శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Oct 04, 2020 , 00:26:20

జగిత్యాలలో.. జిగేలు రాణులు

జగిత్యాలలో.. జిగేలు రాణులు

సీతాకోకచిలుకలు..మనిషికి వరుసకు మేనత్తలు అవుతాయి. ఎందుకంటే, అతడికంటే ముందే, భూమిమీద ఉద్భవించాయి. ఆ ఎగిరే పూలు..పర్యావరణ మార్పులకు సూచికలు. జీవ వైవిధ్యానికి పంచప్రాణాలు. అందానికి చిరునామాలు. ఆకర్షణలో అయస్కాంతాలు! కాటుక వర్ణంలో కనిపించేవి కొన్నయితే.. అరుణవర్ణంలో మెరిసిపోయేవి మరికొన్ని! పసుపు ఛాయలో జిగేల్‌మనేవి కొన్నయితే.. మేఘవర్ణంతో ఆకట్టుకునేవి ఇంకొన్ని! ప్రకృతిలోని రంగులన్నీ సీతాకోక చిలుకమ్మకు అందమైన కోకలే! 

సీతాకోకచిలుకలు స్వతహాగా కీటక జాతికి చెందినవి. తేనెటీగలు, చిమ్మెటలతోపాటు జీవ వైవిధ్యంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. వీటి జీవితకాలం తొమ్మిది నెలలు. అంటే, ఓ బిడ్డ తల్లి కడుపులో జీవం పోసుకుని.. ఈ ప్రపంచం మీదికి అడుగుపెట్టే సమయానికంతా ఓ సీతాకోక చిలుక జీవిత చక్రం పూర్తి అవుతుంది. అయితేనేం, బతికినంతకాలం ఆనందంగా బతుకుతాయి. పచ్చదనాన్ని ప్రేమిస్తాయి. ప్రాణవాయువంటే ప్రాణం ఇస్తాయి. వాటి జీవితంలో నాలుగు దశలు ఉంటాయి. మొదటిది లార్వా దశ. ఇది మొక్కల ఆకులను అంటిపెట్టుకుని ఉంటుంది. రెండోది కోశస్థ దశ. ఆరు నుంచి ఏడు రోజుల్లో ఒక నిర్మాణం ఏర్పడుతుంది. ఈ దశలో తన చర్మం ద్వారా శ్వాసిస్తుంది. దీన్నే గొంగళిపురుగు దశ అంటారు. ఈ దశలో కండ్లు ఏమంత ప్రభావవంతంగా ఉండవు. ఆకులను తిని తన పరిమాణాన్ని పెంచుకుంటుంది. మూడోది విశ్రాంత దశ లేదా ప్యూపా దశ. గొంగళి పురుగు తన చుట్టూ ఒక కోశాన్ని అల్లుకుంటుంది. మొక్కను గట్టిగా పట్టుదారంతో అంటిపెట్టుకుని ఉంటుంది. ప్యూపా దశ నుంచి గొంగళి పురుగు కాస్తా సీతాకోకచిలుకగా మార్పు చెందుతుంది. నాలుగోది ప్రౌఢ దశ. గొంగళి పురుగు కోశాన్ని తొలగించుకుని, చిన్న సీతాకోకచిలుకగా బయటికొస్తుంది. త్వరలోనే ఇది ప్రౌఢ సీతాకోకచిలుకగా మారుతుంది. ఆ దశలో సీతాకోక చిలుక మరింత అందంగా కనిపిస్తుంది. ఇవి వృక్ష సంపద వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎగిరే పూవులుగా గుర్తింపు పొందిన సీతాకోక చిలుకల ఉనికి సౌభాగ్యానికి చిహ్నం, స్వచ్ఛతకు ప్రతీక, పచ్చదనానికి సాక్షి సంతకం! 

ఎన్నో జాతులు

ప్రపంచవ్యాప్తంగా 2,800 సీతాకోక జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. ఇందులో 80 శాతం జాతులు వృక్ష సంపదపై, మొక్కలపై ఆధారపడి జీవితాన్ని గడుపుతాయి. అయితే, సీతాకోక చిలుకలు సమశీతల మండలంలోనే అధికంగా జీవిస్తాయి. అలాగే ఉష్ణ మండలంలోని కొన్ని చోట్ల సైతం వీటి సంచారం ఉంటుంది. 200 మిలియన్‌ సంవత్సరాల క్రితం.. భూమిపై వృక్ష సంపద ఆవిర్భవించినప్పుడే సీతాకోక చిలుకలు సైతం అవతరించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎన్ని సీతాకోక చిలుకల జాతులు ఉంటే.. అంత వృక్ష సంపద అభివృద్ధి జరుగుతున్నట్టు! సీతాకోకలు అన్ని రకాల చెట్లపైనా గుడ్లు పెట్టవు, తమకు లవణాలను, మకరందాన్ని ఇచ్చే వృక్షాలపై మాత్రమే.. అదీ సమశీతల వాతావరణం ఉన్నప్పుడే గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఏ తల్లి దండ్రులైనా తమ పిల్లలు కాలుష్యపు జాడలేని వాతావరణంలో పుట్టి పెరగాలనే కదా కోరుకుంటారు! సీతాకోకమ్మ ఆశా అదే!  కొన్నిరకాల వృక్షాలపై, కొన్ని జాతుల సీతాకోక చిలుకలే సంచరిస్తాయి. వాటి జీవితంలో చాలా క్రమశిక్షణ ఉంటుంది. 

సుదీర్ఘ ప్రయాణం

సీతాకోక చిలుకలు వృక్ష ఫలదీకరణలో  కీలక పాత్ర పోషిస్తాయి. ఒక పూవుమీది నుంచి మరో పూవుపైకి వాలుతూ ఉంటాయి. దీని వల్ల పరాగ సంపర్కం జరుగుతుంది. ఫలితంగా, పూలు ఫలదీకరణ చెంది కమ్మని ఫలాలను ఇస్తాయి. సీతాకోక చిలుకలు కనుక పూలపై వాలి పరాగ సంపర్కం చేయకపోతే, వృక్ష సంపద నశించిపోతుంది. ఈ లెక్కన జీవ, వృక్ష పరిణామంలో సీతాకోకచిలుకల పాత్ర అత్యంత కీలకమైంది. అనేక జీవుల్లానే.. సీతాకోక చిలుకలు సైతం వలస వెళ్తాయి. ఉత్తర అమెరికా ఖండం నుంచి దక్షిణ అమెరికా ఖండానికి, ఆపైన యూరప్‌కు సైతం వీటి ప్రయాణాలు జరుగుతాయనీ, అలాగే దక్షిణ ఆసియా ఖండం వైపుగానూ వలసలు ఉంటాయనీ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ప్రయాణం నాలుగు వేల కిలోమీటర్ల వరకూ సాగుతుందనీ తొమ్మిది తరాల వరకూ వీటి గమనం ఉంటుందనీ.. వలస ఆరంభించిన సీతాకోక చిలుకలు చనిపోయినా, మిగిలినవి ఆ యాత్రను పూర్తి చేస్తాయనీ పరిశోధకులు గుర్తించారు. అటవీ ప్రాంతంలోని సాలీడులు, తొండలు, బల్లులు, ఇతర మాంసాహార జీవులకు సీతాకోక చిలుకలు వివిధ దశల్లో ఆహారంగా మారుతుంటాయి. సీతాకోక చిలుకల వృద్ధి లేకపోతే, జీవావరణంలోని కొన్ని జీవులకు తీవ్రమైన ఆహార కొరత వచ్చే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరించారు. సీతాకోక చిలుకలను పర్యావరణ సూచికలుగా చెప్పవచ్చు. భూ ఉపరితలం వేడెక్కితే సీతాకోక చిలుకలు అంతరించిపోతాయి. ఆ ఒక్క కారణంతోనే, గత పదేండ్ల వ్యవధిలో 53 శాతం సీతాకోక చిలుకలు నశించాయన్నది కఠోర సత్యం! మనిషి తన స్వార్థం కోసం ఆ రంగుల రెక్కల్ని ఇనుప పాదాల కింద నలిపేస్తున్నాడు. ఉపకారి అయిన ప్రాణికి అపకారం చేస్తున్నాడు. క్షమించు సీతాకోక చిలుకమ్మా! 

జగిత్యాల పరిసరాల్లో పరిశోధన

శ్రుతి సురేశ్‌ పుణెలోని భారతీయ విద్యా కేంద్రం విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చేస్తున్నారు. ఆమె మొదట మహారాష్ట్రలోని మహావీర్‌ సీతాకోక చిలుకల పార్క్‌లో పరిశోధన చేయాలనుకున్నారు. అక్కడ కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాను ఎంచుకున్నారు. కొడిమ్యాల మండలంలోని శనివారంపేట, మల్యాల మండలం ఒడ్యాడ్‌ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలోని ఒక చెక్‌డ్యామ్‌ ఏరియాలో అరవై రోజుల పాటు అధ్యయనం చేశారు. ఇక్కడ దాదాపు 160 జాతులకు సంబంధించిన సీతాకోక చిలుకలు ఉన్నట్లు గుర్తించారు. నీటి సామర్థ్యం పెరగడం, అటవీ ప్రాంతంలోని భూమిలో నీటి ఊటలు అధికంగా ఉండటంతో భూమిలోని లవణాలను స్వీకరించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని ఆమె గ్రహించారు. శ్రుతి నివేదికను, ఫొటోలను పరిశీలించిన సంబంధిత శాస్త్రవేత్తలు ‘స్పెక్ట్‌ కాంటినెంటల్‌ స్విఫ్‌'్ట అనే సీతకోక చిలుక ఉనికి ఇంతవరకు తెలంగాణలో లేదనీ తొలిసారిగా దీన్ని శ్రుతి ఆవిష్కరించినట్లు ధ్రువీకరించారు. జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన సీతాకోక చిలుకల గమనం ఆరంభమైంది. ఇక్కడ దాదాపు 160 జాతులకు సంబంధించిన సీతాకోక చిలుకలు జీవిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రాణం పోసుకుంటున్నాయి. స్మాల్‌ గ్రాస్‌ ఎల్లో, ట్వోని కోస్టర్‌, కామన్‌గ్రాస్‌ ఎల్లో, కామన్‌ లియోపార్ట్‌, డార్క్‌ గ్రాస్‌ బ్లూ, గ్రేట్‌ ఈగల్‌ఫ్లై, జీబ్రా బ్లూ, లైన్‌ బ్లూ.. ఇలా అనేక రకాలు ఇక్కడ అనేక రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇంతవరకు తెలంగాణలో ఎక్కడా స్పెక్ట్‌ కాంటినెంటల్‌ స్విఫ్ట్‌ జాతి సీతాకోక చిలుక ఉనికి రికార్డు నమోదు కాలేదు. అయితే జగిత్యాల ప్రాంతంలో ఈ జాతికి చెందిన సీతాకోక చిలుకల కదలికలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సీతాకోక చిలుకమ్మలు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోడానికి ప్రధాన కారణం భూగర్భజలాలే అంటున్నారు. సీతాకోక చిలుకలు ప్రధానంగా పువ్వుల్లోని మకరందాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి. కాకపోతే, ఆహారంగా మకరందం మాత్రమే సరిపోదు. జీవనం కోసం, పునరుత్పత్తికోసం లవణాలు, ఖనిజాలు అవసరం అవుతాయి. అయితే ఆ వనరులు మకరందాల్లో ఉండవు. దీంతో, లవణాలు, ఖనిజాలను, జంతువుల శరీరాల నుంచి సైతం గ్రహిస్తాయి. అలాగే భూ ఉపరితలంపై నీరు పుష్కలంగా చేరిన సందర్భంలో, ఆ నీటిలోని లవణాలను, ఖనిజాలను స్వీకరిస్తాయి. జగిత్యాల ప్రాంతంలోని శనివారం పేట గ్రామ అటవీ ప్రాంతంలో జరుగుతున్నది ఇదే. ఆ అందాల ప్రాణులను ఆకట్టుకుంటున్న అయస్కాంతత్వ శక్తీ ఇదే!  

లవ్‌ విత్‌ జగిత్యాల

సీతాకోక చిలుకలు.. ప్రకృతి పేరంటాళ్లు. పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. ప్రాణవాయువు పుష్కలంగా లభించే చోటే కాపురాలు పెడతాయి. పిల్లల్నీ కంటాయి. కాబట్టే.. సుజలాలతో, సుఫలాలతో కళకళలాడుతున్న తెలంగాణగడ్డతో ప్రేమలో పడ్డాయి. జగిత్యాల పరిసరాల్లోని చిట్టడవిని చిరునామాగా చేసుకున్నాయి.  

ప్రపంచ వ్యాప్తంగా..

సీతాకోకల మనుగడ ప్రకృతి విధ్వంసం వల్ల రెండు దశాబ్దాల నుంచీ తీవ్ర ప్రమాదంలో పడింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతో, జలయజ్ఞాలతో, ప్రాజెక్టులతో పచ్చదనం పెరిగింది. దీంతో, ఆ అందమైన ప్రాణులు రంగుల రెక్కల్ని ఊపుకుంటూ తెలంగాణ బాట పట్టాయి. ఫలితంగా,  జగిత్యాలలోని ఒక చిట్టడవిలో ఏకంగా 160 జాతుల వేలాది సీతాకోక చిలుకలు విహరిస్తున్నట్టు తాజాగా ఓ యువ శాస్త్రవేత్త గుర్తించారు. 

అద్భుతం.. ఈ అటవీ ప్రాంతం


శనివారం పేట, ఒడ్యాడ్‌ అటవీ ప్రాంతం పచ్చదనానికి చిరునామా. కాబట్టే, అనేక జాతుల సీతాకాకో చిలుకలకు ఆవాసంగా మారింది. నీటి సామర్థ్యం పెరగడం, అటవీ ప్రాంతంలోని భూమిలో నీటి ఊటలు అధికంగా ఉండటంతో సీతాకోక చిలుకలు మట్టిలోని ఉప్పును స్వీకరించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. నా పరిశీలనలో అనేక రకాల అరుదైన జాతులు కనిపించాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న ఆరు రకాల సీతాకోక చిలుకలను ఇక్కడ గుర్తించాం. తెలంగాణలో ఉనికిలోనే లేని.. కాంటినెంటల్‌ స్విఫ్ట్‌ను రికార్డు చేయడం గొప్ప విషయం. జలాల వృద్ధి, సమశీతల పరిస్థితులు, అటవీ సంపద వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇదంతా తెలంగాణ అవతరణ తర్వాత వచ్చిన మార్పే. స్త్రీలు పూజించబడే చోట దేవతలు విహరిస్తారని అంటారే! అలానే, సీతాకోక చిలుకలు ఉన్నాయంటే ప్రకృతి చాలా స్వచ్ఛంగా ఉన్నట్లు లెక్క. సీతాకోక చిలుకల వృద్ధి జరిగిన చోటు జీవావరణ సమతౌల్యానికి సాక్ష్యం. జగిత్యాల జిల్లాలో సీతాకోక చిలుకల వృద్ధి గణనీయంగా ఉన్నది. పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తే ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. - శ్రుతి సురేశ్‌, పరిశోధకురాలు (పుణె)

సీతాకోక సూత్రాలు

  • ఆనందం సీతాకోక చిలుక లాంటిది. అందుకోవాలని చూసిన ప్రతిసారీ సుతారంగా తప్పించుకుని వెళ్తుంది. ఏ ప్రయత్నమూ చేయనప్పుడు.. దానంతట అదే మన భుజాల మీద వాలుతుంది. 
  • సీతాకోక చిలుకలు దేవదూతల అనుచరగణం. ఆ రంగుల రెక్కల ప్రాణులు గాల్లో నాట్యం చేస్తున్నాయంటే, ఆ పరిసరాల్లో ఎక్కడో దేవకన్యలు షికార్లు చేస్తున్నట్టు అర్థం. 
  • జీవితంలో అయినా, ప్రకృతిలో అయినా మార్పు సహజం. ఆ మార్పు తీర్పే లేకపోతే అందాల సీతాకోక చిలుక కూడా లేదు. 
  • నువ్వు సీతాకోక చిలుకలా హాయిగా ఎగరాలనుకుంటే, స్వేచ్ఛగా బతకాలనుకుంటే.. నీలోని గొంగళిపురుగును వదిలించుకోవాలి. ఇరుకిరుకు మనస్తత్వాన్ని దూరం చేసుకోవాలి. 
  • సీతాకోక చిలుకలు మనిషికి ప్రకృతి రాసిన ప్రేమలేఖలు.
  • కొన్ని పొందాలనుకుంటే, కొన్ని కోల్పోవాల్సిందే. అయినా సందేహం ఉంటే సీతాకోక చిలుకను అడగండి! 
  • గొంగళిపురుగు చిరుద్యోగి లాంటిది. ఎంతో శ్రమిస్తుంది. సీతాకోక చిలుక బాసులాంటిది. ప్రశంసలూ, పురస్కారాలూ అన్నీ దానికే. 
    • ఆ అందమైన జీవులు జీవితాన్ని అంకెల్లో లెక్కించవు. అనుభూతుల్లో కొలుస్తాయి. కాబట్టే, తొమ్మిది నెలల్లోనే పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదిస్తాయి. 

అందాల పోటీ..

మిస్‌ ఇండియా, మిస్టర్‌ ఇండియా పోటీలు మనుషులకేనా? సీతాకోక చిలుకలకు మాత్రం ఏం తక్కువ? ఇదే ఆలోచనతో ప్రతి రాష్ర్టానికి ఓ అధికారిక సీతాకోకచిలుకను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతి రాష్ట్రం తమ భౌగోళిక సరిహద్దులలోని చూడచక్కని బటర్‌ఫ్లైలను ఎంపిక చేసి కేంద్రానికి ఎంట్రీలు పంపాలి. నిపుణుల కమిటీ విజేతలను ఎంపిక చేస్తుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌ కామన్‌పీకాక్‌ జాతిని, కర్ణాటక సాటర్న్‌ బర్డ్‌వింగ్స్‌ను, కేరళ మలబార్‌ బాండెడ్‌ పీకాక్‌ను, తమిళనాడు ఎల్లోమాన్‌ను అధికారిక సీతాకోక చిలుకలుగా ఎంచుకున్నాయి. మళ్లీ వీటన్నిటిలో నుంచి ఓ సీతాకోక చిలుకల జాతికి జాతీయ హోదా లభిస్తుంది. సెప్టెంబరు 11న ప్రారంభమైన పోటీ అక్టోబరు 8 నాటికి ముగుస్తుంది. 2021లో ‘నేషనల్‌ బటర్‌ఫ్లై ఆఫ్‌ ఇండియా’ పేరును ప్రకటిస్తారు. ఆ హోదాను అందుకోడానికి తగిన అందచందాలు తెలంగాణ సీతాకోక చిలుకలకూ ఉన్నాయి.