శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 23:25:13

పసిడి పతకాలు... ఒడిసిపట్టారు!

పసిడి పతకాలు... ఒడిసిపట్టారు!

ఆ మైదానాలు ఉదయం ఆరు గంటలకంతా బాలబాలికల చెమటలతో తడిసిపోతాయి. ఆ ఆవరణలో పొద్దు పొడవకముందే గాలిలో సెపక్‌తాక్రో బంతులు ఆకాశాన్ని తాకేస్తుంటాయి. విల్లు ఎక్కుపెట్టిన బాలికల గుంపు ఓ వైపు, ఆర్చరీ టార్గెట్‌ పాయింట్‌ వద్ద బాణాల కుప్పలు మరోవైపు. కొద్దిగా ముందుకెళ్తే జిమ్నాస్టిక్‌ విన్యాసాలు.. నువ్వా నేనా అన్నట్లుగా జూడో సాధనలు. ఇవన్నీ హైదరాబాద్‌లోని ‘తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల’లో నిత్యం కనిపించే దృశ్యాలు. 

ఆ క్రీడా పాఠశాల ఒడిలో ఎదుగుతున్న బాలబాలికలు మారుమూల గ్రామాలకు చెందిన నిరుపేదలు. ఆ చిన్నారులకు ఆటలంటే ప్రాణం. వారి క్రీడా ప్రతిభను చిరుప్రాయంలోనే గుర్తించి అక్కున చేర్చుకుంది తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల. గ్రామీణ విద్యార్థులను ప్రాథమిక స్థాయిలోనే ఎంపిక చేసుకొని భావి భారత క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 1992లో రంగారెడ్డి జిల్లా (ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని హకీంపేట గ్రామం)లో 206.5 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేశారు. గత 28 ఏండ్లుగా పల్లెల నుంచి వచ్చిన బాలబాలికలను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దే కసరత్తు నిర్విరామంగా జరుగుతూనే ఉంది. 

అంతర్జాతీయ ప్రమాణాలు

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులు ఉన్నాయి. మైదానాలు, క్రీడా సామగ్రి, రెండు ఇండోర్‌ స్టేడియాలు, 1400 మీటర్ల అథ్లెట్‌ ట్రాక్‌, ఫుట్‌బాల్‌ స్టేడియం, రెండు కాన్ఫరెన్స్‌ హాళ్లు (బాలబాలికలకు వేరువేరుగా), వాలీబాల్‌ గ్రౌండ్‌, ఒక వెయిట్‌ లిఫ్టింగ్‌ హాల్‌, ఒక ఆర్చరీ గ్రౌండ్‌, అన్నిటికి మించి..  ఆకు పచ్చని చెట్లతో కూడిన ఆహ్లాదకర వాతావరణం.. రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రత్యేకత. 500 మంది ఒకేసారి భోజనం చేసేంత విశాలమైన డైనింగ్‌హాల్‌ను ఏర్పాటు చేశారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్‌ వరకు కో-ఎడ్యుకేషన్‌లో,  స్టేట్‌ సిలబస్‌లో విద్యాబోధన జరుగుతుంది. ఇందులో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు వసతి, భోజనం, చదువు, శిక్షణ, టోర్నమెంట్‌ ఖర్చులు, క్రీడా పరికరాలు, పుస్తకాలు, వైద్యం, బీమా.. ఇలా సకల సౌకర్యాలనూ ప్రభుత్వం ఉచితంగానే సమకూరుస్తుంది. రోజూ 850 గుడ్లు, 850 అరటిపండ్లు, 85 లీటర్ల పాలు, 45 కిలోల గోధుమ పిండి, 130 కిలోల బియ్యం, 85 కిలోల మటన్‌/చికెన్‌  విద్యార్థులకు వడ్డిస్తారు. కాబట్టే, ఆ పిల్లల్లో పోషక విలువల లోపం కనిపించదు. అనారోగ్య సమస్యలూ తక్కువే.       

పతకాల పంట

స్పోర్ట్స్‌ స్కూల్‌  బాలబాలికలు ఇప్పటి వరకు 168 అంతర్జాతీయ పతకాలను (బంగారు-83, వెండి-57, కాంస్య-28) సాధించారు. 2,184 జాతీయ పతకాలను (బంగారు-698, వెండి-669, కాంస్య-816) గెలుచుకుని వచ్చారు. తెలంగాణ అవతరణ తర్వాత.. ప్రభుత్వం క్రీడా పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఆరేండ్లలోనే  50 అంతర్జాతీయ పతకాలను సాధించారు. జాతీయ స్థాయిలో 515 పతకాలు తెచ్చారు.  క్రీడా పాఠశాలలో ఆర్చరీ, అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, ఫెన్సింగ్‌, జిమ్నాస్టిక్స్‌, జూడో, వాటర్‌ స్పోర్ట్స్‌,సెపక్‌ తాక్రో, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌ వంటి క్రీడలలో విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు చదువుల్లోనూ మేటి. ఏటా ర్యాంకుల పంట కూడా పండిస్తున్నారు. కాబట్టే, ఈ క్రీడా విద్యాలయం ఉత్తమ విద్యాసంస్థగా అనేక అవార్డులు సాధించింది. 

గెలుపు కథలు

దీక్షితది వరంగల్‌ జిల్లాలోని దిగువ మధ్యతరగతి కుటుంబం. బాస్కెట్‌బాల్‌ బాగా ఆడేది. దీంతో ఉపాధ్యాయులు ప్రోత్సహించి ఈ పాఠశాల గురించి చెప్పారు. తను ఇక్కడి శిక్షణలో రాటుదేలి అంతర్జాతీయంగా ఎనిమిది పతకాలు సాధించింది. జాతీయ స్థాయిలో ముప్పై పైచిలుకు విజయాలు వరించాయి. తను ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగి. శ్రీకాంత్‌ నేపథ్యమూ అలాంటిదే. నల్లగొండజిల్లాలోని ఓ కుగ్రామం తనది. కొవిడ్‌కు ముందు వరకూ కేరళలో జరుగుతున్న ఖేలో ఇండియా క్యాంప్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ పరుగుల వీరుడి ఖాతాలోనూ అనేక పతకాలు ఉన్నాయి. ఈ క్రీడలబడే లేకపోతే.. ఎన్ని మాణిక్యాలు మట్టిలో కొట్టుకుపోయేవో! ‘స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు మున్ముందు మరింత ప్రతిభను కనబరుస్తారని ఆశిస్తున్నా’ అంటారు స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రత్యేక అధికారి డా.హరికృష్ణ.  ఇటీవల, ఈ ఆటల బడి ఖేలో ఇండియా ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌' హోదాను పొందింది.