మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 05:41:14

స్వచ్ఛంశివం సుందరం

స్వచ్ఛంశివం సుందరం

అహింసను పోరుబాటగా మార్చినవాడు... సత్యానికి కూడా ఆగ్రహం ఉంటుందని నిరూపించినవాడు... గాంధీజీ! మహాత్ముడి లక్ష్యం స్వాతంత్య్రం మాత్రమే కాదు! ఆదర్శవంతమైన సమాజం కూడా! మహిళా సాధికారత నుంచి అస్పృశ్యత వరకు అన్ని విషయాల్లోనూ మెరుగైన సమాజం ఎలా ఉండాలో ఆయనకో స్పష్టత ఉండింది. అవన్నీ గాలివాటపు ఆలోచనలు కావు. తన జీవితాన్నే ప్రయోగశాలగా మార్చి మరీ ఆవిష్కరించిన గొప్ప సత్యాలు. మహాత్ముడి బోధనల్ని కొట్టిపారేయడం తేలిక. అర్థం చేసుకోవడమే చాలా కష్టం. పారిశుద్ధ్యం పట్ల ఆయన నిబద్ధతే ఇందుకు ఉదాహరణ.

అహింసను పోరుబాటగా మార్చినవాడు... సత్యానికి కూడా ఆగ్రహం ఉంటుందని నిరూపించినవాడు... గాంధీజీ! మహాత్ముడి లక్ష్యం స్వాతంత్య్రం మాత్రమే కాదు! ఆదర్శవంతమైన సమాజం కూడా! మహిళా సాధికారత నుంచి అస్పృశ్యత వరకు అన్ని విషయాల్లోనూ మెరుగైన సమాజం ఎలా ఉండాలో ఆయనకో స్పష్టత ఉండింది. అవన్నీ  గాలివాటపు ఆలోచనలు కావు. తన జీవితాన్నే ప్రయోగశాలగా మార్చి మరీ ఆవిష్కరించిన గొప్ప సత్యాలు. మహాత్ముడి బోధనల్ని కొట్టిపారేయడం తేలిక. అర్థం చేసుకోవడమే చాలా కష్టం. పారిశుద్ధ్యం పట్ల ఆయన నిబద్ధతే ఇందుకు ఉదాహరణ. 

ఓ అయిదు వందల ఏండ్ల క్రితం ‘ఉటోపియా’ అనే నవల వచ్చింది. ఆదర్శవంతమైన సమాజం ఎలా ఉంటుందో, అందులో వివరించే ప్రయత్నం చేశారు రచయిత థామస్‌ మోర్‌. ఆ నవల ప్రేరణతో చాలామంది... ఉటోపియా ఎలా సాధ్యమనే కోణంలో రకరకాల సిద్ధాంతాలు రూపొందించారు. గాంధీజీ ఆ పుస్తకాలన్నీ చదవకపోయి ఉండవచ్చు. కానీ, ఈ ప్రపంచాన్నే ఓ ఉటోపియాగా మార్చేయగల పరిణతి తనకి ఉంది. మంత్రి కే తారకరామారావు అక్టోబర్‌ రెండును స్వచ్చతా దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మెరుగైన సమాజానికి పారిశుద్ధ్యమే పునాది అని తేల్చిన గాంధీజీ దృక్పథాన్ని తెలుసుకోవడం సందర్భోచితం.

చిన్నప్పుడు గాంధీ ఎంతో బుద్ధిమంతుడైన పిల్లాడు. ఒక్క విషయంలో మాత్రం తల్లి పుత్లీ బాయితో పొసగేది కాదు. ఉకా అనే కుర్రాడితో గాంధీ చనువుగా ఉండేవాడు. ఉకా పారిశుద్ధ్య కార్మికుల ఇంట్లో పుట్టాడు. దీంతో తన బిడ్డ ఆ కుర్రాడితో కలవడం  ఆమెకు ఇబ్బందిగా అనిపించేది. ఉకాని ముట్టుకున్నప్పుడల్లా... గాంధీకి స్నానం చేయించేది. అప్పుడే, గాంధీలో రెండు ప్రశ్నలు మొదలయ్యాయి. ఒకటి - ఎవరి మరుగుదొడ్డిని వాళ్లు శుభ్రం చేసుకోరు ఎందుకు... అందుకు ప్రత్యేకమైన కులాలు ఉండటం ఏమిటి? రెండు- ఆ పని చేస్తున్నందుకు వాళ్లను నీచంగా, అస్పృశ్యులుగా చూడటం ఎందుకు? పారిశుద్ధ్యాన్ని నీచమైన పనిగా భావిస్తాం కాబట్టే, దాని కోసం కొన్ని కులాలను ఏర్పరుచుకుని, ఆ పని చేస్తున్నవాళ్లని కూడా అంటరానివారిగా చూస్తున్నారని ఆయనకు అర్థమైపోయింది. 

దక్షిణాఫ్రికాలోనే మొదలు...

గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు... భారతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం జరిపారు. ఆయన సత్యాగ్రహ ప్రయోగానికి బీజం పడింది అక్కడే. అదే సమయంలో ఓ విషయాన్ని గ్రహించారు. ఐరోపావాసులకు, భారతీయుల పట్ల చిన్నచూపునకు అనేక కారణాలు. అందులో ఒకటి... అపరిశుభ్రత. అక్కడి ఆసియావాసుల నివాసాలు చెత్తచెత్తగా ఉండటం వల్లే, వారుండే చోట ఒకటి రెండుసార్లు కలరా కూడా సోకింది. ఆ సమయంలో స్వయంగా గాంధీజీ స్వచ్ఛంద సేవకులతో కలిసి ఆ పరిసరాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ‘శుభ్రత విషయంలో నిర్లక్ష్యమే... చాలా రోగాలకు కారణం’ అని స్పష్టంగా పేర్కొన్నాడు. ‘రోజూ స్నానం చేసినంత మాత్రానో, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రానో... పరిశుభ్రతని పాటించినట్టు కాదు. వ్యక్తులు శుచిగా ఉంటే సరిపోదు... పౌరులుగా ఎంత శుభ్రతను పాటిస్తున్నాం అన్నది కూడా ఆలోచించాలి’ అంటూ గుర్తుచేస్తారు. అందుకే దక్షిణాఫ్రికాలోని తన మొట్టమొదటి ఆశ్రమం ‘టాల్‌స్టాయ్‌ ఫామ్‌'లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేశారు. మురుగునీటిని చెట్లకు మళ్లిస్తూ, అశుద్ధాన్ని ఎరువుగా మారుస్తూ... ఆదర్శమైన జీవన వ్యవస్థను రూపొందించారు. ‘అవకాశం దొరికితే, భారతీయులు కూడా ఐరోపావాసులకు దీటుగా పరిశుభ్రతను పాటించగలరు’ అని అక్కడి చట్టసభకి లేఖ రాసి మరీ, దాన్ని నిరూపించారు. ‘పట్టుపట్టరాదు, పట్టివిడువరాదు’ అన్నమాట గాంధీకి ఎంతలా అన్వయిస్తుందో... ఆయన ఆత్మకథ చదివినవారికి స్పష్టమైపోతుంది. స్వచ్ఛత విషయంలో అది మరీ స్పష్టం. డర్బన్‌లోని (దక్షిణాఫ్రికా) తన ఇంట్లో ఫ్లష్‌ సౌకర్యం ఉండేది కాదు. మరుగుదొడ్డిని చేతులతో శుభ్రం చేయాల్సిందే. ఆ పనిని కుటుంబ సభ్యులే స్వయంగా చేసుకోవాలని గాంధీజీ నిబంధన. ఓసారి ఎవరో అతిథి వచ్చి వెళ్లిన తర్వాత, అతను తక్కువ జాతివాడన్న కారణంతో కస్తూరిబా పాయిఖానాను శుభ్రంచేయడానికి తిరస్కరించారు. కులం ప్రాతిపదికన జీవించాలనుకుంటే, తనతో కలిసి ఉండటం సాధ్యం కాదని ఆమెకు తేల్చిచెప్పేశారు గాంధీ. 

ప్లేగును నివారించడంలో...

దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలోనే ఓసారి భారత పర్యటనకు వచ్చారు గాంధీ. అది 1898వ సంవత్సరం. ముంబైలో ప్లేగు విలయతాండవం చేస్తున్నది. పారిపోయినవారు కొందరు, చనిపోయినవారు ఇంకొందరు! నగరం శ్మశానాన్ని తలపించింది. ఆ సమయంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చేరుకున్నారు గాంధీ. ముంబై నుంచి వలసల కారణంగా... త్వరలో రాజ్‌కోట్‌ను కూడా ప్లేగు ఆక్రమిస్తుందనే పుకార్లు వినిపించాయి. వెంటనే గాంధీ కార్యాచరణలోకి దిగిపోయారు. తను సేవకు సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వానికి తెలియచేశారు. ఓ కమిటీతో కలిసి ఇంటింటికీ తిరిగి మరుగుదొడ్లను పర్యవేక్షిస్తూ, వాటి శుభ్రతకు సలహాలు అందించారు. బారిస్టర్‌ చదువుకుని, విదేశాలలో ఉన్న ఓ వ్యక్తి ‘మీ ఇంట్లో మరుగుదొడ్లను చూడాలి’ అంటూ వెలివాడల్లోకి అడుగుపెట్టడం ఈ రోజుకీ ఓ అద్భుతమే!

గాంధీ రెండో పర్యటనలోనూ స్వచ్ఛత పట్ల నిబద్ధతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాంగ్రెస్‌ సమావేశాలలో పాల్గొనేందుకు 1901లో కోల్‌కతాకు చేరుకున్న గాంధీకి, అక్కడి అపరిశుభ్రత చూసి దిమ్మతిరిగిపోయింది. చాలామంది కార్యకర్తలు వసతిగదుల ముందే మలవిసర్జన చేస్తున్నారు. దానికి అడ్డుచెప్పేవాళ్లు లేరు, శుభ్రం చేసేవాళ్లూ లేరు. ఎవరిని అడిగినా... అది మా పని కాదు అని తేల్చేశారు. దాంతో తనే చీపురు పట్టుకుని అక్కడి పరిసరాలను శుభ్రపరచడం మొదలుపెట్టారు గాంధీ. విదేశీ దుస్తులతో ఉన్న వ్యక్తి మలాన్ని శుభ్రం చేయడం చూసి, కార్యకర్తలు నివ్వెరపోయారే కానీ... ఎవరూ ముందుకు రాలేదు! ఆ పర్యటనలో గాంధీని నిరుత్సాహపరిచే ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. కిళ్లీ ఉమ్ములతో, వదిలేసిన ఆహారపదార్థాలతో కంపుకొడుతున్న రైలులో ప్రయాణించారు. పవిత్ర వారణాసిలో బురద మయమైన రోడ్లు, ముసిరే ఈగలు, కుళ్లిపోయిన పూల కుప్పలను చూసి చలించిపోయారు. ‘అంత గొప్ప ఆలయం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి కదా!’ అని వాపోయారు. ఆ పరిస్థితులను మార్చే అవకాశం రానే వచ్చింది.

పచ్చని పల్లెల కోసం

స్వాతంత్య్రం కోసం గాంధీజీ పోరు, చంపారన్‌ సత్యాగ్రహంతో మొదలైంది. అక్కడ నీలిమందును పండించే కూలీల మీద తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. వారికి అండగా అక్కడికి చేరుకున్న గాంధీజీకి, గ్రామాల్లోని అపరిశుభ్రతను చూసి బాధ కలిగింది. ఎటు చూసినా చర్మవ్యాధుల రోగులే పలకరించారు. ఇక బహిరంగ మలవిసర్జన సరేసరి! దాంతో ఒకవైపు సత్యాగ్రహం, మరోవైపు పారిశుధ్యం.. ద్విముఖ వ్యూహంతో  కార్యకర్తలను నడిపించారు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వచ్చే వ్యాధులను విధిరాతగా భావించడాన్ని ఆయన తప్పుపట్టేవారు. ‘మనలో విచక్షణ లేకపోవడం వల్లే చాలా గ్రామాలు పేడకుప్పలుగా మారిపోయాయి. కళ్లూ, ముక్కూ మూసుకుని నడవాల్సిన దుస్థితిలో ఉన్నాయి’ అంటారు గాంధీజీ. అందుకే ‘గ్రామానికి ఏదైనా సేవ చేయాలనుకునే కార్యకర్తలు ముందు అక్కడి పారిశుద్ధ్య మీదే దృష్టి పెట్టాలి’ అని పిలుపునిచ్చేవారు.

పేదరికం వల్లే గ్రామాల్లో పరిశుభ్రత ఉండదనే వాదనను ఆయన ఒప్పుకునేవారు కాదు. అందుకే ‘పేదరికానికీ పారిశుద్ధ్యానికీ సంబంధమే లేదు. ఎంత పేదవాడి మరుగుదొడ్డి అయినా సరే, దాన్నో వంటగది అంత పరిశుభ్రంగా ఉంచుకోవడం అసాధ్యమేమీ కాదు’ అని తెగేసి చెప్పారు. ‘మన గ్రామాలు ఎప్పుడూ ఇంతే..’ అనే వాదనని కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ‘మనది చాలా ప్రాచీనమైన నాగరికత అని గర్వంగా చెప్పుకొంటాం. గ్రామీణ భారతం ఇప్పుడున్నంత అపరిశుభ్రంగా ఉండి ఉంటే... ఇన్ని వందల ఏండ్లు మనుగడ సాధించగలిగేదే కాదు’ అని తెగేసి చెబుతారు. ‘గ్రామాల్లో స్వచ్ఛమైన గాలి ఉండాలి, కానీ అది దొరకడం లేదు. తాజా కూరలు అందుబాటులో ఉండాలి, కానీ లభించడం లేదు. ఇదంతా అపరిశుభత్ర వల్లే కదా’ అని వాపోతారు. గాంధేయ ఆర్థిక వ్యవస్థ కూడా గ్రామాల చుట్టూనే తిరుగుతుంది. యువతకు స్థానికంగానే ఉపాధి దొరకాలనీ, స్వయం పరిపాలన అలవర్చుకోవాలనీ ఆశించేవారు. అద్దంలా మెరిసే గ్రామాలు, కులరహిత సమాజం, స్వయం సమృద్ధి... ఆయన కల. 

అంట... రానితనమే! 

చాలామంది దృష్టిలో మరుగుదొడ్లను శుభ్రం చేయడం నీచమైన పని. ఆ పనిచేసేవాళ్లతో కలిసి జీవించడం ఊహకందని విషయం. అంటరానితనానికి మూలం అదే. అందుకే పారిశుద్ధ్యానికీ, అంటరానితనానికీ సమానమైన ప్రాధాన్యం ఇచ్చారు బాపూ. ‘నా భార్యని పెండ్లి చేసుకోవడానికి ముందే... అంటరానితనాన్ని దూరం చేయాలనే లక్ష్యాన్ని మనువాడాను’ అని తెగేసి చెప్పారు. ‘మీ ఇంట్లో పాకీపని చేయడానికి ఎవరి కోసమో చూడటం ఎందుకు! మీరే ఆ పని చేయవచ్చు కదా? అప్పుడు మీ దృక్పథమే మారిపోతుంది. మీ చుట్టుపక్కల ప్రదేశాలని కూడా శుభ్రంగా ఉంచే పరిణతి వస్తుంది. అన్నిటికీ మించి... ఆ వృత్తిలో ఉన్నవారిని విముక్తుల్ని చేసినవారవుతారు’ అంటారు. ఓసారి తన ఆశ్రమంలో ఉండటానికి అంటరానివాళ్లను అనుమతించినందుకు, తన సహచరుల నుంచే నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా గాంధీజీ నిబద్ధత విషయంలో ఏనాడూ వెనక్కి తగ్గలేదు.

1946లో స్వాతంత్య్రోద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు గాంధీజీ ఢిల్లీకి బస మార్చాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన ఎంచుకున్న ప్రదేశం... పాకీవాళ్లు నివసించే ‘భంగి కాలని’ (ఇప్పుడది వాల్మీకి బస్తీ). ఆ బస్తీలోని వాల్మీకి మందిరాన్ని ఓ పాఠశాలగా మార్చుకుని.. చుట్టుపక్కల పిల్లలకు చదువు, ఆరోగ్యసూత్రాలు బోధించేవారు గాంధీ. నెహ్రూ, మౌంట్‌బాటన్‌ లాంటి మహామహులంతా ఆయనను కలవాలంటే ఆ బస్తీలో అడుగుపెట్టాల్సిందే! గాంధీ ఆదర్శాలకు భూమికగా నిలిచిన చోటు కాబట్టే, ఆరేండ్ల క్రితం స్వచ్ఛ భారత్‌ ఉద్యమాన్ని మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు, ప్రధానమంత్రి మోదీ ఈ చోటునే ఎంచుకున్నారు.

గాంధీ జీవితాంతం పారిశుధ్యానికే కట్టుబడి ఉన్నారు. దేశ విభజన సమయంలో ఓ వైపు నిరాహారదీక్ష చేస్తూనే, శరణార్థి శిబిరాలలోని పరిశుభ్రత గురించి ఆరాతీసేవారు. పారిశుధ్యాన్ని ఆయన వ్యక్తిగత బాధ్యతగా ఏనాడూ భావించలేదు. ఆయన దృష్టిలో అది సామాజిక స్పృహ. ‘రోడ్డు మీద ఉమ్మి వేయడం లాంటి పనులు పాపం మాత్రమే కాదు, ద్రోహం కూడా. అరణ్యంలో మలవిసర్జన చేసేవాడు కూడా, దాన్ని మట్టితో కప్పకపోవడం శిక్షార్హం’ అంటూ పౌరుల అపరిశుభ్రతని తీవ్రంగా నిందిస్తారు బాపు. మన దేశం కనీవినీ ఎరుగని రీతిలో స్వచ్ఛభారత్‌ ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీనే స్ఫూర్తి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ అది ఓ ప్రభుత్వ కార్యక్రమంలా ఉంటే సరిపోదు. స్వచ్ఛత మన జీవనవిధానంగా మారాలి. అందుకే ప్రధాని మోదీ ‘స్వచ్ఛభారత్‌ కల వెయ్యి మంది గాంధీలతోనో, లక్షమంది నరేంద్ర మోదీలతోనో, యావత్‌ ప్రభుత్వంతోనో నెరవేరేది కాదు. 125 కోట్ల భారతీయుల సహకారంతోనే అది సాకారం అవుతుంది’ అని తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఈ కొవిడ్‌ సమయం, పరిశుభ్రత మన ప్రాణాల్నే కాపాడగలదని నిరూపించింది. సాక్షాత్తు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘శుచి, శుభ్రతలని తక్కువగా అంచనా వేయకూడదన్న మహాత్ముడి మాటను గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది... అలాంటి ముందుజాగ్రత్తే కరోనాని నిలువరించగలదు’ అని చెప్పేశారు. 

తాత్కాలిక మార్పు కాదు!

1936లో గాంధీ వార్ధాలో ఓ ఆశ్రమాన్ని స్థాపించారు. అది వెనుకబడిన గ్రామాల మధ్య ఉండేది. బడుగుల వైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి, వారికి దగ్గరగా ఉండి సేవ చేయడానికి గాంధీ ఎంచుకున్న వ్యూహమది! అనుకున్నట్టుగానే, ఆశ్రమవాసులు చుట్టుపక్కల గ్రామాలకి వెళ్లి అక్కడి పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం చేసేవారు. వారిలో మీరా బెన్‌ ఒకరు. కొన్నాళ్ల తర్వాత ‘బాపూ! నేను పనిచేస్తున్న గ్రామానికి ఓసారి రండి...’ అంటూ అభ్యర్థించడం మొదలుపెట్టింది. ఓ రోజు బాపూజీకి కాస్త వెసులుబాటు చిక్కడంతో, సమయానికి మీరా బెన్‌ తోడులేకపోయినా... ఆమె పనిచేసే గ్రామానికి చేరుకున్నారు. కానీ అక్కడి పరిస్థితులు చూసి ఆయన నివ్వెరబోయారు. ఆ ఊరివీధుల్లో ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా పడి ఉంది. చెత్త ఎందుకలా పోగయ్యిందని కారణం అడిగితే... ‘ఓ రెండు రోజుల నుంచి వాటిని శుభ్రం చేయడానికి మీరా బెన్‌ రావడం లేదండీ’ అంటూ అమాయకంగా బదులిచ్చారు జనం. ఆశ్రమానికి వచ్చిన తర్వాత బాపూ, మీరాబెన్‌ను పిలిచి ‘నువ్వు ఇన్నాళ్లుగా గ్రామస్థుల కోసం పనిచేస్తున్నావే కానీ... వాళ్లతో కలిసి కాదని అర్థమైంది’ అంటూ మందలించారు. గాంధీ దృష్టిలో ఖాళీసమయాలలో సేవ చేసినంత మాత్రాన, సమస్యలలో మార్పు రాదు. స్ఫూర్తి రగిలించాలి, చైతన్యం అందించాలి. సమస్యని మూలం దగ్గరే పరిష్కరించాలి.

ప్లాగింగ్‌! 

గాంధీకి నడక అంటే చాలా ఇష్టమని తెలిసిందే! తన వేగాన్ని అందుకోవడం కుర్రాళ్లకి కూడా సాధ్యపడేది కాదు. నడిచే సమయం వృధా కాకుండా... దారిలో చెత్త కనిపిస్తే ఏరి చెత్తకుండీలో పడేసేవారు. ఆఖరికి అశుద్ధం కనిపించినా, ఎండుటాకులతో ఎత్తేసేవారు. ఇలా దారిలో ఉన్న చెత్తని ఏరేయడానికి ఇప్పుడు ఓ పేరు పెట్టారు- ‘ప్లాగింగ్‌'. స్వీడన్‌లో మొదలైన ఈ ప్లాగింగ్‌ ఇప్పుడో అంతర్జాతీయ ట్రెండ్‌. పుణెలోని వివేక్‌ గౌరవ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఈతరహా ప్లాగింగ్‌ కోసం వందల మందిని కూడగట్టి, వేల టన్నుల చెత్తను ఏరేశాడు. మోదీకూడా ఆ మధ్య మహాబలిపురం బీచ్‌లో నడుస్తూ, ప్లాగింగ్‌ చేశారు. వీటికి ఆద్యులు గాంధీ అన్న విషయం ఎవరూ గుర్తించినట్టులేదు.

నేరుగా రంగంలోకి!

1915లో గాంధీజీ స్వతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టారు. ఆయన దక్షిణాఫ్రికాలో సాధించిన విజయాలను చూసి, ఇక్కడ కూడా ఏదో మార్పు తెస్తారనే బలమైన నమ్మకంతో ఉంది దేశం. కాంగ్రెస్‌ సమావేశాలు జరిగినప్పుడు పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా దళాలను రూపొందించడం మొదలుపెట్టారు గాంధీ. అలా ఏకంగా రెండువేల మంది కార్యకర్తలతో అలాంటి దళాన్ని ఏర్పాటు చేసిన సందర్భం కూడా ఉంది. వారిలో ఎక్కువగా అగ్రవర్ణాలవారే. ఓ కాంగ్రెస్‌ సమావేశంలో గాంధీజీని కలవడానికి టాగూర్‌ వచ్చారు. ఆయన కనిపించగానే ‘కాస్త చీపురూ, బక్కెట్టు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా!’ అని అడిగారు గాంధీ. టాగూర్‌ తన జీవితంలో ఎన్నడూ వినని ప్రశ్న అది.
గాంధీజీ ఆశ్రమాల్లోనూ పారిశుద్ధ్యానిదే పెద్దపీట. ఊపిరి సలపనంత పనిలో ఉన్నా  గాంధీజీ ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్య పారిశుద్ధ్య పనులు చేసేవారు. ఆశ్రమంలో వనరులు వృథా కాకుండా కట్టుదిట్టంగా ఉండేవారు. అది కాగితం ముక్కయినా, నీటి చుక్కయినా సరే! ఆశ్రమంలోనే కాదు... చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం గురించి అవగాహన పెంచేవారు. ఓ పల్లెవాసులు, ఎంత చెప్పినా వినకుండా బహిరంగ మలవిసర్జన చేయడం చూసి... గాంధీనే నెలల తరబడి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ‘స్వాతంత్య్రం కంటే శుభ్రత చాలా అవసరం’ అనేవారు గాంధీ. ఆయన దృష్టిలో శుచిగా ఉండేవారే స్వాతంత్య్రానికి అర్హులు. ఆ పట్టుదల వెనుక కారణమూ లేకపోలేదు. గాంధీ అభిప్రాయంలో శుభ్రత కేవలం శారీరకమైన అలవాటు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఓ అవసరం మాత్రమే కాదు.... అది ఆత్మాభిమాన ప్రతీక! ఆత్మను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తొలి మెట్టు. దైవత్వం తర్వాత పరిశుభ్రతకే ప్రాధాన్యం అని నమ్మేవారు బాపూ. ‘మురికి కాళ్లతో ఎవరూ నా మనసులో చోటు సంపాదించుకోలేరు’ అని తెగేసి చెప్పారు.

మార్పు సాధ్యమే!

120 ఏండ్ల నాటి సంగతి. కలరా మహమ్మారి భారతదేశాన్ని వణికిస్తున్నది. దాని బారిన పడకుండా ఉండటానికి ఒకే ఒక్క మార్గం, పరిశుభ్రతకు కట్టుబడి ఉండటం అని మేఘాలయలోని ఓ చిన్న గ్రామం గ్రహించింది. ఈ విచక్షణ ఆ ప్రాంతాన్నే మార్చేసింది. అదే షిల్లాంగ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌలినాంగ్‌. పట్టుమని వెయ్యిమంది కూడా లేని ఆ ఊరు... అద్దాన్ని తలపిస్తుంది. ఊరినిండా పచ్చని చెట్లే! కానీ ఓ ఎండుటాకు నేలరాలినా, దాన్ని దగ్గరలో ఉన్న డస్ట్‌బిన్‌లో పడేసేంత నిబద్ధత అక్కడి ప్రజలది. ఆ డస్ట్‌బిన్‌ కూడా వెదురుతో చేసినదై ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్‌ వాడకం అతి తక్కువ, పాలిథీన్‌ అయితే కనిపించడానికే వీల్లేదు. ఊరిలోని చిన్నాపెద్దా అందరూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఐక్యంగా పనిచేస్తారు. ఆ చిన్న ఊరిలో పబ్లిక్‌ టాయిలెట్లు ఉండటం ఓ వింతయితే, వాటి బాధ్యతని అందరూ పంచుకోవడం మరో విశేషం. ఇక ఆ ఊళ్లో పొగతాగడమూ నిషేధమే. అందుకే ఈ ఊరిని ఆసియాలోనే శుభ్రమైన గ్రామాల్లో ఒకటిగా ఎంపిక చేసింది బీబీసీ! గ్రామీణభారతం తలుచుకుంటే బాపూ కలగన్న స్వచ్ఛభారతం సాధ్యమే అని ఇది నిరూపిస్తున్నది.


logo