శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 02:04:27

ద్వారానికి ఎదురుగా చెట్టు ఉండటం దోషమా?

ద్వారానికి ఎదురుగా చెట్టు ఉండటం దోషమా?

ద్వారానికి ఎదురుగా చెట్టు ఉండటం దోషమా? ఏం చేయాలి? చెట్టు కొట్టాలా? -వి. అనిరుద్‌, బోయిన్‌పల్లి

ముందుగా మీరు ఇంటికి, చెట్టుకు మధ్య ఖాళీ ఎంత ఉంది అనేది చూడండి. అలాగే చెట్టుకి, ఇంటికి మధ్య రోడ్డు ఉందా చూడండి. ఎందుకంటే మీరు ఆ వివరాలు రాయలేదు. ప్రధానంగా ఇంటి నుండి చెట్టుకు మధ్య మళ్లీ ఇల్లు పట్టేంత దూరం ఉంటే ఆ చెట్టు దోషం మనకు ఉండదు. అది గృహ ద్వారానికి ఎదురుగా ఉన్నా కూడా.. అలాగే చెట్టుకు ఇంటికి మధ్య వీధి ఉన్నా ఆ చెట్టుతో ఏ మాత్రం దోషం రాదు. కేవలం దగ్గరలో ఉండి, డైరెక్టుగా చెట్టు అడ్డుపడుతుంది అంటే తప్పక మార్పు చేయాలి. ఆ చెట్టును తీసి మరోచోట నాటే ప్రయత్నం చేయండి లేదా చెట్టును తీయకుండా, అవకాశం ఉంటే ద్వారంలోకి రాకుండా ద్వారాన్ని పక్కకు జరపండి. అంతేకానీ చెట్టుకొట్టుట ముఖ్యం కాదు. అలాగే దోషాన్ని సరి చేయకపోవటం కరెక్టు కాదు. అన్నీ చూసుకొని చేయండి.

పాత ఇంటిని తీసి కొత్త ఇల్లు కట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇల్లు తీసి ఇల్లు కట్టాలి అనుకుంటే ముందు ఆ ఇంటి స్థలం బాగుందా.. ఆ స్థలానికి ‘వీధిపోట్లు’, ‘దిశ దోషాలు’ లేకుండా ఉన్నాయా.. మనం అనుకున్నంత ఖాళీ వదిలి సరిపడే ఇల్లు నిర్మించుకోవచ్చా అనేది విచారించుకోవాలి. పాత ఇల్లు పూర్తిగా తీసినప్పుడు దానిని పునాదులతో సహా పెకిలించి తీయాలి. అది అప్పటికే పిల్లర్స్‌తో కట్టింది అయితే ‘ఫుటింగ్స్‌'తో సహా తీసి స్థలాన్ని పూర్తిగా శుద్ధి చేయాలి. స్థలాన్ని దున్ని గుల్ల చేసి శుద్ధి చేయడం శాస్త్రీయ పద్ధతి. దున్నకపోయినా.. ఏ ఆనవాలు లేకుండా తీసి కొత్త ఇంటి నిర్మాణానికి పూనుకోవాలి. ‘కాంప్రమైజ్‌' కావద్దు.

తూర్పు ద్వారానికి తప్పక రెండు పక్కలా కిటికీలు పెట్టాలా? ఒకటి సరిపోతుందా?- జి.విప్లవరెడ్డి, సీతారామపురం

ఇంటి నిర్మాణ శైలి ఇప్పుడు చాలా విధాలుగా మారింది. ఒకప్పుడు ఏ ముఖ ద్వారం కలిగిన ఇంటికైనా ఇంటి సెంటర్‌లో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసి దానికి ఇరువైపులా రెండు కిటికీలు పెట్టేవారు. ఆ ‘చతుఃశ్శాల’ నిర్మాణాలు పోయాయి. అప్పుడు పడక గదుల ప్రాధాన్యం తక్కువ. అన్ని ‘హాల్స్‌'గా విభజిస్తూ నిర్మించేవారు. నేడు శయన మందిరాలు బహు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత విజ్ఞానాభివృద్ధి జరిగి ఇంటి ఆయుష్షును, ఆరోగ్యాన్ని పెంచే కోవలో ఉన్నత శాస్త్ర ప్రమాణాలు వచ్చాయి. కాబట్టి సింహద్వారం తూర్పు ఈశాన్యం వైపు చేరింది. అలాగే, ఉత్తరం కూడా ద్వారం తప్పక పెట్టాలి. ఆ విధంగా కిటికీలు ద్వారానికి రెండు వైపులా పెట్టే ప్రాధాన్యం తగ్గింది. ఇల్లు గాలి వెలుతురులతో వర్ధిల్లడమే ప్రధానం.
logo