శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 21:12:33

యాక్టర్‌ కాకముందే డాక్టర్‌!

యాక్టర్‌ కాకముందే డాక్టర్‌!

‘మీరేం కావాలనుకున్నారు ?’ అనగానే, దాదాపుగా నటీమణులంతా ‘నేను డాక్టర్‌ కావాలనుకున్నా’ అనే చెబుతారు. కానీ, రూప కొడువయూర్‌ మాత్రం ముందుగా డాక్టర్‌ అయ్యింది. ఆ తర్వాతే, యాక్టర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

  • రూప ఎంసెట్‌కు ప్రిపేర్‌ అవుతున్న రోజుల్లో తల్లికి క్యాన్సర్‌ అని తేలింది. అప్పుడే తాను ఆంకాలజిస్ట్‌ కావాలని నిర్ణయించుకుంది. గుంటూరులో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ఒక డాక్టర్‌గా ఇప్పుడు కరోనా బాధితుల సేవలో చురుగ్గా పాల్గొంటున్నది.
  • రూప ప్రాథమిక విద్య విజయవాడలో పూర్తయింది. తల్లి మంగలక్ష్మి సంస్కృతం లెక్చరర్‌, తండ్రి రవికుమార్‌ ఆర్మీలో అధికారిగా పని చేస్తున్నారు.
    • అమ్మ కోరిక మేరకు డాక్టర్‌ అయిన రూప, తన కలను నెరవేర్చుకోవడానికి యాక్టర్‌ అయింది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కోసం  హీరోయిన్లను వెతుకుతున్న విషయం తెలుసుకొని తన ప్రొఫైల్‌ పంపింది. డైరెక్టర్‌, నిర్మాత ఆడిషన్‌ చేసి తనను ఎంపిక చేశారు.
  • ఇటీవల విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో జ్యోతి పాత్రలో సహజంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మేకప్‌ లేకుండా, సహజ సౌందర్యంతో అందరినీ ఆకట్టుకుంది రూప. చిత్రంలో ఓ సన్నివేశంలో చేసిన ఫ్లాష్‌మాబ్‌ డ్యాన్స్‌ ఆమె ప్రతిభకు అద్దం పడుతుంది. రియల్‌ లైఫ్‌లో కూడా మేకప్‌ లేకుండా ఉండటమే తనకిష్టమట.
  • సుహాసిని, రాధికల సినిమాలంటే రూపకు ఎంతో ఇష్టం. ‘మంచి పాత్రలు పోషించి వాళ్లలా గొప్ప పేరు తెచ్చుకుంటాను’ అంటున్నది.
    • రూప మంచి డ్యాన్సర్‌ కూడా. సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. డ్యాన్స్‌తో పాటు లలితకళలపై తనకు మక్కువ ఎక్కువ అని చెబుతూ ఉంటుంది.
  • సొంతంగా యూట్యూబ్‌ చానెల్‌ కూడా నిర్వహిస్తున్నది రూప. సాహోరే బాహుబలి పాటను సంప్రదాయ నృత్యరీతిలో అభినయించి తన చానెల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చిత్రాల్లోని పాటలకు అద్భుతంగా నాట్యం చేసి యూట్యూబ్‌లో ఉంచింది.


logo