గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Sep 06, 2020 , 00:02:24

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

మంచి పుస్తకాలను మించిన సహచరులు లేరు. మన జీవిత ప్రయాణానికి మార్గనిర్దేశనం చేసే దిక్సూచి పుస్తకం. అదిచ్చే స్ఫూర్తి వెలకట్టలేనిది. - అబ్దుల్‌ కలాం

పిల్లల సైన్స్‌ విచిత్ర ప్రకృతి

రచయిత: వి.ఆర్‌. శాస్త్రి 

పేజీలు: 116

వెల: 90/-

ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌

ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుందని ప్రశ్నించే పిల్లవాడికి... వినిపించే జవాబుతో అతని భవిష్యత్తే మారిపోవచ్చు. ప్రశ్న మొదలైనంత సహజంగానే దానికి జవాబు ఇస్తే... తనలోని శాస్త్రవేత్త మేల్కొంటాడు. అలాకాకుండా, ఆ పసిమనసు మీద సిద్ధాంతాల కుప్పపోస్తే... మరోసారి ఆ ప్రశ్న అడిగేందుకు జంకుతాడు. అందుకే పిల్లల జీవితంలో ‘పాపులర్‌ సైన్స్‌' పుస్తకాలది ఓ ముఖ్య పాత్ర. చదివే అలవాటు తగ్గిపోతున్న నేటి తరానికి ఇలాంటి పుస్తకాలు అందిస్తే పఠనాసక్తీ పెరుగుతుంది. ఒక్క నీటి చుక్కయినా తాగని జంతువు ఉంటుందా? జంతువులు తమలో తాము ఎలా మాట్లాడుకుంటాయి? జంతువులకి అనారోగ్యం వస్తే, వాటి పరిస్థితి ఏమిటి? ఎక్కడైనా చేపలు చెట్లెక్కుతాయా?... లాంటి సవాలక్ష సందేహాలకు జవాబులు అందిస్తుందీ చిన్న పుస్తకం. పిల్లలకి నాలుగు తెలుగు ముక్కలు చదవడం రావాలన్నా, సెల్‌ఫోన్‌ నుంచి కాసేపు వాళ్ల దృష్టిని మళ్లించాలన్నా.... వాళ్లతో ఇలాంటి పుస్తకాలు చదివించడం చాలా అవసరం.

అనుభవాలూ... ప్రేమలూ.. కాగితం పడవలు


రచయిత: వి.మల్లికార్జున్‌

పేజీలు: 102, వెల: 150/-

ప్రతులకు: 9381110979

ప్రేమకు మించింది ఏముంటుంది? అంటూ తన పుస్తకాన్ని మొదలుపెడతాడు రచయిత. జవాబు కష్టమే... బహుశా అసాధ్యమేమో కూడా! కానీ ఆ వెదుకులాటలో... ప్రేమనే పదేపదే గుర్తుచేసే జ్ఞాపకాలెన్నో, మనోవీధిలో తారలై తళుకుమంటాయి. అలాంటి కొన్ని వెలుగుల గుప్పిళ్లే ఈ కథలు. వీటిలో అనూహ్యమైన మలుపులు ఉండవు. కానీ ప్రియురాలి స్పర్శ అంత నులివెచ్చగా, అక్షరాలు కబుర్లు చెబుతాయి. తనూ, ఆమె కలుసుకున్న కాఫీ పరిచయాలు.. విడిపోయాక వెంటాడే జ్ఞాపకాలు కథలై పలకరిస్తాయి. ‘వర్షం మనకు ఎన్ని గుర్తు చేస్తే అంత భయపెడుతుంది’ (ఇరవై రూపాయల నోటు) అంటూ కంగారుపడతాడు. ‘అలా వెళ్లేప్పుడు ఒక ఖాళీ ఉంటుంది చూడూ.. నేను ప్రయాణాలు చేసినప్పుడల్లా ఆ ఖాళీలో నిన్ను నింపుకుంటాను’(చిన్న ప్రపంచం) అంటూ సముదాయించుకుంటాడు. మొత్తానికి 20 కథలూ ప్రేమలోని పార్శాన్నేదో గుర్తుచేస్తాయి. తేలికగా చదివించేసినా... మనసులో ఏదో మూల స్థిరపడిపోతాయి. కాగితం పడవల్లాగా!

ప్రపంచ సాహిత్యం... కోకిల - గులాబీ


అనుజృజన: రంగనాథ రామచంద్రరావు

పేజీలు: 104, వెల: 85/-

ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌

ఓ విద్యార్థి తన ప్రియురాలి కోసం ఎర్రగులాబీని సాధించాలనుకున్నాడు. కానీ ఎక్కడ చూసినా... తెల్లగులాబీలే! తన ఆశను గ్రహించిన కోకిల, తను కూడా ఓ ఎర్ర గులాబీ కోసం వెదుకులాట మొదలుపెట్టింది. ప్చ్‌... తనకీ దొరకలేదు. చివరగా ఎర్రగులాబీ సాధించడానికి ఓ ఉపాయం తెలిసింది. గులాబీ ముల్లును తన ఎదలోకి గుచ్చి, రాత్రంతా పాడుతూ ఉంటే.. ఓ ఎర్ర గులాబీ దక్కుతుంది. ఆ తర్వాత సన్నివేశాలను మనమే ఊహించుకోవచ్చు. ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన ‘కోకిల- గులాబీ’ కథ ఇది. ప్రపంచ సాహిత్యంలో ఉన్న ఇలాంటి అరుదైన కథలన్నింటినీ అనువదించారు రచయిత. ‘ఎడ్గార్‌ ఎలెన్‌ పొ’ రాసిన హారర్‌ కథ (చిత్రహింస) నుంచి అనూహ్యమైన ముగింపుతో చురుక్కుమనిపించే ఓ హెన్రీ రచన (అంతరం) వరకు రకరకాల కథకుల శైలినీ, వైవిధ్యమైన వస్తువులనూ పరిచయం చేస్తారు. పుస్తకంలో ఉన్న పదహారు అనువాద కథలూ వేటికవే ఆకట్టుకుంటాయి. ప్రపంచ రచయితలంతా మన భాషలో పలకరిస్తారు.logo