బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sunday - Sep 13, 2020 , 03:46:45

తన రక్షణే.. మన రక్షణ!

తన రక్షణే.. మన రక్షణ!

కాలుష్యం వలనో.. కరోనా వలనో అందరం ముఖానికి ‘మాస్క్‌' ధరిస్తున్నాం. ‘కొవిడ్‌'తో పాటు అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌ల నుంచి కాపాడుతున్న ఆ ‘రక్షణ’ను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాం. అలాంటిది.. జీవకోటికి నిలయమైన ఈ ధరణికి ‘ప్రాణ కవచం’ అయిన ‘ఓజోన్‌' విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాం. ‘భూమాత’కు తీరని అన్యాయం చేస్తున్నాం. 

‘ఓజోన్‌ పొర’.. భూమికి రక్షణ కవచంగా పేరుగాంచింది. సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి, ఈ గ్రహంపై ఉండే సకల జీవులనూ కాపాడుతున్నది. ప్రాణికోటికి ప్రకృతి అందించిన వరం ఈ ఓజోన్‌. కానీ, మనిషి స్వార్థానికి అన్యాయంగా బలవుతున్నది. ఆధునిక జీవనంతో పల్లె నుంచి పట్టణం దాకా ‘కాలుష్యం’ కోరలు చాస్తుండగా, భూరక్షణ కవచం ప్రమాదంలో పడింది. క్రమక్రమంగా క్షీణిస్తుండటాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి, ఓజోన్‌ పరిరక్షణకు ప్రపంచ దేశాలను ఏకం చేసింది. సెప్టెంబర్‌ 16ను ‘ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం’గా నిర్వహిస్తున్నది. 

భూ ఉపరితలంపై స్ట్రాటోస్పియర్‌ ఆవరణంలో ఉండే ఓజోన్‌ పొరను 1930లో కనుగొన్నారు. 25 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతి శక్తిమంతమైన, ప్రమాదకరమైన కిరణాలను స్ట్రాటోస్పియర్‌ ఆవరణంలోనే ఓజోన్‌ సంగ్రహించుకుంటుంది. అయితే, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని రకాల కర్బన సమ్మేళనాల ద్వారా స్ట్రాటోస్పియర్‌ ఆవరణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఓజోన్‌ పొర క్రమక్రమంగా క్షీణిస్తున్నది. ఈ పొరకు రంధ్రాలు ఏర్పడటం వల్ల సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపైకి చేరుతున్నాయి. ఈ విషయాన్ని 1987లోనే గుర్తించిన శాస్త్రవేత్తలు, ఓజోన్‌ పొరకు వాటిల్లుతున్న ముప్పును అరికట్టాలని ప్రపంచ దేశాలకు సూచించారు. ఈ క్రమంలోనే 1994 సెప్టెంబర్‌ 16న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వివిధ దేశాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఓజోన్‌ క్షీణతను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ‘ఓజోన్‌' సంరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ఏటా సెప్టెంబర్‌ 16న ‘ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం’గా జరుపాలని నిర్ణయించారు. 

‘పొర’పాట్ల వల్లే.. 

మనిషి తన అవసరాల కోసం వినియోగిస్తున్న అనేక రకాల పరికరాలతో ప్రకృతి ఎప్పటికప్పుడు ప్రమాదంలో పడుతూనే ఉన్నది. మోటారు వాహనాలు పెరుగడం, పరిశ్రమల నుంచి వస్తున్న విష వాయువుల వల్ల రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్నది. శాస్త్రవేత్తల హెచ్చరికలను కూడా పట్టించుకోకపోవడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. హేలోన్స్‌, మిథైల్‌ క్లోరోఫామ్‌, మిథైల్‌ బ్రోమైడ్‌, సీఎఫ్‌సీ వంటి రసాయన సమ్మేళనాలు విచ్చలవిడిగా గాలిలో కలిసిపోతున్నాయి. ఏరోసోల్‌ ఉత్పత్తులు, రిఫ్రిజిరేటర్లు, ఫోమ్‌ బ్లోయింగ్‌ అప్లికేషన్లు, ఇబ్బడి ముబ్బడిగా ఏసీలను వాడటం వల్ల ఓజోన్‌ పొర పలుచబడిపోతున్నది. మానవ తప్పిదాలతో సకల జీవరాశులపై హానికర ప్రభావం పడుతున్నది. మనుషుల్లోనూ కంటి సమస్యలు, చర్మ క్యాన్సర్లు, జన్యుపరమైన వ్యాధులు పెరుగుతున్నాయి. అనేక రకాలైన సముద్ర జీవులకూ ప్రమాదం వాటిల్లుతున్నది. 

భారత్‌ ముందడుగు..

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఓజోన్‌ రక్షణ కోసం 1993 నుంచే భారత్‌ రంగంలోకి దిగింది. మాంట్రియల్‌ ఒప్పందం మేరకు గడువు కంటే ముందుగానే అనేక నియంత్రణలు పాటించింది. ఈక్రమంలోనే సీఎఫ్‌సీ వంటి ఉత్పత్తులను నిలిపివేయడంతోపాటు 296 కన్వర్షన్‌ ప్రాజెక్టులకు ఆమోదం కూడా తెలిపింది. 2008లోనే క్లోరోఫ్లోరో కార్బన్‌ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది. 2020 నాటికి దేశంలో ‘హెలో హైడ్రోకార్బన్ల’ వాడకాన్ని నిషేధించాలని 2011 మాంట్రియల్‌ ప్రొటోకాల్‌, 2013లో క్యోటో ప్రొటోకాల్‌పై సంతకాలు చేసింది. 

మేల్కొంటేనే మనుగడ..

  • అందివచ్చిన విలాసాలను విచ్చలవిడిగా వాడుకోవడం తగ్గించాలి. 
  • ఏసీలు, కాస్మెటిక్స్‌, స్ప్రేల నుంచి ప్లాస్టిక్‌ వస్తువుల వాడకంలో పరిమితులను పెట్టుకోవాలి. 
  • సోలార్‌ విద్యుత్‌ వాడకాన్ని పెంచాలి. 
  • మితిమీరిన ఇంధన వాడకాన్ని తగ్గించాలి. 
  • క్లోరోఫ్లోరో కార్బన్‌ పదార్థాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. 
  • మొక్కలు నాటాలి. చెట్లను సంరక్షించాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. logo