గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Sep 20, 2020 , 02:22:56

ఐతారం పలారం వహ్వా.. చుడ్వా!

ఐతారం పలారం వహ్వా.. చుడ్వా!

ఇప్పుడంటే మ్యాగీలూ, ఉప్మాలూ వచ్చాయి. కానీ, నిన్నమొన్నటి వరకూ అతిథులు వస్తే,  ఓ ఐదు నిమిషాల్లో కరకర లాడే అటుకుల చుడ్వాతో ఆకలిని తీర్చేవారు. పైగా, చుడ్వా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఒకసారి చేసి పెడితే వారాల పాటు ఆరగించవచ్చు. చాలా ప్రాంతాల్లో పోహా చివ్డాగా, అటుకుల మిక్చర్‌గా పిలిచే ఈ వంటకం... మన దగ్గర మాత్రం అటుకుల చుడ్వాగా పేరు తెచ్చుకుంది.  

దూర ప్రయాణాలు చేయాలంటే ఇప్పటిలా బస్సు సౌకర్యాలు ఉండేవి కావు. కాలినడకన వెళ్లినప్పుడు చాలాకాలం నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకెళ్లేవారు. ఈ జాబితాలో చుడ్వా తప్పనిసరి.  పెండ్లిచూపుల సమయంలో.. పెండ్లికొడుకు తరఫు వాళ్లకు ఒకప్పుడు చుడ్వ, ఒక లడ్డు పెట్టేవారు.  స్కూల్‌ నుంచి వచ్చాక, పిల్లలకు దీన్ని  స్నాక్‌గా ఇస్తుంటారు. కాస్త చుడ్వా పెట్టి.. గ్లాసెడు పాలు ఇస్తే కడుపు నిండిపోతుంది.

చుడ్వా చేయడం బ్రహ్మ విద్యేం కాదు. కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇందులోనే పల్లీలు, పుట్నాలు కలిపి,  బాగా వేగాక.. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు వేసి.. రెండు నిమిషాల తర్వాత అటుకులు వేసి బాగా వేయించాలి. కావాలనుకుంటే కారం కలుపుకోవచ్చు. అటుకుల చుడ్వాలో కొందరు బాదం, జీడిపప్పు, కిస్మిస్‌ కూడా కలుపుతుంటారు.  

కరివేపాకుతో చుడ్వాకు ప్రత్యేకమైన రుచీ పరిమళమూ అబ్బుతాయి.  రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కరివేపాకు సహకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్‌ గుణాలు ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా చేస్తాయి. కరివేపాకులో ఉండే.. ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌  రక్తహీనత నుంచి కాపాడతాయి. జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలగాలంటే కరివేపాకు తప్పనిసరి.

అటుకుల్లో ఉండే విటమిన్‌ -బి1 రక్తంలోని  చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తుంది. శరీరానికి తగిన మోతాదులో కెలోరీలను అందించడంలో అటుకులు ఎంతో ఉపయోగపడతాయి. 

కొందరికి ఉదయం  చాయ్‌తో పాటు చుడ్వా ఉండాల్సిందే.  సకినాలు, మడుగులు తిన్నట్టే..  చుడ్వాను కూడా చాయ్‌లో వేసుకుని ఆరగించేవారూ ఉన్నారు. 

చుడ్వాలోని  పల్లీల వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బరువు తగ్గడానికి పల్లీలు బాగా పనిచేస్తాయి. వీటిద్వారా విటమిన్‌- బి3 శరీరానికి లభిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించుకోవడానికి పల్లీలు తినాలంటారు. డిప్రెషన్‌, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గేందుకు  కూడా పల్లీలను ఆహారంలో చేర్చుకోవాలి.  

పోపు గింజలంటే.. సాక్షాత్తు ధన్వంతరి అవతారమే. ఆవాల్లో విటమిన్లు అపారం. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచుతాయి. జీలకర్ర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గుండె సంబంధమైన రుగ్మతలు, శ్వాసకోశ వ్యాధులు  అధిగమించడంలో  ఉపయోగపడుతుంది. 

గుండెపోటు దరిచేరకూడదంటే  పసుపు తప్పనిసరిగా వాడాలి. పసుపులో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఎక్కువ. రక్తశుద్ధికి పసుపును ఉపయోగిస్తారు.  లో డెన్సిటీ లిపొప్రొటైన్‌ అనే చెడు కొవ్వును తగ్గించడంలో పసుపు బాగా పనిచేస్తుంది. ఇనుము, పొటాషియం, విటమిన్‌ -బి6, మెగ్నీషియం, విటమిన్‌-సి, క్యాల్షియం.. ఇలా అన్నీ పసుపులోనే ఉంటాయి. 

 అటుకుల్లో విటమిన్‌- బి, కార్బొహైడ్రేట్స్‌, ప్రొటీన్లు, ఐరన్‌ పుష్కలం. త్వరగా జీర్ణం అయ్యే ఆహారం ఇది. గ్లూకోజ్‌, కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి అటుకులు. 

చుడ్వాలోని పుట్నాలు పంటికిందికి బాగా పనికొస్తాయి. అంతేకాదు, పుట్నాల్లో ఫైబర్‌ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. ఆడవాళ్లలో హార్మోన్‌ సమస్యలను తగ్గిస్తాయి పుట్నాలు. మలబద్ధకం తొలగాలంటే పుట్నాలు తినాలి. రక్తహీనతను దూరం చేసుకునేందుకు పుట్నాలు బాగా ఉపయోగపడుతాయి. 


logo