శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 23:44:56

పోరు తెలం‘గానమా’..

పోరు తెలం‘గానమా’..

‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా’ అంటూ వీర తెలంగాణ విప్లవత్వాన్ని చాటి చెప్పినా, ‘నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా’ అని ఆత్మీయబంధాన్ని తెలియజెప్పినా అది గద్దర్‌కే చెల్లింది. ‘ఒరేయ్‌ రిక్షా’(1995), ‘ఎర్రోడు’(1995), ‘జై బోలో తెలంగాణ’ (2011) మొదలైన సినిమాల్లో ఆయన రాసిన పాటలు సంచలనాన్ని రేకెత్తించాయి.

‘ఎర్రోడు’(1995) కోసం గద్దర్‌ రాసిన ‘ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు నాగులో నాగులన్నా’ అనే పాట ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరల వల్ల పేదసాదల జీవితాలు ఎంత దుర్భరమౌతున్నాయో వివరిస్తుంది. 

విప్లవకవిగా, ప్రజా వాగ్గేయకారుడిగా సుపరిచితులైన గద్దర్‌ తెలంగాణ నేలలో మెరిసిన పాటల మందారం. గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించిన ‘గదర్‌ పార్టీ’మీద గౌరవంతో తన పేరు మార్చుకున్నారు. గద్దర్‌ మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌లో లచ్చమ్మ, శేషయ్య దంపతులకు (1949లో) జన్మించారు. విద్యాభ్యాసం నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌ ప్రాంతాల్లో సాగింది. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. భావవ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. దీని కోసం బుర్రకథను మాధ్యమంగా ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన ప్రముఖ సినిమా దర్శకులు బి.నరసింగరావు, భగత్‌సింగ్‌ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం గద్దర్‌ ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో ‘ఆపర రిక్షా’ అంటూ మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్‌. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. ఉద్యమ ప్రయాణంలోనూ తోడైంది.

అన్నీ సూపర్‌ హిట్‌!

1984లో ‘రంగుల కల’ సినిమాతో సినీ రచయితగా పరిచయమైన గద్దర్‌ అద్భుతమైన పాటల్ని అందించారు. ఆయన పాటల్లో సముద్రమంత గాంభీర్యం ఉంటుంది. ఉర్రూతలూపే చైతన్యం కనబడుతుంది. పిడికిళ్లే నినాదాలవుతాయి. పాట రచనతో పాటు అతని గానం, దరువు ఉత్తేజపరుస్తాయి. గద్దర్‌కు బాగా పేరుతెచ్చిన సినిమా ‘ఒరేయ్‌ రిక్షా’ (1995). అందులో ఆయన రాసిన ‘మల్లె తీగకు పందిరి వోలె మస్క సీకటిలో ఎన్నెలవోలె నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ ప్రతి నోటా వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటకు ఆత్రేయ మనస్వినీ పురస్కారం, ఉత్తమ గీత రచయితగా రాష్ట్రస్థాయి నంది పురస్కారం లభించాయి. జానపదశైలిలో, స్వచ్ఛమైన యాసలో సాగిన ఈ గీతం అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. ‘గణగణమంటూ గంటలే మ్రోగి మ్రోగి కణకణమంటూ కత్తులే మెరిసి మెరిసి’ పాట ఉద్యమాల బాటపై జనసందోహమై కదులుతుంది. ఇదే సినిమాలో శ్రామికశక్తిని చాటే ‘రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు’, ‘ఆపుర రిక్షోడో రిక్షెంట నేనొస్తా’, ‘రాజ్యాంగం చట్టమంటూ రంకెలేసి దూకుతావు’ ... తదితర పాటలన్నీ ఆయన రాసినవే.

ఉద్యమానికి ఊపిరై

గద్దర్‌ పాటల ప్రభావంతో పోరుబాట పట్టిన యువతీ యువకులు ఎంతో మంది. ‘ఎర్రోడు’ (1995) సినిమా కోసం గద్దర్‌ రాసిన ‘ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు నాగులో నాగులన్నా’ అనే పాట నిత్యావసర సరుకుల అధిక ధరల వల్ల పేదసాదల జీవితాలు ఎంత దుర్భరమౌతున్నాయో వివరిస్తుంది. ‘జై బోలో తెలంగాణ’(2011) సినిమాలో ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా’ తెలంగాణ మలిదశ ఉద్యమానికి శంఖారావమై మోగిందని చెప్పవచ్చు. ఇంకా- ‘పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే’, ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’ వంటి ప్రైవేటు గీతాలు కూడా సంచలనాన్ని రేకెత్తించాయి. స్వేచ్ఛాగానంగా, ఉద్యమగీతంగా ప్రయాణిస్తున్న గద్దర్‌ పాటల వేగుచుక్క. 


logo