శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Oct 10, 2020 , 22:17:17

ఈ మెరుపుల్‌..పక్కా లోకల్‌!

ఈ మెరుపుల్‌..పక్కా లోకల్‌!

‘బిగ్‌బాస్‌-4’ షోలో ఉరుము లేని మెరుపులా తళుక్కుమన్నదో తార. మేని ఛాయ బంగారం. మాటలు చిలుక పలుకులే. ఆమె అడుగుపెట్టడంతోనే బిగ్‌బాస్‌ ఇంట్లో ఈక్వేషన్స్‌ మారిపోయాయి. ఇంతింత కన్నులతో మాయచేస్తున్న ఆ ఇంతి పేరు స్వాతీ దీక్షిత్‌. తనని చూడగానే తెలుగు టీవీ కార్యక్రమానికి బాలీవుడ్‌ ముద్దుగుమ్మ వచ్చిందేమిటా అనుకున్నారంతా! కానీ, స్వాతి అచ్చతెలుగు ఆడపడుచు. ఈ  బాపు బొమ్మ గురించి కొన్ని విశేషాలు..

  • స్వాతి నూరుశాతం హైదరాబాదీ. 1993 మార్చి 20న ఇక్కడే పుట్టింది. భాగ్యనగరిలోనే చదువుకుంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా రెండు సినిమాల్లో కనిపించింది.
  • పదేండ్ల క్రితం  ‘అందమైన భామలు’ అనే టీవీ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది స్వాతి. మొదటి ఈవెంట్‌లోనే విన్నర్‌గా నిలిచింది. తర్వాత రెండు కమర్షియల్‌ యాడ్స్‌లో నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది.
 • టాలీవుడ్‌ సంచలనం ‘ఆర్‌ఎక్స్‌ 100’లో తొలుత హీరోయిన్‌ అవకాశం స్వాతికే వచ్చిందట. అయితే, ఎందుకో ఆ పాత్రకు తను సరిపోనని వద్దనుకున్నట్టు టాక్‌. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో డీగ్లామర్‌ పాత్రలో నటించి మెప్పించాలనేది స్వాతి కోరిక. తథాస్తు!
 • గత ఏడాది ‘సాతుర ఆది 3500’, ‘సింబా’ చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించింది. హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో స్వాతి తండ్రిని కోల్పోయింది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. 
 • 2012లో బెంగాలీ చిత్రం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంది స్వాతి. తర్వాత బ్రేకప్‌ అనే తెలుగు సినిమాలో కనిపించింది. 2014లో రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన ‘పట్టపగలు’లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. అదే ఏడాది అల్లరి నరేష్‌ సరసన ‘జంప్‌ జిలానీ’లో సెకండ్‌ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ‘జంటిల్‌మెన్‌', ‘చిత్రాంగద’ చిత్రాలు మంచిపేరే తెచ్చిపెట్టాయి. 
  • స్వాతికి యోగాలో ప్రవేశం ఉంది. రోజూ కనీసం గంటసేపు ఆసనాలు వేస్తుంది. ఇంటర్నేషనల్‌ యోగా ట్రైనర్‌గానూ ఆమెకు పేరుంది. ఏ రుగ్మతకు ఏ ఆసనం పనిచేస్తుందో ఇట్టే చెప్పేస్తుంది. 
  • గతంలో రెండుసార్లు బిగ్‌బాస్‌ షోకు అవకాశం వచ్చినా స్వాతి  ఆసక్తి చూపలేదు. ఈసారి మాత్రం వైల్డ్‌ కార్డు ఎంట్రీతో బిగ్‌బాస్‌లో మెరిసిందీ బుట్టబొమ్మ. టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యమిస్తూ ఒక రోజులో పది పనులైనా చేయడం ఇష్టమని అంటున్నది. అల్లరి చేయడం... హారర్‌ మూవీలు చూడటం తన హాబీలు.


logo