ఆదివారం 01 నవంబర్ 2020
Sunday - Sep 20, 2020 , 03:40:52

ఆ పాటే ఓ విప్లవం

ఆ పాటే ఓ విప్లవం

తెలంగాణ గడ్డ మీద పాటలతో దరువులేసిన ప్రజాకవి, సినీగేయ రచయిత గూడ అంజయ్య. అచ్చమైన తెలంగాణ యాస, పలుకు బళ్ళు, పల్లెపదాల సోయగం అతని పాటల్లో పొంగిపొరలుతాయి. ఉద్యమ గీతాల రచయితగా అతనికి ప్రత్యేకమైన స్థానముంది. ‘రంగుల కల’(1982) సినిమాలోని ‘భద్రం కొడుకో’, ‘ఎర్రసైన్యం’(1994) లోని ’ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా’, ‘ఒసేయ్‌ రాములమ్మ’(1997) లోని ’లచ్చులో లచ్చన్న ’ మొదలైన పాటలు ఇప్పటికీ మనల్ని ఉత్తేజపరుస్తుంటాయి. ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. మనిషి మనిషిలోని నిసత్తువను ఆవిరి చేసి చైతన్యాన్ని రగిలిస్తూనే ఉంటాయి.

ప్రజా గాయకుడిగా, కవిగా, సినీగేయ రచయితగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారునిగా పేరు పొందిన గూడ అంజయ్య అసలు సిసలైన ప్రజాకవి. ఒక ధిక్కార స్వరం. ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామంలో 1955, నవంబర్‌ 1న లక్ష్మయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన అంజయ్య చిన్నతనం నుంచే, పనిపాటల్లో భాగంగా తల్లిదండ్రులు పాడే పాటలు విని పాటపై మక్కువ పెంచుకున్నారు. పల్లె వాతావరణంలో పెరిగిన ఆయన స్వచ్ఛమైన పల్లెయాసలో పాటలు అల్లి అందరి చేత భళా అనిపించుకున్నారు. ప్రజల భాషలోనే, వారి బాధలనే వారి జీవన పరిస్థితుల ఆధారంగానే పాటల రచన చేస్తూ ముందుకు సాగారు. అంజయ్య వృత్తిరీత్యా వైద్యులు. ఏ రోగానికి ఏ మందు రాయాలో ఆయనకు తెలుసు. ప్రవృత్తి రీత్యా కవి. అవినీతి,అక్రమాలతో అనారోగ్యం పాలైన సమాజానికి తన పాటలతో మందు రాసి, వైద్యం చేయడమూ తెలుసు.

పదహారు భాషల పాట

తొలి దశలో ప్రజానాట్యమండలి, అరుణోదయ కళా సంస్థల ద్వారా తన గళాన్ని ప్రపంచానికి వినిపించారు అంజయ్య. తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకులుగా కూడా పనిచేశారు. అప్పట్లో మహాకవి శ్రీశ్రీ తో కలిసి సభల్లో పాల్గొనేవారు. 1982లో ’రంగుల కల’ సినిమాలో - ‘భద్రం కొడుకో నా కొడుకో కొమురన్న/ జెర పైయిలం కొడుకో నా కొడుకో కొమురన్న’ పాటతో గీత రచయితగా పరిచయమయ్యారు. పల్లెల్లో దొరల కాళ్ళ కింద నలిగి, పొట్ట చేత పట్టుకుని పట్టణానికి వలసపోవాలనుకునే పేదవాళ్ళకి... పట్నంలో కూడా అలాంటి దోపిడీ దారులే ఉంటారని అంజయ్య చేసిన హెచ్చరికే ఈ పాట. ‘ఎర్ర సైన్యం’(1994)లో రాసిన  ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా’ అనే పాటలో శ్రమజీవులంతా ఏకమై దోపిడీ వ్యవస్థను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ పాట ఏకంగా 16 భాషల్లోకి అనువాదమైంది. 1980లో హైదరాబాద్‌ లో జరిగిన ఆసియా-ఆఫ్రికన్‌ దేశాల రచయితల సదస్సులో ఈ పాటను విని ఆ సమావేశానికి హాజరైన ప్రతినిధులు అప్పటికప్పుడే వారి భాషల్లోకి అనువాదం చేసుకునేలా ప్రేరేపించింది. ఇంకా ‘ఒసేయ్‌ రాములమ్మ’ (1997)లోని ‘లచ్చులో లచ్చన్న ఈ బచ్చాగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయె’, ‘చీమలదండు’(1995)లోని ‘యిగ ఎగబడుదామురో’, ‘తెలంగాణ గట్టు మీద సందమామయ్యో ’, ‘అరణ్యం’(1996)లోని ‘ఓ - కొండల్లారా!’, ‘వాలేకుమ్‌ సలామాలేకుమ్‌', ‘ఎయ్యర దరువెయ్యర’, ‘అడవిలో అన్న’(1997)లోని ‘బాంచేను కాల్మొక్కుతానే’, ‘తిరుగబడ్డ తెలంగాణ’,‘దున్నెటొనిదే భూమిరా’,‘దళం’(1996)లోని ‘పల్లెకె మా పల్లెకొచ్చిన’,‘స్వర్ణక్క’(1998)లోని ‘ఓ దొర ఓ మాదొరో’,‘రాజన్న...రాజిగో’ వంటి పాటల్లో కష్టజీవుల గోస కనిపిస్తుంది. తిరుగుబాటు కాంక్ష, తెలంగాణ సాకారం కావాలన్న బలమైన ఆకాంక్ష చెలరేగుతుంది.

ఉద్యమానికి ఊపు

ఆయన పాటల్లో తెలంగాణ ప్రజల జీవిత గాథలు కోకొల్లలుగా వినబడతాయి. అణచివేయబడ్డ గొంతులు పిడికిలెత్తి కనబడతాయి. ‘సింగన్న’(1997)లోని ‘ఎయ్యిరో సింగన్నెయ్యిరో’, ‘దొంగలు-దొంగలు’, ‘చీకటి సూర్యులు’ (2000)లోని ‘ఏం దునియా’ వంటి పాటలు గుండెని రగిలిస్తాయి. ‘దండోర’(1993), ‘తెలుగోడు’(1998), ‘కూలన్న’(2000), ‘భీముడు’ (2000), ‘రైతురాజ్యం’(2000), ‘అమ్ములు’(2003) మొదలైన సినిమాల్లో ఆయన రాసిన గీతాలు అన్యాయం అలుముకున్న సమాజంపై ప్రశ్నల్ని సంధించిన బాణాలే. తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో ఆయన పాటలే ఉద్యమానికి ఊపునిచ్చాయి. ‘ఛలో అసెంబ్లీ’(2003)లోని ‘గజ్జెలు గజ్జెలు రెండు గజ్జెలో రాజయ్య’, ’వేగుచుక్కలు’(2005)లోని ‘అసలేటి వానల్లో ముసలెడ్ల’ వంటి పాటలు ప్రజల్లో విప్లవాన్ని రేకెత్తించాయి.. ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించడం విశేషం. అంజయ్య ప్రైవేటు గీతాలు కూడా ప్రత్యేకమైన గుర్తింపును పొందాయి. తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో రాసిన ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా?’ అనే పాట ఎంత జనాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. తన పాటలతో పోరాట కెరటమై ఎగిసిన గూడ అంజయ్య 2016 జూన్‌ 21న మరణించారు.