శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sunday - Sep 20, 2020 , 02:05:46

ఇమ్యూనిటీ విటమిన్‌

ఇమ్యూనిటీ విటమిన్‌

విటమిన్‌ సి.. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. విజృంభిస్తున్న కరోనా వ్యాధి నుంచి కాపాడే రక్షణ కవచంగా దీన్ని భావిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్‌ సి కీలక పాత్ర వహించడమే ఇందుకు కారణం. మన శరీరంలో సహజ సిద్ధంగా ఉండే ఇమ్యూనిటీని ఇది ప్రేరేపిస్తుంది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతిరోజూ సిట్రస్‌ పండ్లను ఏదో ఒక రకంగా వినియోగించాలని సూచిస్తున్నారు నిపుణులు. 

రక్తహీనత రాకుండా

ఇనుము లోపిస్తే రక్తంలో హిమోగ్లోబిన్‌ తక్కువ అవుతుంది. తద్వారా రక్తహీనతకు దారితీస్తుంది. మన శరీరానికి ఇనుము బాగా అందాలంటే విటమిన్‌ సి కూడా తగినంత ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఇమ్యూనిటీ పెంచడానికే కాకుండా రక్తవృద్ధికి కూడా విటమిన్‌ సి పరోక్షంగా దోహదం చేస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మన శరీరం ఇనుమును గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. 

కంటి ఆరోగ్యానికీ...

కంటిచూపు సరిగ్గా ఉండటం కోసం విటమిన్‌ ఎ తప్పనిసరిగా తీసుకోవాలని మనకు తెలిసిందే. విటమిన్‌ ఎ కోసం ఆకుకూరలు, క్యారెట్ల వంటివి పిల్లలకు ఎక్కువగా తినిపించాలని కూడా సూచిస్తుంటారు. కంటి ఆరోగ్యంలో విటమిన్‌ సి కూడా కీలకమైందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. కంటిలో శుక్లాలు ఏర్పడటాన్ని విటమిన్‌ సి ఆలస్యం చేస్తుంది. 

ఎంత అవసరం?

చిన్న పిల్లలకు 45 మి.గ్రా., టీనేజ్‌ పిల్లలు రోజుకి 65 నుంచి 75 మి.గ్రా. వరకు విటమిన్‌ సి తీసుకోవాలి. 18 ఏండ్లు దాటిన వాళ్లు రోజుకి 75 నుంచి 90 మిల్లీగ్రాముల వరకు విటమిన్‌ సి తీసుకోవాలి. సాధారణంగా తాజా పండ్లు, కూరగాయలు, సిట్రస్‌ పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, చిక్కుళ్ల వంటివి తీసుకునేవాళ్లలో విటమిన్‌ సి లోపం రాదు. లేకపోతే సప్లిమెంట్లు తీసుకోవాల్సి వస్తుంది. 


logo