బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Oct 10, 2020 , 23:51:22

డ్రై కిచెన్‌కు, వెట్‌ కిచెన్‌కు మధ్య వాష్‌ ఏరియా పెట్టొచ్చా?

డ్రై కిచెన్‌కు, వెట్‌ కిచెన్‌కు మధ్య వాష్‌ ఏరియా పెట్టొచ్చా?

డ్రై కిచెన్‌కు, వెట్‌ కిచెన్‌కు మధ్య వాష్‌ ఏరియా పెట్టొచ్చా?- ఆర్‌.కిరణ్‌, నిజాంపేట

ఇంట్లో రెండు వంట గదులు పెట్టడం అవసరమా ఆలోచించండి. ఒకే కిచెన్‌ను విశాలంగా, అనుకూలంగా నిర్మించుకుంటే సరిపోతుంది. ముందు ఆ రెండు కిచెన్‌లు ‘ఆగ్నేయ భాగంలో’ ఉండాలి. స్థలం అనుకూలించినా  సరే, ఈ రెండిటి మధ్య వాష్‌ ఏరియా పెట్టుకోవద్దు. అప్పుడు కిచెన్‌ల విభజన మారుతుంది. అంతగా అనుకుంటే ‘పార్టిషన్‌ వాల్‌'తో వేరు చేసుకునేలా ఉండాలి. వాష్‌ ఏరియాను వంటగదికి దక్షిణ ఆగ్నేయ దిశలో వచ్చేలా ప్లాన్‌ చేసుకోండి. 

మా ఇంటికి పడమర, ఉత్తరం, తూర్పు ఇండ్లు ఆనుకొని దక్షిణం రోడ్డు ఉంది.ఇప్పుడెలా? ఏం చేయమంటారు? - వి.హనుమంతు, దోమలగూడ

ముందు మీరు ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి మారండి. మంచి గాలి, వెలుతురు వచ్చే ఇంట్లోకి షిఫ్ట్‌ అవ్వండి. ఆ తర్వాత మీ సొంత ఇంటిని తూర్పు, ఉత్తరం ఖాళీ ఉండేలా పై నుంచి స్లాబ్‌ను కనీసం మూడు అడుగులు కొట్టేయండి. అప్పుడు ఇంట్లోకి గాలి, వెలుతురు వస్తాయి. దానికి అనుగుణంగా ఇంట్లో మార్పులు చేసుకోండి. మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఆస్తిపాస్తులు, అధికారం, ఐశ్వర్యం శాశ్వతం కాదు. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కాపాడుకోవాలంటే గృహం సలక్షణంగా ఉండాలి. ఈ విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఇంట్లో మార్పులు చేసుకుంటే సమస్యల నుంచి తప్పక బయటపడతారు.

మా ఆఫీసు పై అంతస్తులో టాయిలెట్లు వచ్చి, కింది అంతస్తులో సరిగ్గా వాటి కిందే సిట్టింగ్‌ రూమ్‌ (చాంబర్‌) వచ్చింది. అలా ఉండొచ్చా? - సీతారామ్‌, హైదరాబాద్‌

మీ నిర్మాణంలోనే లోపం ఉంది.  అధికారి గదిని ఎవరైనా నైరుతి భాగంలో ఏర్పాటు చేస్తారు. అలాంటప్పుడు దానికి పైఅంతస్తులో అయినా, కింది అంతస్తులో అయినా ఆ భాగం అదేవిధంగా ఉండాలి. కానీ, కింద చాంబర్‌ ఇచ్చి దాని పైన టాయిలెట్లు నిర్మించడం దోషం. ఏ నిర్మాణంలో అయినా టాయిలెట్‌ జోన్‌గా ఆగ్నేయం లేదా వాయవ్యం దిశలు మంచి వసతి ఇస్తాయి. ఎందుకంటే ఆ మూలల్లో ఎప్పుడూ సూర్యరశ్మి ఉంటుంది. అలాగే కార్నర్‌లో భాగం కాబట్టి, వెంటిలేషన్‌ పుష్కలంగా ఉంటుంది. టాయిలెట్లూ శుభ్రంగా ఉంటాయి. మీరు ముందుగా నైరుతి భాగంలోని టాయిలెట్లను అన్ని అంతస్తుల నుంచీ తీసివేయండి. అన్ని అంతస్తుల్లో ఆ భాగాన్ని డైరెక్టర్స్‌కి, అంటే యాజమాన్యానికి అనుకూలంగా నిర్మించండి. తద్వారా కింది నుంచి పైదాకా ఆ దిశ శక్తిని పొందుతుంది. 

మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్‌ నం: 10, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ - 500034.


logo