శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 01:21:29

అహింసా సిల్క్‌.. అదిరెనహో!

అహింసా సిల్క్‌..  అదిరెనహో!

పట్టులోనే ఉంటుంది ఏదో కనికట్టు.. అందుకే మగువల మనసులను దోచేస్తుంటుంది. అయితే ఒక్క చీర నేయడానికి సుమారు 30వేల పట్టుపరుగులను చంపుతున్నామని ఎప్పుడైనా అనుకున్నారా? కొందరికి తెలుసు కాబట్టి అలా తయారయ్యే చీరలను కట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. మరి ఎలా? పట్టు పురుగులను చంపకుండా చీర నేయలేమా? ఆ ఆలోచనలో నుంచే సరికొత్త చీరలను తయారు చేయడం మొదలుపెట్టాడు.. హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటున్న కుసుమ రాజయ్య.

సృష్టిలో ప్రతీ జీవికి జీవించే హక్కు ఉంది. అందులో పట్టు పురుగుకేం మినహాయింపు కాదు కదా అని అంటారు. అందుకే పట్టుపురుగును చంపకుండా వస్ర్తాన్ని తయారు చేస్తున్నారు. ఆ పట్టుకు అహింసా సిల్క్‌ అని పేరుపెట్టారు. వరంగల్‌ జిల్లా మారుమూల గ్రామమైన నాగారం గ్రామానికి చెందిన కుసుమ రాజయ్యది చేనేత కుటుంబం. పుట్టింది అటవీ ప్రాంతంలో కాబట్టి అన్ని ప్రమాణాలు కలిగిన పాఠశాలలు లేవు. దీంతో తను పదో తరగతి చదివేందుకు పది పాఠశాలలను మార్చాల్సి వచ్చింది. అనంతరం సేలంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్స్‌ టెక్నాలజీలో చేనేత సాంకేతిక పరిజ్ఞానంలో మూడేళ్ల డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని ఆప్కోలో  సాంకేతిక అధికారిగా పని చేశాడు.  1990లో అప్పటి రాష్ట్రపతి వెంకట్‌రామన్‌ సతీమణి జానకీ రామన్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఆప్కో కార్యాలయం సందర్శన సందర్భంగా అక్కడున్న పట్టువస్ర్తాలను చూస్తూ అహింసా పట్టు ఉందా అని అడిగారు. ఆమె అడిగిన ప్రశ్న.. రాజయ్యల్లో కొత్త ఆలోచన రేకెత్తించింది. కొత్త ఆవిష్కరణకు పురిగొల్పింది.  ఏడాది కష్టం తర్వాత సరికొత్త ఫ్యాబ్రిక్‌ తీసుకువచ్చారు రాజయ్య. 

అహింసా పద్ధతి.. 

సాధారణంగా పట్టు పురుగు తననుంచి స్రవించే లార్వాతో గూడు అల్లుకుంటుంది. ఆ గూళ్లను మరుగుతున్న వేడి నీటిలో వేసి దారాన్ని తీస్తున్నారు. ఈ క్రమంలో గూడులో ఉన్న పురుగు చనిపోతుంది. ఒక్కో గూడు నుంచి వెయ్యి గజాల పట్టుదారం వస్తుంది. పట్టుపురుగు చనిపోకుండా, అది ఎగిరిపోయిన తర్వాతనే దారాన్ని తీయడం అహింసా పద్ధతి. ఆ పద్ధతిలో చేసేందుకు మొదట వంద కేజీల పట్టుపురుగులతో కర్ణాటకకు వెళ్లి ఓ స్పిన్నింగ్‌ మిల్లులో తన పద్ధతి గురించి వివరించాడు అక్కడ పని కాలేదు.. తర్వాత ఒడిశాకు వెళ్లాడు. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. చివరికి ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని స్పిన్నింగ్‌ మిల్లులో అతని ఆలోచనకు పునాది పడింది. రాజయ్య అనుసరించిన విధానంలో పట్టుగూళ్లను సేకరించి ఓ పది రోజులు ఓ బుట్టలో ఉంచుతారు. రెక్కలు తొడిగిన పురుగులు స్వేచ్ఛగా ఎగిరిపోయాక గూళ్ల నుంచి పట్టుదారాన్ని తీస్తారు. ఈ విధానం ద్వారా కేవలం 20శాతం మాత్రమే పట్టుదారం లభిస్తుంది. అలా ఒక్కో అడుగు వేసుకుంటూ 2000 సంవత్సరంలో స్థాపించిన అహింసా పట్టు ద్వారా ఏడాదిలో 200 చీరలు, 1200 స్టోల్స్‌, 10,000 మీటర్ల బట్టలను విక్రయించారు. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా, యూరోపియన్‌ దేశాల నుంచి కూడా ఆర్డుర్లు వస్తున్నాయి. అలా 2006 నాటికి కుసుమ రాజయ్య అహింసా సిల్క్‌కు ట్రేడ్‌మార్క్‌, పేటెంట్‌ హక్కులు సాధించారు. 

రెండు నెలలు.. 

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరులోని పట్టు రైతుల నుంచి పెద్దమొత్తంలో పట్టు గుళ్లను కొనుగోలు చేస్తారు. గుళ్ల నుంచి పురుగులు వెళ్లిపోయిన తర్వాత గూళ్లను జాగ్రత్తగా సేకరించి స్పిన్నింగ్‌ మిల్లుకు పంపుతారు. అక్కడ దారం తయారు చేశాక, ఆ దారాన్ని నల్గొండలోని చేనేత కార్మికులకు ఇచ్చి అందమైన ఇక్కత్‌, జమ్దానీ చీరలను నేస్తారు. సుమారు ఎనిమిది చీరలు ఈ పద్ధతిలో తయారు చేసేందుకు రెండు నెలల సమయం పడుతుందని చెబుతున్నాడు రాజయ్య. ఈయన తయారు చేసిన దారాన్ని బెంగళూరులోని ఒక విద్యుత్‌ మగ్గానికి కూడా పంపి స్వచ్ఛమైన బట్టను ఉత్పత్తి చేసి దానిని ప్రముఖ డిజైనర్లకు కూడా విక్రయిస్తున్నాడు. త్వరలోనే అహింసా పట్టు ద్వారా పిల్లల బట్టలు, ఇతర వస్ర్తాలను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు రాజయ్య. అహింసా పట్టు ద్వారా 30 నుంచి 40 మంది చేతి వృత్తుల వాళ్లున్న సంఘానికి చేయూతనందిస్తున్నాడు రాజయ్య. 

ప్రశంసల జల్లు

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా అహింసా పట్టు అందరినీ ఆకర్షించింది. ఎన్నో పురస్కారాలు రాజయ్యను వరించాయి. అంతర్జాతీయ అహింసా పురస్కారం కూడా లభించింది. ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ తారలు, ప్రముఖులు ముచ్చట పడి అహింసా పట్టును కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి ఫ్యాషన్‌ డిజైనర్ల నుంచి కూడా అహింసా సిల్క్‌ వస్ర్తాలకు ప్రశంసలు లభించాయి. కాలిఫోర్నియాకు చెందిన చెరైల్‌కో, జర్మనీకి చెందిన డా.మసియా లొంగేయర్‌, ఐర్లాండ్‌కు చెందిన ఈవా, యూఎస్‌కు చెందిన లందర్‌ ఇలా అనేక మంది అహింసా వస్ర్తాలకు ఫిదా అయ్యారు. 

ప్రోత్సహిస్తే.. 

సొంత స్పిన్నింగ్‌ మిల్లు లేకపోవడంతోపాటు ఈ వయస్సులో పెట్టుబడి పెట్టేంత ఆర్థిక స్థోమత లేదని, తెలంగాణకే తలమాణికంగా మారుతున్న అహింసా పట్టును ప్రోత్సహిస్తే రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉందని 

చెబుతున్నాడు రాజయ్య.