శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 02:52:42

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

ఓ పుస్తకాన్ని చూసిన వెంటనే ఏదో గొంతుక వినిపిస్తుంది. అది బహుశా వెయ్యేండ్ల పాతదైనా కావచ్చు. ఎందుకంటే పుస్తకాలని చదవడం అంటే కాలాన్ని దాటి వెళ్లిపోవడమే!.. -కార్ల్‌ సాగన్‌

ఓసారి రోమన్‌ వైపు... చిరాయువులు- ప్రాచీన రోమన్‌ చరిత్ర


రచయిత: డా. వి.శ్రీనివాస చక్రవర్తి

పేజీలు: 252, 

వెల: 150/-

ప్రతులకు: 94907 46614

చరిత్రను అక్షరబద్ధం చేసుకోవాలనే శ్రద్ధ చాలా తక్కువ అని భారతీయుల మీద ఓ అభియోగం ఉంది. ప్రపంచ చరిత్రలను గమనించాలనే ఆసక్తి కూడా మనలో తక్కువేనేమో! అందుకే కాలేజీలో చరిత్ర ఎప్పుడూ ఒక తక్కువస్థాయి సబ్జెక్టుగానే మిగిలిపోయింది. పోనీ చదివి తెలుసుకుందామంటే, చరిత్ర గురించి అందుబాటులో ఉన్న పుస్తకాలు కూడా చాలా అరుదు. ఈ లోటును తీర్చే ఒకానొక ప్రయత్నం ఇది. రెండువేల సంవత్సరాలకు పైగా నిలచి గెలిచిన రోమన్‌ సామ్రాజ్యాన్ని పరిచయం చేసే యత్నమిది. అదేమంత తేలిక కాదు కానీ... రాజులూ, యుద్ధాలు, వ్యూహాలు అన్నిటినీ కండ్లకి కడతారు రచయిత. రోమన్‌ సామ్రాజ్యంతోపాటు ఎదిగిన కళలు, తత్వచింతన, విజ్ఞాన విశేషాలను చెప్పుకొస్తారు. అడపాదడపా పేరు వినడమే కానీ, వివరం తెలియని సీజర్‌, కలిగులా, కాంస్టాంటిన్‌, ట్రేజన్‌ల జీవితకథలతో అబ్బురపరుస్తారు. మధ్యమధ్యలో కనిపించే చిత్రాలు, పుస్తకాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. చదవాల్సిన పుస్తకం ఇది. 

తెలుసుకోవాల్సిన భావజాలాలు


పది భావజాలాలు

ఆంగ్లమూలం: ఎస్‌.జైపాల్‌రెడ్డి, 

అనువాదం: కల్లూరి భాస్కరం

పేజీలు: 330, వెల: 460/-

ప్రతులకు: ప్రముఖ పుస్తకకేంద్రాలు

‘చదవటం వ్యక్తికి సంపూర్ణతను తెచ్చి పెడుతుంది; సంభాషణ మనిషిని ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంచుతుంది; రచనే మనిషిని నిజమైన మనిషిగా మారుస్తుంది’ అంటారు ప్రముఖ తత్వవేత్త ఫ్రాన్సిస్‌ బేకన్‌. ఈ మాటను తన పుస్తకంలో ప్రస్తావించిన జైపాల్‌రెడ్డి, తనే ఆ వాక్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు. మేధావిగా, వక్తగా, రచయితగా తనేమిటో గుర్తుచేస్తారు. ‘టెన్‌ ఐడియాలజీస్‌' పేరుతో ఆయన రాసిన పుస్తకానికి అనువాదమే ఇది. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీవాదం, స్త్రీవాదం... అంటూ పది ముఖ్యమైన వాదాల మీద లోతైన విశ్లేషణ అందిస్తారు. చాలా క్లిష్టమైన విషయాలుగా తోచే ఈ అంశాలు, రచయిత ఎంచుకున్న శైలి కారణంగా సులభంగా అర్థమవుతాయి. మధ్యమధ్యలో ఆయా వాదాలకు సంబంధించిన ఉటంకింపులు, గణాంకాలు కథనానికి బలం చేకూరుస్తాయి. ఇప్పటి యువతకు రాజకీయ పరిజ్ఞానం తక్కువనే వాదనను దూరం చేసుకోవాలంటే, ఈ పుస్తకాన్ని చదవాల్సిందే!

ఔషధ గుళికలు ఈ కథలు... మనసుకు చికిత్స


చన: డా॥ లక్ష్మీ రాఘవ

పేజీలు: 164 వెల: రూ.100/-

ప్రతులకు: 94401 24700

కథలు ఎక్కడి నుంచో పుట్టుకురావు. అనుభవంలో నుంచి తొంగి చూస్తాయి. వాటిని అంతే అందంగా తీర్చిదిద్దగలిగితే ప్రతి కథా ఓ ఔషధ గుళిక అవుతుంది. చదివిన వారి మనసుకు ఊరట లభిస్తుంది. ‘మనసుకు చికిత్స’ కథల సంకలనంలో ఉన్న 27 కథలూ ఇలాంటివే. పిల్లల మనస్తత్వాలు, పెద్దల ఉద్దేశాలు, ఒత్తిళ్లు, ఆ పరిణామాలను హృద్యంగా, పఠనాసక్తిని రేకెత్తించే విధంగా రాశారు రచయిత్రి. ‘ఒక సమస్యను అవతలి వ్యక్తుల కోణంలోంచి చూస్తే.. సమాధానాలు సానుకూలంగా మారతాయ’ని తెలిపే మొదటి కథ సారాంశం సదా ఆచరణీయం. ఊహాతీతమైన కల్పనలు, అతిశయోక్తులు లేకుండా సరళంగా సాగిపోయే కథలు గుండెను హత్తుకుంటాయి. కథలు చదివేటప్పుడు పాఠకుడి మనసు పొరల్లో అందులోని పాత్రలు కనిపించాలి. అవి పలికే మాటలు వినిపించాలి. వాటినే మంచి కథలుగా చెబుతారు. ఈ విషయంలో రచయిత్రి నూటికి నూరుపాళ్లూ సఫలీకృతురాలు అయ్యారు.