శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 05:15:29

ఒకటే పాట... పది కాలాలపాటు

ఒకటే పాట... పది కాలాలపాటు

‘నేటి భారతం’(1983) సినిమాలోని ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాట వినని తెలుగువారుండరు. అప్పట్లో ఇది దవాఖాన పాటగా ప్రసిద్ధి చెందింది. గొప్ప సంచలనం రేకెత్తించింది. ఈ పాట రచయిత ఎవరో కాదు ప్రజాకవిగా, వాగ్గేయకారుడిగా తెలంగాణ గడ్డపై విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొంది, శ్రామికుల పక్షాన కలమెత్తి నిలబడ్డ ‘బల్ల కిష్టస్వామి’.

ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో సీతయ్య, పోశమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు బల్ల కిష్టస్వామి. పదిహేను ఏండ్లకే పాటలు రాయడం మొదలుపెట్టారు. సింగరేణిలో కోల్‌ ఫిల్లర్‌గా పనిచేస్తూ ప్రజానాట్య మండలికి దగ్గరయ్యారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఉద్యోగాన్ని  పోగొట్టుకున్నారు. అంతేకాకుండా 12 ఏండ్లు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు . సింగరేణి కార్మికుల పోరాటాలు, మహిళా సమాఖ్యలు, సారా ఉద్యమం, అక్షర దీపిక్ష, తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉత్తేజపరచడానికి పలు గేయాలు రచించి అభ్యుదయ కవిగా పేరు పొందారు. 

దవాఖాన కష్టాలు

ఇప్పుడంటే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన సేవల్ని అందిస్తున్నాయి. కానీ, ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానల పరిస్థితి ఎంతో దీనంగా ఉండేది. ఆ  ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికే జనం భయపడేవారు. ఒకానొక ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా చికిత్స లేని వైనాన్ని, వైద్యులు లంచాలు గుంజే పరిస్థితిని కండ్లారా చూసిన కిష్టస్వామి ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ పాటను రాశారు. అది ప్రైవేటు గీతంగా అప్పటికే ప్రజాదరణ పొందింది. 

అనేకానేక సాహిత్య వేదికల మీద ఎంతోమంది కార్మికులు బృందగానం చేసేవారు. ఏ వేదికెక్కినా ఇదే పాట వినిపించేది. ఒకానొక సభలో ఈ పాటను విన్న దర్శకుడు  టి.కృష్ణ   బాగున్నదే అనుకున్నారు. ఎంతో ఊపున్న ఈ గేయాన్ని   తాను తీస్తున్న ‘నేటి భారతం’  (1983) సినిమాలో వాడుకోవాలనుకున్నారు.     కిష్టస్వామిని అడిగితే.. మొదట్లో నిరాకరించినా, తర్వాత సరేనన్నారట. ఇక ఆ పాటను సినిమాలో పెట్టాక ఎంత పాపులర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ  పాట వల్లే సినిమాకు అంత పేరొచ్చిందని  అనడం అతిశయోక్తి కాదేమో!

‘దమ్ము తోటి దగ్గు తోటి సలిజొరమొచ్చిన అత్తో

అత్తో పోదాం రావే.. మన ఊరి దవాఖానకు..

మందుల గోలీలు మంచి సూదులు ఎత్తండ్రట.. 

నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానకు

ఎర్ర నీళ్ళమందు సున్నాపు నీళ్ళ సూదులాయె

మందుకు దగ్గొచ్చే సూదేస్తే జొరమొచ్చె

నేను రాను బిడ్డో గండాల దవాఖానకు..’ 

అని ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యసేవలు అందక  పేదవారు పడే బాధలు ఎలా ఉన్నాయో ఈ పాటలో తెలిపారు. ఆసుపత్రుల్లో  డాక్టర్లు లంచాలకు మరుగుతారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని, ఆసుపత్రి సిబ్బంది అందరూ డబ్బులడిగి పేదవారిని పీల్చిపిప్పి చేస్తారని ఈ పాటలో చెబుతారు. రోగాలను నయం చేయడం మాని, డబ్బులు గుంజి, పేదవాణ్ణి మరింత పేదరికంలోకి తోసి, లేని రోగాన్ని అంటకడతారని చెబుతారు. ప్రభుత్వ వైద్యుల అవినీతి పై   పిడిబాకును దించిన పాట ఇది. ఈ పాటను పాడిన వందేమాతరం శ్రీనివాస్‌, ఎస్‌.పి.శైలజకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. 

ఉద్యమ సూర్యుడు

...ఇంకా ఇలాంటి కార్మిక గీతాలు, అభ్యుదయ గీతాలెన్నో రాశారు కిష్టస్వామి. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ‘ఉద్యమ సూర్యుడు’ అనే పాటల సి.డి ని రూపొందించి ఆయనకు అంకితమిచ్చారు. దవాఖాన పాటతో తెలుగు సినిమా పాటల చరిత్ర పుటల్లో ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకొన్న  బల్ల కిష్టస్వామి 2014 అక్టోబర్‌ 29న మరణించారు.  కవుల మరణాలు భౌతికమే. పాటల రూపంలో జనం గుండెల్లో బతికే ఉంటారు వారు.