శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Sep 20, 2020 , 02:01:03

జిలుగులు.. వెలుగులు!

జిలుగులు.. వెలుగులు!

పూల జడ.. వీలున్నప్పుడు తగిలించుకునేలా వస్తే? గడియారంలో ముళ్లే కాదు, ముచ్చటైన చిత్రాలూ ఉంటే? ఒక డ్రెస్‌ ఒకసారికే బావుంటుంది. అదే డ్రెస్‌ను ఇంకోలా, మరోలా మార్చుకోగలిగే చిట్కా తెలిస్తే? రాజసానికి మారుపేరైన నగలు చవకగానూ లభిస్తుంటే? -  ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఓసారి ఫ్యాషన్‌ నగరిలో విహరించాల్సిందే!  

రాజసం ఉట్టిపడేలా 

పోల్కీ జువెలరీ.. సహజమైన అన్‌కట్‌ డైమండ్స్‌తో చేసే నగలు. ఈ రకమైన జువెలరీకి చాలా డిమాండ్‌ ఉంటున్నది. ముఖ్యంగా పెండ్లిండ్ల సమయంలో వధువులు ఈ నగలను ధరించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. కుందన్‌ జువెలరీతో పోలిస్తే వీటి మెరుపు ఎక్కువ. ధర కూడా ఎక్కువే. పోల్కీ నగలను ప్రవేశపెట్టింది సాక్షాత్తు మొఘల్‌ చక్రవర్తులు. దీంతో, ప్రతి ఆభరణంలో ఆ రాజసం తొంగిచూస్తూనే ఉంటుంది.  అంత డబ్బు పెట్టి కొనలేమని నిరాశపడాల్సిన అవసరమూ లేదు.  వీటి పోలికలతో అనుకరణ నగలు కూడా వస్తున్నాయి.  

నచ్చినట్టుగా 
గడియారం అనేది సమయం చూసుకోవడానికనే అనుకుంటారు. కానీ, ఆ పెద్దముల్లూ చిన్నముల్లూ మధ్యలో.. మనకు ఇష్టమైన వ్యక్తి ఛాయాచిత్రం కనిపిస్తూ ఉంటే.. వాళ్లను చూస్తూ సమయాన్ని కూడా మరచిపోతాం! ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో - అంటూ ఆత్మీయుల్ని తలచుకుని పాడుకోవచ్చు కూడా.  అవును, ఇప్పుడు అలాంటి పర్సనలైజ్‌ గడియారాలు  మార్కెట్‌లోకి వచ్చేశాయి. మనకు నచ్చినవారి ఫొటోలే కాదు.. సీనరీలు, ఇష్టదైవాల పటాలు.. ఒకటేమిటి, దేన్నైనా గడియారంలో అలంకరించుకోవచ్చు. 
తగిలించేయండి! 
ఒకప్పుడంటే వాలుజడలు ఉండేవి. మల్లెపూలు తురుముకోవడమూ ఉండేది. ఇప్పుడు హిప్పీ కటింగ్‌లు, కొత్తకొత్త హెయిర్‌ స్టయిల్స్‌ ఎంచుకుంటున్నారు అమ్మాయిలు.  కానీ, ప్రత్యేక సందర్భాల్లో  మాత్రం పెద్ద జడ వేసుకొని పట్టుచీర కట్టాలని మగువ మనసు తపించి పోతుంది. అలాంటప్పుడు సవరం పెట్టి, జుట్టు వేసి పూలు తురుముతారు. ఇంత కష్టం లేకుండా.. రెడీమేడ్‌ జడలు వచ్చేస్తున్నాయి. జుట్టును రెండు పాయలు అల్లి, హుక్‌ తగిలించుకోవడమే. బరువనిపిస్తే కాసేపు అలా పక్కన పెట్టి.. మళ్లీ ఏ ముహూర్తం సమయానికో వేసుకొని కల్యాణ వేదికంతా  తిరిగేయవచ్చు. పైగా ఈ తరహాలో  రకరకాల జడలు దొరుకుతున్నాయి. 
‘మల్టీ’ మెరుపులు 
ఎంత ఖరీదైన డ్రెస్‌ అయినా రెండోసారి వేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపరు. అదే డ్రెస్‌ను... ఎన్ని రకాలుగానైనా వేసుకొనే వెసులుబాటు ఉంటే, ఎగిరిగంతేస్తారేమో! చీరకట్టులో వివిధ  పద్ధతులు ఉంటాయి.  అదే మోడ్రన్‌ డ్రెస్‌లలో లేనేలేవు... అనేవారికి సమాధానంగా డిజైనర్లు కొత్త రకమైన డ్రెస్‌లను కుట్టేస్తున్నారు. ఉదాహరణకు ఓ డ్రెస్‌ను   ఏకంగా ఇరవై నాలుగు రకాలుగా వేసుకోవచ్చు. ముందు, వెనుక నెక్‌ డిజైన్లను మార్చుకోవచ్చు. కొన్ని టాప్‌లయితే.. నాలుగు నుంచి పది రకాలుగా ధరించవచ్చు. అలాగే స్కార్ఫ్‌లను కూడా డ్రెస్‌లుగా మార్చి కొత్త ట్రెండ్‌ని  సృష్టిస్తున్నారు.