సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Oct 11, 2020 , 04:29:01

జలుబు.. కొవిడ్‌.. ఏంటి తేడా?

జలుబు.. కొవిడ్‌.. ఏంటి తేడా?

సాధారణ జలుబును చూసి కొవిడ్‌ అని  భయపడుతూనే ఉన్నాం. రెండింటికీ తేడాను ఎలా గుర్తించాలి? ఏ మాస్కు వాడితే మంచిది... ఇలాంటి విషయాల్లో మనకింకా అనేక సందేహాలున్నాయి. అయితే కొవిడ్‌  గురించి పరిశోధనలు, అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. అలాంటి కొన్ని అధ్యయనాల్లో నుంచి ముచ్చటగా మూడు.

తేమతో కొవిడ్‌!

గాలిలోకి చేరిన లాలాజల బిందువుల ద్వారాక కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని మనకు తెలిసిందే. అయితే తేమ ఎక్కువగా ఉండే వాతావరణం ఈ లాలాజల బిందువుల్లో ఉండే వైరస్‌ జీవితకాలాన్ని పొడిగించగలదని ఇటీవలి అధ్యయనంలో తేలింది. తేమ వాతావరణం వైరస్‌తో కూడిన బిందువుల జీవితకాలాన్ని 23 రెట్లు ఎక్కువ చేస్తుంది. అందుకే కొవిడ్‌  విషయంలో సామాజిక దూరమే సరైన పరిష్కారమంటున్నారు శాస్త్రజ్ఞులు. కొవిడ్‌కి కారణమయ్యే కరోనా వైరస్‌ మాట్లాడటం, తుమ్మడం, దగ్గడం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుందని మనకు తెలిసిందే. అయితే గాలి ద్వారా ఎలా వ్యాపించగలుగుతుందనేది మనకింకా స్పష్టత కాలేదు. అయితే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లాలాజల బిందువుల్లోని వైరస్‌లో 70 శాతం కింద పడిపోతుంది. అందుకే సామాజిక దూరం పాటించడం వల్ల ఈ బిందువులు  మన మీద పడే ప్రమాదం తగ్గుతుంది. అంతేగాక వాటిని పీల్చుకునే అవకాశం కూడా తగ్గుతుంది. సాధారణంగా మన శ్వాసలో ఉండే బిందువుల పరిమాణం పదిలో ఒక వంతు నుంచి 1000 మైక్రాన్లు ఉంటుంది. కరోనా వైరస్‌ మైక్రాన్‌లో పదోవంతు ఉంటుంది. మనం ఊపిరి వదిలినప్పుడు దానిలో ఉండే బిందువులు 50 నుంచి 100 మైక్రాన్ల డయామీటర్‌లో ఉంటాయి. అందువల్ల చాలావరకు వైరస్‌ కింద పడిపోతాయి. ఇకపోతే  గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు సహజ సిద్ధమైన ఆవిరయ్యే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్‌ గాలిలో ఎక్కువసేపు ఉంటుందని తేల్చారు పరిశోధకులు. మిస్సోరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేమ వాతావరణానికి, కొవిడ్‌ వ్యాప్తికి మధ్య సంబంధాన్ని విశ్లేషించినప్పుడు ఈ విషయం తేలింది. అందుకే ఈ సీజన్‌లో సామాజిక దూరాన్ని పాటించడం మరింత అవసరమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

బట్ట మాస్కులే బెస్ట్‌!

మనం మాట్లాడుతున్నప్పుడు, తుమ్మినా, దగ్గినా... నోటి నుంచి వచ్చే లాలాజలపు తుంపరల (ఏరోసాల్స్‌) వల్ల జరిగే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మాస్కులదే ప్రధాన పాత్ర. ఈ ఏరోసాల్స్‌ ట్రాన్స్‌మిషన్‌ను తగ్గించడంలో వివిధ రకాల వస్ర్తాలతో  చేసిన మాస్కులు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయంటున్నారు. ఈ అధ్యయనం కోసం 11 రకాల పదార్థాలతో ఇంట్లో తయారు చేసిన మాస్కులను పరిశీలించారు. ఇల్లినాయిస్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉన్నది. 

వాసన ఎందుకు రాదంటే?

జలుబు చేసినప్పుడు ముక్కులు బ్లాక్‌ అవుతాయి. ఒక్కోసారి గాలి సరిగా పీల్చుకోలేం. దీంతోపాటుగా ముక్కు చాలా  వాసనలను సరిగా గుర్తించలేదు. కొవిడ్‌తో కూడా వాసన కోల్పోతాం. అయితే ఈ రెండింటి మధ్య తేడా ఉందని చెప్తున్నారు ఈస్ట్‌ ఆంగ్లియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. కొవిడ్‌  సోకినప్పుడు వాసన కోల్పోతారు గానీ ముక్కులు మూసుకుపోవు. ముక్కు కారదు. కొవిడ్‌  కేంద్రీయ నాడీ వ్యవస్థ (మెదడు)ను కూడా ప్రభావితం చేయడమే ఇందుకు కారణమని చెప్తున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనాంశాలు రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అయితే వాసన, రుచి కోల్పోవడమనేది జలుబు, కొవిడ్‌..  రెండింట్లోనూ ఉండటంతో సాధారణ జలుబు ఉన్నప్పటికీ కరోనాయే కావచ్చని భయపడటం సహజం.  కొవిడ్‌  సోకితే వాసన కోల్పోవడం కూడా ప్రథమ లక్షణంగా కనిపిస్తున్నదని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. ఇప్పుడు మళ్లీ ఇంకో చిక్కు వచ్చి పడింది. తీవ్రమైన జలుబు, ఫ్లూ ఉన్నప్పుడు కూడా ముక్కులు మూసుకుపోయి, వాసన తెలియదు. అందుకే ఈ దిశగా పరిశోధన చేశారు యుకెలోని ఈస్ట్‌ ఆంగ్లియా యూనివర్సిటీ పరిశోధకులు. కొవిడ్‌ 19 పేషెంట్లు చేదు, తీపి రుచులను గుర్తించలేరని కొత్త పరిశోధనలు బల్లగుద్ది చెప్తున్నాయి.


logo