సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Oct 11, 2020 , 04:52:13

అదరహో.. ఆదివాసీ యువత!

అదరహో.. ఆదివాసీ యువత!

అడ్వెంచర్‌ ట్రిప్స్‌కు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్లాలో, ఎలా చేరుకోవాలో తెలియక సతమత పడుతుంటారు. అలాంటి వారిని గైడ్‌ చేసేందుకు ఆదిలాబాద్‌ జిల్లాలోని ఊట్నూరుకు చెందిన ఆదివాసీ యువకులు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ‘ట్రైబ్‌వైబ్‌ అడ్వెంచర్‌' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.  బతుకు-బతికించు అన్న నినాదంతో గిరిజన కళలనూ ప్రోత్సహిస్తున్నారు.

అతనొక ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌. దేశమంతా చుట్టేస్తూ కొతకొత్త ప్రదేశాలూ.. అక్కడి వింతలూ విడ్డూరాలూ చిత్రీకరించడమే తన వ్యాపకం. వీటన్నింటి కంటే ముందుగా అతనొక ఆదివాసీ. ఎన్నో ప్రదేశాలు చూశాక, తనకు ఒక ఐడియా వచ్చింది. తనుండే ప్రాంతంలోనే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటినెందుకు ప్రపంచానికి పరిచయం చేయకూడదనే ఆలోచనతో ఉద్యోగాన్ని వీడాడు. ఆ ప్రయత్నంలో మరికొందరు తోడయ్యారు. ‘ట్రైబ్‌ వైబ్‌ అడ్వెంచర్‌' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఔత్సాహికులకు ప్రకృతి అందాలను పరిచయం చేస్తున్నది ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలానికి చెందిన అశోక్‌ మిత్ర బృందం. ఉత్తరాఖండ్‌, అస్సాం, సిక్కిం తదితర ప్రాంతాల్లోని ఎత్తయిన కొండలు, అడవులు అంటే అందరికీ ఇష్టమే. ఇలాంటి ప్రాంతాలను  చూడాలనీ, అక్కడ ఒక రోజు అయినా గడపాలనీ ఎవరికి మాత్రం ఉండదూ? కానీ దూర ప్రయాణం ఖర్చుతో కూడుకున్న పని. కట్‌ చేస్తే, తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాల్లో వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే. ప్రపంచానికి తెలియని జలపాతాలూ అపారం. ట్రెక్కింగ్‌ చేసేందుకు అనువైన కొండలూ అనేకం. అందులోనూ, తెలంగాణ కశ్మీరం అయిన ఆదిలాబాద్‌ అడవుల్లో కనిపించే ప్రకృతి అందాలు పర్యాటకుల మనసులను దోచుకుంటున్నాయి. ట్రైబ్‌వైబ్‌ వెబ్‌సైట్‌లో ఆ అనుభవాల వివరాలన్నీ ఉంటాయి. 

ఈ బృందంలోని ఐదుగురూ ఒక్కో రంగంలో నిష్ణాతులే. ఫౌండర్‌ వెడ్మ అశోక్‌కుమార్‌ విజువల్‌ కమ్యూనికేషన్స్‌ నిపుణుడు. అనాక అవినాశ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివాడు. ఆత్రం వినోద్‌ మెకానికల్‌ ఇంజినీర్‌. జుగ్‌నక్‌ చరణ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌లో కోర్సు చేశాడు. మంగం మహేశ్‌ బీఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివారు.

క్యాంపింగ్‌.. ట్రెక్కింగ్‌...

 

ఆసిఫాబాద్‌లోని మిట్టె వాటర్‌ ఫాల్స్‌ (ఏడు), ఆదిలాబాద్‌లోని ఇచ్చోడ దగ్గరున్న గాయత్రీ ఫాల్స్‌  పరిసరాల్లో క్యాంపింగ్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అడవుల్లో ఒక రోజు గడపాలనుకునే ఔత్సాహికులకూ తగిన సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చే అతిథులకు ఆదివాసీ వంటలను రుచి చూపిస్తారు. పర్యాటకుల ఆసక్తి మేరకు ఒకటి నుంచి మూడు రోజుల ప్యాకేజీలను రూపొందించారు. ట్రైబ్‌వైబ్‌ అడ్వెంచర్‌ బృందం ఇక్కడి రైతులకూ అండగా నిలుస్తున్నది. అడవుల్లో దొరికే పండ్లు, గిరిజనులు పండించే పంటలను విక్రయించేందుకు రైతులకు సహకరిస్తున్నది. ఉత్తరాఖండ్‌లో  కూడా వీరి బృందం పని చేస్తున్నది. కాకపోతే, కొవిడ్‌ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ నిలిపివేశారు. నవంబర్‌ నుంచి మళ్లీ పర్యాటకుల సందడి మొదలయ్యే అవకాశం ఉంది. ‘ఆదిలాబాద్‌లోని  ప్రకృతి అందాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అనేకమంది వచ్చారు. మున్ముందు మరిన్ని పర్యాటక ప్రదేశాలను ప్రకృతి ప్రియులకు చూపించేందుకు కృషి చేస్తాం’ అంటారు ట్రైబ్‌ వైబ్‌ అడ్వెంచర్‌ వ్యవస్థాపకుడు అశోక్‌. థింక్‌ గ్లోబల్‌.. యాక్ట్‌ లోకల్‌ అంటే ఇదే మరి! logo