బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sunday - Sep 13, 2020 , 04:06:57

పాటే చేరదీసింది

పాటే చేరదీసింది

‘జానపదం నా తల్లిలాంటిది. నేను నడిచిన దారుల్లోని మట్టి సుగంధాల జాడను ఎప్పటికీ మరచిపోను. ప్రధాన స్రవంతి సినిమా సంగీతంతో పాటు నా అభిరుచుల్ని ప్రతిబింబించే ప్రైవేట్‌ పాటల్ని కూడా అందించాలనుకుంటున్నా’ అని అంటున్నారు తెలంగాణ యువ సంగీతకారుడు భీమ్స్‌. గీతరచయితగా, స్వరకర్తగా తెలుగు చిత్రసీమలో ఆయన అందరికి సుపరిచితుడే. ‘నువ్వా నేనా’, ‘కెవ్వు కేక’, ‘జోరు’, ‘బెంగాల్‌ టైగర్‌', ‘నక్షత్రం’, ‘గాలిపటం’, ‘పీఎస్‌వీ గరుడవేగ’ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. స్వీయరచనలోఇటీవల ఆయన స్వరపరచిన ‘ఎల్లి పోతావురా మనిషి’ ప్రైవేట్‌ గీతం విశేష ఆదరణ సంపాదించుకున్నది. ఈ నేపథ్యంలో ‘బతుకమ్మ’తో భీమ్స్‌ పంచుకున్న సంగతులు..

నాకు చిన్నతనం నుంచే పాటపై మమకారం ఏర్పడింది. పాఠశాలలో నిర్వహించే పాటల పోటీల్లో తప్పకుండా పాల్గొనేవాడిని. మా స్వస్థలం ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామం. అక్కడి మనుషులు, పెరిగిన వాతావరణం.. కాలేజీ రోజుల్లో అధ్యాపకుల ప్రోత్సాహం, మిత్రుల సాంగత్యంతో పాటంటే మరింత అనురక్తి కలిగింది. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే ఓ ప్రేమకవిత రాశాను. ఆ వయసులో ప్రేమ భావనలు.. వాటి గాఢత గురించి ఎలాంటి అవగాహన లేదు. అయినా నాలోని అపరిపక్వ భావాల్ని ప్రకటిస్తూనే పాట రాశాను. నాతోటి సహచరులు అద్భుతంగా ఉందని మెచ్చుకోవడంతో భవిష్యత్తులో గీత రచనను సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నా. పదో తరగతి తర్వాత జెమిని టీవీ నిర్వహించిన ‘వన్స్‌మోర్‌' కార్యక్రమంలో సెమీఫైనల్‌ వరకు చేరుకున్నా. అక్కడ నా ప్రతిభను గమనించిన చాలా మంది సినిమాల్లో ప్రయత్నిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

వంద రూపాయలతో హైదరాబాద్‌కు..

దర్శకుడు తేజ హవా నడుస్తున్న రోజులవి. ఆయన కొత్తవాళ్లకు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నారని చెప్పడంతో వంద రూపాయలు పట్టుకొని హైదరాబాద్‌ రైలెక్కాను. జీవితంలో హైదరాబాద్‌ రావడం అదే తొలిసారి కావడంతో అంతా అయోమయంగా అనిపించింది. కొన్ని రోజుల పాటు తేజ ఆఫీసు చుట్టూ తిరిగాను. ఓ రోజు కుండపోత వర్షం కురుస్తున్న టైంలో చేతిలో పాటల కాగితాల్ని పట్టుకొని తేజ ఆఫీసు బయట నిలబడి ఉన్నా. అప్పుడే తేజ సన్నిహితుడు సూర్యనారాయణరాజు నన్ను చూశారు. ‘చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నా. ఏం కావాలనుకుంటున్నావు’ అని అడిగారు. పాటలు రాస్తానని చెప్పడంతో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిని కలవమని సలహా ఇచ్చారు. ఆయనకు నా పాటలు బాగా నచ్చడంతో డైరెక్టర్‌ ఎన్‌.శంకర్‌ దగ్గరకు వెళ్లమని సూచించారు. ఆరునెలల తర్వాత శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఆయుధం’ (2003)సినిమాలో గీత రచయితగా అవకాశమొచ్చింది. ఆ చిత్రంలో ‘ఓయ్‌ రాజు కన్నుల్లో నువ్వే’ పాట అద్భుతమైన ప్రజాదరణ సొంతం చేసుకుంది. అలా నా పాటల ప్రయాణం ఆరంభమైంది.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

గీత రచయితగా పరిశ్రమలో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మరోవైపు చదువుపై కూడా దృష్టిపెట్టాను. అలా ఇండస్ట్రీలో ఆరేళ్లు గడచిపోయాయి. ఒక సినిమాకు సంగీత దర్శకుడిగా ఛాన్స్‌ వచ్చి చివరి నిమిషంలో చేజారింది. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.  జీవనోపాధికి ఎలాంటి ఉద్యోగం లేదు.. పరిశ్రమలో అవకాశం మిస్సయింది.. ఏం చేద్దాం? అనే ఆందోళనతో కుంగిపోయాను. ‘ఈ పరిస్థితికి ఎవరినీ నిందించలేం. నా దగ్గరే ప్రయత్నలోపం ఉందేమో!’ అన్న ఆలోచనలు చుట్టుముట్టాయి. తీవ్రమైన మానసిక సంఘర్షణతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అదే సమయంలో బీఈడీలో సీటు రావడంతో రాజమండ్రి వెళ్లాను. అక్కడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆత్మహత్యకు ముందు ఒక్కసారి నా కాలేజీ ఎలా ఉందో చూసొద్దామనే కోరిక పుట్టింది. కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే విద్యార్థుల సందడి, సీతాకోకచిలుకల్లా, అందమైన పక్షుల్లా  విహరిస్తున్న వారి స్వేచ్ఛాప్రియత్వం నాలో పరివర్తన తీసుకొచ్చింది. తిరిగి బాల్యంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది. ఆ క్షణమే ఆత్మహత్య ఆలోచనను విరమించుకొని తిరిగి సాధారణ జీవన స్రవంతిలో కలిశాను. అది జరిగిన ఏడాది తర్వాత సంగీత దర్శకుడిగా నాకు అవకాశమొచ్చింది.

మానవీయ కోణం ‘ఎల్లి పోతావురా మనిషి’ 

చిత్రసీమలో జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. కింద పడిన ప్రతిసారి కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడాలనే తపనతో పనిచేస్తాను. నా శక్తిసామర్థ్యాల మీద నాకు అచంచల విశ్వాసం ఉంది. ఇప్పటివరకు పనిచేసిన ప్రతి సినిమాకు స్వరకర్తగా పరిపూర్ణంగా న్యాయం చేశాననే భావిస్తున్నా. కాబట్టి నా పరాజయాలకు ఎవరూ కారణం కాదంటాను. మరింత కష్టపడటానికి వాటిని ప్రేరణగా తీసుకుంటా. ఎక్కడో పల్లెటూళ్లో ఉన్న నన్ను పాట ఇంతవరకు తీసుకొచ్చింది. పాటే ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది. చేరదీసి సాంత్వన చేకూర్చింది. అందుకే పాటకు ఎప్పుడు రుణపడి ఉంటా.  ఇటీవల నా స్వీయ రచనలో కంపోజ్‌ చేసిన ‘ఎల్లి పోతావురా మనిషి’ అనే ప్రైవేట్‌ గీతానికి సోషల్‌మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. మాననీయ భావాలు కలబోసిన గీతమని అందరూ ప్రశంసిస్తున్నారు. మనిషిలో గూడుకట్టుకున్న నిరాశ, నిస్పృహల్ని పారద్రోలే గొప్ప చైతన్య గీతమని మెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేసే ఆలోచన ఉంది. ఇక జానపదం నా పుట్టుక. నా తల్లిలాంటిది. నేను నడిచొచ్చిన మట్టి పరిమళం జానపదం. సోషల్‌మీడియా వేదిక ద్వారా మరిన్ని జానపద పాటల్ని చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం రంజిత్‌ మూవీస్‌ సంస్థలో ఓ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నా.

దర్శకుడి అభిరుచులకు తగినట్లుగా..

దర్శకుడు పాటకు సంబంధించిన సన్నివేశం గురించి వివరించినప్పుడు నేను అందులోకి పరకాయప్రవేశం చేస్తాను. సినిమా కథ మొత్తం తెలుసుకుంటాను. ఆ భావనలకు తగిన ప్రతిస్పందన వ్యక్తం చేసేలా ట్యూన్‌ తయారుచేస్తాను. దర్శకుడి అభిరుచుల్ని సంతుష్టి పరిచినప్పుడు ఆ ట్యూన్‌ ఓకే అవుతుంది. సాధారణంగా నేను ట్యూన్‌ ఇచ్చిన తర్వాతే అందుకు తగినట్లుగా రచయితల్ని పాట రాయమని కోరతాను.

‘నువ్వా నేనా’తో సంగీత ప్రయాణం

అల్లరి నరేష్‌, శర్వానంద్‌ కథానాయకులుగా నటించిన ‘నువ్వా నేనా’తో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం ఆరంభమైంది. అందులో ‘సర్‌ర్‌.్ర..వయ్యారి బ్లాక్‌బెర్రీ’ అనే పాట సంగీతప్రియుల్ని అలరించింది. తర్వాత కెవ్వుకేక, గాలిపటం, జోరు, బెంగాల్‌టైగర్‌, నక్షత్రం, పీఎస్‌వీ గరుడవేగ, పేపర్‌బాయ్‌ చిత్రాలకు స్వరాల్ని సమకూర్చాను. నేను సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు. బాల్యం నుంచే సహజాతంగా ఆ ప్రతిభ అబ్బింది. సప్తస్వరాలు ప్రకృతి నుంచే ఉద్భవించాయి. నేను కూడా ప్రకృతిలో ఓ భాగం కాబట్టి సంగీతాభిరుచి కలిగింది అనుకుంటాను.

జీవితాంతం గుర్తుంచుకుంటా

రవితేజ కథానాయకుడిగా నటించిన ‘బెంగాల్‌ టైగర్‌' చిత్రానికి సంగీతాన్నందించాను. ఆ చిత్రంలోని ‘చూపులతో దీపాలా’ పాట రవితేజను ఎంతగానో ఆకట్టుకుంది ‘భీమ్స్‌..నా కెరీర్‌లో ‘మళ్లి కూయవే గువ్వా’ వంటి  పాట తర్వాత  ‘చూపులతో దీపాలా’ అంత గొప్ప పాట’ అని ఆయన మెచ్చుకున్నారు. ఆ గీతానికి దుబాయ్‌లో అవార్డు కూడా అందుకున్నా. రవితేజ ప్రశంసను జీవితాంతం హృదయంలో దాచుకుంటా. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నక్షత్రం’ సినిమాకు మ్యూజిక్‌ చేశాను. కృష్ణవంశీ నడిచే గ్రంథాలయం లాంటివారు. ఆయనతో మాట్లాడితే చాలు వందల పుస్తకాల జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ‘నక్షత్రం’ చిత్రం ప్రయాణంలో ఆయన నుంచి ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా.


logo