శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 22:14:46

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

‘సాహిత్యంలో అసాధారణమైనవిగా పేరొందిన పుస్తకాలన్నీ... సమాజంలోని లోటుపాట్లను ఎత్తి చూపేవే’ -ఆస్కర్‌ వైల్డ్‌

ఉపయోగపడే రచన


తోవ

రచన: కొండవీటి మధుసూదన్‌ రెడ్డి

పేజీలు: 270

వెల: 220/-

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు

కొన్ని కథలు, కొన్ని కథల్లాంటి వ్యాసాలు, మరికొన్ని వ్యాసాల్లాంటి కథలు... వెరసి ఇందులో ప్రతి శీర్షికా ఏదో ఒక మంచిమాట చెప్పేందుకే ప్రయత్నిస్తుంది. కథలు రాయడం నాకు కొత్త అంటూనే రచయిత, మంచి సాహిత్యాన్నే అందించారు. జర్నలిజం, విద్యారంగాలలో తను గమనించిన విషయాలకు కాల్పనికతను జోడించారు. లక్ష్యం మంచిది కాబట్టి, కథలూ చదివింపచేస్తాయి. పుస్తకంలోని తొలికథ ‘రిమ్‌యా సాహస యాత్ర’తోనే రచనా శైలి ఆకట్టుకుంటుంది. నేల విడిచి సాము చేయకుండానే, సరళమైన వాక్యాలతో సమస్యనీ, దానికి సమాధానాన్ని కూడా అందిస్తారు రచయిత. పిల్లల కోసం తన సొంత కాళ్ల మీద నిలబడిన ‘ఓ తల్లి విజయగాథ’, దోమలు సైతం మన కార్పొరేట్‌ వైద్యాన్ని చూసి జాలిపడే ‘ధూం’, నాయకుడు ఎలా ఉండాలో చెప్పే ‘శ్రీపాలుడు’ లాంటి కథలతో పాటు సమయపాలన, భయాన్ని జయించడం.. లాంటి జీవన నైపుణ్యాలను వ్యాసరూపంగా పరిచయం చేస్తారు.

ముక్తిమార్గం


భాగవత కథా తత్తం

రచన: కపిలవాయి లింగమూర్తి

పేజీలు: 385

వెల: 300/-

ప్రతులకు: 87907 27772

కపిలవాయి లింగమూర్తిది... తెలంగాణ సాహిత్యంలో అరుదైన స్థానం. శతాధిక గ్రంథకర్తగా, 90 ఏండ్ల వయసులోనూ రచనను వీడని సాహితీ కార్యకర్తగా చిరస్మరణీయులు. వారి సాహిత్యంలో ‘భాగవత కథా తత్తం’ ఓ అరుదైన రచన. భాగవతంలోని పది ఆకర్షణీయమైన ఘట్టాలను విశ్లేషించే ప్రయత్నమిది. రుక్మిణీ కళ్యాణం, వామన చరిత్ర, గజేంద్రమోక్షం లాంటి ప్రజాదరణ పొందిన కథలే కాకుండా ‘కపిల దేవహూతి సంవాదం’, ‘పురంజనోపాఖ్యానం’, ‘భరతోపాఖ్యానం’, ‘నారాయణ కవచం’ వంటి అరుదైన ఘట్టాలనూ స్పృశిస్తారు రచయిత. పోతన పద్యాల మకరందానికి, తన విశ్లేషణా మధురిమను జోడిస్తూ... పాఠకుడికి తాత్తికత లోతులను పరిచయం చేస్తారు. కేవలం రాక్షస సంహార ఘట్టంగాతోచే ‘ప్రహ్లాద చరిత్ర’ను సైతం జీవాత్మ, పరమాత్మల భూమికతో విశ్లేషిస్తారు. వైరాగ్య పాఠంలా, వ్యక్తిత్వ వికాసంలా సాగే ఈ రచనను మూడు దశాబ్దాల తర్వాత పునర్ముద్రించడం తెలుగు జాతికే ఉపయుక్తం. అభినందనీయ ప్రయత్నం.

వరాల కథలు


జవరాలి కథలు

రచన: గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి

పేజీలు: 196 వెల: 150/-

ప్రతులకు: 85588 99478

కాంతం కథలు, అత్తగారి కథలు అంటూ తెలుగు సాహిత్యంలో స్త్రీ పాత్రే ప్రధానంగా వచ్చిన కథలకి ప్రత్యేక స్థానం ఉంది. కానీ కథలు రాయడమే అరుదైన ఈ రోజుల్లో అలాంటి ప్రయత్నాన్ని మరోసారి చేయబూనడం ఆశ్చర్యమే. అందుకే జవరాలి కథలు పేరుతో వచ్చిన ఈ 24 కథల సంపుటి పాఠకులను ఆకట్టుకుంటుంది. కథలన్నీ ఓ అంతర్జాల పత్రికలో వెలుగు చూసినవే. వృత్తిరీత్యా అనేక ప్రాంతాలను, అక్కడి జీవితాలను నిశితంగా గమనించిన రచయిత... మధ్యతరగతి సంసారాలలో తరచుగా కనిపించే దృశ్యాలన్నిటినీ అక్షరబద్ధం చేసే ప్రయత్నం చేస్తారు. తొలి రేయితో మొదలయ్యే ఈ కథలు, అంచెలంచెలుగా సాగుతూ, కొత్త సంసారంలో కనిపించే కోపతాపాలు, ప్రణయకలహాలు, సర్దుబాట్లు అన్నిటినీ దాటుకుని ఓ స్థిరత్వానికి చేరుకోవడంతో సంపుటి ముగుస్తుంది. కథలన్నీ భర్త దృష్టికోణంలోంచి సాగినా... స్త్రీ హృదయం కూడా పరిపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది. ఆమె మనసును అక్షరాల్లో చదివేస్తాం.


logo