బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sunday - Sep 13, 2020 , 03:53:13

భిక్షువు చెబుతున్న కొవిడ్‌ పాఠం

భిక్షువు చెబుతున్న కొవిడ్‌ పాఠం

కొత్త సంవత్సరం రావడంతోనే... కాలం మనతో 20-20 ఆడేసుకుంది. రోజులు గడిచే కొద్దీ, పీడకలలే జీవితమయ్యాయి. అక్కడో వార్త ఇక్కడో వార్తగా వినిపించిన వైరస్‌, నేరుగా నట్టింట్లోకి వచ్చేసింది. భవిష్యత్తు సంగతి సరే... ఆర్థికం నుంచి ఆరోగ్యం వరకు జీవితమే కుదేలైపోయింది. ఇలాంటి సమయంలో మాథ్యూ రికా చెప్పే మాటలు కాస్త ఊరటనిచ్చి తీరుతాయి.

కొవిడ్‌ నుంచి మనం ఏం నేర్చుకోవాలని మాథ్యూ అనుకుంటున్నారు- ‘మనం ఈ ప్రకృతికే అధిపతులం అనే అహంకార ధోరణి ఉండేది. చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించాం కాబట్టి, జన్యువులనుకూడా మార్చగలుతున్నాం కాబట్టి... ఈ విశ్వానికి మనమే రారాజులం అనే భ్రాంతిలో ఉన్నాం. ఆ భ్రమని కొవిడ్‌ పటాపంచలు చేసేసింది. కాస్త వినయంగా ఉండమని చెప్పింది!’

డెబ్బై నాలుగు ఏండ్ల మాథ్యూ ఓ ఫ్రెంచ్‌ కుటుంబంలో జన్మించాడు. తల్లి పెయింటర్‌, తండ్రి రాజకీయ విశ్లేషకుడు. సహజంగానే వాళ్ల కుటుంబం మేధావుల మధ్య మెలిగేది. కానీ అంతమంది మధ్య ఉన్నా, మాథ్యూ మనసులో ఎన్నో ప్రశ్నలు. చర్చల్లో దొరకని జ్ఞానమేదో, మనసులో స్ఫురిస్తుందనే నమ్మకం. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌లో డాక్టరేట్‌ తీసుకున్నా... తెలియని అసంతృప్తి. ఓసారి మాథ్యూ టిబెట్‌ బౌద్ధులకు సంబంధించిన డాక్యుమెంటరీ చూడటం తటస్థించింది. వాళ్లని గమనించినప్పుడు ఫ్రాన్సెస్‌ ఆఫ్‌ అసిసి, సోక్రటిస్‌ లాంటి తత్వవేత్తలే గుర్తుకొచ్చారు. సమోన్నత హిమాలయ పర్వతాలకి తన మనసులోని అగాధాన్ని పూడ్చగల శక్తి ఉంటుందనిపించింది. వెంటనే హిమాలయాలకు బయల్దేరాడు. ఇక అక్కడే ఉండిపోయాడు. బౌద్ధభిక్షువుగా మారి, దలైలామాకు అనువాదకుడిగా స్థిరపడ్డాడు.

అత్యంత సంతోషకరమైన మనిషి

మాథ్యూ గురించి విన్న ‘విస్కిన్‌సన్‌-మాడిసన్‌' అనే యూనివర్సిటీ అతని మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసుకునేందుకు ఓ పరిశోధన చేపట్టింది. పన్నెండేళ్ల పాటు సాగిన ఈ పరిశోధన కోసం తరచూ మాథ్యూ తల మీద వందకు పైగా సెన్సర్లు అమర్చేవారు. ఆయన మెదడులో వెల్లువెత్తుతున్న గామా తరంగాలు పరిశోధకులను ఆశ్చర్యపరిచాయి. మనసులో సంతోషం, దయ, తృప్తి లాంటి అనుభూతులు కలిగినప్పుడే ఈ గామా తరంగాలు కనిపిస్తాయి. అలాంటిది మాథ్యూ నిరంతరం వాటి మధ్యే ఉండటం విచిత్రం. అందుకనే మాథ్యూని ‘ప్రపంచంలోనే సంతోషకరమైన వ్యక్తి’గా ముద్ర వేశారు. కానీ ఆ మాటని మాథ్యూ కొట్టి పారేస్తాడు. ‘ఏడువందల కోట్ల మందిలో ఎవరు ఎంత సంతోషంగా ఉంటున్నారో... ఎలా చెప్పగలరు!’ అంటారు. పోనీ తన ప్రశాంతతకు కారణం ఏమిటని అడిగితే... ‘సుఖం వేరు, సంతోషం వేరు అన్న విషయాన్ని గుర్తించాలి. డబ్బు, పరపతి లాంటి వాటితోనే సంతోషం దక్కుతుందనేది భ్రమగానే మిగిలిపోతుంది. ఆ పోలిక ఎప్పటికీ మీలో అసంతృప్తినే మిగులుస్తుంది. నిజమైన సంతోషం కావాలంటే, మనసుని గెలిచేందుకు నిరంతరం సాధన చేయాల్సిందే’ అంటారు. మరి ఇప్పటి మహమ్మారి గురించి మాథ్యూ ఏమంటారు!

కొవిడ్‌ పాఠాలు

‘కొవిడ్‌ మనకి మరణ భయాన్ని పరిచయం చేసింది. కాబట్టి జీవితం ఎంత విలువైందో గ్రహించాలి. బతుకులోని ప్రతి రోజునీ ఆస్వాదించాలి’ అంటారు మాథ్యూ. ‘కొవిడ్‌ రాగానే ప్రభుత్వాలన్నీ తక్షణ చర్యలు తీసుకున్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఎలాంటి ఆదేశాలనైనా పాటించేందుకు సిద్ధంగా ఉన్నారు. మంచిదే! కానీ ఇదే చిత్తశుద్ధిని గ్లోబల్‌ వార్మింగ్‌, జీవజాతులు అంతరించిపోవడం లాంటి సమస్యల పట్ల కూడా చూపిస్తే ప్రపంచం మరింత మెరుగవుతుంది... ఎందుకంటే పర్యావరణ రక్షణ మన చేయి దాటిపోతే అసాధారణమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది’ అని సూచిస్తారు. మరి కొవిడ్‌తో పాటు వచ్చిన ఏకాంతం గురించి మాథ్యూ ఏమనుకుంటున్నట్టు! నిజానికి మాథ్యూలాంటి భిక్షువులకి ఐసొలేషన కొత్తేమీ కాదు. ధ్యానం కోసం వాళ్లు నెలలు తరబడి గుహల్లో నివసిస్తూనే ఉంటారు. ‘మనసుని ప్రశాంతంగా ఉంచుకో, అది చెప్పే మాట వినే ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఎంత కాలమైనా, ఎలాంటి కాలమైనా తేలికగా సాగిపోతుంది’ అంటారు.


logo