గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 02:44:29

బంగారు గని

బంగారు గని

ఉగాండా ఒచ్చిన కొత్తల ఇది ‘కంపాలా’ గాకుండ ‘కంపల’ వడ్డట్లు గొట్టింది. ‘కంపాలా’ల నేను జర జర సర్దుకున్న. అంగట్ల కొనుక్కొచ్చిన కొత్తెద్దుకు కొత్తజాగల ఎంత తిప్పలైతదో అంత తిప్పలయ్యింది. పెద్దన్న, వాసు ఉన్నందుకు జల్దే నేర్సుకున్న. 

పోయిన్నెల మేమందరం ‘జింజా’ పోయొచ్చినం. ప్రపంచంలనే పొడుగైన నది ‘నైలు’. అది మొదలయ్యేది ఈడికెల్లే. ఆ నది నడ్మకెళ్ళి బురుగులుకక్కుకుంట పెద్ద ఊట ఉబికి ఒచ్చే తావుకాడికి పడవల పొయ్యి చూసొచ్చినం. వంద ఆస్పారాల మోటర్‌ వోసినట్లు ఒస్తున్నయి నీళ్ళు. ఆ ఊట ముందుగాల ‘విక్టోరియా’ సరస్సులెక్క తయారయితది. ఆ చెరువు ఎంత పెద్దదంటే ఉగాండా సుట్టుముట్టున్న ఐదు దేశాలవరకు కలుస్తయి. ఉగాండా, టాంజానియా, కెన్యా, బురుండి, రువాండా ఇన్ని దేశాలకు ఈ చెరువు పాకి ఉంటది. పెద్ద సముద్రంలెక్క కొడ్తది. మంచినీళ్ళ సముద్రం అన్నట్లు.

మల్ల ఇంకో దిక్కు ఇక్కడి ఊర్లను సూస్తే పానం ఉసూరుమంటది. ‘కంపాలా’కు సుట్టుపక్కలున్నయి అంతో ఇంతో నయమే గని, లోపటికి పోతున్నకొద్దీ మస్తు బాదయితది. వందేండ్లకింద మన ఊళ్ళు ఎట్లున్నయో సరీగ అట్లనే ఉంటయి. తిననీకె తిండి ఉండది, నీళ్ళకు కాల్వలు, మడుగులే గతి, కరెంటు లేదు, ఇస్కూల్లు లేవు...ఆల్లను తల్సుకుంటే కండ్లల్ల నీల్లూరుతయి. ఆల్లకు యవుసం గూడ రాదు. ఎర్రటి బంగారమసోంటి భూమి. ఎర్రటి ఎండకాలంల గూడ వారానికి రెండుసార్లు వానగొడ్తది. మనతాన గిసోంటి భూమి గిట్ల ఉంటెనా, ఇట్ల నేను దేశాలు వట్టుకోని రావుడు ఎందుకుంటది. ఉన్నతాన్నే నిమ్మలంగ ఉంటుంటిమి. ఈ నడ్మ మనసోంటోళ్ళు ఒచ్చినంక అంతో ఇంతో నేర్సుకుంటున్నరు. 

ఇదివరకైతే అడవులపోంటి పొయ్యి గడ్డలు తవ్వుకు తినేటోళ్ళే. మనదేశపోళ్ళే గాకుండ యూరోపియన్లు, చైనోళ్ళు, ఇంకా చాన దేశాలకెళ్ళి ఈడికొచ్చి ఈళ్ళతానున్న వనరులను దోసుకోనిపోతున్నరు. అంతెందుకు మనదేశంల నుంచే పెద్దపెద్దోళ్ళ బినామీలందరు ఈడ వేల ఎకరాలు లీజుకు దీస్కోని యవుసాలు చేస్తున్నరు. అగ్వ కూలీలు, బాయితవ్వేదిలేదు, మందులేసేదిలేదు. అర్దెకు పండుతది. పండించిందంత వేరే దేశాలకు ఎగుమతులు చేస్తరు. ఇదంత సూసుకుంట ఎట్ల ఊకోబుద్దైతదో నాకర్తమే గాదు.

ఇదంత సూస్తుంటే కడుపులకింత ముద్ద గూడ దిగదు. ఇగ ఇంత ఎనకవడ్డ దేశమంటాని అందరు అంటనే ఉంటరు. మా దోస్తుగాళ్ళైతే అదేదో శీన్మల బ్రహ్మానందంకి వజ్రాలు దొరికినట్లు నీగ్గూడ దొరికి గొప్పోనివై ఒస్తవా అంటాని మజాక్‌ చేస్తరు. ఎవరెంత మజాక్‌ చేశ్నా ఈళ్ళ తాన నేర్సుకునేది చానున్నది. రోడ్లమీద ఇష్టమున్నట్లు బండ్లు నడుపరు. పద్ధతి తీర్గ ఒగనెనక ఒగరు పోతరు. ఉత్తగనే పొద్దువోక హారన్లు కొట్టరు. ఉగాండాల కరెంటుకు ప్రీ పెయిడ్‌ మీటర్లుంటయ్‌. ఫోను రీచార్జింగు చేసుకున్నట్లు కరెంటును ముందుగాలనే రీచార్జింగు చేసుకుంటే అండ్ల పైసలయ్యిపోయిందాంక కరెంటు వాడుకోవచ్చు. ఇగ ఇప్పుడు చెప్పుండ్రి ఆళ్ళు డెవలప్పు అయ్యిండ్రా లేకుంటే మనం  డెవలపు అయినమా? 

‘కంపాలా’ల నా దోస్తాన అంత ఆళ్ళతోటే. బయట దోస్తులు తక్వనే గని ఆఫీసుకు ఒచ్చేటోళ్ళు పొయ్యేటోళ్ళు మస్తుగ అయ్యిండ్రు దోస్తులు. ఆళ్ళతోటి తిరుగుతుంటి, ఆళ్ళ తిండి తింటుంటి, గందుకనే జరకన్ని ఎక్వ సంగతులు తెల్శినయి. 

అట్లనే మా ఆఫీసుల నన్ను కల్వనీకె నా తానికి నిచ్చె చానమంది ఒచ్చేటోళ్ళు. ైక్లెంట్లు అన్నట్లు. అండ్ల ఒక పిలగాడు...పిలగాడంటే చిన్న పోరడేం కాదుగని నాకంటే శిన్నోడే ‘ఒసిండే’ అనేటాయనకు నాకు మస్తు దోస్తాన అయ్యింది. ఆయన ఒచ్చినప్పుడల్ల చాన సేపు గవీ గివి ఇచ్చులు కచ్చకాయలు మాట్లాడుకుంటుంటిమి. ‘ఒసిండే’ మన దేశం సంగతులు, మన పెండ్లిళ్ళు, దావతులు, పిల్లలు, ఆళ్ళ చదువులు, తిండి, ఇండ్లు అన్ని అడుగుతుండె. అట్లనే నేను గూడ అన్ని అడిగి తెల్సుకుంటుంటి. అట్లనే ఒగనాడు జర పని తక్వ ఉన్ననాడు ‘ఒసిండే’ ఒస్తే జోలివెట్టుకుంట కూసున్నం. అదీ ఇదీ మాట్లాడుకుంట ‘ఒసిండే’ అడిగిండు.

‘అవునుగని, ‘కంపాలా’కు నువ్వొచ్చి ఇన్ని దినాలయ్యింది కదా, మా దేశం ఎట్లున్నది, మేమెట్లున్నం’ అంటాని అడిగిండు. నేను జర సేపు నెత్తి గోక్కున్న, సోంచాయించిన, ఇదివొరకటిదాంక నేను చూశ్నయి, తెల్సుకున్నయి  అన్ని యాదికి తెచ్చుకున్న.

‘మీ దేశం బంగారు గని, మంచి మనుషులు, కష్టపడి పనిచేసేటోల్లు, మీకు ఒకరి కింద బతుకుడు అల్వాటయిపోయింది,  మీ దగ్గరున్న వనరుల కీమతు మీకు తెలుస్త లేదు’ అంటాని అన్న.

‘నాకు కొంచం కొంచమే అర్తమయ్యింది,’ అన్నడు ‘ఒసిండే’.

‘మీవి బంగారమసోంటి భూములు, నీటి సౌలతు ఉన్నది, కష్టపడి పనిచేసే మనుషులున్నరు. అందుకనే మీ దేశానికి ప్రపంచంల ఉన్న దేశాలోల్లంత ఒచ్చి ఈ బంగారు గనిని తవ్వుకొని పోతున్నరు. మీ తానున్న దాని విలువ మీకు తెలుస్తలేదు. చేతిల బంగారం పెట్టుకోని రాళ్ళు కొడుతున్నరు’ చెప్పిన.

‘అరె! గిట్ల నా దేశాని గురించి నాకు చెప్పినోళ్ళే లేరు, మా తానికెళ్ళి అందరు దేశపోళ్ళు దోసుకపోతున్నసంగతి మాకు గూడ తెలుసు గని, దీనికి పరిష్కారమెట్ల’ అంటాని అడిగిండు ‘ఒసిండే’

మేము గూడ ఇసోంటి కష్టాలే పడ్డము. కాని మాకు ఒక బంగారమసోంటి మనిషి దొరికిండు, యాభైకేజీల బంగారం అన్నట్లు, అట్ల మీకు గూడ మా సారు ‘కేసియ్యారు’ సారసోంటోళ్ళు ఒక్కడంటే ఒక్కడు దొరుకుతే నా యసోంటి బతకనీకె ఒచ్చినోళ్ళమందరం ఈడికెళ్ళి తోక పీకుతం,’ బదులిచ్చిన.


logo