శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 23:55:53

డేటా.. మాంత్రికుడు!

డేటా.. మాంత్రికుడు!

పిల్‌గ్రిమ్‌ ఫాదర్స్‌... సరిగ్గా నాలుగు వందల ఏండ్ల క్రితం అమెరికాలో అడుగుపెట్టి, ఆ ఖండం రూపురేఖలనే మార్చేశారు. 20వ శతాబ్దం నాటికి అమెరికా అగ్రరాజ్యంగా మారిపోయింది. ఇప్పుడు మరోసారి వలస విప్లవం వచ్చింది. ఈసారి అది  తెలంగాణ నేల నుంచి మొదలైంది. నాలుగు దశాబ్దాల క్రితం  వినిపించిన కంప్యూటర్‌ అనే మాట, రాబోయే రోజుల్లో ప్రపంచాన్నే శాసిస్తుందని ఊహించారు మనవాళ్లు. ఆ సామ్రాజ్యంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధపడ్డారు. తెలుగువాడికి అవకాశం వస్తే ఆకాశమే హద్దవుతుందని నిరూపించారు. అమెరికాలో మన సత్తా చాటిన వారిలో సాయి గుండవల్లి ఒకరు.

సాయి పుట్టి పెరిగింది  హైదరాబాద్‌లోనే. తాత పేరుకి నిజాం దగ్గర పనిచేస్తున్నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. చదువుకుంటేనే తమ జీవితాలు బాగుపడతాయని నమ్మారు సాయి తండ్రి పరమేశ్వరరావు. ఇంట్లో చెబితే ఒప్పుకోరని గుట్టుచప్పుడు కాకుండా, న్యాయవాదంలో పట్టా తీసుకున్నారు. ఆ డిగ్రీతో ఓ చిన్నపాటి ఉద్యోగమైతే వచ్చింది కానీ, జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించలేదు. పెరిగిన కుటుంబాన్ని నెట్టుకు వచ్చేందుకు ఓ కోళ్ల ఫారం మొదలుపెట్టారు. చదువుకుంటూనే, తండ్రి వ్యాపారంలో సాయపడేవాడు సాయి. దీంతో అటు కష్టం తెలిసింది. ఇటు వ్యాపార సూత్రాలూ ఒంటబట్టాయి. తన శ్రమ  వృథా పోలేదు. ఉస్మానియాలో ఇంజినీరింగ్‌ చేసే అవకాశం వచ్చింది. స్కాలర్‌షిప్‌ కూడా దక్కింది.

అమెరికా కల

పరమేశ్వరరావుకు అమెరికా వెళ్లాలని కోరిక. దాన్ని నిజం చేసుకోలేకపోయారు. తన పెద్దకొడుకు సాయి ఆ లక్ష్యాన్ని అందుకోగలడనే నమ్మకం ఉండేది. దీంతో అమెరికాలో ఎదుగుదల అవకాశాల గురించి తరచూ కొడుక్కి చెబుతూ ఉండేవారు.  ఎలాగైనా, తండ్రి ఆశయాన్ని తాను సాధించాలనుకున్నారు సాయి. అమెరికాలో చదువుకునేందుకు దరఖాస్తు చేశారు. అనుమతి కూడా వచ్చేసింది. అప్పట్లో అమెరికాకు వీసా లభించడం దాదాపుగా అసాధ్యం. అదీ దక్కింది! కానీ అమెరికా ఫ్లైట్‌ ఎక్కేందుకు  టికెట్టు కొనలేని పరిస్థితి. రోజూ ఉదయాన్నే లేవడం, అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం.. ఇదే దినచర్యగా మారింది. మరో దారిలేదు మరి! చివరికి ఆ పట్టుదల చూసి ఓ బ్యాంక్‌ మేనేజర్‌ రెండుగంటల్లోనే డబ్బు చేతిలో పెట్టాడు. 

2,500 వేల కిలోమీటర్లు

సాయికి ఒక్లహామా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేసే అవకాశం వచ్చింది. అది 1986వ సంవత్సరం. ఇరాన్‌-అమెరికాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సమయం. దాంతో చమురు వ్యాపారం మీద ఆధారపడిన ఒక్లహామా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఎటుచూసినా నిరుద్యోగం తాండవించేది. అయినా స్కాలర్‌షిప్‌ దక్కించుకుని చదువు పూర్తిచేశారు. మరి ఉద్యోగమెలా? ఎక్కడో క్యాలిఫోర్నియా నుంచి ఓ ఆఫర్‌. ‘ఇక్కడికి వస్తే వసతితోపాటు చిన్నపాటి ఉద్యోగం ఇస్తాం’ అనే భరోసా వచ్చింది. అంతే! వెంటనే కారు నడుపుకుంటూ రెండున్నర వేల కిలోమీటర్లు వెళ్లి వాలిపోయారు. ఓ చిన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరారు. దాదాపుగా ఆ సమయంలోనే ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇంజినీరింగ్‌లో మెలకువలు, లెక్కలమీద పట్టు, ప్రోగ్రామింగ్‌లో ఓనమాలు... ఇవన్నీ కలగలిసిన నిపుణుల కోసం సిస్కో అనే కంపెనీ అప్పట్లో ఎదురుచూస్తున్నది. సాయి ప్రతిభ గురించి తెలిసి, పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. కంపెనీలో వాటా కూడా ప్రకటించారు. సాయి చేరికతో సిస్కో అనూహ్యమైన ప్రగతిని అందుకుంది. షేర్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 30 ఏండ్లు నిండకుండానే మిలియనీర్‌ అయిపోయారు. వాటిని అమ్ముకుంటే చాలు. నిశ్చింతగా  బతికేయవచ్చు. 

జీవితాన్ని మార్చిన పుస్తకం

ఓ రోజు ఏదో పుస్తకం చదువుతూ ఉండగా ఆయన కండ్లు ఓ వాక్యం దగ్గర ఆగిపోయాయి..  ‘70 ఏండ్లు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితాన్ని చూసి గర్వపడగలగాలి. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకున్నాననే తృప్తి కలగాలి’. ఆ మాటలు కదిలించాయి. ఆలోచింపజేశాయి. వెంటనే సిస్కోను వీడి బయటకి వచ్చేశారు. ఒరాకిల్‌ (ORACLE)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని, హైదరాబాద్‌లో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే సంస్థను నెలకొల్పారు. ఇంటర్నెట్‌ను ఓ విలాసంగా, డేటా వేగాన్ని అసాధ్యంగా భావించే సమయం అది. 1995లోనే ఓ ప్రపంచ స్థాయి సాంకేతికతను భారతీయులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో, శిక్షణ పొందిన వేలమంది జీవితాలు మారిపోయాయి. 

కానీ, హాయిగా సాగిపోయే ప్రోగ్రామ్‌లో ఓ బగ్‌ లాగా... మరో కుదుపు ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే 9/11 ఉపద్రవం. ఆ ఘటనతో అమెరికన్‌ షేర్‌ మార్కెట్‌ కుప్పకూలింది. విప్రో, సత్యం లాంటి సంస్థలన్నీ తమ కార్యకలాపాలను ఇండియాకు మార్చుకున్నాయి. ఖర్చు తగ్గడంతో, అమెరికన్‌ సమాజం కూడా వాటిని ప్రోత్సహించింది. షేర్ల ధరలతోపాటు సాయి ఆస్తులు కరిగిపోయాయి. మరోవైపు భారత్‌లో శిక్షణా సంస్థలు పెరిగిపోయాయి. రూటు మారాలి... మళ్లీ సున్నా నుంచి కెరీర్‌ మొదలుపెట్టాలి. అప్పుడు వచ్చిన ఆలోచనే సొలిక్స్‌!

డేటానే బంగారం

చాలా కంపెనీల దగ్గర కోట్ల బైట్ల డేటా ఉంటుంది. దాన్ని క్రమబద్ధంగా భద్రపరచగలిగితే, ఆ సమాచారాన్ని విశ్లేషించి నివేదికలు రూపొందిచగలిగితే, దాని ఆధారంగా సమస్యలనీ, సవాళ్లనీ గుర్తించగలిగితే... కంపెనీ భవితకు బలం చేకూరుతుంది. అందుకనే ‘డేటా మేనేజ్‌మెంట్‌'కు సంబంధించిన సేవలనూ, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం మొదలుపెట్టింది సొలిక్స్‌. అంతర్జాలానికి గూగుల్‌ ఎలాగో, కంపెనీలకు సొలిక్స్‌ అలా అనుకోవచ్చు. ఇంత ఉపయుక్తం కాబట్టే... సిటీబ్యాంక్‌లాంటి బడా సంస్థలు సొలిక్స్‌ సేవలను వినియోగించుకోవడం మొదలుపెట్టాయి. విప్రో, హెచ్‌సిఎల్‌, అమెజాన్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌... లాంటి అనేక సాఫ్ట్‌వేర్‌ సేవా సంస్థలు సొలిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ రంగంలో ప్రపంచంలోనే ఉత్తమ సేవలు అందించే సంస్థగా ‘గార్ట్‌నర్‌' నివేదిక సొలిక్స్‌ను ఉటంకించింది. క్యాలిఫోర్నియా, హైదరాబాద్‌లతో పాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌, చైనా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లోనూ కార్యాలయాలు నెలకొల్పింది సొలిక్స్‌. చర్చిల్‌ క్లబ్‌, నాస్కామ్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు సాయిని సభ్యునిగా చేర్చుకున్నాయి.

‘ఈ విజయం ఓ ఆరంభం మాత్రమే’ అంటారు సాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ని వినియోగించుకుని, భవిష్యత్తులో డేటా మేనేజ్‌మెంట్‌లో అద్భుతాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతారు. ఇంతకీ అమెరికాకు వెళ్లాలనే తండ్రి కల నెరవేరిందా అంటే లేకేం లెక్కలేనన్నిసార్లు, లెక్కలేనన్ని రోజులు తన తండ్రి అమెరికాలోని ఇంట్లో గడిపారని తృప్తిగా చెబుతారు. ‘వయసులో ఉన్నప్పుడు తెలియని ఓ మొండిధైర్యం ఉంటుంది. దాంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఈ రంగంలో అనూహ్యమైన విజయాలు సాధించిన చాలామంది, యువకులే కావడం యాదృచ్ఛికం కాదు. కాకపోతే సాధించాలనే తపన ఉండాలి. అదే మనకు ఓ దారిని సూచిస్తుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సవాలునీ ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది’ అంటారు సాయి గుండవల్లి.

కుటుంబమే బలం

1989లో సాయి పెండ్లి వీణతో జరిగింది. అప్పటికే ఉస్మానియాలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన వీణ, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ విప్లవాన్ని అందిపుచ్చుకున్నారు. భర్తకు సాయపడుతూ, ఇద్దరు పిల్లలను తీర్చిదిద్దుతూ... డిజిటల్‌ ఫైనాన్స్‌ రంగంలో ‘ఎమాజియా’ అనే కంపెనీ స్థాపించారు. సిలికాన్‌ వ్యాలీ ‘ఉమెన్‌ ఇన్‌ ఐటి ఆవార్డు’ అందుకున్నారు. తన అత్తమామలు, అమ్మానాన్నలు కూడా అటు ఇండియాలో, ఇటు అమెరికాలో వ్యాపారం ఎదగడానికి, కుటుంబం సజావుగా సాగడానికీ అండగా నిలబడ్డారని పదేపదే చెబుతారు సాయి. పిల్లలు తేజ్‌, త్రిష సోషల్‌ ఆంత్రప్రెన్యూర్స్‌గా మారారు. కష్టంలో ఉన్నవాళ్లకీ, దాతలకీ మధ్య ఓ వారధి ఉండాలనే వాళ్ల సూచనతో... సాయి ‘టచ్‌ ఏ లైఫ్‌' ఫౌండేషన్‌ను ప్రారంభించారు. రేడియా కార్యక్రమాలు, యాప్స్‌తో ఈ సంస్థ ముందుకు సాగుతున్నది. నవంబర్‌ 13న ‘వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే’ సందర్భంగా ప్రపంచస్థాయిలో సెమినార్‌ను నిర్వహించే ఏర్పాటులోనూ ఉంది.