మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 02:51:21

అబలా జీవితము

అబలా జీవితము

పీవీ సాహితీ ప్రతిభకు మరో తార్కాణం ‘అబలా జీవితం’. మరాఠీ సాహిత్యంలో ఆణిముత్యంగా భావించే ‘పన్‌ లక్షత్‌ కోన్‌ ఘెతో’(ఎవరికి పట్టింది!) నవలకు ఇది అనువాదం. బహుభాషా కోవిదులైన పీవీకి మరాఠీలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. అది ఈ అనువాదంతో జగద్విదితమైంది.  ఈ నవలతో మూల రచయిత హరి నారాయణ్‌ ఆప్టే మరాఠీ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అనూహ్యమైన వర్ణనలతో సాగే ఈ పుస్తకాన్ని సరళమైన తెలుగులోకి అనువదించారు పీవీ. దీని ద్వారా తెలుగు సాహిత్యానికి ఓ అరుదైన జోడింపు లభించింది. 

ఆ రోజు జ్ఞాపకం వస్తే నాకిప్పటికీ నవ్వు వస్తుంది. ఎంతో సరదా అనిపిస్తుంది. అది మాకెంత ఆనందదాయకమైన దినం! పక్కింటి ‘ఠకీ’ అన్నకు యిటీవలనే పెళ్లి జరిగినందున వాళ్ల యింట్లో తిను బండారం పుష్కలంగా మిగిలింది. మా అమ్మ మాకు కూడా కొద్దోగొప్పో తీపి వస్తువులు చేసి పెడతానంది. అన్నయ్య నాకు బాసికాలు తయారు చేసిస్తానని చెప్పాడు.  ఈ విధంగా సమగ్రమైన వ్యవస్థ జరిగి బొమ్మల పెళ్లికి ఆరోజు సాయంకాలమే ముహూర్తం నిశ్చయించాం. నేనేమో పెళ్లి కొడుకు తల్లిని. ‘ఠకీ’ పెళ్లి కూతురు తల్లి. క్రిందటి రోజున ఎవరి తల్లి ఎవరు కావాలా అని ఎంత కలహం! పెళ్లి కొడుకు తల్లి తానే అవుతానని ఠకీ పట్టు. నేనే అవుతానని నా పట్టు. చివరకు మా అన్నయ్య తీర్పు చెప్పాడు. ‘చీటీలు వేస్తే సరి పోతుంది’ అని. తానే చీటీలు వ్రాసి కళ్లు మూసుకొని ఒక చీటీ ఎత్తుమని ఠకీతో చెప్పాడు. తానే పెళ్లి కొడుకు తల్లినవుతానని ఠకీ ఎంతో ఆశించింది. 

కాని ఆమె ఎత్తిన చీటీ విప్పి అన్నయ్య అందులో నా పేరు చదివాడు. మా అన్నయ్యపైన అందరికీ సంపూర్ణ విశ్వాసం వుండేది. వాడు చెప్పిందే సత్యం. వాడన్నట్టు అందరం నడుచుకోవాలి. అన్నయ్య ఠకీని ‘ఠకీ, మీ యింట్లో నిజమైన మగపెళ్లి మొన్ననేగా జరిగింది? మరి ఇలా చేస్తున్నావేం? ఈ బొమ్మల పెళ్లిలోనైనా పెళ్లి కొడుకును మావైపుండనీ’ అని  సముదాయించాడు. అంతటితో ఠకీ విచారమంతా మాయమైపోయింది. అది పూర్వం వలెనే ప్రసన్నురాలైంది. అన్నయ్య మాట విని నేను మాత్రం చిన్నబోయాను. ఎందుకంటే మొన్న అది తన అన్న పెళ్లిలో ఎంతో కులికింది, మురిసింది, ఎగిరింది, దుమికింది! మా అన్నయ్య పెళ్లిలో నేనూ అలాగే చెయ్యాలనుకున్నాను. అన్నయ్య పెళ్లి ఎప్పుడవుతుందో అని నాకెంతో తొందర కలిగింది. ఎవరైనా పిల్లనిస్తామని వస్తే పెళ్లి నిశ్చయమైందనే అనుకొనేదాన్ని. తీరా చూచేసరికి ఏమీ జరిగేది కాదు. లగ్న ముహూర్తం కూడా గడచిపోయేది. అన్నయ్య మాట విని నేను చిన్నబోతూ వాడితో యిలా అన్నాను. 

‘అదేమిటన్నయ్యా, వచ్చే ఏడు నీ పెళ్లి మాత్రం కాదా? నిన్ననే అమ్మ అనింది. వచ్చే మార్గశిర మాసంలో పెళ్లి కాకుండా పోనిచ్చేది లేదని  మరి పెళ్లి కూతురెవ్వరో తెలుసా?’ ఇలా అంటూ నేను నవ్వి ఠకీ వైపు చూచాను. అంతటితో అది గిరుక్కున తల త్రిప్పుతూ కనుబొమ్మలు ముడుచుకొని “పోవే, యమీ! ఏమిటే  నీ వరస? ఇలా చేశావంటే నేనింక ఎప్పుడూ మీ యింట్లో అడుగుపెట్టను. ఇందుకేనా నీవు నన్ను ఆడుకుందామని పిలిచింది?” అని ఎర్రబారిన చెక్కిళ్లతో నవ్వుతూ అంది. నేను మళ్లీ నవ్వుతూ అందుకున్నాను. “అబ్బబ్బ ! ఎంత ధుమ ధుమ! అప్పుడే నీవు నా వదినవై పోయినట్లే ! ”

ఆ మాట విని ఠకీ నిజంగానే వెళ్లిపోయే అందుకు లేచింది. అప్పుడు అన్నయ్య చటుక్కున లేచి దాన్ని పట్టుకొని “ఠకీ ! దాని మాటెందుకే వింటావు? అది అలాంటి పోకిరిదే! యమూ, నేను నీకు పూసలు కుచ్చిచ్చేది లేదు. నీతో స్నేహం తెగత్రెంపులు చేస్తాను ” అని ఆ చివరి మాటలు ఎంతో కృత్రిమ కోపం తెచ్చుకొని ఉచ్చరిస్తూ ఠకీ వైపు చూచి దొంగతనంగా నవ్వడం నేను గమనించాను. అన్నయ్య మాట విని నేను మళ్లీ పెద్దగా నవ్వి యిలా అన్నాను. 

“ అన్నయ్యా, పెళ్లి కాకముందే నీవు దాని పక్షం వహించి నాతో స్నేహం తెగత్రెంపులు చేయడానికి సిద్ధమయ్యావు కదూ!”

ఆ మాట విని ఠకీ తలుపుదాటి వెళ్లిపోనే పోయింది. ఇటు అన్నయ్య నాతో మాట మానేశాడు.  అప్పుడింక ఉపాయమేమి? నేను పరుగెత్తుతూ ఠకీ యింటికి పోయి దాన్ని పిలిచాను. కాని అది ఎక్కడా పలుకలేదు. వెదకి వెదకి వేసారాను. చివరకు చిన్నబోయి తిరిగివచ్చేసరికి మా అన్నయ్యా, ఠకీ ఏదో గుసగుసలాడుతూ కూర్చొని ఉన్నారు. 

నేను కాళ్లు పట్టుకునే వరకు నాతో మాట్లాడవద్దని అన్నయ్యకు ఠకీ సలహా యిస్తున్నట్టుంది. నేను పోయి వాళ్లను ప్రాధేయపడసాగాను. మళ్లీ పోకిరితనం చేయనని నాతో ఖచ్చితంగా ఒప్పించుకొని చివరకు నన్ను క్షమించారు. తదుపరి మళ్లీ మా ఆటలు మొదలయ్యాయి. బొమ్మల పెళ్లి నిశ్చయమయింది. ఆనాడు శనివారమైనందున అన్నయ్య ఉదయమే బడికి పోయి వచ్చాడు. మధ్యాహ్నమంతా వాడికి తీరికే. మా జగడం ముగిసి పెళ్లి నిశ్చయం జరగగానే ఇక ఆట హడావిడి యింతింతని కాదు. సుముహూర్తం వెళ్లి పోతుందేమోనని విపరీతమైన భయం. నేను నా పూసల పొట్లం అన్నయ్య ముందు పడేశాను. వాడు బాసికాలు తయారు చేయడంలో నిమగ్నుడయ్యాడు. మా అమ్మ ఱవికలు కుట్టుకున్నప్పుడు నాకిచ్చిన జరీముక్కలు, ముఖమల్‌ పేలికలు, పట్టు పేలికలు, సాదాగుడ్డ పేలికలు అన్నీ చక్కగా మడతలు పేర్చి పెళ్లి కూతురుకి ఎప్పుడే గుడ్డలు కట్టించాలో, ఏ రవికలు తొడిగించాలో, పెళ్లి కూతురు తల్లికి ఏమేం కానుకలివ్వాలో, నేనెప్పుడు ఏ సాకుతో అలిగి కూర్చుండాలో, ఈ మున్నగు అంశాలను గురించి సవివరంగా ఆలోచిస్తున్నాను. ఉంగరం కోసమని పెళ్లి కొడుకు చేత అలిగించడం ఎలాగూ తప్పదు. మున్ముందు కంఠహారమే అడగాలనీ, కనీసం వజ్రపుటుంగరమో లేక మూడు తులాల బటువో పెట్టందే అలుక తీరడానికి వీల్లేదని ఖచ్చితంగా నిశ్చయించాను. అడుగడుగునా ఠకీని లొంగదీస్తాను. నేను పెళ్లి కొడుకు తల్లిని, అది పెళ్లి కూతురు తల్లి. అది నా కాళ్లమీద పడి తీరాలి. దాన్ని యిలా ఈసడిస్తాను, అలా తిరస్కరిస్తాను, అని ఎడతెఱపి లేకుండా నా ఆలోచనలు సాగుతున్నాయి. మధ్యమధ్య అన్నయ్యకూ నాకూ సంప్రదింపులు నడుస్తున్నాయి. బాసికాలు తయారయ్యాయి. అప్పుడు ‘ఎంగిలి పసుపు’ తేవడానికి ఠకీకి కబురంపించాం. 

ఇంతలో మరొక చిక్కు ఎలా సంభవించిందో చూడండి. మా అమ్మ పైకి వచ్చి, నాతో “యమూ! ఈ సుందరిని (నా చెల్లెలు దాదాపు మూడేళ్లది) తీసుకొని ఆడించు” అని చెప్పింది. నేనమ్మతో మరీ మరీ చెప్పాను. అది మా ఆట పాడు చేస్తుందనీ, ఏడుస్తుందనీ, అక్కడ మలినం చేస్తుందనీ, కానీ అమ్మ ఎక్కడ వింటుంది? సుందరిని నా ముందు కూర్చోనేబెట్టింది. నాకెంతో కోపం వచ్చింది. అంతలో సుందరి ఏడ్వసాగింది. అప్పుడు దాన్ని చంకన వేసుకొని “ఏమమ్మా, మా అమ్మ పెట్టే చిక్కు! మమ్మల్ని సరిగా ఆడుకోనైనా ఆడుకోనివ్వదు!’ అని విసుగుకున్నాను. ఆట మంచి రక్తిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పని చెప్పినా, లేక పిల్లల్ని ఆడించమని చెప్పినా, ఎంత కోపం వస్తుందో అనుభవమున్న వాళ్లకు నా పరిస్థితి అర్థమవుతుందనుకుంటాను. నా మాట విని అన్నయ్య “యమూ! అమ్మ చిక్కులు పెట్టిందంటావా? ఇటీవల నీ పోకిరితనం మితిమీరిపోతుందే!” అని మందలించాడు.

“కాదన్నయ్యా, ఏదో నోరుజారి అన్నాను. ఇక ముందెప్పుడూ అలా అనను!” అంటూ అన్నయ్యను శాంతింపజేశాను. కొద్దిసేపట్లో ఠకీ అయిదారుగురు అమ్మాయిలను వెంట పెట్టుకొని మా వద్దకి ‘ఎంగిలి పసుపు’ తీసుకువచ్చింది. అది చూచి మన వైపు ఆడవాళ్లు లేరనీ, నేనొక్కర్తెనే ఉన్నాననీ గమనించాను. 

ఎంగిలి పసుపు అయిపోగానే చరచరా వెళ్లి నలుగురు కొత్త అమ్మాయిలను ప్రోగు చేసి తెచ్చాను. మా అమ్మ అంగీకరించిన ప్రకారం సామగ్రి యిచ్చింది. అంతటితో ఎడతెఱపిలేని సమ్మర్దం మొదలయింది. నేనదేపనిగా యిటు నుంచి అటూ అటు నుంచి యిటూ పరుగులు పెడుతున్నాను. ఒకసారి సుందరితో సహా అడ్డం పడిపోయాను కూడా. ఆ పాటుతో సుందరి చేసిన హంగామా యింతింతని కాదు. అది విని మా అమ్మ పరుగెత్తుకొని వచ్చింది. అక్కడి దృశ్యం చూచి కోపపడుతూ ‘ఆగండి! మీ ఆటలే మాన్పించివేస్తాను!’ అని బెదిరించింది. 

నేను దొంగలా నిలుచున్నాను. అన్నయ్య కొంత అనునయం చేసినందున చివరకు మా ఆట మళ్లీ మొదలయింది. నాలుగు గంటలకు మా ఉరుకులూ, పరుగులతో విసిగి ఠకీ తల్లి “ఆటలన్నీ మీ యింటిలోనే సాగించుకొమ్మ”ని ఆదేశించింది. అప్పుడు వధూవరుల ఉమ్మడి హడావుడి అంతా మాయింట్లోకి మారింది. నవ్వడం, కులకడం, అరవడం అంతా హద్దులు దాటి సాగింది. చివరకు అయిదు గంటలకు వధూవరుల మధ్య తెరపట్టి మంగళాష్టకాలు చదువసాగాం. అప్పటి నవ్వులూ అరపులూ ఏమని చెప్పను? మాలో ఉన్న శక్తినంతా వినియోగించి ‘శుభ మంగళ సావధాన!’ అని అరపులు సాగించాం. ఆ మంగళాష్టకాలంటే ఏమిటో అందరికీ తెలుసు. మా అన్నయ్య అనుకరణలో చాలా ఆరితేరినవాడైనందున ఎంతోసేపు రకరకాల మంగళాష్టకాలు పఠించాడు. వాడు చదవడం, మేము ఆ స్వరాన్నందుకోవడం, కడుపుబ్బేట్టు నవ్వడం, యిలాగే హంగామా నడిచింది. కాని ఇంతలోనే ఆ హంగామా, ఆ హడావుడి ఒక్క క్షణంలో మాయమైపోయాయి. మా నాన్నగారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, నేరుగా మా మీద కేకలు వేస్తూ, ‘ఏం పెడబొబ్బలు సాగించారు వెధవలూ! ఫొండి ఫొండి, మీ యిళ్లకు ఫొండి. ఏరా గాడిదా, పన్నెండేళ్ల గాడిదవయ్యావు, ఇంకా బొమ్మలాట లాడు..........’  


logo