గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Oct 11, 2020 , 05:21:13

సిరిసిల్ల సిగలో.. విద్యుల్లత

సిరిసిల్ల సిగలో.. విద్యుల్లత

గుడ్డి దీపాల పల్లెల్లో వెలుగులు నింపిన కాంతిపుంజం ఆ సంస్థ. కరెంటు అంటే అంతగా తెలియని రోజుల్లో  గుడిసెలో బల్బు వెలిగించి, వీధి చివర స్తంభంపై వెన్నెల కురిపించి, ఊరి చివర పొలంలో జలతరంగాన్ని ఉప్పొంగించి బాపూజీ కలలుగన్న పల్లె భారతానికి వన్నెలు అద్దిన సంస్థ అది. అనేక సంక్షోభాలను ఎదుర్కొని, జాతీయ స్థాయిలో  ప్రత్యేకతను నిలుపుకొని స్వర్ణోత్సవ కాంతులు విరజిమ్ముతున్నది.. సహకార విద్యుత్‌ సరఫరా సంఘం లిమిటెడ్‌, సిరిసిల్ల (సెస్‌).  నవంబరు 1న యాభై వసంతాల పూర్తి చేసుకుంటున్న ఈ కాంతిపుంజం కథలో మేలి మలుపులు అనేకం.

రెంట్‌ అంటే బ్రహ్మపదార్థం అనుకునే రోజులవి. పల్లెసీమలకు విద్యుత్‌ కాంతులు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో 1969లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఇసి)ను ప్రారంభించింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో ఐదు గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంఘాలు ప్రారంభించాలని సంకల్పించింది. ఈ క్రమంలో 1970 నవంబర్‌ 1న సిరిసిల్లలో సహకార విద్యుత్‌ సరఫరా సంఘం కార్యకలాపాలు మొదలయ్యాయి. సహకార స్ఫూర్తికి తలమానికంగా నిలిచి. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందీ సంస్థ.

రెండున్నర లక్షల కనెక్షన్లు

సంస్థ ప్రారంభమైన తొలినాళ్లలో విద్యుత్‌ కనెక్షన్లు వందల సంఖ్యలోనే ఉండేవి. కాలక్రమంలో వేలు దాటి, ఇప్పుడు లక్షల సర్వీసులు కలిగి ఉన్నది.ప్రస్తుతం..సెస్‌ పరిధిలో 2.55 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. సంస్థ ప్రారంభంలో కేవలం మూడు వేల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 76 వేలకు చేరుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో నాణ్యమైన సేవలు అందిస్తూ.. ప్రభుత్వ నిరంతర విద్యుత్తు సంకల్పాన్ని నెరవేర్చడంలో తనవంతుగా కృషి చేస్తున్నది. సెస్‌ పనితీరును చూసి ఉమ్మడి రాష్ట్రంలో పదమూడు సహకార విద్యుత్‌ సరఫరా సంఘాలు నెలకొల్పారు. అయితే వాటిలో చాలావరకూ మూతపడ్డాయి. ఐదు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. వాటిలో నాలుగు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణలో మాత్రం ఇదొక్కటే. ఈ సంస్థ ప్రస్తుతం ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ నుంచి కరెంటు కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నది. సంస్థ పురోగతిలో ఉద్యోగుల పాత్ర ఎన్నదగినది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరిస్తూ ప్రజల నమ్మకాన్ని కాపాడుతున్నారు. తెలంగాణ అవతరణ తర్వాత.. ప్రభుత్వం చేయూత తోడవ్వడంతో తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ సెస్‌ తలమానికంగా నిలుస్తున్నది. సెస్‌ విజయాలు జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్నాయి. 

మగ్గాలు ఆగకుండా

తెలంగాణ చేనేత ఖిల్లాగా పేరున్న సిరిసిల్ల నేతన్నల అభివృద్ధిలో సెస్‌ సహకారం ఎంతైనా ఉంది. మర మగ్గాలు అలుపెరగకుండా ఆడేలా చూస్తున్నది. నేత, అనుబంధ రంగాలకు ప్రభుత్వం కల్పిస్తున్న 50 శాతం విద్యుత్‌ రాయితీని అందిస్తున్నది. ఆ మొత్తాన్ని సంస్థకు  ప్రభుత్వం  ఇస్తున్నది సిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌కు అవసరమైన విద్యుత్‌ కూడా ఈ సంస్థ నుంచి సరఫరా అవుతున్నదే. స్వర్ణోత్సవ స్ఫూర్తితో సంస్థ ఉద్యోగులు మరింత ఉత్సాహంగా  పని చేస్తారనడంలో  సందేహం లేదు.

సభ్యుల సహకారంతో..

ఐదు దశాబ్దాల విజయగాథలో సభ్యులు, వినియోగదారులు అత్యంత క్రియాత్మకంగా వ్యవహరించారు. సహకార సంఘంలో ప్రస్తుతం 2.97 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరి వాటా ధనం సుమారు 6.15 కోట్లు. అంటే సంస్థ ఆర్థిక పురోగతిలో వీరి సహాయ సహకారాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. సంస్థ ప్రారంభంలో విద్యుత్‌ లైన్ల నిర్మాణంలో, ట్రాన్స్‌ఫార్మర్ల స్థాపనలో, సామగ్రి  రవాణాలో వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రమదానం చేశారు. ఒక సంస్థ తల్లిచెట్టు లాంటిది. ఆ నీడన వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తాయి. 

చెన్నమనేని కృషి

సిరిసిల్లలో సంస్థ స్థాపన వెనుక అప్పటి శాసనసభ్యుడు, రాజనీతిజ్ఞుడు చెన్నమనేని రాజేశ్వరరావు పట్టుదల ఎంతో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో... ఆంధ్రపాలకుల పెత్తనంలో.. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థను సిరిసిల్లకు తీసుకురావడం అంటే మాటలు కావు. ఆ తర్వాత సిరిసిల్ల శాసన సభ్యులుగా సేవలందించిన నేతలు, సంస్థ ఉద్యోగులు, ఉన్నతాధికారుల కృషే సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ మనుగడ మహోన్నతంగా కొనసాగేలా చేసింది.logo