సినిమా కష్టాలు ఎదురుకాలేదు!

Sep 20, 2020 , 03:24:01

సుహాస్‌...పేరులోనే హాస్యాన్ని కలబోసుకున్న ఈ యువనటుడు యూట్యూబ్‌ వేదికగా తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచాడు. లఘుచిత్రాలద్వారా ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల్లో చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. చూడగానే పక్కింటి అబ్బాయిలా..చిన్ననాటి మిత్రుడిని స్ఫురింపజేసే సుహాస్‌ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ‘కలర్‌ఫొటో’ చిత్రం ద్వారా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సుహాస్‌ ‘బతుకమ్మ’తో ముచ్చటిస్తూ పంచుకున్న సంగతులివి..

నాకు చిన్నప్పటి నుంచి నటన, డ్యాన్స్‌ అంటే చాలా ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుతున్న టైమ్‌లో యూత్‌ఫెస్టివల్స్‌తోపాటు కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ఓ రోజు స్టేజీమీద చిన్న స్కిట్‌ ప్రజెంట్‌ చేశాను. ‘నీ వాయిస్‌, కామెడీ టైమింగ్‌ చాలా బాగున్నాయి. ఇక నుంచి రెగ్యులర్‌గా స్కిట్స్‌ చేస్తే బాగుంటుంది’ అంటూ నా మిత్రులు ప్రోత్సహించారు. కొత్త టాపిక్స్‌ తీసుకొంటూ వాటికి నాదైన శైలి హాస్యం జోడించి స్కిట్స్‌ చేస్తుండేవాడిని.  ఆ క్రమంలో నా మీద నాకే మంచి విశ్వాసం ఏర్పడింది. నటనలోనే జీవితాన్ని వెతుక్కోవాలనే లక్ష్యంతో ఓ రోజు హైదరాబాద్‌ పయనమయ్యాను. తొలుత షార్ట్‌ ఫిల్మ్స్‌తో గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘చాయ్‌ బిస్కెట్‌' యూట్యూబ్‌ చానల్‌లో చేసిన వీడియోలు రెండు తెలుగు రాష్ర్టాల్లో పాపులర్‌ అయ్యాయి.  ‘పడి పడి లేచె మనసు’ చిత్రం ద్వారా నటుడిగా చిత్రసీమలోకి అరంగేట్రం చేశాను.

‘చాయ్‌ బిస్కెట్‌' మలుపు తిప్పింది

నేను చాయ్‌బిస్కెట్‌ యూట్యూబ్‌ చానల్‌ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానమైన లఘు చిత్రాలు రెండు రాష్ర్టాల్లో పాపులర్‌ అయ్యాయి. ఆ గుర్తింపుతోనే సినిమాల్లోకి రాగలిగాను. ముఖ్యంగా ‘అతిథి’, ‘కళాకారుడు’ అనే లఘుచిత్రాలతో మంచి పేరొచ్చింది. సోషల్‌మీడియా ద్వారా అవి కొన్ని లక్షల మందికి చేరువయ్యాయి.  తొలుత ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలే ఉత్తమ మార్గమనిపించింది. అందుకే కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా కామెడీ ప్రధానంగా వీడియోలు చేశాను. ఆ తర్వాత షార్ట్‌ఫిల్మ్స్‌పై దృష్టిపెట్టాను.  ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఒకే మూసకు పరిమితం కావద్దు

సినిమాల్లో నా నటన..సంభాషణలు పలికే విధానం, కామెడీ టైమింగ్‌ విషయంలో దర్శకుడి ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాను. ఎక్కడైనా ఇంప్రూవైజేషన్‌ అవసరమనిపిస్తే దర్శకుడి అనుమతి తీసుకొని నా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారు. వారు సమ్మతిస్తే మార్పుల్ని సూచిస్తాను. ఏ పాత్ర చేసినా దానికి వందశాతం న్యాయం చేయాలని నమ్ముతాను. పాత్రలపరంగా ఏదో ఒక మూసకు పరిమితమైపోవాలనుకోవడం లేదు. నా మనసుకు నచ్చిన..సినిమా కథాగమనంలో ప్రభావవంతమైన పాత్ర ఏదైనా సరే సంతోషంగా అంగీకరిస్తా. ‘కలర్‌ఫొటో’ చిత్రంలో కూడా నా పాత్ర ఓ ప్రధాన క్యారెక్టర్‌లాగానే ఉంటుంది తప్ప...హీరో ఛాయలు కనిపించవు. ఒక సినిమా చేస్తే ఆ పాత్ర ప్రేక్షకులకు తప్పకుండా  గుర్తుండిపోవాలి. ఏదో అలా కొద్దిసేపు కనిపించిపోయాం అనే తరహాలో పాత్రలు ఉండకూడదని నా అభిప్రాయం. ప్రస్తుతం ఫ్రెండ్‌ రోల్స్‌ కూడా ఫుల్‌లెంగ్త్‌ ఉన్నవే వస్తున్నాయి.

విజయ్‌ దేవరకొండతో మంచి స్నేహబంధం

‘డియర్‌ కామ్రేడ్‌', ‘మజిలీ’ చిత్రాలు నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చాయి. ‘డియర్‌ కామ్రేడ్‌' షూటింగ్‌ అంతా సరదాగా గడచిపోయింది. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, చిత్ర దర్శకుడు భరత్‌ కమ్మ...మేమందరం ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. ఇప్పటికీ విజయ్‌తో చక్కటి స్నేహసంబంధాలు కొనసాగుతున్నాయి. వీలున్నప్పుడు కలుసుకుంటాం. ‘కలర్‌ఫొటో’ సినిమా టీజర్‌ను విజయ్‌ దేవరకొండ రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ను నాని అన్న విడుదల చేశారు. నేను ఏ సినిమాకు పనిచేసినా ఆ చిత్ర బృందంతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తాను.

యూట్యూబ్‌ వేదికగా..

పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నాకు ‘సినిమా కష్టాలు’ ఏమీ ఎదురుకాలేదు. ఎందుకంటే నేను హైదరాబాద్‌కు వచ్చిన టైమ్‌లో సోషల్‌మీడియా, యూట్యూబ్‌ చానల్స్‌ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.  ఎవరి దగ్గరికో వెళ్లి అవకాశాల కోసం ఎదురుచూడటం వృథా అనిపించింది. సోషల్‌మీడియా ద్వారా మన ప్రతిభ ఏంటో  నిరూపించుకోవచ్చు కదా అనుకున్నా. అదృష్టం కొద్ది మంచి మిత్రులు కూడా పరిచయమయ్యారు. దాంతో నేను సొంతంగా షార్ట్స్‌ ఫిల్మ్స్‌ చేయడం మొదలుపెట్టాను. వాటితో లభించిన గుర్తింపే సినిమాల్లో అవకాశాల్ని కల్పించింది. ప్రస్తుతం ఉన్న వినోద మాధ్యమాల దృష్ట్యా మన టాలెంట్‌ నిరూపించుకోవాలంటే ఎన్నో వేదికలు అందుబాటులో ఉన్నాయి.

నెగెటివ్‌ ఛాయలున్న పాత్ర చేస్తున్నా..

నేను  షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించాను. వెబ్‌సిరీస్‌లు చేశాను. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నా. ఈ మూడు వేదికలు నాకు సౌకర్యవంతంగానే అనిపించాయి. లఘు చిత్రాల్లో నటించడాన్ని ఎంతగా ఆస్వాదించానో  సినిమాల్ని కూడా అదే ఫీల్‌తో చేస్తున్నా. ఎస్వీ రంగారావుగారు అభిమాన నటుడు. ఆయన ఎలాంటి పాత్రకైనా ప్రాణప్రతిష్ఠ చేసేవారు. నేను కూడా ఏ పాత్ర పోషించినా దానికి పూర్తిగా న్యాయం చేయాలనుకుంటాను. ప్రస్తుతం ఓ సినిమాలో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రను చేస్తున్నా. నటుడిగా పెద్ద లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. ‘సుహాస్‌ బాగా నటిస్తాడు’ అనే గుర్తింపును సంపాదించుకుంటే చాలనుకుంటున్నా.

సరికొత్త అనుభూతి

ప్రస్తుతం నేను కథానాయకుడిగా నటిస్తున్న ‘కలర్‌ఫొటో’ చిత్రాన్ని ఓ  వినూత్నమైన కథతో తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర చిత్రణ నవ్యమైన పంథాలో ఉంటుంది. హీరోగా నటిస్తున్నాననే భావనతో కాకుండా పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉన్న మంచి పాత్ర దొరికిందనే సంతృప్తితో సినిమా చేశాను. నేను యూట్యూబ్‌ వీడియోలు, లఘు చిత్రాలు చేసిన మిత్రబృందం ఈ సినిమాలో భాగం కావడంతో అందరం కలిసి మంచి సినిమా ఇవ్వాలనే తపనతో పనిచేశాం. శరీర ఛాయ ఆధారంగా సమాజంలో చూపించే వివక్ష అనే పాయింట్‌మీద ఈ చిత్రకథ నడుస్తుంది. అదేమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD