ఆటా పాటా అదుర్స్‌

Sep 20, 2020 , 09:44:52

బిగ్‌బాస్‌ ఫేమ్‌ దీప్తీ సునయన కొత్త పాట లక్షల వ్యూస్‌ కొల్లగొడుతున్నది. ‘కార్తీక దీపం’ వంటలక్క  ఓనం పండుగ ముచ్చట్లు అభిమానులతో పంచుకున్నది. ‘నం.వన్‌ కోడలు’ బ్యూటీ చిట్కాలు చెప్పేస్తున్నది. ఆలస్యం ఎందుకు ఆ సంగతులు చదివేయండి..

పాట వైరల్‌ 

బిగ్‌బాస్‌-4  మొదలైంది. సీజన్‌ రెండులో దీప్తి సునయన గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత అడపాదడపా తన ఫ్రెండ్‌ షణ్ముఖ్‌తో కొన్ని వీడియోలు చేసింది. కానీ ఇప్పుడు సోనీ మ్యూజిక్‌ ద్వారా తను ఒక్కతే ఒక సాంగ్‌లో కనిపించి.. కుర్రకారు మతి పోగొడుతున్నది. అచ్చ తెలుగు ఆడపడుచులా చీర కట్టి ఎంతో ముద్దుముద్దుగా కనిపిస్తున్నది. ‘కాటుక కనులే..’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంటుంది. అందుకే యూట్యూబ్‌లో ఇరవై నాలుగు గంటల సమయంలోనే రెండు మిలియన్ల వ్యూస్‌ దాటిపోయాయి. పైగా టాప్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నది. 

వంటలక్క చక్కని చుక్క!

స్టార్‌ మాలో వచ్చే ‘కార్తీకదీపం’ సీరియల్‌కి ఫాలోయింగ్‌ ఎక్కువే. అందులో వంటలక్క.. అదేనండీ ప్రేమీ విశ్వనాథ్‌కి కూడా ఎంతోమంది  ఫాలోవర్స్‌ ఉన్నారు. కేరళకి చెందిన ప్రేమీ ఓనమ్‌కి సొంతూరుకి వెళ్లింది. పండుగ ఫుడ్‌ బాగా ఎంజాయ్‌ చేశానంటూ పోస్ట్‌లు పెట్టింది. అంతేకాదు.. అక్కడ ఓనమ్‌ ఫొటోషూట్‌ చేశానంటూ తన యూట్యూబ్‌ చానెల్‌లో ఫొటోలు  అప్‌లోడ్‌ చేసింది.  వాటిలో ఈ కేరళ కుట్టి చాలా అందంగా ఉందని కితాబు ఇస్తున్నారు అభిమానులు. ఉయ్యాల ఊగుతూ, పచ్చని పంటలతో ముచ్చట్లు చెబుతూ వంటలక్క చక్కని చుక్క అనిపించుకున్నది. కావాలంటే సోషల్‌మీడియాలో ఆమె ఫొటోలను ఒకసారి చూసేయండి. 

సరసు చిట్కాలు

జీ తెలుగు సీరియల్‌లో ‘నం.వన్‌ కోడలు’గా నటిస్తున్న మధుమిత అందరికీ సుపరిచితురాలే. ఆ ధారావాహికతో  సరసుగా అందరికీ దగ్గరయిందీ కన్నడ కస్తూరి.  అయితే.. ఈ అమ్మడు సోషల్‌మీడియా వేదికగా ఒక పోస్ట్‌ పెట్టింది. ఆయిలీ స్కిన్‌ వాళ్లు, ఇతర చర్మతత్వం ఉన్నవాళ్లు ఎలాంటి స్క్రబ్‌ వాడితే బాగుంటుందో సలహా ఇస్తూ తను పెట్టిన పోస్ట్‌కి అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు. తాను నేచురల్‌గా ఉండటానికే ఇష్టపడతానని, ఇంట్లో ఇవే ప్యాక్స్‌ వాడుతాననీ  మధుమిత అంటున్నది. వీలైతే.. అందరూ ట్రై చేయవచ్చు. 

సూటిగా సుత్తి లేకుండా! 

ఒక అమ్మాయీ అబ్బాయీ ప్రేమించుకుంటారు. అబ్బా యి లైఫ్‌లో సెట్‌ అవ్వలేదన్న అసంతృప్తితో వేరే కుర్రాడిని  పెళ్లి చేసుకుంటుంది ఆ అమ్మాయి. ఆ బాధలో ఉన్నప్పుడు అబ్బాయికి మరో అమ్మాయి పరిచయం అవుతుంది. మొదట్లో ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్‌ అయిపోతారు, ప్రేమికులుగా  మారుతారు. చివరకి వీరి కథ ఏమైందనేది ఇతివృత్తం.  ‘చోటీ జిందగీ’ పేరుతో యూట్యూబ్‌లో ఈ వెబ్‌సిరీస్‌ ఉంది. ఫీల్‌గుడ్‌తో వచ్చిన ఈ సిరీస్‌ ఆరు ఎపిసోడ్లు మాత్రమే ఉంటుంది. కంటెంట్‌ పాతదే అయినా.. ప్రజెంటేషన్‌ బాగుంది. చూడొచ్చు. కాలక్షేపానికి మినిమమ్‌ గ్యారెంటీ!

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD