గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Sep 20, 2020 , 03:22:56

మానవత్వానికి మార్గం

మానవత్వానికి మార్గం

ఆకలి విలువ తెలిసినప్పుడే అన్నం  విలువ తెలుస్తుంది.  అమీర్‌ అయినా, కూలి పని చేసుకొనే గరీబ్‌ అయినా జానెడు పొట్ట నింపుకోనిదే పూట గడవదు. కానీ  ఈ ఒక్క పూట కూటి కోసం రోజూ  వేల మంది  బాధపడుతున్నారని అంటున్నాడు మల్లేశ్వర్‌రావు. వందల మంది పస్తులుంటూ అల్లాడుతున్నట్టు చెబుతున్నాడు. చిన్నతనంలోనే తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నాడితను. ఖాళీ కడుపుతో కాలేజీకి వెళ్లి, చదువుకొని నేడు వేల మంది ఆకలిని అర్థం చేసుకోగలిగాడు.  గత పదేండ్లుగా వీధి బాలలు, అనాథలకు ఆహారాన్ని అందించడం కోసం నిరంతరం పని చేస్తున్నాడు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆహార పంపిణీ చేస్తున్న ఈ యువకుని లైఫ్‌ జర్నీ ఈ వారం.

అమ్మమ్మ వాళ్ల ఊర్లో వ్యవసాయం చేసేవాడు నాన్న. నాకప్పుడు ఐదేండ్లు. అప్పుడప్పుడే నాన్న వెంబడి పొలానికి వెళ్లేవాడిని.  కొంత సొంతభూమి, మరికొంత కౌలుకు తీసుకొని పదెకరాల్లో పండించేది.  దాని కోసం అప్పు చేశాడు నాన్న.  ఆ ఏడాది  వర్షాలు కూడా అనుకూలించాయి. సంతోషించాడు నాన్న. పంట బాగా పండింది. చేతికొచ్చే సమయం రానే వచ్చింది. మళ్లీ వర్షం కురిసింది. ఎంతా అంటే.. పంటను ముంచేసేంత.. బతుకును మార్చేసేంత.  ఏ వర్షం అయితే పంటను చేతికిచ్చిందో అదే వర్షం నోటి కాడి బుక్కను లాగేసుకున్నట్టు చేసింది.  ఆ ఒక్క వర్షంతో మా కుటుంబం కోలుకోలేని దెబ్బ తిన్నది. మాది రాజమండ్రి. అమ్మమ్మ ఊరు నాగ్‌పూర్‌. అక్కడే వ్యవసాయం చేశాం. ఆ ఒక్కరోజు వాన మమ్మల్ని వలస బాధితులను చేస్తుందని ఊహించలేదు. నాగ్‌పూర్‌ నుంచి అంతా సర్దుకొని నిజామాబాద్‌కు మకాం మార్చేశాం. 

 1999 బాన్సువాడలోని వర్ని 

మా వలస జీవితం ప్రారంభమైన రోజు. నేను చాలా చిన్నవాడిని. జీవితం ఎలా ఉండబోతున్నదో తెలియదు. వర్నీలో ఓ చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని ఉన్నాం. నాన్న పొద్దున పనికి వెళ్తే తప్ప మాకు అన్నం దొరికేది కాదు. పండుగొచ్చిన ప్రతిసారి కూలి పని దొరక్కపోయేది. దీంతో మాకు పండుగంటే గుప్పెడు భయం. ఆ రోజు పని ఉండదు. దీంతో మేము పస్తులుండాల్సి వచ్చేది.  కొద్ది రోజులకు నేను ఓ హోటళ్లో పనికి చేరాను.  అక్కడి నుంచి మెల్ల్లగా పొద్దున పూట  గవర్నమెంట్‌ స్కూల్‌కి వెళ్లేవాడిని. ఒకరోజు స్కూల్‌ శివారులోని రామాలయం దగ్గర  ఆడుకుంటూ హోటల్‌కు వెళ్లకుండా ఆగిపోయాను.  విషయం ఓనర్‌కు తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి పనిలోకి రానందుకు చితకబాదాడు.  ‘చదువుకోవాలనుంది, ఆడుకోవాలనుంది’ అని వెక్కివెక్కి ఏడ్చాను.  ఈ విషయం మా స్కూల్‌ టీచర్‌ ఒకతను గమనించాడు. వీలు చూసుకొని మా ఇంటికి వచ్చాడు. వివరాలు కనుక్కొని ‘సంస్కార్‌ ఆశ్రమ విద్యాలయం’లో చేర్పించాడు.  అక్కడ నాకు బట్టలు, పుస్తకాలు, భోజనం ఇచ్చేవారు. నా ఆకలి తీరినా.. ఇంటి దగ్గరి పరిస్థితులు ఆలోచించాల్సి వచ్చింది. పదో తరగతి వరకూ అక్కడ చదివాను. 2009లో నా పదో తరగతి ఆ స్కూల్‌ నుంచి అయిపోయింది.  

ఇంటర్‌లో ఎంపీసి చేయాలనుకున్నాను. వర్నీ ప్రభుత్వ కళాశాలలో చేరాను. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో రూమ్‌ సర్వీస్‌ కింద పని చేశాను.  ఇంటర్‌ అయ్యాక ఎంసెట్‌ కట్టాను. అదే ఆశ్రమంలో ట్రెయినింగ్‌ తీసుకున్నాను. అనుకున్నట్టుగానే ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. సీబీఐటీలో సీటు. కానీ అందులో చేరడానికి మనసొప్పలేదు.  ఎందుకంటే నేను వేసుకొనేవి అన్నీ సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులు. 

 రెండో కౌన్సెలింగ్‌ ద్వారా  ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీలో చేరాను. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగం. బీటెక్‌ చదువాలంటే అప్రాన్‌, డ్రాఫ్టర్లు కనీస అవసరాలు అని నాకు అప్పుడే తెలిసింది. వాటిని కొనాలంటే ఐదారువేల పైనే ఖర్చు అవుతుంది.  అవి లేకుండా కాలేజీకి వెళ్తే క్లాస్‌ బయట నిలబెట్టారు. దీని గురించి ఇంట్లో చెప్పుకోలేను, డబ్బులు అడుగలేను.  ఎలాగైనా డ్రాఫ్టర్లు , అప్రాన్‌ను కొనాలనుకున్నాను.   ‘క్యాటరింగ్‌' నాకు కాంతిరేఖలా కనిపించింది.  హాస్టల్‌ నుంచి స్నేహితులతో కలిసి క్యాటరింగ్‌ పనికి వెళ్లాను. అక్కడ నిర్వాహకులు పబ్బులో వెయిటర్‌గా తీసుకున్నారు. పబ్బులో నాకు ఆ రోజు వచ్చిన టిప్పు రూ. ఐదు వేలు.  తెల్లవారే డ్రాఫ్టరు, ఆప్రాన్‌ కూడా వచ్చేశాయి. 

క్యాటరింగ్‌కు వెళ్లడం నిత్యకృత్యం అయింది. ఈ క్రమంలో నాకు అర్థమైంది ఒక్కటే..  ఫంక్షన్‌లో మిగిలిన ఆహారం తీవ్రంగా వృథా అవుతున్నది. అలా కావొద్దని స్నేహితులతో చర్చించాను. నేనూ, స్నేహితులు అనేకసార్లు పస్తులున్న సంగతి గుర్తు చేశాను. మనలా ఎవరూ ఉండొద్దని, ఆ ఫుడ్‌ను పంచుదాం అని వారితో అన్నాను. కొందరు స్పందించారు. మొదటిసారి ఓ ఫంక్షన్‌లో మిగిలిన ఆహారాన్ని  సికింద్రాబాద్‌ రైల్వే రోడ్డులో వంద మందికి పైగా పంచాం.  ఆకలి కోసం ఎంతమంది అలమటిస్తున్నారో ఆరోజే నేను కండ్లారా చూశాను. మేమిచ్చే ఒక్క ప్యాకెట్‌ వారి ఎన్నాళ్ల ఆకలిని తీరుస్తుందో తల్చుకొంటే నాకు నా జీవితం గుర్తుకువచ్చింది.  తర్వాత ఆహార పంపిణీ కొనసాగింది. తర్వాత హోటల్స్‌కు వెళ్లి అక్కడ మిగిలిన ఆహారం తెచ్చాం. రోజూ ఐదు వందల మందికి పైగా అందించాం.  హైదరాబాద్‌లోని స్లమ్స్‌లో  పిల్లలు ‘మేం చదువుకుంటాం’ అన్నారు. స్నేహితులతో కలిసి వారికి చదువులు చెప్పాం. గచ్చిబౌలి, క్యూసిటీ,  గోపీచంద్‌ అకాడమీ శివారులో ఉన్న బస్తీ పిల్లలకు పాఠాలు చెప్పాం.  సోషల్‌ మీడియా గ్రూప్‌ల ద్వారా మాకు వలంటరీల సాయం దొరికేది.  2011 నుంచి నేటి వరకూ రోజూ ఐదు వందల నుంచి రెండు వేల మందికి ఆహారాన్ని అందిస్తున్నాం. 

తాజాగా  లాక్‌డౌన్‌లో మా బాధ్యత మరింత పెరిగింది.   సిటీ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నాను. చాలామంది విరాళాలు ఇచ్చేవారు. వాటితో  70వేల మందికి నిత్యావసరాలు అందించాం. ఓ కంపెనీ  25 కార్లు, 4 ట్రక్కులు అవసరం కోసం  ఇచ్చింది. వాటి సాయంతో ఓఆర్‌ఆర్‌ వైపు పేదలకు ఆహారాన్ని అందించాం.  లాక్‌డౌన్‌లో రైతులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. నకిరేకల్‌, నాగార్జున సాగర్‌ నుంచి 45 టన్నులు నారింజ పండ్లను  పంపిణీ చేశాను.  వలస కార్మికులకు చెప్పులు, గుడ్లు, ఫుడ్‌ ప్యాకెట్లు, పీపీఈ కిట్లు, మాస్కులు అందించాం. సుమారు  రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే సరుకులను పంపిణీ చేశాం. 

మా గ్రూప్‌ ‘కనెక్ట్‌ హోప్‌' ..

‘కనెక్ట్‌ హోప్‌' అనే   ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా అనేక కార్యక్రమాలు చేశాను. దీనికి ప్రత్యేకంగా  గ్రూప్‌ ఉంది. హైదరాబాద్‌,      విజయవాడ, విశాఖ, రోహతక్‌, ముంబై, పూణె, డెహ్రాడున్‌లో వలంటరీలు స్పందిస్తున్నారు.  ప్రస్తుతం కరోనా మృతదేహాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌, నల్గొండలలో 50 శవాలకు అంత్యక్రియలు నిర్వహించాం.  హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి హెల్ప్‌ లైన్‌ సెంటర్లు పెట్టాను.  గాంధీ, ఉస్మానియాల పరిధిలో రోగులకు అంబులెన్సులను అందుబాటులో ఉంచాం. లాక్‌డౌన్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ప్రారంభించింది నేనే కాబట్టి, మధ్యలో ఆపేస్తే నష్టాన్ని నేను ఊహించగలను. అందుకే ఏది ఏమైనా  అవసరం ఉన్న వారికి అండగా ఉండటం, ఆకలి తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న. ‘కనెక్ట్‌ హోప్‌' మానవత్వం ఉన్న అందరినీ కలుపుతుందనే నమ్మకం ఉంది. 


logo