శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Oct 11, 2020 , 05:43:04

నేను సైతం సాహిత్యానికి...

నేను సైతం సాహిత్యానికి...

‘ఒకటే జననం ఒకటే మరణం’ అంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పాట రాసినా, ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే’ అంటూ హుషారు గీతంతో కుర్రకారును ఊపినా, ‘పుల్లలమంటివి గదరా ఇదిగో పులిపిల్లాలై వచ్చినామూరా’ అంటూ ఉద్యమగీతంతో ఉర్రూతలూ గించినా... అది సుద్దాల అశోక్‌ తేజ కలానికి మాత్రమే చెల్లింది. ఆ అక్షరానికున్న బలం అలాంటిది మరి! 1994 లో ‘నమస్తే అన్న’ సినిమాతో పాటల రచయితగా అడుగుపెట్టి దాదాపు 2000  సినిమా పాటలు రాశారు.  ఠాగూర్‌ సినిమా కోసం రాసిన  ‘నేను సైతం ప్రపంచాగ్నికి’ పాటకు ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

సినీ గేయ రచయితగా, జాతీయ పురస్కార గ్రహీతగా పేరుపొందిన సుద్దాల అశోక్‌ తేజ 1960 మే 16న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో పుట్టారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఈటెల్లాంటి పాటలతో నిజాంను ఎదిరించిన ధీశాలి, ప్రజాకవి సుద్దాల హనుమంతు కుమారుడే అశోక్‌ తేజ. తల్లి సుద్దాల జానకమ్మ. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు తేజ. బాల్యం నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు. సినీ పరిశ్రమకు రాకముందు మెట్‌పల్లిలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. మెట్‌పల్లి, కోరుట్లలలో సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తండ్రి సుద్దాల హనుమంతు కొంతవరకు రాసిన ‘వీరతెలంగాణ సాంఘిక యక్షగానా’న్ని పూర్తి చేశారు. బతుకుపాటలు, వెలుగురేకలు, శ్రమకావ్యం మొదలైన గ్రంథాలు రాశారు.

విప్లవం నుంచి ప్రణయం వరకు

1994లో ‘నమస్తే అన్న’ సినిమాలోని ‘గరం గరం పోరీ’ పాటతో తెలుగు సినీ పరిశ్రమకు పాటల రచయితగా పరిచయమయ్యారు అశోక్‌ తేజ. మొదట్లో విప్లవగీతాలే ఎక్కువగా రాశారు. దాసరి నారాయణరావు సినిమాలు అశోక్‌ తేజకు మంచి బ్రేక్‌ ఇచ్చాయి. ‘ఒసేయ్‌ రాములమ్మ’(1997)లో ‘రామసక్కని తల్లి రాములమ్మ’,‘ఇంతీ ఏ ఇంటీ జాణవే’, ‘పుల్లలమంటివి గదరా’ .. ఇలా మొత్తం ఏడు పాటలు రాశారు. అవన్నీ  తెలంగాణలో ఒకప్పటి దొరల దోపిడీ విధానాన్ని కండ్లకు కట్టినట్లు చూపుతాయి. ప్రజా ఉద్యమ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి. ‘రాయుడుగారు నాయుడుగారు’(1996)లోని ‘ఆకుపచ్చ చందమామ నువ్వేలే’, ‘ఎన్‌కౌంటర్‌' (1997)లోని ‘ఊరూవాడ అక్కల్లారా’, ‘శ్రీరాములయ్య’లోని ‘గడియ గడియల్లోన ఒక గండమై’, ‘గురి’లోని ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేనవేల వందనాలమ్మా’, ‘భద్రాచలం’లోని ‘ఇదే నా పల్లెటూరు’, ‘ఒకటే జననం’, ‘శంకర్‌ దాదా జిందాబాద్‌'లోని ‘వందేమాతరం గాంధీ ఓంకారం’, ‘నగరం నిద్రపోతున్న వేళ’లోని ‘నిద్రపోతున్నది పట్నం’ మొదలైన పాటలన్నీ గొప్ప చైతన్యాన్ని, దేశభక్తిని, తెలంగాణ పలుకుబళ్ళను, భావ సుగంధాన్ని రంగరించుకున్నాయి. 

అలరించే అక్షరాలు

 ‘ఒకటే జననం ఒకటే మరణం’ పాట నిరాశతో, నిస్పృహతో ఆత్మహత్యకు యత్నించిన వారికి కూడా జీవితం విలువేంటో తెలిపి, పట్టుదలను నేర్పి  శిఖరాల స్థాయికి చేర్చింది. ఆ పాట విని చావు ఆలోచనను మార్చుకున్న వారూ అనేకమంది ఉన్నారు. ‘పాండురంగడు’(2008)లోని ‘మాతృదేవోభవ అన్న మాట మరిచాను’ పాట తల్లిదండ్రుల ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. పిల్లల బాధ్యతనూ గుర్తుచేస్తుంది. ప్రణయగీతాలు రాయడంలో ఆయనదో ప్రత్యేక శైలి. ప్రణయానికి అచ్చమైన జానపద సౌందర్యాన్ని అద్దగలరు అశోక్‌ తేజ. అందులో అమలిన శృంగారమూ అంతర్లీనం. ‘ఝుమ్మంది నాదం’లోని ‘ఏం సక్కగున్నావ్‌ రో ’, ‘ఫిదా’లో ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే’ తదితర పాటలు ఎంతగా ఉర్రూతలూపాయో అందరికీ తెలిసిందే. ‘6 టీన్స్‌'లోని ‘దేవుడు వరమందిస్తే’, ‘గర్ల్‌ ఫ్రెండ్‌లోని ‘నువు యాడికెళ్తే ఆడికొస్త’, ‘చందమామ’లోని ‘రేగుముల్లోలే’, ‘సుభాష్‌ చంద్రబోస్‌'లోని ‘నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు’, ‘రోబో’లోని ‘ఇనుములో హృదయం మొలిచెనే’, ‘గోవిందుడు అందరి వాడేలే’లోని ‘నీలిరంగు చీరలోన’ ఇలా ప్రతి పాటా అలరించేదే. ఠాగూర్‌'లోని ‘నేను సైతం ప్రపంచాగ్నికి’(శ్రీశ్రీ ప్రేరణతో) పాటకు ఉత్తమ గీతరచయితగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 2014లో గీతం యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. అలుపెరుగని పాటల కెరటంలా ప్రయాణిస్తున్నారు..పదునెరిగిన అక్షర కిరణంలా ప్రసరిస్తున్నారు అశోక్‌తేజ. “మా నాన్న సుద్దాల హన్మంతు జగమెరిగిన కవి. నా చిన్నతనంలో మా ఇంటికి ఎందరో కవులు, ప్రజానాయకులు వస్తుండేవారు. వారితో నాన్న సాగించే చర్చలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. అంతేకాదు, నేనింకా పదాలు కూడా రాయలేని రోజుల్లోనే శ్రీశ్రీ మహాప్రస్థానం నాతో బట్టీపట్టించారు. అలా నాన్న వారసత్వంగా రచనా శక్తి, ఆసక్తి నాకు అబ్బాయి” అంటారు సుద్దాల అశోక్‌ తేజ.