మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 22:41:19

అబలా జీవితము... పీవీ నర్సింహారావు

అబలా జీవితము... పీవీ నర్సింహారావు

యమున తన అన్నగారితో, స్నేహితురాళ్లతో మైమరచి బొమ్మలపెండ్లి ఆడుకుంటూ ఉండగా... నాన్నగారు ధుమధుమలాడుతూ వచ్చేశారు. ఆయన ఉగ్రరూపానికి కారణం తెలియక, పిల్లలిద్దరూ వణికిపోయారు. ఇంతలో అమ్మమ్మ ఊరికి వెళ్తున్నామని తెలిసింది. ఒకవైపు ఊరికి వెళ్తున్నామనే సంతోషం, మరోవైపు అందుకు కారణం ఏమిటో తెలియని అయోమయం. ఈ పరిస్థితుల్లో యమున ఇంట్లో వారి గుణగణాలు పరిచయం చేస్తూ కథను నడిపించింది...

మా నాన్నగారి వర్ణనతో పాటు మా అమ్మను గురించి కూడా కొంత వర్ణించడం జరిగింది. కాని తదుపరి వృత్తాంతం చెప్పకముందు మా కుటుంబంలోని వ్యక్తులందరినీ వర్ణించడం అత్యావశ్యకం. మా అమ్మ కూడా మంచి రూపసి. ఆమె కళ్ళూ ముక్కూ ఎంతో చక్కనివి. ఆమె మొహం చూస్తే ఉదార స్వభావం, ఉదాత్త హృదయం వ్యక్తమయ్యేవి. ఆమె వాస్తవంలోనూ ఉదార స్వభావ, ఉదాత్త హృదయ. ఆహాహా! ఆమె సుగుణాలెన్నని వర్ణించను! ఆమె పనితనం, ఆమె మాటముచ్చటల తీరు, పిల్లలమైన మాకు మంచి సుద్దులు చెప్పే తరహా-అన్నీ వర్ణనీయాలే! నా వల్ల ఈ ప్రపంచంలో జరిగిన మంచిపనులన్నీ యిద్దరు వ్యక్తుల శిక్షణవల్ల జరిగాయి. పిన్ననాడు తల్లి శిక్షణవల్ల, పెద్దపెరిగాక- ఇంక నేను పేరుపెట్టి చెప్పడమెందుకు? ఇంకెవరి శిక్షణ అయుంటుంది? నా మనోవృత్తి మా అమ్మ శిక్షణ వల్ల తయారయినందుననే తదుపరి లభ్యమైన రెండవ శిక్షణ మనసులో ప్రతిబింబించింది. అమ్మ శిక్షణ వల్ల నమ్రత, పనితనం, వినయం, ఉద్యోగశీలత, మితవ్యయం ఇత్యాది గుణాలు మొదటనే నా మనసులో నాటుకొని ఉండకపోతే తదుపరి లభ్యమైన శిక్షణ జలాలవల్ల అవి అంకురించి పెరిగి, వృక్షాలై, పుష్పించి, ఫలించి ఉండేవి కావు. మా అమ్మంటే సాక్షాత్తు దేవతా స్వరూపిణి అనడంలో నాకేమాత్రం సందేహం లేదు. ఆ తల్లి గొప్పతనం ఎంత వర్ణించినా తక్కువే. తన ఆప్తులు తనకు నచ్చుతారనే కారణం చేత మాత్రం నేనామెను ప్రశంసిస్తున్నానని ఎవ్వరూ అనుకోవద్దు. ముందు చరిత్ర చదివాకనే నేననేది అక్షరాలా సత్యమని అందరికీ తెలిసివస్తుంది. ఆమె నా తల్లి అయినందున యింత సవిస్తరంగా వర్ణించడంలో ఎవరికైనా అతిశయోక్తి గోచరిస్తే వారు నా మీద నేరారోపణ చేయకూడదు. ఎందుకంటే మా అమ్మ ఏ విషయంలో చూచినా ఆశేష ప్రశంసాపాత్రురాలని నా దృఢ విశ్వాసం. అందుకని మాతృభక్తి వల్ల కూతురు తల్లిని కొంత విపులంగా వర్ణిస్తే అందుకు క్షమిస్తారని ఆశిస్తున్నాను.

మా నాన్నగారు కలెక్టరు కార్యాలయంలో హెడ్‌గుమాస్తా ఉద్యోగం చేస్తుండేవారు. నెలకు నూటయాభై రూపాయల జీతం. అంతేకాక మా ఊళ్ళో భూముల మీద కూడా బాగానే ఆదాయం వస్తుండేది. నాన్నగారు మా తాతయ్యకొక్కడే కొడుకు. కాని వాళ్లిద్దరికీ సరిగ్గా పడివచ్చేదికాదు. అందుకనేక కారణాలుండేవి. ఇద్దరి స్వభావాల్లోని సామ్యమే ముఖ్య కారణం. ఇద్దరూ ముక్కోపులే! ఇద్దరూ పట్టినపట్టు వదిలేవారుకారు. తానన్నది సాగించుకొని తీరాలనేది యిద్దరి స్వభావం. తాతయ్య మరీ కోపిష్టి. అచ్చంగా జమదగ్ని అవతారం. ఆయన పోలికలే నాన్నగారికి కూడా వచ్చాయని అమ్మ ఎప్పుడూ అంటుండేది. మా నాయనమ్మ కొద్దోగొప్పో ఆ మాసరాకు చెందిందే. అందుకని తాతయ్యకూ నాయనమ్మకూ ఎన్నడూ పడలేదు. ఒక్కొక్కప్పుడు ఆరారు నెలలు ఒకరితో ఒకరు మాటలు మానివేసేవారు. మా నాయనమ్మ మా అమ్మతో సాగించిన సాధింపులను సవిస్తరంగా చెప్పాలంటే అదొక రామాయణమే ఔతుంది. ఆ బాధలన్నీ సహించి అంతటి రాకాసి అత్తనోట వహ్వా అనిపించుకోవడం మా అమ్మకే సాధ్యపడింది.

తాతయ్యకూ నాన్నగారికీ కుదిరేది కాదని యిదివరకే చెప్పాను. నాయనమ్మ అప్పుడప్పుడు నాన్నగారి వద్దకు వస్తూ ఉండేది. కాని తాతయ్య మాత్రం ఎప్పుడూ వచ్చేవాడు కాదు. కారణమేమంటే మా యింట్లో వైశ్వ దేవం జరగదని! నా మాట అసత్యమనిపిస్తుందేమో కాని సత్యం చెప్పుతున్నాను. మా యింట్లో వైశ్వదేవం జరగాలనీ, స్వయంగా నాన్నగారే చేయాలనీ, తాతయ్య కోరిక. కాని ఉద్యోగ రీత్యా తనకు వెయ్యి చోట్ల తిరుగవలసి వస్తుందనీ, అలాంటప్పుడు వైశ్వదేవం వగైరా కుదరడం అసాధ్యమనీ, నాన్నగారనేవారు. మాటామాటా ముదిరిపోయింది. చివరకు నాస్తికులూ, సంస్కర్తలూ వున్న యింట్లో నైవేద్యం, వైశ్వదేవం జరగని కొంపలో, భోజనం చేయడమంటే మాలవాడి యింట్లో భోంచేసినట్లని అంటూ ముసలివాడు నిజంగానే చరచరా యిల్లు విడిచి వెళ్ళిపోయాడు. నాన్నగారు కూర్చున్న చోట అలాగే కూర్చునిపోయారు. ఏ మాత్రం కదలలేదు. చివరకు మా అమ్మ మర్యాదాగిర్యాదా అటుంచి తాతయ్య వెనువెంటనే పోయి ఆయన కాళ్లావేళ్లాపడి ‘మీరు రానిదే నేను భోజనం చేయ’నని చెప్పి ఎలాగో ఆయనను తీసుకువచ్చింది. తక్కిన వాళ్లందరూ తమాషా చూస్తూ నిలుచున్నారు. ఇదంతా ఏమిటా అని అమ్మ కనిపించింది. చివరకు తాతయ్య ఏమనుకున్నాడో ఏమో కాళ్లుచేతులు కడుక్కొని రెండు మెతుకులు తిన్నాడు. మళ్ళీ సాయంత్రం ఏదో మాటమీద తండ్రి కొడుకుల మధ్య తీవ్ర కలహం జరిగి మరుసటి రోజు భోజనమైనా చేయక తాతయ్య మొదటిరైలుకే వెళ్ళిపోయాడు. తదుపరి నాన్నగారున్న ఊళ్ళో కాని, నాన్నగారి యింట్లో కాని ఆయన అడుగుపెట్టలేదు. నాన్నగారితోనూ, నాతోనూ ఆయన సరిగా మాట్లాడేవాడు కాదు. అమ్మతోనూ, అన్నయ్యతోనూ ఆప్యాయంగా మాట్లాడేవాడు. మా అమ్మంటే ఆయన కెంతో ప్రేమ. ఆమె ఆయనకెంతో నచ్చేది. అన్నయ్య కూడా ఆయన మర్జీలోనివాడు. కాని నేను కనపడితే మాత్రం “ఈ పోరి నాయనమ్మనూ తండ్రినీ పోలింది. వాళ్లలాగే తయారవుతుంది. ఆ కుర్రవాడు మాత్రం అచ్చం తల్లిలాగే మంచి వాడవుతాడు!” అని అంటూవుండేవాడు. ఆ మాట విని మా నాయనమ్మ మండిపడేది. ఆమెకు నేనంటే ఎంతో యిష్టం. అన్నయ్య మీద ప్రేమ లేదని కాదు. కాని అది తక్కువే. అందుకు కారణం బహుశా అన్నయ్య తాతయ్యకు నచ్చడమే అయివుటుంది. తాతయ్య వద్దకు పోవాలంటే నాకు కొంత ఆనందమూ, కొంత దిగులూ కలుగుతుండేది. నాయనమ్మ ఉన్నందుకు ఆనందం, తాతయ్యను స్మరించుకుంటే అంతులేని భయం!

మా కుటుంబంలోని వాళ్ల వర్ణన ఇప్పటికే చాలా పొడుగై పోయింది. దాన్నింక ముగించి నేను మొదట చెప్పినట్లు ఆ రోజు జరిగిన వృత్తాంతం వ్రాయడానికి ఉపక్రమిస్తాను. ఈ సందర్భంలో ఒక్కమాట మాత్రం చెప్పి పెట్టాలి. నేను చెప్పబోయే సంఘటనలూ, తత్సంబంధమైన వ్యక్తులూ, సన్నివేశాలూ అన్నీ నేను ప్రత్యక్షంగా చూచినవే! అంతేకాక ఈనాటి పరిస్థితిలో అట్టి సంఘటనలూ, సన్నివేశాలూ, వ్యక్తులు ఎవ్వరికైనా కనిపించవచ్చు. ఎవరైనా నామీద అతిశయోక్తి ఆరోపించదలిస్తే అంతకుముందు తమ అనుభవాన్ని పరిశీలించి చూడాలి. నేను వ్రాసిందంతా అక్షరశః సత్యం.

ఆనాడు నాన్నగారి కోపాన్ని గురించి నేనూ, అన్నయ్యా మాట్లాడుకుంటూ వుండగా చీకటి పడింది. రాత్రిపూట మమ్మల్ని మూడవ అంతస్థుపైన ఉండనిచ్చేవారు కారు. అన్నయ్య చదువుకోవాలంటే రాత్రంతా క్రింది అంతస్తులో దీపం వద్ద కూర్చొని చదువుకోవాలి. భోజనం చేసి నిద్రపోయేవరకు నేనూ వాడి వద్దనే కూర్చుండే దాన్ని. ఆనాడు మాత్రం మా యిద్దరిలో ఎవ్వరూ క్రిందికి దిగలేదు. పొట్టలో కాకులు కూస్తున్నాయి. నాకయితే ఆకలితో ప్రాణాలెగిరిపోతున్నాయి. మధ్యాహ్నం ఆడుకున్నప్పుడు మా కిచ్చిన పదార్థాలైనా తినడానికి సమయం దొరకలేదు.  (మిగతా వచ్చేవారం..)


logo