మనుషులంతా అంతమైతే!

Sep 20, 2020 , 02:52:13

ఈ అనంత విశ్వంలో లక్షలాది నక్షత్రాలు ఉన్నాయి. వాటిచుట్టూ కోట్ల సంఖ్యలో గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. కానీ, ప్రాణులు జీవించడానికి వీలైనది ఇప్పటి వరకైతే ఒక్క భూగ్రహం మాత్రమే. ఈ భూమిపైన ఉన్న కోటానుకోట్ల జీవుల్లో అత్యంత తెలివైన వాడు మనిషి ఒక్కడే. ప్రస్తుతం ఈ అరుదైన గ్రహాన్ని శాసిస్తున్నవాడూ అతడే. మరి అలాంటి మనిషి ఒక్కసారిగా మాయమైపోతే! మానవజాతి మొత్తం అంతరిస్తే!

భూమిపైన మనిషి అనేవాడు లేకుండా పోయిన కొన్ని గంటల్లోనే ప్రకృతి తిరిగి ప్రాణం పోసుకుంటుంది. మనిషి చేసిన గాయాన్ని తనకు తానుగా మాన్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఒక్కరోజు గడిచే సరికే కరెంటు ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు పనిచేయడం ఆపేస్తాయి. వారం పది రోజుల్లోనే భూగర్భ రైళ్లు, గనులు నీటిలో మునిగిపోతాయి. నెల తర్వాత నిర్వహణలేని న్యూక్లియర్‌ రియాక్టర్లలోంచి ప్రమాదకరమైన రేడియం బయటకు వస్తుంది. ఫలితంగా అనేక జీవులు క్యాన్సర్‌బారిన పడి చనిపోతాయి. ఏడాది తర్వాత భూమిపై ఉన్న నగరాలు శిథిలం అవ్వడం ప్రారంభిస్తాయి. దశాబ్దం తర్వాత భూమిపైన కాలుష్యం అనేది లేకుండా పోతుంది. గాలీ, నీరు, నేల స్వచ్ఛంగా మారిపోతాయి. అర్ధ శతాబ్దానికి చెక్క నిర్మాణాలన్నీ నేలకూలుతాయి. శతాబ్దం తర్వాత నగరాలన్నీ అడవులను తలపిస్తాయి. దాదాపు 75శాతం నేల పచ్చని చెట్లతో నిండిపోతుంది. అటవీజంతువులన్నీ నగర వీధుల్లోకి వచ్చేస్తాయి. మూడు శతాబ్దాలు గడిచేసరికి ఇనుముతో నిర్మించిన కట్టడాలు (ఐఫిల్‌ టవర్‌లాంటివి) కూలిపోతాయి. వెయ్యి సంవత్సరాలకు సముద్రంలోని కొన్ని రకాల జీవులు, భూమిపైకి వచ్చి జీవించడం ప్రారంభిస్తాయి. 10 వేల ఏండ్ల తర్వాత రాతి కట్టడాలు (తాజ్‌మహల్‌, ఇతర కోటలు) నేలమట్టమవుతాయి. 10 లక్షల ఏండ్ల తర్వాత ఈ భూమిపై మనిషులు నివసించారనడానికి గుర్తుగా ప్లాస్టిక్‌ బాటిళ్లు, గ్లాసులు కనిపిస్తాయి. ఆ సమయంలో ఈ భూగ్రహం ఎలా ఉంటుందో చూసేందుకు మనుషులు ఎవరూ ఉండరు. కానీ, కొన్ని దశాబ్దాల క్రితమే మనుషులు వదిలేసిన అనేక ప్రాంతాలు, పట్టణాలు మాత్రం ఆ దృశ్యాలను ఇప్పుడే మన కళ్లకు కడుతున్నాయి. అవే ఈ చిత్రాలు!

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD