బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 05:05:16

దుబాయ్‌ కుబేరుడు.. తెలంగాణ రామ్‌

దుబాయ్‌ కుబేరుడు.. తెలంగాణ రామ్‌

ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టిన ఓ యువకుడు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయ్యాడు. ఒకప్పుడు బతుకుదెరువు కోసం నానా అగచాట్లు పడ్డవాడే ఇప్పుడు ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాడు. కాలినడకన దుబాయ్‌ రోడ్లమీద తిరిగిన రోజుల నుంచి ఖరీదైన రోల్స్‌రాయిస్‌ కారులో షికారు చేసే స్థాయికి ఎదిగాడు. ఇక్కడి గల్లీలో అనామకుడిగా ముద్రపడ్డా గల్ఫ్‌లో నాయకుడయ్యాడు. అతనే వేములవాడకు చెందిన తోట రామ్‌కుమార్‌. దుబాయ్‌లోని ‘ఎస్సారార్‌ బీఎంటీ’ సంస్థకు అధిపతి. వలస కూలీగా ఎడారి దేశంలో అడుగు పెట్టి, 680కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నరామ్‌కుమార్‌ లైఫ్‌జర్నీ.. 

పూర్వ కరీంనగర్‌ జిల్లా వేములవాడ పట్టణంలోని  మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు రామ్‌కుమార్‌. తల్లిదండ్రులు తోట నారాయణ, నర్సమ్మ. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తేనే ఇల్లు గడిచేది. చిన్నప్పటి నుంచీ వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండే రామ్‌, చదువులో వెనుకబడ్డాడు. దీంతో.. ఒకసారి తప్పి, రెండోసారికి పదో తరగతి పూర్తి చేశాడు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉన్నా, కుటుంబ పోషణ కోసం ఏదో ఒక పని చేయాలనున్నాడు. 1980లలో సిరిసిల్ల ప్రాంతంలో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువ. అలాంటి సమయంలో అక్కడి యువత చూపు ఎడారి దేశంవైపే ఉండేది. రామ్‌కుమార్‌ కూడా వారిలాగే ఆలోచించాడు. రెండు జతల బట్టలు, పదో తరగతి మెమో పట్టుకొనిదుబాయ్‌ ఫ్లయిట్‌ ఎక్కాడు. అక్కడ ఏ పని చేయాలో..? ఎక్కడ ఉండాలో..? తెలియదు. కానీ, ఏదైనా సాధించాలనే సంకల్పం, ‘బతుకంటే నువ్వొక్కడివే తినడం కాదు.. మరో పది మందిని కూడా బతికించాలె’ అని తల్లిదండ్రులు చెప్పిన మాటలు రామ్‌కుమార్‌ను ముందుకు నడిపించాయి. అలా 1989లో దుబాయి చేరుకొని, ఓ కంపెనీలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా పనిలో కుదిరాడు. రోజులు గడుస్తున్నా.. ఎలాంటి ఎదుగూబొదుగూ లేకుండా ఉన్నాడు. ‘పది’కే పరిమితమైతే ఎలాంటి ప్రయోజనం లేదనీ, ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడు. అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌లలో నైపుణ్యాలు పెంచుకున్నాడు.  ఓవైపు ఉద్యోగం చేస్తూనే, సీఏ పరీక్షలకు సిద్ధం అయ్యాడు. పట్టుదలతో చార్టెడ్‌ అకౌంటెన్సీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆదానీ గ్రూప్‌లో సేల్స్‌ డైరెక్టర్‌గా కొలువు సంపాదించాడు. 

మలుపు తిరిగిన జీవితం

అదానీ గ్రూప్‌లోని పెట్రో కెమికల్‌ విభాగం అధిపతి యోగేష్‌ మెహతా ప్రోత్సాహం, రామ్‌ కుమార్‌ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. కార్పొరేట్‌ పాలనా వ్యవహారాల్లోని లోతుపాతుల్ని అక్కడే తెలుసుకున్నాడు. మెహతా నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ఆయనలో పదిశాతం కష్టపడ్డా ఎంతో పైకి రావొచ్చని అనుకున్నాడు. తనకు తానే కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో యూఏఈలోని పలు కంపెనీల సేల్స్‌ డైరెక్టర్‌లతో పరిచయం ఏర్పడింది. సేల్స్‌ డైరెక్టర్స్‌ గ్రూప్‌లోనూ స్థానం సంపాదించాడు. అక్కడ అంతర్జాతీయ వాణిజ్య అంశాలపై అనేక చర్చలు నిర్వహించేవారు. మార్కెట్‌లో జరిగే పరిణామాలపై విశ్లేషించుకునేవారు. అదే సమయంలో దుబాయిలో నిర్మాణరంగం ఊపందుకున్నది. అప్పటిదాకా ఉద్యోగమే జీవితం అనుకున్న రామ్‌కుమార్‌, వ్యాపారంలోకి దిగాలని అనుకున్నాడు. 

‘రాజన్న’ పేరుతోనే.. 

బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌లో ఉన్న అనుభవంతో తన స్నేహితుడితో కలిసి అదే వ్యాపారంలోకి దిగాడు రామ్‌కుమార్‌. అప్పటిదాకా కూడబెట్టిన డబ్బులతోపాటు బ్యాంకుల నుంచి రుణం కూడా తీసుకున్నాడు. 2004లో ‘టోటల్‌ సొల్యూషన్స్‌' పేరుతో దుబాయ్‌లోనే ఒక కంపెనీని ప్రారంభించాడు. తాము ఊహించిన దానికంటే గొప్పగా వ్యాపారం సాగింది. 2007లో స్నేహితుడితో విడిపోవాల్సి వచ్చింది. ఇక సొంతంగా వ్యాపారం చేయడమే తన ముందున్న ఏకైక మార్గంలా కనిపించింది. తన ఆరాధ్య దైవం వేములవాడ రాజరాజేశ్వర స్వామి పేరు మీదే ‘శ్రీరాజరాజేశ్వర బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌ (ఎస్సారార్‌ బీఎంటీ)’ని ప్రారంభించాడు. దుబాయ్‌లో నిర్మించే పెద్దపెద్ద భవనాలు, షాపింగ్‌మాల్స్‌.. ఇలా ఏ నిర్మాణమైనా మెటీరియల్‌ను సరఫరా చేయడం మొదలు పెట్టాడు. 

ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫాకూ..

కంపెనీని ప్రారంభించిన తొలి ఏడాదిలోనే సుమారు రూ.200కోట్ల లావాదేవీలు నిర్వహించాడు. గల్ఫ్‌ దేశాల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సంస్థలు నిర్మించే భారీ నిర్మాణాలకూ సామగ్రిని అందించే అవకాశం దక్కించుకున్నాడు. ప్రఖ్యాత బుర్జ్‌ఖలీఫాతోపాటు మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ సిటీ, ఆల్‌ మక్‌టౌమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అరేబియన్‌ రాంచెస్‌, స్పోర్ట్స్‌ సిటీ, మోటర్‌ సిటీ, దుబాయ్‌ మాల్‌, ఫామ్‌ జుమేరా, బిజినెస్‌ బే.. ఇలా విప్లవాత్మకమైన నిర్మాణాలకు భవన నిర్మాణ సామాగ్రిని ‘ఎస్సారార్‌ బీఎంటీ’ నుంచే సరఫరా చేశాడు. ఇలా వ్యాపారం అంతకంతకూ విస్తరించింది. దుబాయిలో చేపట్టే ఏ పెద్ద నిర్మాణానికైనా తన కంపెనీ నుంచే మెటీరియల్‌ తీసుకెళ్లే స్థాయికి ఎదిగింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ తరహా వ్యాపారం చేస్తున్న కంపెనీల్లో ఆయనది రెండోస్థానం. ఈ క్రమంలోనే గల్ప్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ టాప్‌ బిలియనీర్‌ కంపెనీల జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది ఎస్సారార్‌. 

పలు దేశాలకు విస్తరణ

దుబాయ్‌లో వ్యాపారం విజయవంతం కావడంతో చైనాలోనూ అడుగుపెట్టాడు రామ్‌కుమార్‌. 2005లో అల్యూమినియం ప్యానెళ్ల పరిశ్రమను నెలకొల్పాడు. మరికొందరి సహాయంతో ఒమన్‌లోనూ తన సంస్థ కోసం ఒక బ్రాంచ్‌ను ప్రారంభించాడు. మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసే టాప్‌ డీలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దుబాయి, ఒమన్‌... రెండు చోట్లా కలిపి ఎస్సారార్‌ సంస్థ ఏడాదికి రూ.600కోట్ల లావాదేవీలను నిర్వహిస్తున్నది. దాదాపు వెయ్యి రకాల మెటీరియల్‌ను సరఫరా చేస్తున్నది. సుమారు 16 అవుట్‌లెట్లలో 345మందికి ఉద్యోగావకాశాలు కల్పించాడు. వీరిలో తెలుగువారితోపాటు ఇతర దేశాల వారు కూడా ఉన్నారు. అయితే, 2008లో దుబాయిలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, రెండేండ్లపాటు అన్ని వ్యాపారాలనూ అతలాకుతలం చేసింది. ఆ అడ్డంకుల్ని కూడా ధైర్యంగా తట్టుకొని నిలబడ్డాడు రామ్‌కుమార్‌. అంతటి ఆర్థిక సంక్షోభంలోనూ ఒక్క ఉద్యోగినీ తొలగించకుండా, ఎవరికీ ఒక్క రూపాయి జీతం తగ్గించకుండా చూసుకున్నాడు.  తర్వాత రెట్టించిన ఉత్సాహంతో లాభాల బాట పట్టాడు. మళ్లీ 2016లోనూ అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. కొందరు కస్టమర్లు విలువైన సరుకులు తీసుకొని రూ.10కోట్లకు చెక్కులు ఇచ్చారు. అంతలోనే తమ కంపెనీని గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. దీంతో రామ్‌కుమార్‌ తీవ్రంగా నష్టపోయాడు. దీన్ని జీర్ణించుకోవడానికి కొన్నేండ్లు పట్టింది. అలాంటి అనేక అటుపోట్లను తట్టుకొని నిలిచాడు రామ్‌కుమార్‌. 

కాన్సులేట్‌ సభ్యుడిగా గౌరవం

ఒక వలస కూలీగా గల్ఫ్‌లో అడుగుపెట్టిన రామ్‌ కుమార్‌, ఇప్పుడు ఓ వ్యాపార సంస్థ అధినేతగా అందరి మన్ననలూ పొందుతున్నాడు. దుబాయిలో తెలంగాణ తరఫున కాన్సులేట్‌ సభ్యుడిగానూ గౌరవం దక్కించుకున్నాడు రామ్‌కుమార్‌. వ్యాపారంతోపాటు సమాజ సేవలోనూ ముందున్నాడు. వేములవాడలో ‘టీఆర్కే ట్రస్టు’ను ప్రారంభించి, సొంతూరితోపాటు చుట్టు పక్కల గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ట్రస్టు నిర్వహణ కోసం తన బావ ఉప్పుల దేవరాజుతోపాటు మరికొందరిని ట్రస్టీలుగా నియమించి, కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. ‘బతకడమంటే నువ్వొక్కడివే బతుకడం కాదు. నీతో పాటు మరో నలుగుర్ని బతికించడం’ అన్న తన తండ్రి మాటలను నెరవేరుస్తున్నాడు.

ఏం చేసినా తక్కువే

నాకు జీవితాన్ని ఇచ్చిన మా ఊరికి ఏం చేసినా తక్కువే. అందుకే  ‘టీఆర్కే ట్రస్టు’ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇప్పటిదాకా చేసిన సాయం వేరు. ఇకపై చేయాల్సింది వేరు. నా జీవితంలోని ప్రతి మలుపులో నా స్నేహితుల అండ ఉన్నది. వారు లేకుండా నేను లేను. నేను ఉన్నత స్థితికి చేరాక వాళ్ల జీవితాలనూ మెరుగు పర్చాలనుకున్నా. ఆత్మీయుల్నీ ఆదుకోవడమే కాదు, పండుగలనూ కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలన్నది నా ఆశయం. అందుకే పన్నెండేళ్లుగా దుబాయ్‌లో ‘బతుకమ్మ పండుగ’ను ఘనంగా నిర్వహిస్తున్నా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్‌ ఖలీఫా. అలాంటి నిర్మాణానికి సామగ్రిని సరఫరా చేసే అవకాశం రావడమే నా జీవితంలో మరపురాని అనుభవం.  - తోట రామ్‌కుమార్‌


logo