శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Oct 11, 2020 , 04:18:16

డీల్‌లో.. డీలా వద్దు!

డీల్‌లో.. డీలా వద్దు!

బేరం చేయడం ఒక కళ. ఒకానొక శాస్త్రం కూడా. దాన్లోనే సైకాలజీ ఉంది. ఎకనామిక్స్‌ ఉంది. సంభాషణా చాతుర్యమూ ఉంటుంది. అందులోనూ అది వ్యాపార సంబంధమైన బేరం అయితే.. మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అదెలాగో, ‘గెరిల్లా డీల్‌ మేకింగ్‌' పుస్తకంలో వివరంగా చెబుతారు  రచయిత జే లెవిన్సన్‌. మీరూ తెలుసుకోండి ఆ చిట్కాలు. 

వ్యూహం

బేరానికి వెళ్తున్నప్పుడు సరుకు గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. ఆ సరుకు యజమాని గురించి కూడా లోతైన పరిశోధన చేయాలి. అతని వ్యక్తిత్వాన్ని విశ్లేషించుకోవాలి. అతను లావాదేవీలు జరిపే పద్ధతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తిని బట్టి వ్యూహం మారాలి. ఇక్కడే చాలా మంది దెబ్బ తింటారు. 

జాగ్రత్త

ఫలానా ఇంటినో, ఫ్లాట్‌నో, ప్లాట్‌లో.. దసరా నాటికో, దీపావళి నాటికో అమ్మేయాల్సిందే అన్న గడువు పెట్టుకోవచ్చు. ఆస్తులు కొంటున్నప్పుడు కూడా ఈ జాగ్రత్త వర్తిస్తుంది. ఆరు నూరైనా ఈ ఏడాది చివరికో, పెండ్లి రోజు నాటికో కొనేయాల్సిందే అన్న పట్టుదల మంచిది కాదు. దీనివల్ల అవతలి వ్యక్తికి మన ఆత్రుత అర్థం అవుతుంది. ధర పెంచుతాడు. తొందరపాటు వివేకాన్ని చంపేస్తుంది. సరైన నిర్ణయం తీసుకోలేం.  ఫలితంగా నష్టపోతాం.  

ఒక విషయం గుర్తుంచుకోండి. ప్లానింగ్‌ అనేది మంచిదే. కానీ, ఆ ప్లాన్‌ ప్రకారమే జరగాలన్న రూలేం లేదు. కొన్నిసార్లు ప్రకృతి మనతో దాగుడు మూతలు ఆడుతుంది. మేనేజ్‌మెంట్‌లో 80:20 అన్న నియమం ఒకటి ఉంది. చాలా సందర్భాల్లో ఎనభైశాతం సమయంలో ఇరవైశాతం పనులు మాత్రమే పూర్తవుతాయి. ఇరవై శాతం సమయంలో ఎనభై శాతం పనులు చకచకా జరిగిపోతాయి. కాబట్టి, టెన్షన్‌ పడకండి. 

మాట

కొంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, అమ్ముతున్నప్పుడూ అంతే అప్రమత్తంగా ఉండాలి. ‘లాస్ట్‌ పీస్‌', ‘బ్రాండ్‌ న్యూ’, ‘లేటెస్ట్‌', ‘డబ్బు ఆదా’, ‘మీరు’, ‘మీది’.. తదితర పదాలను ధారాళంగా ఉపయోగించండి. ఆ మాటలకు అయస్కాంతత్వ శక్తి ఉంది. వద్దనుకున్నవాడితోనూ కొనిపిస్తాయి. ఓ రూపాయి ఎక్కువ ఖర్చుపెట్టేలా చేస్తాయి. డీల్‌ జరుగుతున్న సమయంలో ‘ఫెయిల్యూర్‌', ‘చావు’, ‘నష్టం’, ‘భయం’.. తదితర మాటల జోలికి వెళ్లకండి. ఈ పదజాలంలో నెగెటివ్‌ ఎనర్జీ ఉంటుంది. 

మనలో మాట. మరక మంచిదే అన్నట్టు, కొన్ని డీల్స్‌ కుదరకపోవడమే శ్రేయస్కరం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లూ తదితర ‘పవర్‌ఫుల్‌' వ్యక్తులతో లావాదేవీ అంటే కొరివితో తలగోక్కున్నట్టే. వాళ్లను ఎన్నటికీ తృప్తి పరచలేం. చివరికి సరుకు ఉచితంగా ఇచ్చినా సరే. 

కష్టమేం కాదు

ప్రశ్నించండి. ప్రశ్నిస్తూనే ఉండండి. ఎదుటి మనిషి విసుక్కున్నా, తిట్టుకున్నా ప్రశ్నించడం మాత్రం మానకండి. ఆ జవాబులో నుంచి ఇంకో ప్రశ్నను సృష్టించుకోండి. అతని నోట్లోంచి ముత్యాలు రాలకపోవచ్చు. కానీ అభిరుచులూ అభిప్రాయాలూ టపటపా రాలుతాయి. వాటిని గుదిగుచ్చితే... విలువైన సమాచారం లభిస్తుంది. డేటా ఎనాలిసిస్‌ అంటే అదే. మనసును తెలుసుకుంటే మనిషిని గెలవడం పెద్ద కష్టమేం కాదు.