ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Sep 06, 2020 , 02:23:16

ఓ ప్రొఫెసర్‌ పరిష్కారం!

ఓ ప్రొఫెసర్‌ పరిష్కారం!

పర్యావరణం గురించి అందరూ కంగారుపడిపోతుంటారు. ఏదో ఒకటి చేయాలని ఆవేశపడిపోతుంటారు. కానీ కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే.. ఏదో ఒక పరిష్కారం దొరికి తీరుతుంది. పర్యావరణాన్నే కాదు, జీవనోపాధిని కూడా దక్కించుకునే సులువేదో దక్కుతుంది. అందుకు సాక్ష్యమే ఈ ప్రొఫెసర్‌ గారి కథ!

సాజీ వర్గీస్‌ బెంగళూరులోని క్రైస్ట్‌ యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌. విశాలమైన ఆ క్యాంపస్‌ గ్రౌండ్‌లో విద్యార్థులు సందడిగా తిరుగుతుంటే చూడటం ఆయనకి మహా సరదా! కానీ ఓ రోజు ఎందుకో ఆ నేల కాన్వాస్‌ మీద అడ్డగీతల్లా పరుచుకుని ఉన్న కొబ్బరి మట్టలని చూసి ఆయనకి బాధగా అనిపించింది. ‘ఏటా ఓ కొబ్బరి చెట్టు నుంచి ఆరు మట్టలు నేలరాలుతుంటాయి. వాటిని ఏం చేయాలో తెలియక తగలబెట్టేస్తుంటారు’ అని గుర్తుచేసుకున్నారు సాజీ. మండుతున్న కొబ్బరాకులు చిటపటలాడుతూ.. అంతెత్తున నుసి ఎగిసిపడుతుంటే కాలుష్యం కమ్ముకుంటుంది. ‘వాటితో స్ట్రాలు తయారుచేస్తే ఎలా ఉంటుంది’ అన్న ఆలోచన వచ్చింది సాజీకి. మనం సరదాగా పీల్చి అవతల పడేస్తూ ఉంటాం కానీ, ఈ నేల మీద వృధాగా పేరుకుపోతున్న ప్టాస్టిక్‌లో అవి భాగమైపోతున్నాయని గ్రహించం. ఓ అంచనా ప్రకారం ఒక్క ఏడాదిలో మన దేశంలో పాతిక వేల టన్నుల స్ట్రాలని పీల్చి అవతల పడేస్తారట. వాటిలో 9 శాతం మాత్రమే రీసైక్లింగ్‌ దశకు చేరుకుంటాయి.

 ప్రయత్నం మొదలైంది

కొబ్బరాకుల నుంచి స్ట్రాలను తయారుచేసేందుకు వాటిని మరగపెట్టగానే.. వాటి నుంచి మైనం వేరు కావడాన్ని గమనించారు సాజీ. వాటిని కనుక పైపూతగా వాడితే, నీటిలో కరిగిపోకుండా ఉంటాయని తట్టింది. ఆ సహజమైన మైనం యాంటీ ఫంగల్‌గా కూడా పనిచేస్తుంది. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి 2017 నాటికి ఓ చిన్న స్ట్రాని రూపొందించారు. సాజీ పట్టుదల చూసి, తన విద్యార్థులు కూడా అన్నిరకాలుగా సాయపడేందుకు ముందుకు వచ్చారు. మరికొందరు ఇంజనీర్లూ తోడయ్యారు. అలా ఏడాది తిరిగేసరికల్లా ‘సన్‌బర్డ్‌ స్ట్రాస్‌' పేరుతో ఉత్పత్తి ప్రారంభించే దశకు చేరుకున్నారు. 3 ఎమ్‌ఎమ్‌ నుంచి 13 ఎమ్‌ఎమ్‌ వరకు వేర్వేరు పరిమాణాల్లో లభించే ఈ స్ట్రాలు మూడు నుంచి పది రూపాయల వరకు ఖరీదు చేస్తాయి.

 ఆషామాషీ కాదు!

సాధారణంగా ఇలాంటి ఉత్పత్తులు.. ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాలతో పోలిస్తే తేలిపోతుంటాయి. కానీ ఇవి మాత్రం ప్లాస్టిక్‌ స్ట్రాలకి ఏమాత్రం తీసిపోవు. ఎలాంటి పానీయం కోసమైనా వీటిని వాడవచ్చు. ఆరుగంటల పాటు నీళ్లలో ఉంచినా తడి పీల్చుకోవు. ఆరునెలల పాటు నిల్వ (షెల్ఫ్‌ లైఫ్‌) ఉంటాయి. అలాగని వీటి తయారీలో ఎలాంటి రసాయనాలనీ వినియోగించరు. అందుకే వీటికి ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చేసింది. ఇప్పటివరకు దాదాపు రెండు కోట్ల స్ట్రాలకి ఆర్డర్‌ వచ్చిందని చెబుతున్నారు సాజీ. అమెరికా, ఇంగ్లండ్‌, జర్మనీ లాంటి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘మారియట్‌' లాంటి ప్రతిష్టాత్మక హోటల్స్‌ వీటిని వినియోగిస్తున్నాయి. ఆ స్ట్రాలకి ఓ ప్రత్యేక పేటెంట్‌ను కూడా సంపాదించారు సాజీ.

 ఉపాధి కూడా!

పర్యావరణానికి మేలు కలిగించే వస్తువులను ఉత్పత్తి చేయడం మంచిదే. వాటితో జీవనోపాధిని కూడా అందించడం అభినందనీయం. కోస్తా ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, అక్కడ దొరికే ముడి సరుకుతో అక్కడి మహిళలకే జీవనోపాధి కల్పించాలి అనుకున్నారు సాజీ. అందుకే మదురై, కాసర్‌గఢ్‌, టుటికోరిన్‌లలో వీటి ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించారు. ఇది ఓ ఆరంభం మాత్రమే! రాబోయే రోజుల్లో మరో 20 కేంద్రాలను ప్రారంభించి కనీసం 200 మంది మహిళలకు ఉపాధి కల్పించడమే తన ధ్యేయం అంటున్నారు సాజీ. ఈ ప్రయత్నాలను గమనిస్తున్న యాక్సంచర్‌, హెచ్‌సిఎల్‌ లాంటి సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.


 


logo