నూటొక్క దేవాలయాల పొట్లపల్లి

Sep 20, 2020 , 02:59:35

రెండు దశాబ్దాల కిందటి వరకు అది మామూలు పల్లె. ఆ ఊరికి వెళ్లేందుకు దారి కూడా సరిగ్గా ఉండేది కాదు. అలాంటి గ్రామం ఇప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఊళ్లో ఏ మూలన తవ్వినా ఓ అపురూప శిల్పం బయల్పడుతున్నది. చరిత్రకారుల పరిశోధనతో ఆ కుగ్రామంలో చోళులు, కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు వెలుగుచూశాయి. ఒకప్పుడు నూటొక్క దేవాలయాలతో అలరారిన ఊరు ఇది.


సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలో ఉంటుంది పొట్లపల్లి గ్రామం. రేణుకా నది తీరాన ఉన్న ఈ పల్లె పొలిమేర మొదలు అడుగడుగునా ఆలయాల ఆనవాళ్లు  పలకరిస్తుంటాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.శ. 1055-75 మధ్య కాలంలో పశ్చిమ చాళుక్య రాజు అయిన త్రైలోక్య మల్లన్న దేవారాయ కాలంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో శివాలయాలు నిర్మించారన్న సంగతి శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు హయాంలోనూ ఈ గ్రామం ఆలయాలతో పరిఢవిల్లిందని చెబుతున్నారు.

శైవమతానికి పట్టుగొమ్మ

పొట్లపల్లి పరిసరాల్లో ఎక్కడ తవ్వినా శిలాశాసనాలు, దేవీదేవతా విగ్రహాలు, శివలింగాలు, బుద్ధుడి మూర్తులు, జైన తీర్థంకరుల విగ్రహాలు బయల్పడుతుంటాయి. కొత్తగా నిర్మించిన శివాలయ గోపురం కోసం తీసిన పునాదిలో సుమారు 500 ఏండ్ల నాటి గాజుబావి బయటపడింది. పలు చోట్ల శైవమతానికి చెందిన ఆధారాలు ఎక్కువగా లభిస్తుండటంతో ఇక్కడ శైవం విరాజిల్లిందని చెబుతుంటారు. బౌద్ధ, జైన మతాలు సైతం ఉనికిని చాటుకున్నట్లు గుర్తించారు. 

ఎక్కడ చూసినా సర్పరాజులే

గ్రామ శివారులోని ఎల్లమ్మగుట్ట(బోడగుట్ట) చుట్టుపక్కల ఎక్కడ చూసినా నాగదేవతల విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. పెద్ద పెద్ద రాళ్లపై మనిషి ముఖం, సర్పదేహంతో ఉన్న మూర్తులు కనిపిస్తాయి. 11 పడగలతో ఖడ్గం, కిరీటం ధరించిన విగ్రహాన్ని నాగరాజుగా, ఏడు తలలతో కనిపించే విగ్రహాన్ని యువ నాగరాజుగా, మూడు తలల మూర్తిని యువరాణిగా స్థానికులు భావిస్తుంటారు. గుట్ట గుహలోని ఎల్లమ్మ విగ్రహం ఇప్పటికీ పూజలు అందుకుంటున్నది. గుట్టపైన శిథిలమైన వినాయకుడు, ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయి. రేణుకానది ఒడ్డుతోపాటు గుడిబండలు, చింతతోపు, దామెరకుంట, బోడగుట్ట, మైసంబొత్తాలు, నాగులగడ్డ తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పురాతన విగ్రహాలు, శిల్పాలు తారసపడుతూనే ఉంటాయి. అంతేకాదు, ఆలయాలు నిర్మించే కాలంలో పొట్లపల్లి శివారులో శిల్పుల కోసం భారీగా పందిళ్లు వేసేవారట. అక్కడే శిల్పాలు చెక్కేవారట. కాలక్రమంలో ఆ ప్రాంతమే పందిల్ల గ్రామంగా రూపుదిద్దుకుందని చెబుతారు.

శివయ్యకు కొత్త గుడి


రెండు దశాబ్దాల కిందట ఇక్కడ పురాతమైన శివలింగం బయటపడింది. రేణుకానది ఒడ్డున కొత్త ఆలయం నిర్మించి దానిని పునఃప్రతిష్ఠించారు. రాజరాజేశ్వరుడిగా స్వామిని పూజిస్తున్నారు. రోడ్డు, ఇతర మౌలిక వసతులు మెరుగవ్వడంతో ఈ ఆలయానికి భక్తుల రద్దీ కూడా పెరిగింది. మహాశివరాత్రికి పెద్ద ఎత్తున జరిగే జాతరకు హుస్నాబాద్‌తోపాటు కరీంనగర్‌, సిద్దిపేట, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.

రాకాసిగూళ్లు


ఎల్లమ్మగుట్ట, రేణుకా నది తీరానగల చిట్టడవుల్లో ఆదిమానవులకు సంబంధించిన రాకాసి గూళ్లు దర్శనమిస్తాయి. ఈ ప్రాంతంలో ఆదిమానవులు కూడా జీవనం సాగించారని చెప్పకనే చెబుతాయి ఈ రాకాసిగూళ్లు. నాగరికత నిర్మాణానికి నదీ పరీవాహక ప్రాంతాలే చిరునామాలు. ఈ క్రమంలో రేణుకా నది తీరంలోనూ ఆదిమానవులు జీవనం సాగించి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆ నది ఉప్పొంగడం వల్ల పురాతన కాలంలో గ్రామం అంతా ముంపునకు గురై ఆలయాలు, శిల్పకళా వైభవం మొత్తం భూగర్భంలో కలిసి పోయిందని, ఆ తర్వాత పొట్లపల్లి పేరుతో ఈ గ్రామం మళ్లీ రూపుదిద్దుకొని ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. మరింత లోతుగా పరిశోధనలు సాగిస్తే.. మరిన్ని అద్భుత విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD