శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 23:06:43

రేపటి వైద్యం... హెల్త్‌ బిట్స్‌

రేపటి వైద్యం... హెల్త్‌ బిట్స్‌

చేతిలోని ఫోన్‌ స్నేహితుడిలా హెచ్చరిస్తుంది. ఆత్మహత్య వరకూ వెళ్లకుండా ఆపుతుంది. టాబ్లెట్లు మాట్లాడుతాయ్‌... ఎప్పుడు ఏ మందు వేసుకున్నారో ఎన్నాళ్ల తరువాతైనా చెప్పేస్తాయి. డాక్టర్‌  గుర్తించలేని రోగాన్ని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కనిపెట్టేస్తుంది. మనలోని వ్యాధి నిరోధక కణాలే క్యాన్సర్‌ని చంపేస్తాయ్‌... ఇలా ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగంలో జరుగుతున్న పరిశోధనలు అందర్నీ అబ్బుర పరుస్తున్నాయి. 

మాట్లాడే టాబ్లెట్‌

దీర్ఘకాలిక వ్యాధులున్నవాళ్లు రోజూ రకరకాల టాబ్లెట్లు వేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని తినక ముందు వేసుకోవాలి. కొన్ని తిన్నాక వేసుకోవాలి. కానీ, ఏవి ఎప్పుడు వేసుకున్నామో చాలాసార్లు మరచిపోతుంటారు. అలా కాకుండా, టాబ్లెటే తనను వేసుకున్నదీ లేనిదీ చెబితే! ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఇంటర్నెట్‌ ఆఫ్‌ మెడికల్‌ థింగ్స్‌ (IoMT). టాబ్లెట్‌లోని ఒక చిన్న సెన్సర్‌ మన స్మార్ట్‌ ఫోన్‌లో ఆ వివరాలను నమోదు చేస్తుంది. టాబ్లెట్‌ వేసుకోగానే పేషెంట్‌ శరీరానికి ఉండే ప్యాచ్‌లోకి ఆ సమాచారం చేరుతుంది. దాని నుంచి స్మార్ట్‌ఫోన్‌లో రికార్డయిపోతుంది. దీంతో ఎప్పుడు, ఏ టాబ్లెట్‌, ఏ మోతాదులో వేసుకున్నారో కూడా ఫోన్లో చూసుకోవచ్చు. స్కిజోఫ్రినియా లాంటి మానసిక సమస్యలకు ఈ రకమైన మెడికల్‌ సెన్సర్లను వాడుతున్నారు. 

డిప్రెషన్‌ను కనిపెట్టే ఫోన్‌

ప్రపంచంలో 300 మిలియన్ల మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అంచనా. వీళ్లలో 8 లక్షల మంది ఏటా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 15 నుంచి 29 ఏండ్ల వయసువారిలో మరణాలకు రెండో కారణం ఇదే. వీరిలో సగానికన్నా తక్కువే చికిత్స తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యకు మన చేతిలోని మొబైలే పరిష్కారం చూపిస్తున్నది. ఇప్పుడు చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ లేని వాళ్లుండరు. అదే ఫోన్‌ వాళ్లు డిప్రెషన్‌, ఇతర మానసిక సమస్యలతో ఉన్నారో లేదో కనిపెట్టేస్తుందంటున్నారు క్యాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఫోన్‌ను ఆపరేట్‌ చేసే విధానాన్ని బట్టి  ఆ వ్యక్తి మానసిక స్థితిని అంచనా వేస్తుంది చేతిలోని మొబైల్‌ ఫోన్‌. అంతేకాదు, కౌన్సెలింగ్‌  అందించే యాప్స్‌ను కూడా వెంటనే సూచించే టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానున్నది.  

కణాల పునరుత్పత్తి

నాలుగుసార్లు గుండెపోటు వస్తే గుండెలోని కణజాలం దెబ్బతింటుంది. అది క్రమంగా హార్ట్‌ ఫెయిల్యూర్‌కి దారితీయవచ్చు. ప్రారంభంలోనే దెబ్బతిన్న కణజాలాన్ని ఆరోగ్యవంతమైన కణాలతో రీప్లేస్‌ చేస్తే..? మోకాలి కీలును మృదువుగా కదిలించడానికి ఉపయోగపడే కార్టిలేజ్‌ వయసుతో పాటు అరిగిపోయి, కీలు దెబ్బతింటుంది.  కొత్త కార్టిలేజ్‌ను తెచ్చి అమరిస్తే..? ఆస్టియో ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు, పెయిన్‌ కిల్లర్లు లేదా కీలు మార్పిడి.. రెండే మార్గాలు. కానీ స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీతో కార్టిలేజ్‌ను తిరిగి పుట్టించవచ్చు. రీజనరేటివ్‌ మెడిసిన్‌ ద్వారా కణాలను వృద్ధి చేసి, దెబ్బతిన్న వాటికి మరమ్మతు చేయవచ్చు. తీవ్రమైన ఆస్టియో ఆర్థరైటిస్‌ ఉన్నవాళ్లకు ఈ చికిత్స ఓ వరం అవుతున్నది. కీలు విషయంలోనే కాదు.. గుండెపోటు వల్ల దెబ్బతిన్న గుండెను రిపేరు చేయడానికి కూడా ఇది సాయపడుతుంది. ప్రయోగశాలలో మానవ కణజాలాలనే కాదు, అవయవాలనూ  అభివృద్ధి చేయడం భవిష్యత్తులో సాధ్యం అవుతుందంటే అతిశయోక్తి కాదు. 

డాక్టర్‌ను మించిన ‘ఇంటెలిజెన్స్‌'

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షా 32 వేల మెలనోమా చర్మ క్యాన్సర్లు నమోదవుతున్నాయి. అయితే చాలా సందర్భాల్లో దీన్ని సకాలంలో గుర్తించడం సాధ్యం కాదు. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన డాక్టర్లు కూడా పొరబడుతుంటారు. డాక్టర్లు మెలనోమాను 87 శాతం కేసుల్లో మాత్రమే సరిగ్గా నిర్ధారణ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ రంగంలోకి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రవేశించింది. కంప్యూటర్‌ ఇమేజ్‌ల ద్వారా 95 శాతం కచ్చితంగా మెలనోమాను గుర్తించవచ్చని చెప్తున్నారు పరిశోధకులు. ఆ వివరాలు ఆనల్స్‌ ఆఫ్‌ ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 


logo