గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Sep 20, 2020 , 02:33:31

జమీలా... కొట్టం రామకృష్ణారెడ్డి

జమీలా... కొట్టం రామకృష్ణారెడ్డి

ఉగాండా అంటే ఆఫ్రికా దేశం కదా, ఆళ్ళంటే బయం కాదా? ఆళ్ళు అంత మంచోళ్ళు కాదంటగదా? కండ్లవడితే కొట్టి దోసుకపోతరంటగదా? మీరు నిమ్మలంగ ఉన్నరా? మనదగ్గరున్నట్లుంటదా? అని ఏమేం అడగాల్నో అన్నీ అడిగిండ్రు దోస్తులు ఈడికొచ్చిన తొల్తల.

అరే! ఎట్లచెప్పాల్నో అర్తం కాకున్నది. మనుసులంత మంచోళ్ళే, ఒక్కడు బద్మాష్‌ గాడుంటే అందర్ని బద్మాష్‌ గాళ్ళని అంటమా? మనతాన అందరు సుద్దపూసలేనా? మనతాన మోక దొర్కితే కొట్టి దోసుకపోతలేరా? మనం ఏడున్నా మన సోయిల మనం ఉండాలే. సోయిదప్పి ఉంటే ఆడైన ఒక్కటే ఈడైన ఒక్కటే. ఆడున్నోళ్ళు ఎసోంటోళ్ళో అనుడు కంటే మనమెసోటోళ్ళమో తెల్సుకోవాలే. మనమెంత మంచిగుంటే ఆళ్ళంత మంచిగుంటరు. నక్రాలు గిట్ల షురూ చేస్తే ఈపులు పల్గుడు గ్యారంటి.

అందరి ముచ్చట అట్లపక్కకు వెడితే నాకైతే అసోంటి పరేషాన్లు ఏం లేకుండే. నాకంతా మంచోళ్ళే తలిగినట్లున్నరు. అట్లన్నట్లు.. ఇంతకు ముందు నాలుగైదు వారాలల్ల ఆళ్ళతాన నేర్సుకునేటివి చానున్నయని చెప్పిన గదా. అభివృద్ది అంటే తెల్ల బట్టలేస్కోని, పెద్దపెద్ద కార్లల్ల తిరుగుకుంట, పెద్ద బంగ్లాలల్ల, ఏసీలల్ల పండుడు, ఆరులైన్ల రోడ్లమీద తిరుగుడుగాదు! ఆల్ల లెక్క సోపతిగాల్ల ఆపతి చూడాలే. పక్కోడి కడుపు సూశుడు గావాలే. ఆళ్ళతాన నవ్వుడు నేర్వాలే మనం. మనిసిని మనిసిలెక్క చూసుడు నేర్వాలే. మనలెక్క మందినిముంచి బతికేటోడు ఎంతలావుంటే ఏం సక్కదనం?

నేను సదూకున్నోన్ని గీ పనైతనే చేస్తా అని కూసోరాళ్ళు. మస్తు సదూకున్నోల్లు గూడ బతకనీకే ఏ పనంటే అది సేస్తరు.  ఆడు తక్వ పని చేస్తున్నడని తక్వ సూడరు. ఉన్నోడు లేనోడు ఒక్కతాన కూకోని, ఒగరి బుజమ్మీద ఒగరు చెయ్యేసుకొని తింటరు, తిరుగుతరు. నోటినిండ పల్కరిచ్చుకుంటరు. గింత మంచి మనుసులున్న ఉగాండా దేశం గురించి ఎవరైన తక్వ చేసి మాట్లాడితే నాకు మంటలేస్తది.

‘కంపాలా’ల నేను తమ్ముడు వాసు ఇంకా మా పెద్దన్న ముగ్గురం బ్యాచిలర్లమే. అదేందో దేవుడు కూడవలుక్కోని ఇచ్చినట్లు మా ముగ్గురికి నెత్తికొక ఆడివిల్ల, ఒక మగ పోరడు ఉన్నరు. అయితే ఆళ్ళంత ఆడ ఇండియాల ఉన్నరు. మేము ఒకరికొకరం సోపతి. 

ముగ్గురం బ్యాచిలర్ల అయినందుకు మాకు ఒంట చేసుడు మంచిగనే ఒస్తది. ముగ్గురం కమ్మగ పుల్లగ బాగనే ఒండుకుంటం గని బాసాన్లు తోముడు, బట్టలుతుకుడు, ఇల్లూడ్వుడు మా తోటి కాకున్నది. పొద్దున్నే ఎనిమిదింటికల్ల ఒండుకొని తిని, ఇంత సద్ది గట్టుకొని పొయ్యి మల్ల పొద్దుమీకి ఏడుగొట్టంగ ఇంటికొచ్చేటోల్లం. పొద్దుందాంక అఫీసుల పని చేసి మల్ల ఇంటికొచ్చి ఇంటిపని సేసుకునుడు మాతోటేం అయితది? అందుకని మేము ఇంట్ల పనికని ఒకామెను మాట్లాడుకున్నం. ఆమె పేరే ‘జమీలా’.

పొద్దున్నే ఆరున్నరకల్ల ఇంటికొచ్చేది. వాళ్ళిల్లు దగ్గర దగ్గర నాలుగు మైల్ల  దూరం. నడిసొస్తుండేటిది. ఇద్దరు, నాలుగైదేండ్ల ఆడివిల్లల తల్లి. బక్కగ సీపురుపుల్ల లెక్క ఉండేటిది. పొద్దున్నే మంచిగ తయారయ్యి, లిప్పుస్టిక్కు పెట్టుకోని మోకాల్ల దాంక గౌనేసుకొని ఒచ్చేటిది. ఆరున్నరకల్ల ఒచ్చి మేము ఆఫీసుకు పోయ్యేటయానికల్ల మొత్తం పనంత దబ్బ దబ్బ ఖతం చేస్తుండే. ఉర్కులాడి ఉర్కులాడి అంతగనం పని చేస్తుండే గని అంత తొండెం మొండెం చేస్తుండేటిది. కొన్ని నెలలు ఎట్లనో సదురుకున్నం. ఇట్ల కాదని ఒగనాడు మేము ముగ్గురం పదుర్కోని ఒక తాళం చేతుల సెట్టు జమీలాకు ఇచ్చినం. 

ఆయాల్టి సంది మా పనులు పుర్సత్‌గ చేస్తుండేటిది. ఇంటి పనంత అయిపోయినంక తాళమేస్కోని పోతుండే. దోస్తులెవరన్న మా ఇంటికొస్తె పరేషానయ్యేటోల్లు బ్యాచిలర్ల ఇల్లు గింత మంచిగున్నదేందంటాని. ఇగ మా తమ్ముడు వాసు అయితే ఇడ్లి చెయ్యనీకె బియ్యమెన్ని నానబొయ్యాలే, మినపపప్పు ఎంత నాన బొయ్యాలే, దోశలకు ఏం జెయ్యాలే ఇసోంటివే గాకుండ ఇడ్లీలు చేసుడు, దోశలేసుడు అన్ని నేర్పిండు.  అన్ని నేర్సుకొని మాకు చేసిపెడుతుండేటిది జమీలా. మా తోటే పొద్దటి పూట నాస్త గిట్ల చేస్తుండే.

మేము తిని ఆఫీసుకు పొయ్యినంక బాసాన్లు తోముడు, బట్టలుతుకుడు ఆన్ని చేస్తుండే. ఆమెకు ఇల్లప్పగించి పొతున్నందుకు సుట్టుపక్కలున్న మనోళ్ళు ముక్కులమీద ఏల్లేసుకున్నరు. జరకన్ని దినాలల్ల ఇల్లంత ఖాళీ చేస్తదని ఎక్కిరిచ్చేటోళ్ళు.

ఒక్కనాడు గూడ ఈడున్న పుల్ల ఒక్కటంటె ఒక్కటి గూడ పోలేదు మా ఇంట్లకెళ్ళి. ఇంటినిండ సామాను, బట్టలు, కంప్యూటర్లు, టీవీ అన్ని  అట్లనే ఉన్నయ్‌. ఎన్నడన్న అయితారం నాడు జమీలాతోని ఆళ్ళ ఒంటలు ఒండిపిస్తుంటిని నేను. అయితారం పొద్దటిపూట నాస్త అక్కడి ఒంటకం ఒండిపిచ్చుకొని తినేటోళ్ళం. 

జమీలా మాకు ఇంటి మనిసి లెక్కయింది. ఒగనాడు మాకు దోశలేసిచ్చుకుంట రేపు నాకు సెలవు కావాల్నంటాన్నది. ఎందుకనడిగినం. రేపు ‘రంజాన్‌' పండగన్నది. సరేనంటాని అన్నము. ఆయల్ల ఆఫీసుకెళ్ళి ఒచ్చేటప్పుడు ముగ్గురం కలిసి పండ్గ సామానంత కొనుకోని జమీలా ఇంటికొయ్యి ఇచ్చొచ్చినం. మస్తు మురిసింది. 

‘రంజాన్‌' పండ్గ అయిపోయిన నెలకు మల్ల అడిగింది ‘జమీలా’ రేపు సెలవు కావాలంటాని. ఎందుకని మల్లడిగినం. రేపు ‘క్రిస్మస్‌' పండుగ గందుకే అన్నది. గదేంది మొన్ననే ‘రంజాను’ అంటివి ఇయ్యాల ‘క్రిస్మస్‌' అంటున్నవు అంటాని అడిగినము. నేను ముస్లిమును, నా మొగడు క్రిష్టియన్‌ అన్నది.

ఆయల్ల సాయంత్రం గూడ పండుగ సామాను కొని ఆల్లింటికొయ్యి ఇచ్చిఒచ్చినం. తెల్లారి క్రిస్మస్‌ నాడు పగటీల బోజనం ఆళ్ళింట్లనే తిన్నం అందరం కల్సి. జమీలా ఆమె మొగడు పిల్లలు అందరు మస్తు సంబరవడ్డరు. మాకు గిట్ల సంబరమయ్యింది.


logo