శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 03:37:49

తెలంగాణ సినిమా కవులు... పది కాలాల పాట

తెలంగాణ సినిమా కవులు... పది కాలాల పాట

అప్పటికే 34 ఏండ్లయిన మనదేశ స్వాతంత్య్రం ఏమిచ్చింది? నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, దుర్మార్గాన్ని, దోపిడీతనాన్ని తప్ప అంటూ ప్రశ్నిస్తూ సాగుతుందీ పాట. మనది  ‘రామరాజ్యం’ అని గొప్పగా చెప్పుకుంటూంటాం. పాడిపంటల ఆ రామరాజ్యం నేడు గంజిదొరకక మాడిన డొక్కలతో, ఎండిన బతుకులతో అస్తవ్యస్తమైపోతున్నది. ఇదీ రామరాజ్యమా? అని గొంతెత్తి ప్రశ్నిస్తాడు ప్రభు. 

ఒకే ఒక్క పాటతో తెలుగు సినిమారంగాన్ని ఒక ఊపు ఊపిన కవి రాచపల్లి ప్రభు. ఆయన సినిమాల్లో ఒక్క పాట మాత్రమే రాశారు. అది ‘ఎర్రమల్లెలు’(1981) సినిమాలోని’ నాంపల్లి టేషను కాడి రాజాలింగో రాజాలింగా’ అనే పాట.  ప్రభు ప్రజానాట్యమండలి కళాకారునిగా ఉన్నప్పుడే రాసిన పాట ఇది. తరువాత సినిమాలోకెక్కి సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ  ఒక్క పాట కోసమే థియేటర్లకు వెళ్లిన వాళ్ళున్నారు. సామాజిక దృక్కోణంలో ఎలుగెత్తిన ఉప్పెనంటి గీతమిది. తెలుగు సినిమాల్లో 100 ఉత్తమ గీతాల్ని ఎంపిక చేసినపుడు అందులో ఈ పాట చోటు దక్కించుకోవడం విశేషం.

‘నాంపల్లి టేషను కాడి రాజాలింగో రాజాలింగా, రామారాజ్యం తీరూ జూడు శివా శంభు లింగా!’ అనే పాట వినని తెలుగువాడుండడు. ఆ రచయిత ఎవరో కాదు ఉద్యమకవిగా, వాగ్గేయకారుడిగా ప్రజానాట్యమండలిలో తన పాటలతో దరువేసిన ‘రాచపల్లి ప్రభు’.

సమాజాన్ని రిపేర్‌ చేసే పాట

ప్రభు హైదరాబాద్‌ పాత నగరంలోని శాలిబండకు చెందిన రాచపల్లి బాలయ్య, శాంతాదేవి దంపతులకు జన్మించారు. హైదరాబాద్‌లోనే మెట్రిక్యులేషన్‌ చేసి, మోటార్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. హైదరాబాద్‌ పేట్ల బురుజులోని పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో మోటారు మెకానిక్‌గా ఉద్యోగం చేస్తూనే జానపద సంగీతం, అభ్యుదయ గీత రచన ప్రవృత్తిగా సాగాడు. అభ్యుదయ భావజాలంతో ఆయన రాసిన పాటలు తొలి నుంచే ఆంధ్రదేశమంతా మారుమోగాయి. అయితే ప్రజానాట్యమండలి కళాకారుడిగా ఉంటూ ఆయన రాసిన’ నాంపల్లి టేషను కాడి రాజాలింగో’ అనే పాట 1970 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వేలాది వేదికలను ఉర్రూతలూగించింది. వేములవాడ జాతర పాట బాణీలో రాసిన ఈ గీతం విశేష జనాదరణ పొందింది.

ఎర్రమల్లెలని అద్దుకొని..

ప్రభు ఈ పాటతో అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను ప్రజల భాషలో, ప్రజల బాణీలో వ్యక్తం చేశాడు. ప్రజానాట్యమండలి గీతంగా ప్రతి నోటా మోగుతున్న ఈ పాటను రెడ్‌ స్టార్‌గా పేరొందిన మాదాల రంగారావు తాను దర్శకత్వం వహిస్తున్న ’ఎర్రమల్లెలు’ (1981) సినిమాలో ఉపయోగించుకున్నారు. గాయనిగా ఎస్‌.పి.శైలజకు ఇది తొలిగీతం. మాదాల రంగారావు కుమారుడు మాదాల రవి ఈ పాట ద్వారానే పరిచయం అయ్యారు. అప్పటికే ప్రజల్లో ప్రఖ్యాతి గాంచిన ఈ పాట సినిమాలోకెక్కిన తర్వాత మరింత ప్రాచుర్యం పొందింది. తెలుగు సినిమాల్లో 100 ఉత్తమ గీతాలను ఎంపిక చేసినపుడు ఆ జాబితాలో ఈ పాట స్థానం దక్కించుకుందంటే అది జనానికి ఎంత చేరువైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజాదరణతో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, నీలం రాజశేఖరరెడ్డి, తమ్మారెడ్డి సత్యనారాయణ తదితరుల ప్రశంసలు పొందిన పాట ఇది.

ప్రశ్నించిన పాట

ప్రభు ఈ పాటలో.. ‘తిందామంటే తిండీ లేదు ఉందామంటే ఇల్లే లేదు/చేద్దామంటే కొలువూ లేదు పోదామంటే నెలవూ లేదు’ అనే పంక్తుల్లో సమాజంలో అలుముకున్న పేదరికాన్ని, పేదల్ని పీల్చుకుతింటున్న దోపిడీ విధానాన్ని కండ్లకు కట్టినట్లు వివరించాడు. అప్పటికే 34 ఏండ్లయిన మనదేశ స్వాతంత్య్రం ఏమిచ్చింది? నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, దుర్మార్గాన్ని, దోపిడీతనాన్ని చుట్టూ  ముసురుకున్న అకృత్యాల చీకట్లను తప్ప. అంటూ ప్రశ్నించే వైఖరిలో ఈ పాట సాగుతుంది. మనది  ‘రామరాజ్యం’ అని గొప్పగా చెప్పుకుంటూంటాం. పాడిపంటలతో సస్యశ్యామలంగా సాగే ఆ రామరాజ్యం నేడు గంజిదొరకక మాడిన డొక్కలతో, ఎండిన బతుకులతో అస్తవ్యస్తమైపోతున్నది. ఇదీ రామరాజ్యమా? అని గొంతెత్తి ప్రశ్నిస్తాడు ప్రభు. ఈ పాటతోనే ఎర్రమల్లెలు సినిమా బాగా పాపులర్‌ అయింది.

సమాజంలో వేళ్ళూనుకుపోయిన అవినీతిని  చీల్చివేయాలనే దృఢసంకల్పంతో రాచపల్లి ప్రభు రాసిన ఈ పాట, తెలుగు సినిమా బతికున్నంతకాలం ఉంటుంది. ఒక్క పాటతోనే రికార్డు నెలకొల్పిన రాచపల్లి ప్రభు 2020 జూన్‌ 16 న మరణించారు.


logo