శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Sep 06, 2020 , 00:39:54

గృహ ద్వారానికి ఎదురుగా ‘సంపు’ వస్తుంది...

గృహ ద్వారానికి ఎదురుగా ‘సంపు’ వస్తుంది...

గృహ ద్వారానికి ఎదురుగా ‘సంపు’ వస్తుంది. అలా ఉండొచ్చా? లేక ఎలా ఏర్పాటు చేసుకోవాలి? - రత్నకుమారి కె., కేపీహెచ్‌బీ

మీరు ఇల్లు పూర్తిగా కట్టలేదు అని రాశారు కదా. కాబట్టి బాధలేదు. మళ్లీ సరిగ్గా ప్లాన్‌ చేయండి. మీ ఇంటి సంపు ఒక్కటే కాదు మీ కిచెన్‌ను ఆగ్నేయంలో పెంచి అనగా తూర్పులోని ఖాళీ జాగాలోకి జరిగి మీరు కిచెన్‌ కడుతున్నారు. అది కూడా పెద్ద దోషమే అవుతుంది. అలాగే మీరు వాయవ్యం మెట్ల కింద టాయిలెట్‌ పెంచి ఇంట్లోంచి చూపిస్తున్నారు. అది కూడా కరెక్టు కాదు. ఇంటి తూర్పు గోడ, ఉత్తరం గోడ ఎక్కడ తెగిపోకుండా సాగాలి. ఆగ్నేయం, వాయవ్యం పెంపుచేసి లోపలి నుంచి వాడకూడదు. ఇక మీ సంపును మీ గృహం సింహద్వారం ఎదురునుంచి తీసి ఇంటికి సెంటర్‌లో వేసుకోండి. సంపు ఈశాన్యంలో ఉండాలని లేదు, తూర్పులో, ఉత్తరంలో కూడా సంపును ద్వారాల్లో పడకుండా వేసుకోవచ్చు. లేదంటే గృహ సభ్యులకు మూర్ఛ సంబంధ వ్యాధులు వస్తాయి.

మాకు పొలం వద్ద ఇల్లు ఉంది. దానికి కాంపౌండ్‌ లేదు. తప్పులేదు కదా! -నేతి రామస్వామి, నకిరేకల్‌

పల్లెల్లో చాలా ఇండ్లకు కాంపౌండ్లు ఉండవు. వాటిని కొంత వరకు వదిలేసినా వ్యవసాయ క్షేత్రాలలో కట్టే గృహాలు, గెస్ట్‌హౌస్‌లు వాటి పేర్లు ఏవైనా ఆ నివాస నిర్మాణాలకు తప్పక ప్రహరీలు ఉండాలి. విశాలమైన భూమిలో నివాసాలు కట్టినపుడు ప్రకృతి నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. దానిని ‘బక్క ఇల్లు’, ‘ఒంటరి గృహం’ తట్టుకోలేదు. తద్వారా ఇంటిలోపలి వాతావరణానికి బయటి వాతావరణానికి తేడా లేకుండా పోతుంది. అప్పుడు మనిషి ‘ఇన్నర్‌ సిస్టమ్‌' తెలియకుండా దెబ్బతింటుంది. ఎప్పుడు కూడా కనబడే బాహ్య శరీరం కన్నా కనబడని సూక్ష్మ శరీరం గట్టిగా ఉండాలి. అప్పుడే మనిషి ఉక్కులా ఉంటాడు. శరీరాలు బలిష్టంగా ఉండి ప్రయోజనం లేదు కదా! అంతరంగం దృఢంగా ఉండాలి. ఇవన్నీ చాలా లోతైన అంశాలు. శాస్త్రంలో లోపలికి వెళితే కానీ అర్థం కావు. ముందు మీ గెస్ట్‌హౌస్‌కు ఇటుకలతో కాంపౌండ్‌ కట్టండి.

మా ఫ్లాట్‌కు దక్షిణం బాల్కానీ ద్వారం పెద్దగా ఉంది. అలా ఉండొచ్చా? ఉత్తరం, తూర్పు కూడా పెంచాలా? - బీసు భిక్షపతి, వెలమకొండ

అపార్ట్‌మెంట్లల్లో చాలా ఇండ్లకు ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్రెంచ్‌ డోర్స్‌ పెడుతున్నారు. యూపీవీసీ డోర్స్‌ నేడు చాలా ఫేమస్‌గా వాడుకలోకి వచ్చాయి. నిజం ఏంటంటే బాల్కానీకి అలాంటి పెద్ద ద్వారాలు వచ్చినప్పుడు అవి దేనితో చేసినవి అయినా కూడా తప్పక గ్రిల్స్‌ బిగించాలి. అంటే ద్వారానికి కాకుండా వాటి వెనుక ఉండే బాల్కానీలకు అప్పుడు దోషం ఉండదు. లేక దక్షిణం మొత్తం బాల్కానీ ఉండి ఏ దక్షిణం బాల్కానీ వచ్చినప్పుడు ఆ దక్షిణానికి లేద పడమరకు అలాంటి పెద్ద ఫ్రెంచ్‌ డోర్స్‌ పెట్టడం పెద్ద దోషం అవుతుంది. పెద్ద ద్వారాలు తూర్పునకు, ఉత్తరానికి పెట్టడం అనివార్యంగా ఉంటే అప్పుడు దక్షిణం, పడమరలకు కూడా పెట్టొచ్చు. మీరు ఇల్లు అన్నారు కాబట్టి మీకు అవసరం ఉండదు. దవాఖానలకు, పార్టీ ఆఫీసులకు అలా పెద్ద ద్వారాలు అవసరం అవుతాయి.


logo