మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sunday - Sep 13, 2020 , 04:39:55

మన రాష్ట్రం.. మన ఉద్యోగం

మన రాష్ట్రం.. మన ఉద్యోగం

జూన్‌ 2, 2014...ఆ రోజు తేదీ మాత్రమే మారలేదు.. తరతరాల చరిత్ర మారింది. పేరుకు పొలం ఉన్నా గంజినీళ్లకు నోచుకోని దౌర్భాగ్యం రద్దయింది.దశాబ్దాల పోరుకు తప్పని ఫలితం దక్కింది. ఘన తెలంగాణ మన సొంతమైంది. ఈ రాష్ట్రం నాది అని ప్రతి స్థానికుడూ గర్వంగా చెప్పుకోగలిగే కల సాకారమైంది.

అది ఓ ఆరంభం మాత్రమే. మన బతుకుల్ని చేతిలోకి తీసుకున్న అవకాశం మాత్రమే. అప్పటికి తెలంగాణ పేరుకే గొప్ప రాష్ట్రం. కాకతీయులతోనే దాని వైభవం ఆగిపోయింది. రాజధానికి కూతవేటు దూరంలోనే అభివృద్ధికి కంచె పడింది. ఇక నుంచి ప్రతి ఊరూ భాగ్యనగరిగా మారాలి, ప్రతి బతుకూ సాఫ్ట్‌వేర్‌లా వెలగాలి. ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు. వెయ్యేండ్ల వెనుకబాటుతనాన్ని తిరగరాయాల్సిన భగీరథ ప్రయత్నం! సమర్థమైన నాయకత్వంతో ఆ ఫలితాలు కనబడుతున్నాయి. కాదనలేని గణాంకాలు, నవ శకానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం... నీళ్లు, నిధులు, నియామకాల వివక్ష నుంచే పురుడుపోసుకుంది. నియామకాలలో జరిగే అన్యాయంతోనే, తెలంగాణ యువతలో సొంత రాష్ట్రం సాధించాలనే తపన కలిగింది. ఎన్నో నిర్బంధాలను సహించి ఉపాధి హక్కుల కోసం ఆరవై ఏండ్లు పోరాటం సాగింది. ఉద్యమ నేత కేసీఆర్‌ బాటలో కలిసి నడిచి అనుకున్నది సాధించినం. అందరి ఆశలకు అనుగుణంగా తెలంగాణను తీర్చిదిద్దుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కొక్కటిగా లక్ష్యాలను సాధిస్తున్నారు. పరిపాలనలో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా నిలుపుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలోని తొలి నినాదం నీళ్లు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చేపట్టిన జలదీక్ష వల్ల ఇప్పుడు ఊరూరా జలసిరి ఉట్టిపడుతున్నది. సాగు రెట్టింపయ్యింది. తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణిగా మారుతున్నది. సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయం, అనుబంధ రంగాలు జోరందుకున్నాయి. దీనితో ఎక్కువ మంది యువత స్వయం ఉపాధి పొందుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో మన ‘నిధులు’ దారి మళ్లినయ్‌. తెలంగాణ రాగానే ఇది మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ-షాదీముబారక్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి... ఇట్లా సామాన్యుల జీవితాలను మార్చే పథకాలెన్నో మన నిధులు ఖర్చవుతున్న తీరును చెప్పకనే చెబుతున్నాయి.

ఉద్యమంలో మరో ముఖ్య నినాదం నియామకాలు. ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ఖాళీ అవుతున్న పోస్టుల భర్తీ జరుగుతున్నది. ఉన్నత చదువులు పూర్తి చేసే వాళ్ల సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వ పరంగా ఖాళీ అయ్యే ఉద్యోగ అవకాశాలు పరిమితమే. అందుకే పట్టణాలు, గ్రామాల్లోని యువతకు ఉపాధి కోసం అవకాశాలను సృష్టించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే, పరిశ్రమల ఏర్పాటుకు ఎలా వ్యవహరించాలనే దానిపై దేశ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో చర్చించారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపే ప్రణాళిక రచించారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో దేశంలోనే ఆదర్శవంతమైన పాలసీని రూపొందించారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌ విండో అనుమతులు ఇచ్చేలా టీఎస్‌ ఐపాస్‌ విధానాన్ని తెచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులనూ గరిష్టంగా 15 రోజులలోపు అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. టీఎస్‌ ఐపాస్‌తో పాటు కరెంటు సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇలా వచ్చిన పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి కల్పించే దిశగా ఆలోచన చేసింది. తెలంగాణ ఉద్యమ నినాదంలో ముఖ్యమైన ‘నియామకాలను’ యువతకు అందించేలా కొత్త విధానాన్ని రూపొందించి ఆగస్టు 5న ఆమోదించింది.

ద్విముఖ వ్యూహం (విన్‌ విన్‌ స్టాటజీ)

టీఎస్‌ ఐపాస్‌ పారిశ్రామికంగా మన దేశంలోని ఉత్తమ పాలసీగా నిలిచింది. ఇది అమలులోకి రాగానే తెలంగాణకు పరిశ్రమలు వెల్లువెత్తాయి. ఇలా వస్తున్న పరిశ్రమలలో తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్‌... పరిశ్రమల మంత్రి  కె.తారకరామారావును ఆదేశించారు. తెలంగాణ యవతకు ఉపాధి కల్పన అవకాశాలు పెంచేలా, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేలా ద్విముఖ వ్యూహంతో మంత్రి కేటీఆర్‌ కొత్త విధానం రూపొందించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి కచ్చితంగా తమ వాళ్లకు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అనే కండిషను పెడితే మేలు చేయకపోగా పారిశ్రామిక ప్రగతికి అడ్డంకిగా మారుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే స్థానికులకు నిర్దేశించిన కోటా మేరకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అనే విధానాలు ఉన్నాయి. ఇలాంటి విధానాలు అక్కడ తిరోగమనంగా మారాయి. ప్రపంచ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రస్తుత పరిస్థితులకు ఇది పూర్తిగా భిన్నమైంది అయ్యింది. జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వం, స్థిర నివాస ప్రాతిపదికలపై అవకాశాల పరంగా వివక్ష చూపరాదనే రాజ్యాంగంలోని 16వ ప్రకరణానికి విరుద్ధమని పారిశ్రామిక వర్గాలు, సమాచార సాధనాలు సైతం దీనిపై విమర్శలు చేస్తున్నాయి. ఆ రాష్ర్టాల్లో ఈ రకమైన విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక ప్రగతికి అడ్డంకి ఏర్పడిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఇలాంటి పద్ధతిలో కాకుండా తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన వ్యూహాన్ని రూపొందించింది. పారిశ్రామిక ప్రగతిలో ముందున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి కొనసాగింపుగా ఉండేలా... మన యువతకు స్థానికంగానే ఉపాధి కల్పన జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో కొత్త విధానాన్ని రూపొందించింది. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు, తెలంగాణ యువతకు ఉభయతారకంగా కొత్త విధానం నిలిచింది.

యువతను తీర్చిదిద్దడం...

ఉపాధి కల్పించాలనే ఆదేశాలతో మాత్రమే పరిస్థితులు మెరుగుపడవని ప్రభుత్వానికి తెలుసు. వృత్తికి తగిన నైపుణ్యం లేని వారికి ఎవరైనా ఎందుకు అవకాశాలు ఇస్తారు! పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మన రాష్ట్రంలోని యువతకు ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచడం దీనిలో ముఖ్యం. రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో యువతను తీర్చదిద్దే నిరంతర ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పరిశ్రమలలో ఉండే అవకాశాలకు అనుగుణంగా యువత నైపుణ్యాన్ని పెంచుకుంటుంటుంది. దీంతో వచ్చిన ఉద్యోగ అవకాశాలను కాపాడుకునేందుకు వారిలో భరోసా కలుగుతుంది. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సమకూరుతాయి. ఈ ద్విముఖ వ్యూహంతో తెలంగాణ యువతకు సొంత రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు అపారంగా పెరుగుతాయి. పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా రాష్ట్రంలోని యువతకు ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని కల్పించే ప్రయత్నం మొదలైంది. ఇప్పటికే ఏర్పాటైన శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో యువతను తీర్చదిద్దే నిరంతర ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చింది. దీనివల్ల అందుబాటులోని ఉద్యోగ అవకాశాలను కాపాడుకునే భరోసా యువతలో కలుగుతుంది. అటు పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులూ సమకూరుతాయి. రాష్ట్రంలో నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమైన స్థానిక మానవ వనరులను ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా సంస్థల సహకారంతో అందిస్తుంది. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతలో నైపుణ్యాన్ని పెంచడంపైనా ప్రభుత్వం గట్టిగా ఉంది. దీనివల్ల పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉండడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ అకాడెమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) వంటి సంస్థలతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడం జరుగుతుంది. నైపుణ్యాన్ని పెంచడం కోసం ముఖ్యమైన పరిశ్రమలను పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐటీఐలతో అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతుంది. 

పరిశ్రమలకు గమ్యం... తెలంగాణ  

సొంత రాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనువుగా టీఎస్‌ ఐపాస్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా పెట్టుబడి పెట్టే వారి స్వీయ ధ్రువీకరణ ఆధారంగానే కార్యకలాపాలు మొదలుపెట్టవచ్చు. ఈ విప్లవాత్మకమైన టీఎస్‌ ఐపాస్‌తో రాష్ర్టానికి ఇప్పటివరకు రూ. 1,96,404 కోట్ల విలువైన పెట్టుబడులు, 13.9 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. వ్యాపార సరళీకరణ(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో తీసుకువచ్చిన అనేక సంస్కరణలతోనే ఈ పురోగతి సాధ్యమైంది. ఇలాంటి ఆచరణల ఫలితంగానే... రాష్ట్రం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం పారిశ్రామిక వృద్ధిని సాధించింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ వాటా 21 పాయింట్లు పెరిగి, అంతకుముందు ఉన్న 4.55 శాతం నుంచి 2019-20లో 4.76 శాతానికి చేరింది. ఎస్‌డీజీ ఇండియా సూచీ ప్రకారం ఏకంగా 82 శాతం ఆర్థికాభివృద్ధిని సాధించింది. అసమానతలను తగ్గించడంలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. 

కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించడం ఎంత ముఖ్యమో, కష్టాలలో ఉన్న సంస్థలను ఆదుకోవడమూ అంతే అవసరం. లేకపోతే, పారిశ్రామిక ప్రగతి ఓ ఆరంభపు ఆర్భాటంగానే మిగిలిపోతుంది. వాటిమీద ఆధారపడిన ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యంగా మారిపోతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం నిస్సత్తువగా ఉన్న పరిశ్రమలకు పునరుత్తేజాన్ని అందించేందుకు ఓ ‘హెల్త్‌క్లినిక్‌'ను ఏర్పాటు చేసింది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించేందుకు, వాటికి మార్గనిర్దేశనం చేయడానికి, అంకుర పారిశ్రామికవేత్తలకు అండగా ఉండేందుకు ‘తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌'(టీఐహెచ్‌సీఎల్‌)ను స్థాపించింది. ఖాయిలా పడిన, ఖాయిలా పడే ప్రమాదం ఉన్న వందల సూక్ష్మ, చిన్న పరిశ్రమలకిది భరోసా కల్పిస్తోంది. 

ఇదీ విధానం

రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలలో స్థానికులకు ఎక్కువగా ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం ఆమోదించింది. ఈ విధానంలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా పరిశ్రమలను రెండు కేటగిరీలుగా పేర్కొన్నారు. నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలలో తెలంగాణ యువతకు ఇవ్వగలిగే అవకాశాల ఆధారంగా ఈ కేటగిరీలను పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు టీ-ప్రైడ్‌, టీ-ఐడియా పథకాలను అమలు చేస్తున్నది. స్థానికులకు ఉపాధి కల్పిస్తే ఇందుకు అదనంగా మరిన్ని ప్రోత్సాహకాలను అందించనుంది.

మొదటి కేటగిరి:

పాక్షిక నైపుణ్యం గల మానవ వనరులలో స్థానికులు 70 శాతం ఉండాలి. నైపుణ్యం కలిగిన మానవ వనరులలో స్థానికులు 50 శాతం ఉండాలి.

రెండో కేటగిరి:

పాక్షిక నైపుణ్యం గల మానవ వనరులలో స్థానికులు 80 శాతం ఉండాలి. నైపుణ్యం కలిగిన మానవ వనరులలో స్థానికులు 60 శాతంగా ఉండాలి. విమానరంగ, రక్షణ పారిశ్రామిక సముదాయాలుతెలంగాణ ప్రభుత్వం రక్షణ, విమాన రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. సాంకేతిక నిపుణులు, సౌకర్యాలు, కొనుగోలుదారులు, ప్రభుత్వం ప్రోత్సాహకాలతో ఎన్నో సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. జీఏంఆర్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌, హార్డ్‌వేర్‌ పార్క్‌ ఈ దిశగా అభివృద్ధి అయ్యాయి. యూనివర్సిటీలతో కలిసి పనిచేయడం, సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి బహుముఖ వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో అనుసరిస్తున్నది.

ఉపాధికి దివ్యౌషధం

జాతీయ స్థూల ఫార్మా ఉత్పత్తిలో 35 శాతం వాటా తెలంగాణదే. మూడున్నర లక్షల కోట్ల విలువ చేసే 800 ఫార్మా, బయోటెక్‌, వైద్య సాంకేతిక సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. 19 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫార్మా సిటీ ప్రపంచపు అతిపెద్ద సమీకృత ఫార్మా వ్యవస్థ. ఇక్కడ 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు... 5,60,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక భారతదేశపు మొదటి, అతిపెద్ద జీవశాస్త్ర ఉత్పత్తుల తయారీ సముదాయంగా జీనోమ్‌ వ్యాలీ ప్రసిద్ధికెక్కింది. సుమారు 150 సంస్థలు, 10 వేల ఉద్యోగులతో నడుస్తున్నది. ప్రముఖ వ్యాక్సిన్‌, పరిశోధన సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దుస్తులు, వస్త్ర పరిశ్రమ రంగాలను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందుకోసం ‘కాకతీయ భారీ వస్త్ర పరిశ్రమ పార్క్‌' లాంటి నాణ్యమైన సదుపాయాలు, వసతుల కల్పనకు నిధులను ఖర్చు చేస్తున్నది. తెలంగాణ వస్త్ర, దుస్తుల విధానం కింద సుశిక్షితులైన మానవ వనరులను, మెరుగైన సబ్సిడీలను అందిస్తున్నది. వస్ర్తాల తయారీలో గింజలు తీయడం, వడకడం, అల్లడం, రంగులు అద్దడం, బట్ట నేయడం వంటి వివిధ దశలలో సమగ్ర, సమీకృత విధానాన్ని అవలంబిస్తున్నది. ఈ మార్గంలో చేరుకుంటున్న కొన్ని లక్ష్యాలు...

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే కీలక గమ్య స్థానంగా నిలిచింది. అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. మరెన్నో పెద్ద సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలు తమ కార్యకలాపాల వేదికలను మార్చుకుంటున్నాయి. ఇలాంటి ఎన్నో సంస్థల చూపు తెలంగాణ వైపు ఉంటున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొన్ని పెట్టుబడులు ఇవీ...

 • స్వీడన్‌కు చెందిన ఐకియా తమ శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.
 • రూ.900 కోట్ల వ్యయంతో ఎం.ఆర్‌.ఎఫ్‌. లిమిటెడ్‌, మెదక్‌ జిల్లాలో తమ కార్యకలాపాలను విస్తరించింది.
 • వాల్‌మార్ట్‌ సుమారు 750 కోట్ల వ్యయంతో తమ శాఖను ప్రారంభించింది.
 • ఫ్లిప్‌కార్ట్‌ తమ అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించింది.
 • మొబైలు ఫోన్‌ తయారీదారు వన్‌ ప్లస్‌ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది.
 • ఫెర్రింగ్‌ ల్యాబోరెటరీస్‌ జీనోమ్‌ వ్యాలీలో రూ.235 కోట్లతో కార్యకలాపాలు ప్రారంభించింది. 
 • నోవార్టీస్‌ తమ నాలెడ్జ్‌ సెంటర్‌ను హైదరాబాదులో ప్రారంభించింది.
 • పరిశోధన, అభివృద్ధి సంస్థలు, అంకుర పరిశ్రమల కోసం ఎంఎన్‌ పార్క్‌, వెయ్యి కోట్ల రూపాయలతో రెండో దశ ఐహబ్‌ను 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిద్ధం చేసింది.
 • బోయింగ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఉమ్మడిగా... అపాచీ హెలికాఫ్టర్‌ కోసం అవసరమయ్యే పైభాగాల కర్మాగారాన్ని స్థాపించింది. 
 • కల్యాణీ-రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ సంస్థ, క్షిపణి ఉపవ్యవస్థ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. 
 • మెడ్‌ ట్రానిక్‌ సంస్థ రూ.1200 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.logo