ఆమె దగ్గర చికిత్స తీసుకున్న అనేక మంది అమెరికన్లు సైతం, దుర్గను అత్యంత ప్రతిభావంతురాలైన వైద్యురాలిగా కితాబునిస్తారు. శ్రీని దంపతులకి ఇద్దరు పిల్లలు. కూతురు సమాంత వైద్యవిద్యార్థి. కొడుకు అజయ్‌ త్వరలో కాలేజ్‌లో చేరబోతున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ తమతమ వ్యాపకాలతో ఎంత బిజీగా ఉన్నా, పిల్లలతో వీలైనంతసేపు గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలు మన ప్రవర్తనని నిత్యం గమనిస్తూ ఉంటారు కాబట్టి, తల్లిదండ్రులే వారికి రోల్‌మోడల్‌గా మెలగాలన్నది శ్రీని అభిమతం.

శ్రీని దాదాపు 20 ఏళ్ల క్రితం తన సామాజిక బాధ్యతలో భాగంగా, ‘మదాల చారిటబుల్‌ ట్రస్ట్‌' అనే సంస్థను స్థాపించారు. మొదట్లో అది చిన్నాచితకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేది. కానీ ఆ సేవాస్ఫూర్తి శ్రీని కుమార్తె సమాంతను కదిలించింది. తను కూడా సాటివారికి ఏమన్నా చేయాలనుకుంది. తన తోటి విద్యార్థినులు ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కోవడాన్ని గమనించింది. ‘హైపో థైరాయిడిజం’, ‘పోషకాహారలోపం’ లాంటి సమస్యలతో చదువుకు దూరమై కెరీర్‌లో నష్టపోతున్నారని గ్రహించింది. ‘హెల్తీ స్కాలర్స్‌' అనే ట్రస్టును ప్రారంభించింది. ఇందుకోసం రెండులక్షల డాలర్ల విరాళాన్ని పోగుచేసింది. ఆ సంస్థ ద్వారా అమెరికా, ఇండియాలలో వైద్య శిబిరాలను నిర్వహించింది. కూతురు చేసిన పనికి మురిసిపోయిన శ్రీని మదాల, తన ట్రస్ట్‌ కార్య కలాపాలను విస్తృతం చేశారు. ‘సమాజం కోసం పనిచేయడం సేవ కాదు, బాధ్యత’ అంటారు శ్రీని.

తర్వాతేంటి!

‘సాఫ్ట్‌సోల్‌'లో  వచ్చిన లాభాలతో ఇతర వ్యాపార సంస్థలలోనూ, స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెడుతూ ఉండేవారు శ్రీని. ఓసారి బీమా రంగంలో జరుగుతున్న అక్రమాల గురించి తన దృష్టికి వచ్చింది. అమెరికాలో బీమా రంగం కొన్ని లక్షల కోట్ల డాలర్ల విలువ చేస్తుంది. సహజంగానే... అంత సంపద ఉన్న చోట తీవ్రమైన అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. అందుకే కొన్నాళ్ల క్రితం ‘ఆక్విలా’ అనే వినూత్నమైన సేవను ప్రారంభించారు శ్రీని. ఆక్విలా అంటే లాటిన్‌ భాషలో గద్ద అని అర్థం. దానంత సునిశితంగా ఇన్‌స్యూరెన్స్‌ డేటా విశ్లేషిస్తూ, అనుమానాస్పదమైన లావాదేవీలను, నేర చరిత్ర ఉన్న క్లయింట్లను గుర్తించి... బీమా సంస్థలను హెచ్చరించడం ‘ఆక్విలా’ విధి. 2020లో ఈ సంస్థకు TIE అనే ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. కోట్ల రూపాయల విలువైన సంపదతో పాటు, వేలాది పనిగంటలను కూడా ఆదా చేయడంలో ముందుంది ఆక్విలా. కేవలం బీమాకు మాత్రమే పరిమితం కాకుండా, ఇతర ఆర్థిక సంస్థలకి కూడా ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దారు.

అయిదు లక్షల మంది కోసం..

తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓ భారీ కార్యక్రమం చేపట్టాలనుకున్నారు శ్రీని. వర్నిలో 40 వేల చదరపు అడుగుల వైశాల్యంతో, భారీ కమ్యూనిటీ సెంటర్‌ను ప్రారంభించారు. ఇంటర్మీడియట్‌ తప్పి మరో దిక్కు తోచని కుర్రవాళ్లను 90 రోజుల్లో తమ కాళ్ల మీద నిలబడేలా చేస్తున్నది ఈ సెంటర్‌. ఉచితంగా శిక్షణ, బస అందిస్తూ  బ్యూటీషియన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ అందిస్తున్నది. ఆడవాళ్లకి కుట్టులో నైపుణ్యం, వైద్య శిబిరాలు, జనరిక్‌ మందుల అమ్మకం, వేసవి శిక్షణా తరగతులు, యోగా... ఒక్కటేమిటి! వర్ని కమ్యూనిటీ సెంటర్‌ ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. వర్ని కమ్యూనిటీ సెంటర్‌ చుట్టూ పదిమైళ్ల మేరకు ఉన్న అయిదు లక్షల మందికి ఈ సంస్థ సేవలు ఉపయోగపడుతున్నాయని చెబుతారు శ్రీని. ‘ఇక్కడి శిక్షణతో వారి జీవితాలు ఎంతలా మారిపోయాయో ఒకొక్కరూ చెబుతున్నప్పుడు కలిగే అనుభూతికి సాటి ఇంకేదీ రాదు. వృత్తిలో కలిగే తృప్తికీ, ఇలాంటి పనులు చేస్తే వచ్చే సంతృప్తికీ చాలా తేడా ఉంటుంది’ అంటారు. భవిష్యత్తులోనూ ఈ సెంటర్‌ను ఇంతే సమర్థంగా నడిపించాలన్నది తన లక్ష్యంగా చెబుతారు. ఇక వ్యాపారంలో వస్తున్న అధునిక సాంకేతికను మరింతగా వినియోగించుకుని మరో మెట్టు ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
logo