శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 01:51:23

అపాయంలో ఉపాయం

అపాయంలో ఉపాయం

ఒక ఊరి చివర కలుగులో చిట్టెలుక జీవిస్తూ ఉండేది.  ఒకరోజు  ఆ చిట్టెలుకని ఓ గండుపిల్లి గమనించింది. దాన్ని  తినాలని  కలుగు పక్కనే మాటువేసింది.  వీలు చూసుకొని దాని  దగ్గరకి వెళ్ళి ‘ఎలుక అల్లుడూ!’ అంటూ పిలిచింది. ‘ఏమిటి పిల్లి మావా?’ లోపలి నుంచే అడిగింది ఎలుక. ‘ శివారులో ఒక పల్లిచేను ఉంది. అక్కడ కాయలు ఎంత బావున్నాయనుకున్నావ్‌! రేపు ఉదయం అయిదు గంటలకి నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం’ అన్నది గండు పిల్లి. 

 దాని ఆలోచనని పసిగట్టేసింది ఎలుక. కానీ బయటపడకుండా ‘అలాగే’ అని తలూపింది.  మరునాడు ఉదయం అయిదు గంటలకి పిల్లి వచ్చి ఎలుకని పిలిచింది. దానికి ఆ చిట్టెలుక ‘నేను నాలుగు గంటలకే వెళ్ళి సుష్ఠుగా తిని వచ్చాను’ అని జవాబిచ్చింది కలుగులోనుంచే. గండుపిల్లికి పట్టలేని కోపం వచ్చేసింది. అయినా తన కోపాన్ని గొంతులోనే దిగమింగుకుంది. ‘సరే మంచిది. మరో మంచి పంటని ఇవాళ వస్తూ చూశాను. ఆ పొలం వైపు రేపు ఉదయం నాలుగు గంటలకి వెళ్దామా’అంది పిల్లి. ‘అలాగే’అంటూ సమాధానమిచ్చింది ఎలుక. తర్వాత రోజు కూడా పిల్లి వచ్చేసరికే ఎలుక వెళ్లి వచ్చేసింది. కానీ ఆ పిల్లి బారి నుంచి తప్పించుకోవడం ఎలా? అని ఆలోచించసాగింది. రోజూ పిల్లికంటే ముందు పల్లిచేనుకు ఎలుక వెళ్ళి వచ్చేది.   ఆ తోట యజమాని తన పంట నాశనం అవడం గమనించసాగాడు. తన పంటని నాశనం చేస్తున్నదెవరో తెలుసుకుందామని ఓ రోజు రైతు చెట్టు చాటున దాక్కున్నాడు. కావాలనే ఆ రోజు ఎలుక ఆలస్యం చేసింది. ముందు ఎలుక, వెనుక గండుపిల్లి తోట వైపు బయలుదేరాయి. తీరా వేరుశనగ తోట దగ్గరికి వెళ్లగానే ఓ కన్నంలోకి దూరి మాయమైంది ఎలుక. దానికోసం వెదుకుతూ.. అటూ, ఇటూ చూస్తున్న పిల్లిని గమనించాడు రైతు. ‘ఇదే తన పొలాన్ని పాడు చేస్తున్నదని’అనుకున్నాడు రైతు. అంతే! అతని చేతిలో ఉన్న కర్రని పిల్లి మీదకి విసిరేశాడు. దాంతో పిల్లి అక్కడికక్కడే చచ్చిపోయింది. నిశ్చింతంగా ఎలుక తన కలుగుకు వెళ్ళిపోయింది. ఉపాయంతో ఆలోచించి ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు అని చిట్టెలుకని చూసి నేర్చుకోవచ్చు.