ఆదివారం 01 నవంబర్ 2020
Sunday - Sep 27, 2020 , 04:16:26

ఆ ఊరికెళ్తే.. షోలే చూడొచ్చు!

ఆ ఊరికెళ్తే.. షోలే చూడొచ్చు!

45 ఏండ్ల కిందట.. ఆ ఊరికి ఇద్దరు వచ్చారు. పంటపొలాలు, గుళ్లూగోపురాలు చూసేందుకు రాలేదు వాళ్లు.గండరగండడైన గబ్బర్‌సింగ్‌ ఆట కట్టించడానికి వచ్చారు. వచ్చిన పనిని.. వాళ్లను పిలిపిచ్చిన పెద్దాయన చెప్పినట్టుగా.. పది మందీ మెచ్చేటట్టుగా చేసుకొని వెళ్లిపోయారు.అదే షోలే సినిమాగా బాలీవుడ్‌ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా వచ్చి 45 ఏండ్లు గడిచిపోయాయి. షోలేను మరచిపోలేదెవరు. ఆ చిత్రాన్ని నిర్మించిన ఊరునూ మరచిపోలేదు.

కాకులు దూరని ఊరు


రామనగరలో ఓ కొండమీద రామాలయం ఉంది. వనవాస సమయంలో సీతారామలక్ష్మణులు ఈ కొండపై కొంత కాలం విడిది చేశారని స్థానికుల నమ్మకం. సీతారాములు ఇక్కడ ఉన్నప్పుడే ఓ వింత చోటుచేసుకున్నది. ఓ రోజు రాముడు సీతమ్మ ఒడిలో తలవాల్చి నిద్రిస్తున్నాడట.  ఆ సమయంలో కాకాసురుడు అనే కాకి.. సీతమ్మ వక్షస్థలంపై గాయపరిచిందట. సీతమ్మ నెత్తుటి చుక్క తడికి నిద్ర లేచిన రాముడు.. బ్రహ్మాస్త్రం అభిమంత్రించి దర్భ పోచను కాకాసురుడిపై సంధించాడట. ముల్లోకాలు తిరిగిన కాకాసురుడు తిరిగి రాముని పాదాలు చేరి శరణు వేడటంతో ప్రాణభిక్ష పెట్టాడట. ఆనాటి నుంచి రామనగరలో కాకులు కనిపించవు. అదేం చిత్రమో గానీ, రాబందుల సంచారం ఇక్కడ ఎక్కువ. వాటికో సంరక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు.

సినిమా పరంగా గబ్బర్‌సింగ్‌ డెన్‌ ఏ చంబల్‌ లోయలోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ, అది ఉన్నది బెంగళూరు నగరానికి సమీపంలో అంటే చాలామందికి నమ్మబుద్ధి కాదు. బెంగళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామనగర. కాలక్రమంలో బెంగళూరు దశ దిశలా అభివృద్ధి చెందినా.. రామనగర సమీపంలోని షోలే రాక్స్‌ సౌందర్యం  మాత్రం చెక్కు చెదరలేదు. వాటి పరిసరాల్లోని ప్రకృతి రమణీయత చెదిరిపోలేదు. ఈ రామనగరే.. షోలేలో మనం చూసిన రామ్‌గఢ్‌. సినిమా షూటింగ్‌ సాగినన్ని రోజులూ.. రామనగర పరిసరాల్లో సందడే సందడిగా ఉండేదట. ఇప్పటికీ వారాంతాల్లో అదే సందడి నెలకొని ఉంటుంది.

షూటింగ్‌లు.. ట్రెక్కింగ్‌లు..


సినిమాలో కనిపించిన కొండలు అన్నీ ఇప్పటికీ అంతే ఠీవీగా, దర్జాగా దర్శనమిస్తాయక్కడ. వీటిని చూసేందుకు,  షోలే జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో అభిమానులు రామనగర బాటపడుతుంటారు. వచ్చిన వాళ్లు ఊరుకుంటారా..! సినిమా డైలాగ్‌లన్నీ అప్పజెప్పేస్తుంటారు. ఓ ఔత్సాహికుడు గబ్బర్‌ను తనలోకి ఆవాహనం చేసుకొని.. ‘అరే వో సాంబా.. కిత్నే ఆద్మీ థే!’ అనేస్తాడు. అన్నట్టు అక్కడో కొండపై ఉన్న గుండుకు ‘సాంబా రాక్‌' అనే పేరు పడిపోయింది కూడా! షోలే ఆనవాళ్లను అంతలా సొంతం చేసుకున్నారు అక్కడి జనాలు. ఇంకొందరు కళాకారులు.. గబ్బర్‌సింగ్‌, జయ్‌, వీరూ, బసంతి పాత్రల్లోకి వెళ్లిపోయి షోలే స్ఫూప్‌లు షూటింగ్‌ చేస్తుంటారు. బెంగళూరు టెకీలు వారాంతాల్లో రామనగర చేరుకొని కొండల్లో, గుట్టల్లో కులాసాగా తిరుగుతారు. ట్రెక్కింగ్‌లో జోరుగా పాలుపంచుకుంటారు. ఇక్కడికి వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు షోలే సినిమా చూస్తారు. వచ్చి.. ఆ చిత్రంలోని సన్నివేశాలను మనసులో ఊహించుకొని.. తమ కండ్ల ముందే జరుగుతున్నదా అన్న అనుభూతికి లోనవుతారు. షోలే చూడకుంటే కంగారు పడాల్సిన పనిలేదు. రామనగరలో కదలక మెదలక పడి ఉన్న రాతి శిలలు.. వాటి చుట్టూ పరుచుకున్న పచ్చదనం కావాల్సినంత ప్రశాంతతనిస్తాయి. షోలే చూసిన వారికి ఆత్మానందం బోనస్‌గా దక్కుతుంది.