శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Sep 20, 2020 , 02:42:53

అబలా జీవితము... పి.వి. నరసింహారావు

అబలా జీవితము... పి.వి. నరసింహారావు

యమున ఓ పన్నెండేండ్ల పిల్ల... ఆటపాటలే లోకంగా సాగుతున్న జీవితం. బొమ్మల పెండ్లి అంటే తనకెంత ఇష్టమో! తన అన్నయ్యనీ, ప్రియ నేస్తం ఠకీనీ... చుట్టుపక్కల ఆడపిల్లలు అందరినీ పోగుచేసి ఓ రోజు బొమ్మల పెండ్లి సంబురంలో మునిగిపోతుంది. ఇంతలో ధుమధుమలాడుతూ తండ్రి రానే వచ్చాడు. పిల్లలందరినీ తిట్లతో తరిమేశాడు. ఆయన వాలకం చూస్తుంటే... అది అకస్మాత్తుగా వచ్చిన కోపంలా లేదు. ఏదో ఉపద్రవాన్ని సూచించే ఉద్వేగాన్ని తలపిస్తోంది. అదేమిటో ఈ వారం కథలో...

గతవారం తరువాయి..

ఆటలాడుతున్నావా? ఫో ఇక్కణ్ణుంచి!.. దీన్నయితే--’ ఆ మాటలు విని నేను తుర్రున పారిపోయాను. నాకు సరిగా పరుగెత్తడం కూడా సాధ్యపడలేదు. శరరీరమంతా గడగడ వణకిపోయింది. సుందరి అక్కడే ఏడుస్తోంది. మొదటి ఉరుముకే అమ్మాయిలందరూ పారిపోయారు. నేను పరుగెత్తి నేరుగా వంటయింట్లో మా అమ్మ వెనుక నక్కాను. ఆమె ఏం జరిగిందని నన్నెంతో అడిగింది. కాని నా నోట మాట పెకిలితే ఒట్టు. తదుపరి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని నేనమ్మతో ఏదో చెప్పుదామనుకొనేసరికి అన్నయ్య కూడా గాభరా పడుతూ వచ్చి, “అమ్మా, అమ్మా, నాన్నగారు నిన్ను వెంటనే రమ్మని పిలుస్తున్నారు. పద పద! ఇవాళ అలా ఎందుకున్నారో ఏమో” అని అన్నాడు. వాడి మాటలు విని అమ్మ మొహం వెంటనే “దిగి”పోయినట్లనిపించింది. అన్నయ్యను ఒకటి రెండు ప్రశ్నలడిగి నేరుగా మేడపైకి పోయింది. అన్నయ్య ఆమె వెనువెంటనే నడిచాడు. కాని నేను వాడి లాగు నాడా పట్టి వెనక్కి లాగాను. వాడు తిరిగి వచ్చాక ‘నిన్నింకేమైనా అన్నారా నాన్నగారు?’ అని అడిగాను. ఆ మాట విని వాడు, “ఫో ఫో ! ఇవ్వాళ నీతో తెగ తెంపులు చేసుకున్నాను. నీవు మహా స్వార్థపరురాలివి. నన్నక్కడ ఒంటరిగా వదిలి పరుగు తీశావు !” అని మందలించాడు. వాడి మాటలు విని నేనెంతో పశ్చాత్తాపపడ్డాను. వాడిని బుజ్జగిస్తూ యిలా అన్నాను. “ అదేమలా చేస్తావన్నయ్యా? నాకు మరేం, మా చెడ్డభయం వేసింది. నీవే చెప్పు. నీవు నా అంతవాడివైతే.. నేను నీ అంతదాన్నయితే నీవు మాత్రం పరుగు తీసేవాడివి కాదా? అంతేకాక నాన్నగారు ఇవ్వాళ కోప్పడ్డట్టు మరెన్నడైనా కొప్పడ్డారా? ” ఈ విధంగా అన్నయ్యను సముదాయించాక మా యిద్దరి స్నేహం మళ్లీ స్థాపితమయింది. ఇద్దరం నాన్నగారి ప్రవర్తనను గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం. అన్నయ్య యిలా అన్నాడు, “ నాన్నగారికి మనిద్దరి మీద చెప్పరాని కోపం వచ్చింది. మనిద్దరినీ యింటి బైటికి గెంటివేసేటట్టున్నారు. నాతోనయితే అననే అన్నారు. ‘ఆగు వెధవా! నిన్ను బైటకు గెంటేస్తాను. ఒక్క క్షణమైనా ఇంట్లో ఉండనివ్వను. నీ వెంటనే ఆ రక్కసిని కూడా పంపిస్తాను. వెధవలంతా పిచ్చెత్తించేశారు,’ అని.”

అది విని నేను దద్దరిల్లిపోయాను. కాని అన్నయ్య నన్నెంతో ఓదార్చాడు. పాఠకులారా! పిన్నతనంలో ఎంత చిన్న ఆపద వచ్చినా దాని ప్రాముఖ్యం ఎంతగా కనిపిస్తుందో, దానిని పిల్లలెంత మహాపర్వతంలా ఊహించుకుంటారో, అలాంటి అనుభవం మీలో చాలా మందికి వుండి వుంటుంది. నాన్నగారు మమ్మల్నింక నిజంగానే బైటికి గెంటివేస్తారని మాకు గట్టి నమ్మకం కలిగింది... మేమింక బిచ్చగాళ్లమైపోతాం. అన్నయ్య యిలా అన్నాడు. “నాకయితే అక్షరాలే సరిగ్గా రాలేదు. లేకపోతే నేనెక్కడో గుమాస్తా పని చేసి మనిద్దరి కడుపు నింపేవాణ్ణి. నాన్నగారి కాళ్లా వేళ్లా పడి మనం క్షమాపణ వేడుకుందాం. తప్పిదమయిందనీ, యిక ముందలా చేయబోమనీ చెప్పుదాం. ప్రాధేయపడుదాం! అప్పటికీ వారు వినకపోతే యింక గత్యంతరం లేదు. నేను బిచ్చమెత్తి మనిద్దరి పొట్టలు నింపుతాను. నీవేమీ దిగులుపడకు. నేనెన్నటికీ నిన్ను దూరం చేయను.” అలాగే పరిపరి విధాలా ఆలోచనలు సాగుతుండగా మా అమ్మ నెమ్మదిగా అడుగులు వేస్తూ కిందికి దిగివచ్చింది. అప్పటి ఆమె ముఖం నాకిప్పటికీ స్పష్టంగా స్మరణకు వస్తుంది. ఆమె కళ్ల నుండి అశ్రువులు జారి చెక్కిళ్లమీద పడ్డాయి. కళ్లు ఎఱ్ఱబారాయి. మమ్మల్ని చూడగానే కొంతసేపామె నిశ్శబ్దంగా నిలిచి వెంటనే స్పృహ తెచ్చుకొని కళ్లు తుడుచుకొని శాంతగంభీర స్వరంతో యిలా అనింది. “పదండర్రా, రాత్రి బండికి మనం తాతయ్య ఊరికి పోవలసిఉంది. వెంటనే సిద్ధం కండి. గుడ్డలూ అవీ కట్టుకొండి.” ఆ మాట విని మా మనసుకేమనిపించిందో ఊహించి తెలుసుకోవలసిందే.

ఇలా అనడానికి కారణం వేరే వుంది. పిల్లల చిత్తవృత్తులెంత చంచలమైనవో గమనించిన వారికి పైవాక్యంలోని అర్థం వెంటనే బోధపడుతుంది. ఏడుస్తూ వచ్చి మా అమ్మ మాతో ఆ రాత్రి తాతయ్య ఊరికి ప్రయాణమయ్యే మాట ప్రస్తావించింది. ఆ మాట విని మాకు కొంత విచారం కలిగింది. కొంత ఆశ్చర్యం కలిగింది. మనసుకు కొంత విచిత్రమనిపించింది. అంతేకాక... మీరాశ్చర్యపడ్డా సరే చెప్పకతప్పదు.. నాకు కొంత ఆనందం కూడా కలిగింది. ఆ ఆనందానికి కారణమేమంటే తాతయ్య ఊరికి మా అమ్మ వెళ్లి అయిదారేండ్లు గడిచాయి. అప్పట్లో నేను చాలా చిన్నదాన్ని. నాకేదీ సరిగా అర్థమయ్యేది కాదు. అప్పటి ఉదంతాలు అన్నయ్యకు మాత్రం సరిగ్గా జ్ఞాపకం వున్నాయి. మధ్యమధ్య వాడు నాకు చెబుతుండేవాడు. నాకేమీ జ్ఞాపకం లేనందున మళ్లీ ఒకసారి మేమందరం తాతయ్య ఊరికి పోతే బాగుండునని నాకెప్పుడూ అనిపిస్తుండేది. అక్కడికి వెళ్లితే ఎంతో మజాగా వుంటుందని అన్నయ్య మాటలను బట్టి అనుకొని ఎప్పటికప్పుడు వెళ్లాలనిపిస్తుండేది. అందుకని హఠాత్తుగా నేడు మాకా అవకాశం దొరకటం వల్ల నాకు కొంత ఆనందం కలగడంలో ఆశ్చర్యమేముంది? అంతేకాక మాకానాడు ఏ కారణాల వల్ల ఊరికి పోవలసివస్తున్నదో, ఎలా పోవలసి వస్తున్నదో ఏమీ తెలియలేదాయెను.

అమ్మ మాటలు విని నేను అన్నయ్య వైపు చూచాను. కాని వాడి మొహం మీద సంతోషం కానరాలేదు. అమ్మ కూడా మరేమీ మాట్లాడలేదు. నేనామెనింకేమో అడుగుదామని అనుకునేసరికి మెట్ల మీద బరువైన అడుగుల చప్పుడు వినవచ్చింది. అది విని నా ప్రాణాలెగిరిపోయి నట్లనిపించింది. నేను వెనుదిరిగి చూచేసరికి మా నాన్నగారు ముందుకు వచ్చి యిలా అన్నారు. “అరే, ఈ వెధవ లింకా యిక్కడే కూర్చొనివున్నారా? దొంగలకు బాగా శాస్తి చెయ్యాలి” అంటూ అన్నయ్య చేయి పట్టుకొని చెంపమీద ఒకటి వాయించి, “నడూ ఇక్కణ్ణుంచి, వెళ్లిఫో, ఏమైనా చదువుతూ కూర్చోఫో, అస్తమానం వెధవ కోలాహలం! ఏమే పోరీ, అక్కడ పారవేసిన సామగ్రి అంతా ఎత్తిపెట్టే దెవ్వరనుకున్నావు?” అని నన్ను కూడా అమ్మ వద్ద నుండి లాగారు. కాని యింతలో అమ్మ వారి చేయి పక్కకు నెట్టుతూ ‘ఇదేమిటండి? ఆ పిల్లల మీదెందుకు కోపం? వాళ్లేం చేశారు’ అంది. అమ్మ పుణ్యాన నాన్నగారి చేతి పట్టు తప్పిపోగానే నేను తక్షణం ఎంత వేగంగా పరుగెత్తానంటే పోతూ పోతూ మెట్ల మీద అడ్డం పడి ఒక చేతిగాజులన్నీ పగిలిపోయి మోకాలికి గట్టి దెబ్బతగిలింది. అయితే మాత్రం నేనాగేదెక్కడ? ఫ్రాకు సర్దుకుంటూ ఒక్క క్షణం నిల్చానో లేదో ‘వాళ్లేం చేశారంటావా? అసలు వాళ్లే దౌర్భాగ్యులు! వెధవల జాతకంలో...’ అన్న నాన్నగారి మాటలు నాకు వినవచ్చాయి. వెంటనే మేడ మీదికి పరుగెత్తి అక్కడి పెళ్లి సామగ్రినంతా ప్రోగు చేయసాగాను.