శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 04:07:11

నమ్మక తప్పని నిజం... సూక్ష్మక్రిముల మహానిద్ర!

నమ్మక తప్పని నిజం... సూక్ష్మక్రిముల మహానిద్ర!

‘ఎప్పుడో డైనోసార్స్‌ కాలం కంటే ముందే సుమారు ఒక లక్ష సంవత్సరాల కిందట, సమద్రగర్భ నేలలో వందల అడుగుల లోపల మట్టిలో సమాధి అయిపోయి, ఇప్పుడు నిద్ర లేచినట్లు మేల్కొనే జీవులు ఎక్కడైనా ఉంటాయా?’ అంటే, శాస్త్రవేత్తలు ‘ఉన్నాయనే’ సమాధానం చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్ర గర్భం అడుగున, దాదాపు 100 మీటర్ల లోపల సుమారు 101.5 మిలియన్‌ ఏండ్ల క్రితం ఖననమై పోయిన ‘ఏరోబిక్‌ బ్యాక్టీరియా’ (సూక్ష్మక్రిములు) తాజాగా ప్రయోగశాలలో నమ్మశక్యం కాని విధంగా మేల్కొని, నాలుగు రెట్లు అభివృద్ధి చెందాయని వారు ఇటీవల ప్రకటించారు. ప్రాణవాయువు, పోషకాలు అత్యల్ప స్థాయిలో మాత్రమే లభ్యమయ్యే అటువంటి అతి సంక్లిష్ట జీవావరణంలోనూ అవి ఎలా మనుగడ సాధించాయన్నది వారికి పెద్ద మిస్టరీగా మారింది.

ఒక ఏకకణ జీవి ‘ఇంత సుదీర్ఘకాలం’ పాటు (లక్ష సంవత్సరాలకు పైగా) జీవించగలుగుతుందన్న సంగతి ఇప్పటికి శాస్త్రవేత్తలకు తెలియదు. పసిఫిక్‌ మహాసముద్రంలోని ‘దక్షిణ పసిఫిక్‌ గైర్‌' ప్రదేశంలో 20,000 అడుగుల (6,000 మీటర్లు) లోతులోని నేలలో 328 అడుగుల (100 మీటర్లు) లోపలినుంచి మట్టి అవక్షేప నమూనాలను జపాన్‌లోని ఒక శాస్త్రవేత్తల బృందం వారు గత పదేండ్ల క్రితం సేకరించారు. ‘ఇంటర్నేషనల్‌ ఓసియన్‌ డిస్కవరీ ప్రోగ్రామ్‌' తరఫున జోయిడ్స్‌ రెసొల్యుషన్‌ (JOIDES Resolution) పరిశోధక నౌకద్వారా వారు దీనిని సాధించారు. ఆ దేశంలోని ‘మెరైన్‌ ఎర్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’కి చెందిన జపాన్‌ ప్రయోగశాలలో ఈ మేరకు అధ్యయనాలు జరగ్గా, పై ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. అసలు, అంత లోతులో ప్రాణవాయువు, పోషకాలు అత్యల్ప స్థాయిలో ఉంటాయి. కనుక, 

‘సూక్ష్మజీవులు ఏమైనా మనుగడలో వున్నాయా? అలా అవి ఎంతకాలం పాటు జీవించి వుండగలవు?’ అన్న కోణంలో పరిశోధనలు మొదలుపెట్టిన వారికి నమ్మశక్యం కాని విధంగా 101.5 మిలియన్‌ సంవత్సరాల కిందటి అవక్షేపంలోనూ ‘బ్యాక్టీరియా’ వెలుగుచూసింది. ప్రయోగశాలలో పోషకాలు అందిన తక్షణం ఆ సూక్ష్మజీవులన్నీ మేల్కొన్నాయి. అంతటితో ఆగకుండా, కేవలం 68 రోజుల్లోనే అనూహ్య వేగంతో అవి అభివృద్ధి చెందడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సూక్ష్మజీవుల సంఖ్య 6,986 వుండగా, అవి నాలుగు రెట్లు పెరిగాయి.

ఆ మట్టి నమూనాలో అంత సుదీర్ఘకాలం సమాధి అయిన వాటిలో 99.1 శాతం సూక్ష్మజీవులు ప్రాణంతోనే వున్నట్టు తేలింది. అక్కడ సముద్ర గర్భనేల లోపల పోషకాలు, ప్రాణవాయువు లేకపోవడంతో అవి తమ జీవచర్యలన్నింటినీ నిలిపి వేశాయని, ప్రయోగశాలలో తాము వాటిని అందించిన తక్షణం తిరిగి శక్తిని పుంజుకొన్నాయని పై శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ ప్రాచీన జీవులు ఆధునిక సూక్ష్మజీవులతో కలిసిపోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొన్నట్టు చెప్పారు. మేల్కొన్న వెంటనే అవి నత్రజని, కర్బన పోషకాలను ఆహారంగా స్వీకరించడాన్ని వారు గుర్తించారు. “ఇంతటి కఠిన సంక్లిష్ట జీవావరణాలలో సాధారణంగా ‘ఏరోబిక్‌ బ్యాక్టీరియా’నే మనుగడ సాగిస్తుంది. ఈ జీవులు ప్రాణవాయువు (ఆక్సీజన్‌)ను పీల్చుకొని జీవించేవి” అని పై పరిశోధక బృందానికి చెందిన యూకీ మొరోనో (Yuki Morono) అన్నారు. అవి లక్ష సంవత్సరాల కాలంపాటు జీవనక్రియలు లేకుండా నిద్రావస్థలో వుండి, తిరిగి మేల్కొనడం ‘నమ్మశక్యం కాని నిజం’. ఒక చిన్న గాలి బుడగపైనే జీవించగలిగే ఈ జీవులు భౌగోళిక కాల పరిణామంలో భాగంగానే అంత లోతుల్లోని అవక్షేపాల వద్దకు చేరుకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధనా పత్రం ‘నేచర్‌ కమ్యునికేషన్‌' జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది.


logo