గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Sep 06, 2020 , 02:58:46

ఆ పసిపాపను మరువలేను!

ఆ పసిపాపను మరువలేను!

పీడియాట్రిక్‌ హార్ట్‌ స్పెషలిస్టుగా సుపరిచితులైన డాక్టర్‌ మన్నెం గోపీచంద్‌ తన వృత్తి జీవితంలో ఎంతో మంది పిల్లల గుండెలకు మరమ్మతులు చేశారు. చిన్ని గుండెలు ఆయన చేతుల్లో ఆరోగ్యాన్ని పొందుతాయి. అప్పుడే పుట్టిన పసికందుకు కూడా అలవోకగా గుండె ఆపరేషన్లు చేస్తారాయన. అలాంటి ఆయన్ని కూడా కంట తడి పెట్టించిందో పసిపాప. మరణం అంచుల దాకా వెళ్లి వచ్చి, డాక్టర్‌గా ఆయనకు గర్వకారణమై నిలిచింది. ఆ పాప కథ..

ఆయన మాటల్లోనే..

2010వ సంవత్సరంలో ఒకరోజు... ఉదయం నుంచీ ఆగకుండా ఆపరేషన్లు చేసి చాలా అలసిపోయాను. అప్పుడే థియేటర్‌ నుంచి వచ్చి కూర్చున్నాను. లంచ్‌ చేద్దామని అనుకుంటుండగా...

‘సార్‌.. మిమ్మల్ని కలవడానికి 14 ఏండ్ల పాప వచ్చింది’ చెప్పాడు బాయ్‌. 

‘ఎవరా పాప..? సరే.. రమ్మను’ అని చెప్పాను. ఎవరా అని ఆలోచిస్తూ ఉన్న నేను కన్సల్టేషన్‌ గది తలుపు తెరుచుకోగానే ఆశ్చర్యపోయాను. నా ఎదురుగా తల్లిదండ్రులతో పాటు ఉన్న పాపను చూడగానే అలసటంతా పోయింది. ఆరోగ్యంగా ఉన్న పాపను చూసి ఆకలంతా ఎగిరిపోయింది. ‘మీరు లేకపోతే ఇవాళ నేను లేను సార్‌. అందుకే నా ప్రాణదాతను చూసిపోదామని వచ్చాను’ అంటూ చేతులు జోడించింది. ఆమె తల్లిదండ్రులు డ్రై ఫ్రూట్స్‌ బాక్సు ఇచ్చారు. పాప తను స్వయానా వేసిన పెయింటింగ్‌ నాకు కానుకగా ఇచ్చింది. ఆ పెయింటింగ్‌ కూడా ఆమె నవ్వు లాగే స్వచ్ఛంగా ఉంది. ఆమె తల్లిదండ్రులు సంతోషంగా నన్ను ఏదేదో పొగుడుతున్నారు. వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్నాను.. వాళ్ల మాటలకు ప్రతిస్పందిస్తున్నాను.. కానీ, నా చెవులకు అవేవీ వినిపించడం లేదు. నా మనసు 14 ఏండ్లు వెనక్కి వెళ్లింది. 

అది 1996వ సంవత్సరం.. ఆరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజుగా పరిణమిస్తుందని అప్పుడనుకోలేదు. మూడు నెలల పసిగుడ్డును పట్టుకుని వచ్చిందా మాతృమూర్తి. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను చేతుల్లో పొదివి పట్టుకుని శోకమూర్తిలా ఉందామె. శరీరమంతా నీలి రంగుకి మారిపోయింది. ‘సార్‌! మా బిడ్డను ఎలాగైనా బతికించండి..’ అంటూ ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. 

ఒక్క సెకనులోనే పాపను ఐసియుకి తీసుకెళ్లారు. ఆ పాపకు ఎడమవైపు ఉండే రక్తనాళాలు కూడా కుడివైపే తెరుచుకోవడంతో మంచి, చెడు రక్తం కలిసిపోతోంది. దాంతో పాప శరీరం నీలిరంగుకి మారిపోయింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితికి చేరిన పిల్లల్ని బ్లూబేబీస్‌ అంటారు. సాధారణంగా రక్తం ప్రసరించేటప్పుడు ఎడమ వైపు మంచి రక్తం, కుడి వైపు చెడు రక్తం ప్రవహిస్తుంది. కానీ ఈ పాపకు ఎడమ, కుడి వైపుల రక్తనాళాలు కలిసిపోవడంతో రక్తప్రసరణ డిస్ట్రబ్‌ అయిపోయి శరీరానికి అందాల్సిన రక్తం తక్కువ అయిపోయింది. ఊపిరితిత్తులకేమో పరిమితికి మించి రక్తం సరఫరా అవుతుంది. అందువల్ల పాప విపరీతంగా ఆయాసపడుతున్నది.

మృత్యుంజయురాలు

అప్పట్లో అపోలో హాస్పిటల్‌లో మాత్రమే చిన్నారుల గుండె సమస్యలను చూస్తున్నాం. పేదవాళ్లు. ఫీజు కట్టలేని పరిస్థితి. పాపకు ఒకపక్క చికిత్స నడుస్తోంది. వెంటిలేటర్‌పై ఉంది. అప్పటికే ఆరు వారాలు గడిచిపోయాయి. వాళ్లు డబ్బులు తేలేకపోయారు. పాప పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది. చికిత్స అందించినా బతకడం కష్టమే అన్నట్టుగా ఉంది. తల్లిదండ్రుల అనుమతితో ఇక వెంటిలేటర్‌ తీసేయాలనుకున్నారు. కానీ నాకేమో పాప ముందు కన్నా కొంతవరకు మెరుగుపడినట్టుగా అనిపిస్తున్నది. చికిత్స ఇంకా కొనసాగిస్తే బాగవుతుందేమో అన్న ఆశ కలిగింది. కానీ రకరకాల కారణాల వల్ల వెంటిలేటర్‌ తీసేయక తప్పలేదు. నా మనసంతా చేదుగా అయిపోయింది. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. పాప గురించిన ఆలోచనలే చుట్టుముట్టాయి. ఇంత కాలం చికిత్స చేసినా లాభం లేకుండా పోతుందేమోనని భయం వేసింది. కానీ తెల్లారేసరికి అద్భుతం జరిగింది. అప్పటి వరకూ ఇచ్చిన చికిత్స ఫలితాన్ని ఇచ్చింది. పాప ఆరోగ్యం మెరుగుపడింది. మృత్యుముఖాన్ని చేరుతుందనుకున్న ఆ పసిగుడ్డు   ఆరు నెలల చికిత్స అనంతరం పునర్జన్మనెత్తింది. 

అప్పటి ఆ పసిబిడ్డే ఇప్పుడు 14 ఏండ్ల తరువాత పెద్దదై తల్లిదండ్రులతో వచ్చి కలిసింది. వాళ్లను చూడగానే ఎంత ఉద్వేగం కలిగిందో మాటల్లో చెప్పలేను. డాక్టర్‌ని అయినందుకు గర్వంగా అన్పించింన క్షణాలవి. 


logo