మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 02:57:57

ఈవారం కథ విస్మృతి

ఈవారం కథ విస్మృతి

9 కి 4 గంటల ముందు...విశ్వనాథానికి మెలకువ వచ్చింది. పైకి లేవకుండా అలాగే కాసేపు పడుకుండిపోయాడు. కొంతసేపయ్యాక మెల్లగా కళ్లు తెరిచాడు. గదిలో జీరోవాట్‌ బల్బు మంద్రంగా వెలుగుతోంది. కళ్లు నులుముకుంటూ గోడ గడయారంకేసి చూశాడు. ఐదుంపావు కావస్తోంది. రోజూ ఐదుగంటలకు నిద్ర లేవటం ఆయనకు అలవాటు. దుప్పటిని పక్కకు తీసి మంచంమీద నుండి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. 

ఇంటి బయట ఆడవాళ్ల గొంతులు వినిపిస్తున్నాయి. పెందరాళే లేచి ఇంటి ముందు సందడి చేస్తున్నారు! తమ ఇంటి ముందరే కాదు, వీధి వీధంతా కోలాహలం వినిపిస్తోంది. మెల్లమెల్లగా ఊరూ వాడా, పల్లె పట్టణమూ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంటోంది. పండుగంటే మామూలు పండుగ కాదు. ఉగాది పండుగ! తెలుగు సంవత్సరాది. తెలుగువాళ్లకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినం.

ఉగాది పండుగకు ఎక్కడెక్కడి వాైళ్లెనా, ఎంత దూరంలో ఉన్నా, తమతమ సొంత ఊళ్లకు చేరుకుని తమ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల మధ్య ఆనందంగా గడుపుతారు. ఎవరింట చూసినా సంబరం అంబరాన్నంటుతోంది.   

రెండురోజుల క్రితమే కూతురూ, అల్లుడూ, కొడుకూ, కోడలూ, మనవళ్లూ అందరూ పట్టణాల నుండి వచ్చేశారు. నిన్న మొన్నటిదాకా బోసిపోయిన ఇల్లు ఇప్పుడు ఎంతగానో కళకళలాడుతోంది. ఏదో తెలియని కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది.

విశ్వనాథం ఉత్సాహంగా కదిలి పెరట్లోకి నడిచాడు. ముఖం కడుక్కుందామని స్నానాలగది వైపు వెళ్లబోయాడు. 

“నాన్నా, ఆగాగు! వొదిన స్నానం చేస్తోంది. వొదిన వచ్చాక వెళుదువులే, కాసేపాగు!” నడుమ్మీద నీళ్ల బిందె పెట్టుకొని ఎదురొస్తూ గబగబ చెప్పి ఇంట్లోకి వెళ్లింది ఆయన కూతురు ఊహ. 

చేసేదేమీలేక ఇంటిముందున్న గేటు దగ్గరికెళ్లి నిలబడ్డాడు. తమ ఇంటి ముందు చక్కగా కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు! దాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది ఆయనకు. తలతిప్పి వీధిలోకి దృష్టిని సారించాడు. అందరిళ్ల ముందూ పెద్దపెద్ద ముగ్గులు దర్శనమిస్తున్నాయి. అబ్బ! ఎంత బావున్నాయి. ఆడవాళ్లకే ఒంటబట్టిన బ్రహ్మ విద్య. చెయ్యి తిరిగిన విద్య. విదేశీయులను విస్మయానికి గురిచేస్తున్న కళాత్మక విద్య.

“నాన్నా. నీ దిష్టే తగిలేట్టుంది మన ముగ్గుకు. చూసింది చాలు కానీ కాస్త ఆ పొయ్యి ముందు కూర్చుని  కట్టెపుల్లల్ని అప్పుడప్పుడు కాస్త ఎగదోస్తుండు నాన్నా!” అని చెప్పి ఈమారు ఖాళీ బిందెతో విసవిసా బయటికెళ్లిపోయింది ఊహ.

మెల్లగా వెళ్లి పొయ్యి ముందున్న పీటమీద కూర్చున్నాడు విశ్వనాధం.

‘ఇంతకీ పార్వతి ఏం చేస్తున్నట్టు? తను లేచి అర్ధగంటైనా కనిపించదేంటీ!’ మనసులో అనుకున్నాడు విశ్వనాధం.

పండగొస్తే పార్వతిని పట్టటానికి వీలుకాదు. అందులోనూ పిల్లలు ఊర్నుండి వచ్చారంటే చాలు... ఇక ఆమె కాలూ చెయ్యీ ఊరుకోదు. బొంగరంలా గిరగిర తిరుగుతుంటుంది. క్షణం తీరికలేకుండా పనుల్లో మునిగిపోతుంది. నిజం చెప్పాలంటే తమ ఇంట్లో అందరికన్నా యాక్టివ్‌ పార్వతినే. ఒంటిచేత్తో అన్ని పనులూ మీదేసుకుని ఏ మాత్రం అలసటను కనిపించనీయకుండా ఉరకలెత్తుతుంటుంది. తనకన్నా పదేళ్లు చిన్నదైనప్పటికీ పాతికేళ్ల పడుచుపిల్లలా చకచకా పనులు చేసేస్తుంది. 

పెళ్ళయిన ఈ ముప్పై ఏళ్లల్లో ఏనాడూ ఒంట్లో బాగోలేదంటూ నాలుగు రోజులు కూడా పడకేసింది లేదు. అలాంటి పార్వతికి బి.పి, నడుమునొప్పి అప్పుడప్పుడూ బాధిస్తూ ఉంటాయి! అయినా వాటివల్ల తన దైనందిక పనుల్లో ఏనాడూ అలసత్వం ప్రదర్శించలేదు. తనకు ఏమేం కావాలో అన్నీ సమయానికి సమకూర్చిపెడుతుంది. సమయపాలన పాటించటం పార్వతి నుండే తామందరమూ నేర్చుకోవాలి. చక్కటి క్రమశిక్షణ కలిగిన ఇల్లాలు...

“తాతయ్యా...” అంటూ పరుగెత్తుకొచ్చి విశ్వనాథం మెడచుట్టూ చేతులేసి వీపుకి కరుచుకుపోయాడు మనవడు. 

“ఒరే, ఒరే... ఆగరా, అలా ఊగకురా. పొయ్యిమీద పడతావ్‌.” అంటూ వాడి ఊపును నియత్రించి వాణ్ణి ముందుకు లాక్కొని బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు విశ్వనాథం. ఆయన మీసాలు తగిలి కిలకిలా నవ్వాడు వాడు.

“ఊ అయితే, ఈసారి నువ్వు రెండో క్లాసుకు వెళతావన్నమాట!” అంటూ వాణ్ణి ఒళ్లో పడుకోబెట్టుకున్నాడు...

“సెకెండ్‌ క్లాసుక్కాదు తాతయ్యా, ధర్డ్‌ క్లాసుకు! అప్పుడే మరిచిపోయావా?” అంటూ బుంగమూతి పెట్టాడు వాడు. 

“లేదులేరా, నువ్వు ఏ క్లాసుకు వెళతావో నాకు తెలియదేంటీ? పక్కింటి పిల్లవాడు రెండుకు వెళ్లబోతున్నాడు లే. వాడు గుర్తొచ్చి అలా అడిగానంతే!!” సర్దిచెప్పాడు విశ్వనాథం. 

అలా అంటూ ఉండగానే ఆయన మాటలు కాస్త బలహీనంగా వచ్చినట్టుగా అనిపించింది ఆయనకు.  

ఈలోపు కోడలు స్నానం పూర్తిచేసుకుని వెళ్లిపోయింది. ఆ వెనకే కొడుకు స్నానానికి తయారై వచ్చి...“నాన్నా, నాకు నీళ్లు తోడేయ్‌, ఆలస్యమైతే మళ్లీ మీ కోడలు అరుస్తుంది.” అన్నాడు దండెంమీద ఆరేసిన తువ్వాలును తీసుకుంటూ...

‘ఊ, ఎవరి మాటా లెక్క చెయ్యనివాడు ఆఖరికి కోడలుకు చిక్కాడన్నమాట! బావుంది...’ అనుకుంటూ లేచి కొడుక్కి బక్కెట్లో నీళ్లుతోడి మళ్లీ ఆ పాత్రలోకి నీళ్లు నింపి, పొయ్యిముందు కూర్చుని, బయటున్న కట్టెపుల్లల్ని పొయ్యిలోకి ఎగదోశాడు.

‘పార్వతి కనిపించదేమిటబ్బా? ఎంత తలమునకలయ్యేటంత పనులున్నా, తను నిద్రలేవగానే టీ తీసుకొచ్చి ఇస్తుందిగా. మరి ఇప్పుడు టీ ఇవ్వదేంటీ?! బిడ్డలొచ్చిన ఆనందంలో మర్చిపోయిందా?’ మనసులోనే అనుకున్నాడు విశ్వనాథ

9 కి 3 గంటల ముందు...

కొడుకు స్నానం పూర్తయ్యాక, అల్లుడు, మనవళ్ల స్నానాలు కూడా పూర్తయ్యేంతవరకూ విశ్వనాధం పొయ్యిముందు నుండి కదలలేకపోయాడు. చాలాసేపు పీటమీదే కూర్చుని ఉండటంవల్ల నడుము పట్టేసినట్టుగా అనిపించింది ఆయనకు.

“నాన్నా... ఇక నువ్వు కూడా స్నానం చేసేయ్‌, నేనూ అమ్మా తర్వాత చేస్తాం!” అంటూ నీళ్లబిందెను మోస్తూ గబగబా ఇంట్లోకి వెళ్లింది ఊహ.

“ఊహా... అమ్మ ఎక్కడుంది?” అని అడిగిన ఆయన గొంతులో నుండి వచ్చిన సన్నని మాటలు ఊహకు వినిపించాయో  లేవో అన్న అనుమానం కలిగింది ఆయనకు. 

ఊహ ఇంట్లో నుండి వస్తూ... “అమ్మ పంచాయతీ ట్యాంకు దగ్గర నీళ్లు పడుతోంది నాన్నా. రావటానికి ఇంకో అర్ధగంట పడుతుంది!” అంటూ దాదాపు పరుగెడుతున్నట్టుగా బయటికి వెళ్లిపోయింది.

ఈలోపు కొడుకు, అల్లుడు, మనవళ్లు కొత్తబట్టలు ధరించి వసారాలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు.

కోడలు వాళ్లందరికీ కప్పుల్లో హార్లిక్స్‌ కలుపుకొచ్చి ఇచ్చింది. వాళ్లు కబుర్లు చెప్పుకుంటూ తాగుతుంటే ఈయనకూ తాగాలనిపించింది. తనకూ ఒక కప్పు తెచ్చిస్తుందేమోనని ఎదురుచూశాడాయన. కానీ కోడలు ఆ ప్రయత్నం చేయకపోయేసరికి  చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయాడు. పొయ్యి ముందునుండి లేచి టూత్‌బ్రష్‌మీద ఇంత పేస్ట్‌ పెట్టుకుని పళ్లు తోముకోసాగాడు. పళ్లు తోముతుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నట్టుగా అనిపించిందాయనకు. 

ఎలాగో నిగ్రంచుకుని బకెట్లోకి వేడినీళ్లు తోడుకొని తన స్నానం పూర్తిచేశాడు. గదిలోకి వెళ్లి  కొత్త పంచె, కొత్త చొక్కా తొడుక్కున్నాడు. వెళ్లి మంచంమీద కూర్చుని ఏం చెయ్యాలో తోచక, నిన్నటి దినపత్రికనే మరోమారు తిరగేశాడు. ఇవ్వాల్టి పత్రిక కొడుకో అల్లుడో చదువుతున్నట్టున్నారు. వాళ్ల దగ్గరనుండి తెప్పించుకోవాలనిపించలేదు ఆయనకు.

9 కి 2 గంటల ముందు...

కొంతసేపయ్యాక గదిలోని కిటికీ దగ్గరకెళ్లి బయటికి చూస్తూ నిలబడ్డాడు. రోడ్డున తెలిసినవాళ్లు వెళుతుంటే వాళ్లను చూస్తూ ఉండిపోయాడు. పండక్కొచ్చిన తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ వెళుతున్నారు వాళ్లు. పదినిమిషాలయ్యేసరికి నిలబడ్డానికి కూడా శక్తి లేనట్టుగా అనిపించి కిటికీ చువ్వల్ని గట్టిగా పట్టుకున్నాడు. 

ఇంతలో మనవడు, మనవరాలు పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చారు. ఆడుకుంటున్నారులా ఉన్నారు. ఒకరికి చిక్కకుండా ఒకరు తప్పుకుని అటుఇటు పరుగెడుతున్నారు. ఆ ఆటలో వాళ్లెంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు.  

ఐదు నిమిషాలయ్యాక వాళ్లు అలసిపోయి మంచంమీద కూర్చుని తమతమ చేతుల్లోని చాక్లెట్ల రేపర్‌లను కొద్దిగా చింపి తినటం మొదలుపెట్టారు. అవి ఖరీదైనవిలా ఉన్నాయి. చాలా పొడవుగా కూడా! దాన్నైనా తినాలనిపించింది ఆయనకు.

బలవంతంగా వాళ్ల చేతుల్లోనుండి తీసుకుని తినేయాలన్నంత కోరిక కలిగింది ఆయనకు. కానీ ఆ పని చెయ్యటం చిన్నతనంగానూ, అసహ్యంగానూ ఉంటుందనిపించింది. వాళ్లె తనకు ఒక ముక్క ఇస్తారనుకున్నాడు. కానీ పిల్లలు కదా, ఇవ్వలేదు! దాంతో వాళ్లను ఏమీ అడగలేక మౌనంగా ఉండిపోయాడు. 

ఉన్నట్టుండి ఒళ్లు తూలుతున్నట్టుగా అనిపించింది ఆయనకు.   

9 కి 1 గంట ముందు...

తనలో ఆ మార్పు కనిపించేసరికి కిటికీ దగ్గరనుండి కదిలి మంచంమీద కూర్చున్నాడు. కానీ ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు. మెల్లగా నడుము వాల్చి కళ్లు మూసుకున్నాడు. ఏదేదో ఆలోచిస్తూ పడుకున్నాడు.

ఇంతలో...“ఏమండీ...” అంటూ విశ్వనాథం భార్య పార్వతమ్మ ఆ గదిలోకి అడుగుపెట్టింది. 

కళ్లు తెరిచి భార్యకేసి చూశాడు. తలంటి స్నానం చేసుకొని వెంట్రుకలను చుట్టచుట్టి దానికి తువ్వాలు కట్టుకుంది. భార్యను చిరునవ్వుతో చూశాడు. “అలా ఉత్తినే సోమరిపోతులా పడుకోకపోతే వెళ్లి ఉగాదిపచ్చడి కోసం రెండు మామిడి కాయలూ, కాసింత వేప్పూతా పట్టుకురావొచ్చుగా...” అంది పార్వతమ్మ. అలాగే అన్నట్టుగా తలూపాడు విశ్వనాథం.

అంతలో కూతురు...“అమ్మా, ఏదీ నూనె ప్యాకెట్టు. బాణలి మాడిపోతోంది, త్వరగా తీసుకురా!” అని గొంతిచ్చేసరికి... “ఆ ఆ... ఇదిగో తెస్తున్నా...”అంటూ వంగి మంచం క్రిందున్న అట్టపెట్టెలో నుండి నువ్వులనూనె ప్యాకెట్‌ తీసుకొని వెళ్లిపోయింది. 

విశ్వనాధం భారంగా మంచంమీద నుండి లేచి గది బయటికొచ్చి కాళ్లకు జోళ్లు తగిలించుకొని వీధిలోకి నడిచాడు.

నాలుగు అడుగులు వేసేసరికి అడుగులు తడబడుతున్నట్టుగా అనిపించింది ఆయనకు.  

ఉదయం ఐదు గంటలకు లేచిన మనిషికి ఇప్పటివరకూ కడుపులో ఏమీ పడలేదు. నీరసంగా కూడా అనిపించింది. 

నాలుగిళ్ల తర్వాత ఉన్న గుర్నాథం ఇంట్లో వేపచెట్టుంది. కొన్ని కొమ్మలు ప్రహరీగోడ బయటిక్కూడా విస్తరించాయి. అక్కడికి చేరుకునేసరికి కింది కొమ్మల్లో పూత అస్సలు కనిపించలేదు. పండుగ కదా, ఊరివాళ్లు అన్నీ తెంపుకెళ్లినట్టున్నారు! పూతలేని ఒఠి ఆకులు తీసుకెళితే పార్వతి అరుస్తుందేమోనని ఇంకెక్కడైనా వేపచెట్టు కనిపిస్తుందేమోనని ముందుకు నడిచాడు.

మరో నాలుగడుగులు వేశాడు. సీతాపతి ఎదురుగా వస్తూ కనిపించాడు. “ఏమోయ్‌ సీతాపతీ, నీ చేతిలో ఉన్నది వేప్పూతేనా? రెండు రెమ్మలిలా ఇవ్వూ.” అనగానే పాపం, అతను కిమ్మనకుండా రెండు రెమ్మలు తీసిచ్చాడు విశ్వనాధానికి. 

ఉగాది పచ్చడిలోకి వేప్పూత సరే! మరి మామిడికాయలూ తెమ్మందిగా. పండుగపూట మామిడికాయలు అంత సులభంగా దొరుకుతాయా? కనీసం పిందెల్లాంటివైనా తీసుకెళితే ఏదో సంప్రదాయానికైనా రెండు ముక్కలు తరిగి పచ్చడిలో వేస్తుంది... అనుకుని ఆలోచిస్తూ ముందుకు అడుగులు వెయ్యసాగాడు. ఇంతకీ మామిడిచెట్టు ఎక్కడుందబ్బా? 

‘ఆ... రంగమ్మ గుడిసె ముందు ఓ మామిడిచెట్టు ఉండాలే?! అక్కడికెళితే కాయలు దొరుకుతాయేమో చూద్దాం! ఇంకెక్కడా మామిడిచెట్టు ఉన్న జ్ఞాపకం లేదు.’ అనుకుని అటుకేసి దారితీశాడు విశ్వనాథం. 

ఆసరికే రంగమ్మ చక్కగా స్నానంచేసి ఉతికిన బట్టలు కట్టుకుని కుంపటి ముందు కూర్చోనుంది. పళ్లెంలో దోసెలు పెట్టుకొని తింటూ కనిపించింది. పొయ్యిమీద పెనం ఇంకా దించనట్టుంది. కావలసినప్పుడు వేడివేడిగా దోసెలు పోసుకుని తింటున్నట్టుంది. విశ్వనాథం కనిపించగానే... “దండాలు బాబుగారూ. రండ్రండి?” అంటూ లేచి నిలబడబోయింది.

“కూర్చో కూర్చో. లేవకు రంగమ్మా! తింటున్నప్పుడు మధ్యలో లేవకూడదు, కూర్చో?” అన్నాడు ఆయన. 

“దాందేముందిలే బాబూ... తమలాంటి పెద్దలు మాబోటి వాళ్లిండ్లకు రావటమే గొప్ప!” అంటూ లేచి నిలబడింది. ఇక ఏం చెప్పినా ఆమె తనమాట వినిపించుకోదని... “అన్నట్టు, నీ కొడుకెలా ఉన్నాడు? పండక్కొచ్చాడా?” అని అడుగుతూ గుడిసె ముందుకొచ్చి తలపైకెత్తి మామిడి కొమ్మల్లోకి దృష్టిని సారించాడు. 

“నిన్ననే వొచ్చాడు బాబూ మా బొట్టడు.” అని ఆనందంగా బదులిచ్చింది రంగమ్మ.

“ఈ యేడైనా వాడికి పెండ్లి చేస్తావా? లేదూ ఇంకా ముదరబెడతావా?” నవ్వుతూ అడిగాడు విశ్వనాథం.

“యాడ బాబూ, వీడికంటూ ఒక ఉద్దోగం సద్దోగం ఉంటే కదా, ఎవురైనా పిల్లనిచ్చేటందుకు! పట్నంలో ఉద్దోగం దొరకటం అంత సుళువైన పనేనా బాబూ?” అదెంత కష్టమో ఆమె మాటల్లో తొంగిచూసింది.  

తల పైకెత్తి కొమ్మల్లోకి అటుఇటు చూస్తుంటే మళ్లీ కళ్లు బైరుకమ్మి ఒళ్లు తూలినట్టుగా అనిపించింది విశ్వనాథానాకి. తల విదిలిస్తూ కొమ్మల్లో నుండి దృష్టిని మరల్చాడు. పైన కొమ్మల్లో రెండుమూడు చిన్నచిన్న కాయలు కనిపించాయి. కానీ వాటిని తెంపాలంటే చెట్టెక్కాల్సిందే. అదిప్పుడు తనకు సాధ్యమయ్యే పని కాదు. ఎవురైనా ఎక్కి కొయ్యాల్సిందే. ఇప్పుడెలా?

“బాబూ, లేకలేక మా గుడిసెకొచ్చారు. రెండు దోసెలు ఏడేడిగా పోసిస్తా, తినండి బాబుగారు.” అంది రంగమ్మ. 

“ఒద్దు లే రంగమ్మా, మా ఇంటిది ఇంకాసేపట్లో టిఫిన్‌ పెట్టదూ నాకూ...” అంటూ నిస్త్రాణగా గుడిసె ముందున్న తిన్నెమీద కూర్చున్నాడు విశ్వనాథం. 

“పర్వాలేదులే... రెండు దోసెలు మాకాడ తింటే ఏంకాదు లే బాబూ.” అని పళ్లెం పక్కన పెట్టి చేతులు కడుక్కుంది. 

ఆమె మాటలు వినిపించుకోనట్టుగా నటిస్తూ...“మామిడికాయలు కావాలి రంగమ్మా. చెట్లో పై కొమ్మల్లో కనిపిస్తున్నాయి. చెట్టు నేనెక్కలేను. నువ్వూ కొయ్యలేవు. నీ కొడుకుంటే ఇలా పిలవ్వూ.” అన్నాడు విశ్వనాథం.

9 పూర్తయిన పావుగంట తర్వాత...

“అమ్మా ఊహా, మీ నాన్న వేప్పూతకని బయటికెళ్లి చాలాసేపైంది. ఎక్కడున్నాడో కాస్త వెతికి పిలుచుకురా! స్నేహితులు కనిపిస్తే చాలు ఇల్లు మరిచిపోతారాయన.” అంటూ కూతుర్ని పురమాయించింది పార్వతమ్మ. 

‘పండగపూట త్వరగా ఇంటికి రాకుండా, ఎక్కడున్నాడబ్బా...”అనుకుంటూ తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరింది ఊహ. వీధులన్నీ తిరిగి చివరికి రంగమ్మ గుడిసె దగ్గరికొచ్చింది. 

రంగమ్మ గుడిసె ముందు మామిడి చెట్టు కనిపించేసరికి ఠక్కున ఆగి, తండ్రికోసం అటుఇటు చూసింది. కనిపించలేదు. రంగమ్మను అడుగుదామని గబగబా గుడిసె దగ్గరికెళ్లింది. బయటున్న తిన్నె ముందు కాలిజోళ్ల జత కనిపించాయి. అవి తన తండ్రి వేసుకునే జోళ్లే. మరి మనిషి ఎటెళ్లాడబ్బా? ఇంతలో...

గుడిసెలోపల నుండి రంగమ్మ మాటలు వినిపించాయి. మెల్లగా కిటికీలో నుండి లోపలికి తొంగి చూసింది ఊహ. 

అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నోట మాట రాలేదు ఊహకు. తండ్రిని ఆ స్థితిలో చూసేసరికి బుస్సున కోపం ముంచుకొచ్చింది. ఆవేశంతో ఆయన్ను పిలవాలనుకుని నోరు తెరవబోయిన ఊహ, ఆ ప్రయత్నం మానుకుని ఠక్కున వెనక్కు తిరిగి ఇంటికేసి నడవసాగింది. ఇల్లు చేరుకునేంత వరకూ తన తండ్రి చేసిన పిచ్చిపనినే తలుచుకుంటూ పళ్లు పటపట కొరికింది. పిడికిళ్లు బిగించి నెత్తిన కొట్టుకుంది.   

వేగంగా అడుగులు వేస్తూ ఇల్లు చేరుకుని తల్లి చెవిలో తను చూసిన దృశ్యాన్ని గురించి చెప్పింది ఊహ.

ప్రస్తుతం...

కొంతసేపటికి ఇంటికి తిరిగొచ్చిన విశ్వనాథం ముఖంలో కాస్త చురుకుదనం, తెంపు కనిపిస్తున్నాయి. 

“పార్వతీ ఇదిగో వేప్పూత, వగైరా...” అంటూ తనచేతిలోని వాటిని భార్య చేతికందించి తన గదిలోెళ్లాడు.

“వేప్పూత అలా ఉంచండి... మీరు చేసిందేమిటీ?” అంటూ ఆయన వెనకనే గదిలోకొచ్చింది పార్వతమ్మ. 

విశ్వనాథం అల్మైరాలో నుండి ఒక ప్లాస్టిక్‌ బాక్సును బయటికి తీశాడు. 

“ఏం చేశానేంటీ?” అని అడుగుతూ ఆ బాక్సులో నుండి తను రోజూ వేసుకునే ఒకరకం మాత్రను తుంచి పక్కనపెట్టాడు. 

అది చూసి అవాక్కయ్యింది పార్వతమ్మ.

అది... అది... తన భర్త రోజూ టిఫిన్‌ తిన్నాక వేసుకునే షుగరు మాత్ర!. 

విశ్వనాధం మాత్రను నోట్లో వేసుకొని అక్కడున్న మంచినీళ్ల బాటిల్లోని నీళ్లను నోట్లోకి వొంపుకున్నాడు.

‘అయ్యో, ఎంత పని జరిగిపోయింది! పిల్లలొచ్చారన్న ఆనందంలో, పండుగ సంబరంలో, పనుల హడావిడిలో ఆయన గురించి తను అసలు పట్టించుకోనే లేదు. నిద్ర లేవగానే ఆయనకిచ్చే టీ ఇవ్వనేలేదు. రోజూ ఎనిమిదీ ఎనిమిదిన్నరకల్లా ఆయన టిఫిన్‌ తింటాడు. అది ఆయనకు తను చేసిన అలవాటు. లేకపోతే షుగరు మనిషి కదా, తట్టుకోలేడు. పాపం ఏం ఇబ్బంది పడ్డాడో, ఏమిటో? పైగా నోరులేని మనిషి, మొహమాటం ఎక్కువ! ఎవరినీ ఏమీ అడగడు. ఆఖరికి తననైనా! తనే ఆయన్ను కనిపెట్టుకుని వేళకు ఆయన అవసరం తీర్చేది. కానీ ఇవ్వాళ ఆయన్ను తనెంత ఇబ్బంది పెట్టింది. అందుకే తట్టుకోలేక ఆ రంగమ్మ ఇంట్లో ఎంగిలి పడినట్టున్నాడు. అది తినటానికైనా అక్కడెంత మొహమాటపడి ఉంటాడో... ఆయన్ను అంతగా ఇబ్బంది పెట్టిన తనెంత పాపిష్ఠిది...’ కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే ఆయన్ను చూడలేక తల దించుకుంది పార్వతమ్మ. 

“చూడు పార్వతీ, పిల్లలొచ్చారన్న ఆనందంలో నీ కడుపును మాడ్చుకోకు. వేళకు అంతో ఇంతో ఏదో ఒకటి తిను. నీకూ బి.పి. ఉంది. ఆ విషయం మర్చిపోకు...” అంటున్న ఆయన్ను కళ్లెత్తి చూడలేకపోయింది పార్వతమ్మ.

ఇదంతా చూస్తున్న ఊహకు ఏదో లీలగా అర్థమైంది. మౌనంగా అక్కణ్ణించి కదిలి పక్కకు వెళ్లిపోయింది. 

కొంగుతో కళ్లను తుడుచుకుంటూ గదిలో నుండి బయటికి వెళ్లింది పార్వతమ్మ.


logo