ఈవారం కథ... పరిష్కారం

Sep 20, 2020 , 02:44:27

నర్సక్కా.. ఏం కూరొండుతున్నవే? నీ కూరాసన అవుసలోళ్ల ఆడకట్టు దాక ఒస్తుంది....’ పక్కింటి లచ్చమ్మ బువ్వ తలె చేత పట్టుకొని నరసమ్మ ఇంటి గల్మట్ల గూసుంట అన్నది.

‘ఏం పాడువడ్డది సెల్లె నిన్న మీ బావ గింత సింత సిగురు  దెచ్చిండు. మొన్న నార్కెపెల్లి అంగట్ల దెచ్చిన షటాకు ఉశ్కేదొంతులు ఉన్నంగ పొయిమీదేశ్న. బల్రాములు శేట్‌ కాడ ఖాత బొచ్చెడైంది. సేటు ఉద్దెర గూడ వెడ్తలేడు. ఐతెమయే గని పొద్దుగాల తింటున్నవ్‌ ఏడికి పోతున్నవే?’ 

 ‘నర్సిరెడ్డి పటేలోళ్ళ బాయికాడ కప్పలీరమ్మ  గుంపు గడ్డెదురబోతున్రట. నేను పోతున్న నువ్వు కూడ రారాదు.’

 సాయమాన్ల పొయ్యిమీద ఉడుకుతున్న కూరని  గంటె తోటి తెచ్చి ’సై సూడు సెల్లె ఉప్పూకారం ఎట్టుందో’ అనుకుంట లచ్చమ్మ తలెల కూర ఏసింది నరసమ్మ.

 ‘నాకు గడ్డెదురుతందుకు శేతనైతున్నాది చెల్లె నడువులు పాడువడ లేస్తలేవాయె. మొన్ననే నల్లగొండ రామరావు దావఖానకు పోతే మూడు వేల రూపాలైనయ్‌. ఈ ఒక్క పోరి నెత్తిల నాలుగు ఇత్తులు వడితే ఈ పాణం పోయినా బాగుండు సెల్లె...‘ 

నరసమ్మది పేద కుటుంబమే. భర్త అంజయ్య ఉన్న రెండు ఎకరాలు  చేసుకుంట ఊర్ల నుంచి పట్నం వెళ్లిపోయిన పటేండ్ల భూములు కౌలుకు చేస్తూ సంసారం సాగిస్తున్నరు. వాళ్లకు ఒక్కగానొక్క బిడ్డ సరిత. ఊళ్లె బడిల పది దాకా చదివించిన్రు. కాని పోని  రోజులున్నయి. ఏదో నాలుగచ్చరాలు నేర్సిన కాడికి సాలు. ఆడిబోరి ఉజ్జోగం సేసేదుందా... ఓ అయ్య సేతులబెడితె మన బరువు దీర్తది. సదువు   బందు సేపిద్దమన్నడు అంజయ్య. సరిత తెలివైన పిల్ల. బల్లె సార్లు అమ్మాయి బాగా చదువుతుంది చదివించు అంజయ్య అని చాలాసార్లు చెప్పిన్రు. పదవ తరగతి టి సి మెమో ఇచ్చేటప్పుడు హెడ్‌మాస్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి సార్‌ ‘అమ్మాయి క్లాస్‌ ఫస్ట్‌ వచ్చింది. చదివి గొప్ప ఉద్యోగస్తురాలు అయితది. చదివించమని’ మరీ మరీ చెప్పిండు. ‘మా ఇండ్లల్ల ఆడి బోరలు ఎవరు సదువు కోలేదు సారు.... మీరు ఇంతగనం  చెబుతున్నరు. చూస్తా సారు’ అనుకుంట వచ్చిండు అంజయ్య. ‘పోరి ఎదిగొస్తుంది. ఏడనన్న  సంబంధం చూస్తున్నవా?’ అని ఆళ్ళు ఈళ్ళు అనేటప్పటికి హెడ్మాస్టర్‌ సార్‌ మాటలు మర్చిపోయిండు అంజయ్య. ‘నాయినా నేను సదువుకుంట...’ అని సరిత ఎంత మొత్తుకున్నా ఇనిపించుకోలేదు. ‘పోరి అంతగనం ఏడుస్తుంది. ఈ రెండేళ్లు చిట్టాల కాడ పన్నెండు దాకా ఉందంట. పంపుదామా..’ అని అంజయ్య నిమ్మల పడ్డప్పుడు నరసమ్మ అడిగింది. ’నీకేం ఎర్క ఊకో...’  కసిరిచ్చిండు అంజయ్య. తోటి పిల్లలంత కాలేజీకి పోతుంటే సరిత మాత్రం సాలోల్ల అంతమ్మ ఇంటికి మిషిన్‌ నేర్సుకోవడానికి  పోతుంది. ఈ కరోనా చేబట్టి అంతమ్మ కూడ మిషన్‌ నేర్పుడు బందు వెట్టింది. సరిత ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది.

‘సెల్లే నా శాత గాదుగాని జర సరితని తీస్కపోరాదు నీ ఎంట.’ బతిలాడింది నరసమ్మ

‘కాల్రెక్కన్న ముదరని గా పసిబోరి గంతలావు గడ్డిమోపులు యాడమోస్తదక్కా....  పాలషేర్లు బట్టినా దిక్కులేదు... ’ అన్నది లచ్చమ్మ

‘మొన్న ముల్కశీర కార్తీకి పదేను ఎల్లి పదారు పడ్డయ్‌. ఇంకెప్పుడు నేర్సుకుంటదే... ఒగింటికిస్తే మాటొస్తది సెల్లే...  ఆడిబిల్లన్నంక అన్నిపనులు నేర్పాల్నే.. లేకపోతే తల్లి గీ పనన్న నేర్పొద్దా అని నల్గురు నాల్గు తీర్ల నన్నంటరు సెల్లే ’ అని నరసమ్మ చెప్పుకుంట పోతుంది.

 ‘అవును నర్సక్క మొన్న ఎలిమినేడోళ్లు  సరిత ను సూసిపోయిర్రంట గదా... ఏమన్నరు మల్ల జాడ ఏమన్న తెలిసిందా?’

‘ఎవలన్నరే... ఈ లోకం సల్ల గుండ దిష్టి తాకింది అంటే దిగదాగింది అంటరు. ఒస్తె  నీకు చెప్పనా సెల్లే. మొన్న గడ్డమీది పాపయ్య మీ బావకు జాడ జెప్పిండంట. ఈన ఇయ్యాళరేపట్ల పొయ్యి అర్సుకొని వొస్తడంట.’

‘దగ్గరిపట్లనేగా సూడూరక్క. రోజుకింత కట్నాలు పెరుగుతనే ఉన్నయ్‌. ఎప్పుడో ఓసారి బరువు దింపుకుందే మేలు’  అనుకుంట ఎల్లిపోయింది లచ్చమ్మ.

*  *  *

‘పోయిన పని ఏమైందయ్యా... ఏమన్నరు?’ ఆత్రుతతో అడిగింది నరసమ్మ. ‘పిలగాడు ముద్దుగనే ఉన్నాడు. పిట్టంపెల్లికి పొయ్యే మూలమీన రోడ్డెమ్మటే ఐదెకరాలుందంట. ఎట్టలేదన్న కోటికి ఉన్నట్టే. పోరడు నిన్నమొన్నటి దాక బొంబాయిల పాల దంద జేసిండు. ఈ కరోనా జేబట్టి ఒచ్చి ఇక్కడ్నే ఉన్నడు. సదువైతే మోతాదుగానే సదివిండట. ఏడు దాక సదివిండని అన్నరు.  మనుసులు గూడ జర నిమ్మలం మనుసులే అనిపించింది’ అన్నడు అంజయ్య. ‘ఎంతమీదున్నరయ్యా?’  కట్నకానుకల విషయాన్ని ప్రస్తావించింది నరసమ్మ. ‘పదియేను లక్షలు అండ్ల మూడు ఇంట్లకు ఇయ్యాలె. మిగిలింది బంగారమే పెట్టుకుంటవో ప్లాటే కొనిస్తవో  నీ ఇష్టం. అన్నడు నడుమ మనిషి. పది అటో ఇటో  సరే అనుకుంటే పిల్లను చూసినంక పెట్టిపోతల ముచ్చట్లు మాట్లాడుకుందామన్నరు. నేను గూడ ఇంట్ల ఇశార జేసుకున్నంక జెప్తని ఒచ్చిన.’

‘అమ్మా మన శాతనైతదా?  మాటంటే మాత్రం ఎన్నటికైన తప్పదు. ఎట్ట జేద్దాం?  ఇయ్యాలరేపు ఆడబిల్లల గన్న పేదోడు సచ్చే కాలమున్నది. ‘తన బాధనంతా స్వగతంగా చెబుతున్నది నరసమ్మ.

 ‘ఇప్పుడు గుడిశె గతిలేనోడు గూడ లచ్చలడుగుతుండు. ఇంతో అంతో జమీనుంది. ఎలిమినేడు సుట్టుపక్కల కంపినీలు బడుతున్నయి. బతుకు దెరువు కొంప. ఇంతకంటే మంచోణ్ని దెస్తమా...  దాని రాత ఎట్టుంటే అట్టైతది. మనకున్నది ఒక్క నలుసు. ఇయ్యాల ముసలోళ్లమై గూసున్నమా? శాతనైన కాడికి పెడదాం. అంత శాత గానినాడు ఆ రొండెకరాలు  పట్ట జేద్దాం.‘స్థిరంగ అన్నడు అంజయ్య.

‘అయితే శంభయ్య పంతులు తానికి బోయి మంచి రోజు అడిగిరా. పిలగాన్ని రమ్మని పిల్లని చూడమని చెప్పు. పిలగాడు నచ్చితే వైనం సొప్పున మనం ఐదుగురం పోదాం. మల్ల ఆల్లు ఒచ్చిననాడు వొరపూజ లగ్గం పెట్టుకునుడు కర్సుల కర్సు ఒక్కపాలే ఐపోవాలె’ అన్నది నరసమ్మ. 

‘సరే’ అనుకుంట భుజం మీద తువ్వాల వేసుకొని పంతులు ఇంటికి బయలుదేరిండు అంజయ్య. 

ఇదంత వింటున్న సరిత ‘అమ్మా నా  ఈడు  ఏం బోయింది. నా తోటి పిల్లలకు పెండ్లిళ్లు ఐనయా? నేను సదువుకుంట. నాకు పెళ్లి ఒద్దు. నాయినకు నువ్వే జెప్పు’ అంటూ ఏడుస్తున్నది. ‘ఒద్దు బిడ్డా  నాయిన సెప్పినట్టు ఇను. నువ్వు ఎక్కువ సదివితే అంతకంటే ఎక్కువ సదివినోడు గావాలె. మనం నోట్లె తడి లేనోల్లం.  జర ఇను బిడ్డా. నువ్వు ఇట్టనే మంకు జేస్తె మీ నాయినకు అసలే అడ్డమైన కోపం. నిన్ను నన్ను సంపుతడు. ఆయిన ఏమన్న ఏసుకొని సస్తడు. నీ ఇష్టం’ నయాన, భయాన నచ్చజెప్పింది  నరసమ్మ. సరిత ఆలోచనల బడ్డది. 

*  *  *

 పెండ్లిచూపులు అయినయి. పిల్ల పిలగాడు ఒకరికి ఒకరు నచ్చిన్రు. పదియేను లక్షలు గాక బీరువా,  మంచం,  బాసన్లు, ఒడి బియ్యాలు వేరే అన్నరు. అన్నింటికీ ఒప్పుకున్నడు అంజయ్య. ఉన్నంతల దగ్గర చుట్టాలను పిలిచి ఘనంగ పెండ్లి జరిపించిండు. కాలచక్రం గిర్రున తిరుగుతున్నది. చూస్తుండగనే రొండేండ్లు గడిచి పోయినయి. భార్య అంటే బానిస అనుకునే మనుషులకు ప్రతినిధిగా నిలిచిండు అల్లుడు నరేష్‌. పెండ్లి అయిన రెండు సంవత్సరాల్లో ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నడు. మారక పోతడా అనుకున్నడు అంజయ్య. ఈ మధ్య సోపతి తోటి తాగుడు కూడ నేర్చిండు. బొంగోని చెరువు దగ్గర తోటల పేకాట ఆడుతూ పోలీస్‌ రైడింగ్‌లో దొరికిండు. అంజయ్య జమానత్‌ పడి ఇడిపిచ్చిండు. రోజింత మూర్ఖంగనే  తయారయితున్నడు గని మారడం లేదు నరేష్‌. సరితను గూడ పెట్టరాని  బాధలు పెడుతున్నడు. తిట్టరాని తిట్లు తిడుతున్నడు. ఒకనాడు అర్ధరాత్రి బాగా తాగి వచ్చి పుస్తకం చదువుతున్న సరితను ’పెండ్లి  అయినంక చదువెందుకే’ అంటూ బెల్ట్‌తో వాతలు వచ్చేటట్లు కొట్టాడు. మరొకనాడు తాగి వచ్చి కూర కమ్మగ లేదన్న సాకుతోటి ఐదు నెలల పొట్ట తోటి ఉన్న మనిషిని కడుపుల తన్నిండు నరేష్‌. గర్భస్రావమయింది.  ఎన్ని రోజులు ఎన్నో కష్టాలు భరించిన సరిత ఇక తట్టుకోలేక పోయింది. ఎవరికీ చెప్పకుండా బట్టలు సర్దుకుని తల్లి గారి ఇంటికి బయలుదేరింది.

*  *  *

 ఇంటికి వచ్చిన సరితను చూసి తల్లి తండ్రి ఆశ్చర్యపోయిన్రు. జరిగిన ఘోరం తెలుసుకుని కంటికి పుట్టెడు ఏడ్చింది నరసమ్మ.  చుట్టుపక్కల కూడిన అమ్మలక్కలంత అల్లున్ని తిట్టరాని తిట్లు తిడుతున్నరు. శాపనార్థాలు పెడుతున్నరు. ‘బిడ్డకు ఎంత కష్టం వచ్చింది పాపం’ అంటూ జాలి చూపిస్తున్నరు. అంజయ్య ‘పెద్దమనుషులల్ల పెట్టి ఆళ్ల సంగతి చూడాలే’ అంటున్నడు. ‘సర్పంచ్‌ తానికి పోయి మాట్లాడొస్తా’ అని మంచంల నుండి లేవబోయిండు అంజయ్య. ‘నాన్న ఆగు... ఇన్ని రోజులు నేను నీకు ఎన్నడూ ఎదురు చెప్పలేదు. నా మీద ప్రేమతో నువ్వు నాకు మేలు చేస్తున్న అనుకుంటున్నవు గాని నీ తెలియనితనం వల్ల నా జీవితం నాశనం అయింది. ఇప్పుడు రావాల్సింది సర్పంచ్‌ కాదు. మన హైస్కూల్‌  శ్రీనివాస్‌ రెడ్డి సార్‌ మీతో మాట్లాడతారట. ఫోన్‌ చేస్తే ఇప్పుడే వస్తాను అన్నారు. కాసేపు కూర్చో. తరువాత ఏం చేయాలో నువ్వే నిర్ణయించుదువు గని అంటూ ఏడుస్తూ కాస్త కటువుగనే  అన్నది సరిత.

ఇంతలోనే శ్రీనివాస్‌ రెడ్డి సార్‌ వచ్చిండు. ’నమస్తే సారు’  అని అంజయ్య మంచంల నుంచి లేచి నిలబడ్డడు.  ‘అయ్యో కూర్చో అంజయ్యా...  బాగున్నరా’ అనుకుంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నడు హె్‌డ మాస్టర్‌. ‘నా బిడ్డను గన్న గని దాని రాతను గనలేదు సారూ...‘  అంటూ ఇప్పటిదాకా ఆగ  పట్టుకున్న దుఃఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చిండు అంజయ్య. అక్కడ కూడిన అమ్మలక్కలంత కండ్లనీళ్ళు దీసిన్రు. ‘అంజయ్యా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు చూసినోనివి. నువ్వే ఇట్లా ఏడిస్తే ఎట్లా? నీ   భార్య బిడ్డలు ధైర్యం చెడరా?  జరిగిందేదో జరిగిపోయింది. జరగవలసిన దాని గురించి ఆలోచిద్దాం. వాడు పెట్టిన కష్టాలకు శిక్ష అనుభవించాల్సిందే. నీ సొమ్ము నీకు ముట్ట చెప్పాల్సిందే. దానికి పోలీస్‌ స్టేషన్లు , కోర్టులు ఉన్నాయి. కానీ సరిత జీవితం గురించి ఆలోచించావా?  మంచి తెలివైన పిల్ల. చదివితే చక్కటి ఉద్యోగం చేస్తుంది అని ఎన్నిసార్లు చెప్పినా విన్నావా?  ఇప్పటికైనా మునిగింది ఏం లేదు. నువ్వు పెండ్లి చూపులకు ఏర్పాట్లు చేసే సమయంలోనే సరిత నన్ను కలిసింది. విషయం చెప్పింది. నీకు తెలియకుండానే అమ్మాయి ఓపెన్‌ ఇంటర్‌ ఫీజు కట్టేశాను. మొన్న ఎండాకాలం ఇంటికి వచ్చినప్పుడు ఆ పరీక్షలు కూడా రాసింది. ఫస్ట్‌ క్లాస్‌ లో పాస్‌ అయింది. టీచర్‌ ఉద్యోగం కోసం రాసే టిటిసి ఎంట్రెన్స్‌లో కూడా మంచి ర్యాంకు తెచ్చుకుంది. ఇకనైనా అమ్మాయిని చదివించు. టీచర్‌ ట్రైనింగ్‌ చేస్తే తప్పక ఉద్యోగం సాధిస్తుంది. ఆడపిల్ల తన కాళ్లమీద తాను నిలబడటం అనేక సమస్యలకు పరిష్కారం. ఏదైనా మన మంచికే. ఇప్పుడైనా నా మాట విను’ అని సరిత సర్టిఫికెట్‌ అంజయ్య చేతిలో పెట్టాడు శ్రీనివాస రెడ్డి. అంజయ్యకు నోట మాట రాలేదు. శ్రీనివాస రెడ్డి రూపంలో దేవుడు తన ఇంటి ముందుకు వచ్చాడని రెండు చేతులెత్తి మొక్కుతూ ధారాళంగా కారుతున్న కన్నీళ్ళతో నిలబడ్డడు అంజయ్య.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD